జెమిని ఏఐ: గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఎలా మొదలైంది, అసలు సమస్య ఏంటి?

ఫొటో సోర్స్, AFP
గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు త్వరలో ఉద్వాసన తప్పదని, లేదంటే ఆయనే రాజీనామా చేస్తారంటూ హెలియోస్ కాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ ఆరోరా సంచలన వ్యాఖ్యాలు చేశారని ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది.
అప్పటి నుంచి సుందర్ పిచాయ్ రాజీనామాపై అనేక కథనాలు మీడియాలో కనిపించడం ప్రారంభించాయి.
గూగూల్ కృత్రిమ మేథ సాధనం ‘జెమిని ఏఐ’ విఫలం కావడమే దీనికి కారణమన్న సమీర్ ‘ఎక్స్’(గతంలో ట్విటర్)లో స్పందిస్తూ సుందర్ పిచాయ్ పదవీకాలం ముగింపు దశకు వచ్చేసినట్టు భావిస్తున్నానని చెప్పారు.
‘‘నా అంచనా ప్రకారం ఆయనను తొలగిస్తారు, లేదా ఆయనే రాజీనామా చేస్తారు. ఏఐని సక్సెస్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలం కావడం వల్ల, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు తీసుకుంటారు’’ అని అరోరా తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గూగూల్ పై చర్యలు?
భారత్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గూగూల్‌కు నోటీసులు జారీ చేయనుందనే కథనాలు వెలువడుతున్నట్టు ‘ది ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. ప్రధాని మోదీ గురించి జెమిని ఏఐ వివక్షాపూరిత సమాధానం ఇవ్వడమే దీనికి కారణమని ఆ కథనం తెలిపింది.
ప్రధాని మోదీ ఫాసిస్టా అని ఓ నెటజన్ జెమిని ఏఐని అడగ్గా, మోదీ అవలంభించిన కొన్ని విధానాల వల్ల కొంతమంది ఆయన్ను ఫాసిస్ట్ అంటారని వివాదాస్పద సమాధానం ఇచ్చిందని ఆ కథనం పేర్కొంది. కానీ ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీల గురించి అడిగినప్పుడు మాత్రం.. ‘కచ్ఛితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ సమాధానమివ్వడంతో జెమిని ఏఐ టూల్ పక్షపాతం చూపుతోందంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఈ ఫ్లాట్ ఫామ్ చర్యలు ఐటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఐటీ యాక్ట్‌లోని రూల్ 3 (1)ని ఇది ఉల్లంఘించడంతోపాటు క్రిమినల్ కోడ్‌లోని అనేక ప్రొవిజన్లను విరుద్ధంగా ఉన్నట్టు చెప్పారని ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, GOOGLE/ GEMINI
ఎన్నో విమర్శలు.. గూగూల్ క్షమాపణలు
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తన కృత్రిమ మేథ టూల్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) ‘జెమిని ఏఐ’తో విమర్శలపాలవుతోంది. చారిత్రాత్మకమైన విషయాలను తప్పుగా చూపుతోందంటూ నెటిజిన్లు సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు.
మరి గూగూల్ ఏఐ సమస్య అంత తర్వగా తేలే వ్యవహారమా కాదా, ఇదే విషయాన్ని బీబీసీ టెక్నాలజీ ఎడిటర్ జో క్లిన్‌మాన్ ఓ కథనంలో చర్చించారు.
కృత్రిమ మేథ సాథనం చాట్ జీపీటికి పోటీగా గూగూల్ సృష్టించినదే జెమిని ఏఐ. టెక్స్ట్ రూపంలో అడిగే ప్రశ్నలకు ఇది సమాధానమిస్తుంది. అంతేకాదు, మనం ఇచ్చే టెక్స్ట్స్ ఆధారంగా చిత్రాలు కూడా రూపొందిస్తుంది.
ఈ క్రమంలో అమెరికాను కనుగొన్నవారి గురించి అడిగిన ప్రశ్నకు అసంబద్ధంగా, నల్లజాతీయులను చూపింది. అలాగే రెండో ప్రపంచ యుద్దకాలం నాటి నాజీ సైనికులను నల్ల జాతీయులుగానూ, ఆసియా మహిళగానూ చూపింది. దీనిపై గూగూల్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పింది.
అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు. లక్షలాదిమందిని చంపిన హిట్లర్ ప్రమాదమా, ఎలాన్ మస్క్ పోస్ట్ చేసే మీమ్స్ ఎక్కువ హానికరమా, సమాజంపై ఏవి ప్రతికూల ప్రభావం చూపాయి అని అడిగిన ప్రశ్నకు జెమిని ఏఐ కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.
దీనిపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘లక్షలాదిమంది ప్రజలు ఉపయోగించే గూగూల్ ఉత్పత్తుల్లో ఈ టూల్ అనుసంధానమై ఉంటుందని కానీ ఇది తప్పుగా ఇచ్చే సమాధానాలు ‘ప్రమాద ఘంటికలు మోగించడమేనని’ అభివర్ణించారు.
నేను జెమినిని పూర్తిగా ఆపేయాలా అని గూగూల్‌ని అడిగితే చాలాసేపటి తరువాత దీనిపై సంస్థ ఎటువంటి కామెంట్ చేయడం లేదనే సమాధానం వచ్చింది. ప్రజలతో తమాషాలు చేయడం సరికాదు’’ అని మస్క్అన్నారు.
అయితే గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ జెమిని చేస్తున్న తప్పులను గుర్తించినట్టు ఓ అంతర్గత మెమోలో పేర్కొన్నారు.
‘‘జెమిని ఏఐ కస్టమర్లను బాధపెట్టినట్టు, పక్షపాతం చూపినట్టు ’’ అందులో తెలిపారు. ‘‘ఇది పూర్తిగా అనంగీకారమైనది, దీనిని సరిచేయడానికి మా టీమ్ 24 గంటలూ పనిచేస్తోంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పక్షపాత సమాచారం
టెక్ దిగ్గజం ఒక సమస్యను పరిష్కరించబోయి మరో సమస్యను సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంటర్నెట్‌లోని అపరిమితమైన సమాచారం ఆధారంగా ఇవి శిక్షణ పొందుతాయి. వీటిల్లో అన్నిరకాల పక్షపాతాలతో కూడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.
సహజంగా డాక్టర్లు అనగానే మగవారి చిత్రాలు కనిపిస్తాయి. పనిచేసేవారి చిత్రాలు (క్లీనర్స్) చిత్రాలలో ఎక్కువగా మహిళల చిత్రాలు ప్రత్యక్షమవుతాయి.
ఇలాంటి సమాచారం ఆధారంగా శిక్షణ పొందిన ఏఐ సాధనాలు గతంలో అనేక ఇబ్బందికరమైన తప్పులు చేశాయి. వీటిల్లో అత్యంత శక్తమంతమైన ఉద్యోగాలు పురుషులే చేయగలరని చూపడం, నల్లగా ఉన్న వారిని మనుషులుగా గుర్తించకపోవడం తదితర తప్పులు ఉన్నాయి.
అయితే మానవ పక్షపాతంతో కూడిన ఈ తప్పులన్నింటినీ సరిచేయడానికి గూగూల్ జెమిని ఏఐకు అటువంటి ఊహలు చేయకుండా తగిన సూచనలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయినా జెమిని ఏఐ విమర్శల పాలు కావడానికి కారణం మానవ చరిత్ర, సంస్కృతి. వీటిని అర్థం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. వీటిల్లో ఉండే స్వల్ప తేడాలు మనకు సహజంగానే అర్థమవుతాయి, కానీ మెషిన్లకు ఆ సున్నితత్వం అర్థం కాదు.
ఇమేజ్ జనరేటర్ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వారాల సమయం పడుతుందని డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు డెమిస్ హస్సాబిస్ చెప్పారు. ఈ డీప్‌మైండ్ ఏఐ సంస్థను గూగూల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ ఈ విషయంలో మిగిలిన ఏఐ నిపుణులు అంత నమ్మకంగా లేరు.
‘‘ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదు. ఇది ఒక ముక్కలో తేల్చేసే వ్యవహారం కూడా కాదు’’ అని హగ్గింగ్‌ఫేస్‌లో రీసర్చ్ సైంటిస్ట్‌గా ఉన్న డాక్టర్ సషా లుక్కియోని చెప్పారు.
‘‘ఏఐ నైతిక సమూహంలోనివారు ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలైనన్ని మార్గాలలో ప్రయత్నిస్తూనే ఉన్నారు’’ ఆని ఆమె తెలిపారు. కాకపోతే దీనికో పరిష్కారం కనిపిస్తోంది. ‘‘మీరు కోరుకునే చిత్రం ఎంత భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు’’ అనే సమాచారాన్ని యూజర్లనే అడగడం ద్వారా దీనిని కొంతవరకు అరికట్టవచ్చని, కానీ ఈ పరిష్కారంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.
‘‘కొన్ని వారాల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కొంత గర్వకారణంగా ఉన్నా, వారు తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి’’ అని ఆమె చెప్పారు.
‘‘చూస్తుంటే ఇది చాలా తీవ్రమైన సమస్యలాగా కనిపిస్తోందని’’ సర్రే యూనివర్సిటీలో కంప్యూటర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ అలన్ ఉడ్‌వర్డ్ అన్నారు. సమాచార శిక్షణ, అల్గారిథమ్స్‌ను సరిచేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సమాచారాన్ని సరిదిద్దలేమా?
గూగూల్ దీని పరిష్కారానికి అంత అనువైన మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపించడం లేదు. ఈ మార్గంలో తెలియకుండానే కొత్త సమస్యలు సృష్టిస్తోంది.
ఏఐ పరుగుపందెంలో కాగితంపై గూగూల్ ముందంజలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దానికి ఏఐ చిప్స్, ఏఐ ప్రాపెసింగ్‌కు అవసరమైన క్లౌడ్ నెట్‌వర్క్ సొంతంగా ఉన్నాయి. అతిపెద్ద యూజర్ బేస్ కూడా ఉంది. అది ప్రపంచ స్థాయి కృత్రిమ మేథ నిపుణులను నియమించుకోగలదు. పైగా దాని ఏఐ పనితీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుంది.
ప్రత్యర్థి టెక్ దిగ్గజానికి చెందిన ఓ కార్యనిర్వాహకుడు మాట్లాడుతూ ‘‘గూగూల్ తప్పటడుగులు చూస్తుంటే చేతి దాకా వచ్చిన ముద్ద నోటికి అందకుండా పోతోందనిపిస్తోంది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సాలినా: శృంగారంలో వేశ్యలతో పోటీపడి అపఖ్యాతి పాలైన రోమ్ సామ్రాజ్ఞి
- భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు...
- జపాన్ మహిళలు న్యూడ్ ఫెస్టివల్లో పాల్గొంటామని ఎందుకు ముందుకు వస్తున్నారు?
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














