ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?

- రచయిత, బీబీసీ ముండో
- హోదా, ...
తొమ్మిది నెలల క్రితం ఓపెన్‌హైమర్ చిత్రం ప్రీమియర్ స్క్రీనింగ్ జరిగింది. అయితే ఆస్కార్ బరిలో నిలిచి, పలు విభాగాల్లో ఏడు అవార్డులు పొందిన ఈ చిత్రం జపాన్‌లో ఈ శుక్రవారం విడుదలైంది.
అయితే, జపాన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం చిన్నదేమీ కాదు.
అమెరికా భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత రహస్య ప్రాజెక్ట్ అయిన మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో రాబర్ట్ ఓపెన్‌హైమర్ పోషించిన పాత్రను తెరపై ఆవిష్కరించారు.
ప్రయోగాలు, పరిశోధనల ఫలితాలు అణుబాంబు తయారీ, జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడులు, తదనంతర పరిణామాలు.. అవన్నీ ఈ చిత్రంలో చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్‌లో ఎందుకు ఆలస్యమైంది?
2023 జులై 21న విడుదల చేసిన ఓపెన్‌హైమర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. సినిమా నేపథ్యం దృష్ట్యా జపాన్‌లో మాత్రం విడుదలను ఆలస్యం చేశారు నిర్మాతలు.
జపాన్‌లో ఈ చిత్రం స్క్రీనింగ్ విషయమై నిరుడు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ “సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు.
“అయితే, ఈ చిత్రాన్ని ప్రపంచమంతా చూసింది. నా ఉద్దేశం ప్రకారం జపాన్‌లోని సినీ ప్రేమికులు, ఓపెన్‌హైమర్‌పై ప్రపంచ దేశాల స్పందనల్ని చూసిన వారు కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం తమకూ కలగాలని కోరుకుంటారు” అన్నారు సినిమా బ్లెండ్ పబ్లికేషన్ డైరెక్టర్.
జపాన్ చరిత్రలోనే పెను విషాదంగా నిలిచిన అణుబాంబు దాడుల్లో సుమారు లక్షా 40 వేల మంది ప్రజలు మరణించారు.
1945 ఆగస్టు 6, 9 తేదీల్లో రెండు అణుబాంబులను ఈ నగరాలపై జారవిడిచారు.
“వారు మీటింగ్‌రూంలో కూర్చుని, కనీసం హిరోషిమా గురించి మాట్లాడిన తీరు, అక్కడి ప్రజల సంగతిని విస్మరించిన తీరు చూసి నాకు బాధగా అనిపించింది” అని ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల్లో ఒకరు బీబీసీతో చెప్పారు.
మరికొంతమంది కథను చెప్పిన పాశ్చాత్య శైలి తమకు కొరుకుడు పడలేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విడుదలపై ఏమన్నారు?
జపాన్‌లో ఈ చిత్రం విడుదలపై చాలా నెలలు తమ మధ్య “ఆలోచనాత్మక చర్చలు” జరిగాయని, ఆ తరువాతనే చిత్రాన్ని విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు టైమ్ మ్యాగజైన్‌తో ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్, డిస్ట్రిబ్యూటర్ బిట్టర్స్ ఎండ్ సంస్థలు తెలిపాయి.
“దర్శకులు క్రిస్టోఫర్ నోలన్ సంప్రదాయక కథన శైలిని కాదని, ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ అనుభూతిని కలిగేలా చేశారు. జపాన్‌లో విడుదలవుతున్న తరుణంలో, ప్రేక్షకులు ఆ ఆవిష్కరణను బిగ్ స్క్రీన్‌పై చూడాలని మేం ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులు తమ కళ్లతో చూసి, ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం” అని ఆ సంస్థలు చెప్పాయి.
అయితే, హిరోషిమా, నాగసాకిల్లో అణుబాంబు దాడుల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూపి, నిజమైన చిత్రాలను సినిమాలో చూపించకూడదని నోలన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ పత్రికలు, ప్రజలు కూడా ప్రశ్నించారు.
నోలన్ అందుకు, ఆ దాడులు విషాదకర ఘటనలు అనే విషయాన్ని తెలిపేలా ఈ చిత్రం ఉంటుంది కాబట్టి, కథనానికి అనుగుణంగా వాస్తవ చిత్రాలను “తక్కువ లేదా ఎక్కువ” తీసుకుంటానని చెప్పారు.
“క్రిస్టోఫర్ నోలన్ బాంబు దాడుల వల్ల జరిగిన విధ్వంసాన్ని విస్మరించారని కాదు. ఓపెన్‌హైమర్ పాత్రలో హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ పరిచయం, హిరోషిమాపై బాంబు దాడి అనంతరం ఏర్పాటు చేసిన సెలబ్రేటరీ స్పీచ్‌లో తన తోటివారితో మాట్లాడుతున్న సమయంలో ఆ బాంబు దాడిని ఊహించడం వంటివి మనకు కనిపిస్తాయి” అని నవోకో వాకె అనే ఉపాధ్యాయులు ది కన్వర్జేషనల్ పోర్టల్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
“అయితే, ఓపెన్‌హైమర్ తన భ్రాంతిలో శ్వేతజాతి యువతి(నోలన్ కుమార్తె ఫ్లోరా నటించారు) ముఖాన్ని చూస్తారు. వాస్తవానికి వారెవరూ ఆ దాడికి గురవలేదు కదా? జపనీయులు, కొరియన్లు, ఏషియన్ అమెరికన్లే కదా ఆ బాంబు దాడులకు గురయింది” అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
మిశ్రమ స్పందన
జపాన్‌లో ఈ చిత్రాన్ని చూసిన కొంత మంది ప్రేక్షకులను బీబీసీ పలకరించగా, మిశ్రమ స్పందనలు వచ్చాయి.
1945లో హిరోషిమా నగరంలో ఏ ప్రదేశంలో ఆ అణుబాంబు నేలను తాకిందో, ఆ ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో బీబీసీ జపాన్ ప్రతినిధి షైమా ఖలీల్, కొంత మంది ప్రేక్షకులతో మాట్లాడుతూ ఓపెన్‌హైమర్ గురించి వారు ఏమనుకుంటున్నారో అడిగారు.
“మాన్‌హాటన్ ప్రాజెక్ట్ విజయవంతమైన సందర్భం, అణుబాంబుల ప్రయోగాల పట్ల అక్కడి వారు, ప్రజలు ఆనందపడటం చూసి నాకు చాలా బాధగా అనిపించింది” అంటూ తన వ్యతిరేకతను తెలియజేశారు ఎరికా అబికో అనే ప్రేక్షకురాలు.
చిత్రంలో బాధితుల గురించి విస్మరించడం తనకు విస్మయాన్ని కలిగించిందని అణు బాంబు వ్యతిరేక కార్యకర్త మాయూ సెటో అన్నారు.
“మీటింగ్ రూంలో కూర్చున్న వారు హిరోషిమా గురించి మాట్లాడిన విధానం, ప్రజల సంగతి విస్మరించడం చూసి నాకు బాధ కలిగింది” అన్నారు.
మసాటో డెయనామా అనే యువకుడు ఆ చిత్రం ఓపెన్‌హైమర్ సంఘర్షణను చూపిస్తూనే, ఆయన్ను గొప్పవ్యక్తిగా చిత్రీకరించిందని అభిప్రాయపడ్డారు.
“పశ్చాత్తాపం, అపరాధ భావాన్ని ఆయన దాచుకోలేకపోయాడని చూపించడం చాలా ఆసక్తి కలిగించింది” అన్నారు.
బయటి ప్రపంచం ఈ ఘటనను ఎలా చూసిందో తనకు ఈ చిత్రం చూశాక అర్థమైందని కనెయి కుమె అనే విద్యార్థి చెప్పారు.
“అణు బాంబుల వల్ల ఎన్నో ప్రాణాల్ని కాపాడొచ్చు అనే మాటలు వినడం నాకు కొత్తగా అనిపించింది. అమెరికన్లు, ప్రపంచం దీనిని ఏ విధంగా చూస్తున్నాయో నేను తెలుసుకున్నాను” అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














