గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు

పసుపు రంగు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాన్వీ ములే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అరుదైన నీలం ధాతువు, మమ్మీ అవశేషాలు, ఆవు మూత్రం.. ఇవి ఒకదానికొకటి సంబంధం లేనివి. కానీ ఇవన్నీ ఒకప్పుడు రంగుల తయారీకి ఉపయోగించారు.

ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ పెయింటింగ్‌లు వీటితో చేసిన రంగులతో వేశారంటే నమ్మడం కష్టం.

ప్రాచీన కాలంలో కావాల్సిన రంగులను తయారుచేసుకోవడం అంత సులభంగా ఉండేది కాదు.

ఆ సమయంలో సింథటిక్ రంగులను తయారు చేసే సాంకేతికత లేదు.

కానీ ప్రజలు రంగులు ఉపయోగించారు, చిత్రాలు తీర్చిదిద్దారు.

అది అజంతా పెయింటింగ్స్ అయినా, మొఘల్ కాలంలో వేసిన సూక్ష్మ పెయింటింగ్స్ అయినా లేదా మధ్యయుగాలనాటి యూరోపియన్ పెయింటింగ్స్ అయినా.

వీటిని చిత్రించడానికి కొన్ని రంగులు ఎలా తయారుచేశారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.

పెయింటిగ్స్

ఫొటో సోర్స్, HISTORICAL PICTURE ARCHIVE/GETTY

ఆవు మూత్రం నుంచి పసుపు రంగు

'ఇండియన్ ఎల్లో' అనేది కొద్దిగా నారింజ రంగు కలిసినట్లుండే పసుపు రంగు. ప్రకాశవంతమైన 'బంగారు రంగు' కనిపించడానికి దీన్ని ఉపయోగించేవారు.

ఈ రంగు ఉపయోగం 15వ శతాబ్దంలో భారతదేశంలో ప్రారంభమైంది, అక్కడి నుంచి ఐరోపాకు చేరుకుంది. మొఘల్ కాలం నాటి అనేక సూక్ష్మ పెయింటిగ్స్‌లో ఈ రంగు కనిపిస్తుంది.

ఐరోపాలోని చాలామంది చిత్రకారులు కుడ్యచిత్రాలు, ఆయిల్ పెయింటింగ్‌లు, వాటర్‌ కలర్‌లలో కూడా ఈ రంగును ఉపయోగించారు.

విన్సెంట్ వాన్ గోహ్ 'ది స్టార్రీ నైట్'లోని పసుపు చంద్రుడు, ఆంగ్ల చిత్రకారుడు జోసెఫ్ మల్లోర్డ్ విలియం టర్నర్ పెయింటింగ్‌లోని సూర్యకాంతి కోసం ఈ పసుపు రంగు వాడారు.

అసలు ఈ రంగు ఆవు మూత్రం నుంచి తయారైందనే ప్రచారముంది.

ఆవు మూత్రానికి 'పసుపు రంగు' రావడానికి వాటికి మామిడి ఆకులను తినిపించారని చెబుతారు.

దీని కోసం ఆవును ఆకలితో ఉంచేవారని, అందుకే అది మామిడి ఆకులను తినేదని చెప్పేవారు.

ఆ తర్వాత గోమూత్రాన్ని మట్టి కుండలలో సేకరించి మరిగిస్తారు. దీని తరువాత వడపోసి, ఎండబెడతారు. వాటిని చిన్న ముక్కలుగా చేస్తారు.

పెయింటర్లు దానిని ప్యాలెట్‌లో తీసుకొని, నీరు లేదా నూనెలో కలిపి, రంగును పెయింటింగ్‌లో వాడేవారనే వాదన ఉంది.

1883లో లండన్‌లోని సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌కు ఈ 'పసుపు రంగు' తయారీ వివరాలను నివేదిక రూపంలో అందించారు.

ఈ నివేదికను సిద్ధం చేయడానికి, ప్రముఖ రచయిత త్రిలోకనాథ్ ముఖోపాధ్యాయ ప్రస్తుత బిహార్‌లోని ముంగేర్‌కు వెళ్లి, అక్కడ పసుపు రంగు తయారీపై పరిశోధన చేశారు.

ఇందుకోసం ఆవులపై జరిగిన అఘాయిత్యాల వివరాలనూ పొందుపరిచారు.

కాగా, ఈ రంగును 1908లో నిషేధించారు, తరువాత కాలంలో రసాయనాలను ఉపయోగించి పసుపు రంగు తయారు చేస్తున్నారు.

అజంతా పెయింటింగ్స్

ఫొటో సోర్స్, RATTHAM/GETTY

అజంతా చిత్రాలలో..

ప్రాచీన కాలంలో భారతీయ పెయింటింగ్‌ల గొప్పదనం అజంతాలోని తైలవర్ణ చిత్రాలలో ప్రతిబింబిస్తుంది. ఈ పెయింటింగ్స్‌లో ఎరుపు, పసుపు రంగుల ఉపయోగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది ఎరుపు-పసుపు రంగు, ఎర్ర మన్ను (జేగురు మన్ను), పసుపు ఓచర్‌తో తయారయింది.

వాస్తవానికి ఓచర్ అనేది ఎరుపు-పసుపు రంగులను తయారీకి వాడే ఒక రకమైన మట్టి. ఇటువంటి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మట్టిలో ఉండే ఇనుము, ఇతర మూలకాల పరిమాణాన్ని బట్టి దీని రంగు కూడా మారుతుంది.

ఓచర్ అనేది మానవులు ఉపయోగించిన మొదటి వర్ణద్రవ్యం కావొచ్చని కొంతమంది నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహ చిత్రాలలో ఓచర్‌ను ఉపయోగించారు.

అంటే ఈ వర్ణద్రవ్యం సుమారు లక్ష సంవత్సరాల నాటిది. నేటికీ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తమ శరీరానికి రంగులు వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

పెయింటిగ్స్

ఫొటో సోర్స్, SOLTAN FRÉDÉRIC/GETTY

హాన్ పర్పుల్, నీలం

అజంతా చిత్రాలను పరిశీలిస్తే కనిపించే మరొక రంగు నీలం, సముద్రం రంగు మాదిరి ప్రకాశవంతంగా, లోతుగా కనిపిస్తుంటుంది.

ఇపుడు అల్ట్రామెరైన్‌గా పిలుచుకొనే ఈ నీలి రంగు కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. దీని కథ అఫ్గానిస్తాన్‌తో ముడిపడి ఉంది.

వాస్తవానికి 'లాపిస్ లాజులి' అనే ఖనిజం అఫ్గానిస్తాన్ ఉత్తర భాగంలోని గనులలో కనుగొన్నారు. దీనిని హిందీ, అరబిక్ భాషలలో లజ్వార్డ్ లేదా రాజవర్ట్ అని పిలుస్తారు.

ఈ ధాతువును హరప్పా నాగరికత (సింధు లోయ నాగరికత) సమయంలో కూడా ఉపయోగించారు. మెసొపొటేమియాలో లాజులీ పూసలు కూడా దొరికాయి.

పురాతన ఈజిప్షియన్లు నైలు నదితో పాటు రాయల్ బ్లూ రంగుకు కూడా ఆకర్షితులయ్యారు. కానీ అక్కడికి ఈ రంగును తీసుకెళ్లలేకపోయారు.

అందుకే ఈజిప్టు కళాకారులు సిలికా, సున్నం, రాగి, క్షారాన్ని ఉపయోగించి కొన్ని రసాయన రంగులను సృష్టించారు. ఈజిప్షియన్లు తయారు చేసిన ఈ రంగు ప్రపంచంలోని మొట్టమొదటి రసాయన వర్ణద్రవ్యంగా పరిగణిస్తున్నారు.

చైనాలో బేరియం, రాగి, సిలికేట్ పిగ్మెంట్లను ఉపయోగించి నీలం, వైలెట్ రంగులు సృష్టించారు. ఈ రంగులను హాన్ బ్లూ, హాన్ పర్పుల్ అని కూడా పిలుస్తారు.

పెయింటింగ్స్

ఫొటో సోర్స్, PICTURES FROM HISTORY

అంతకుముందు నీలి రంగును భారత్‌లో ముఖ్యంగా ప్రత్యేకమైన నీలిరంగు దుస్తులు తయారు చేయడానికి ఉపయోగించేవారు. అయితే లాపిస్ లాజులీ రంగు మరింత ఆకర్షణీయంగా కనిపించేది.

కరిగించిన మైనం, నూనె, పైన్ బంకతో నీలం పొడిని కలిపి ఈ వర్ణద్రవ్యం తయారు చేశారు.

ఈ ధాతువు చాలా అరుదు, ఆ రోజుల్లో అఫ్గానిస్తాన్‌లో మాత్రమే దొరికేది. పాశ్చాత్య దేశాలలో నీలం రంగును ఎక్కువగా ఉపయోగించకపోవడానికి, కొన్ని భాషలలో నీలం అనే పదం లేకపోవడమూ కారణం.

అయితే, సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం, అరబ్ వ్యాపారుల నుంచి లాపిస్ లాజులీ ఐరోపాకు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి 'చిత్రం' మారిపోయింది.

ఆ సమయంలో ఐరోపాలో ఇది బంగారం కంటే ఖరీదైనది, కాబట్టి దీనిని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉపయోగించారు.

ఈ రంగును యేసు, మేరీ, కొన్నిసార్లు రాజ కుటుంబానికి చెందిన ముఖ్యమైన వ్యక్తుల పెయింటిగ్స్ వేయడానికి ఉపయోగించేవారు.

లాపిస్ లాజులీ రంగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాపిస్ లాజులీ రంగు

మైఖేలాంజెలో, రాఫెల్ వంటి కళాకారులు కూడా ఈ రంగు కొనే సాహసం చేయలేకపోయారు.

డచ్ కళాకారుడు జోహన్నెస్ వెర్మీర్ తన చిత్రాలలో ఈ రంగును స్వేచ్ఛగా ఉపయోగించారు, కానీ దాని కారణంగా ఆయన అప్పుల పాలయ్యారు.

కృత్రిమ నీలం రంగులను 19వ శతాబ్దం నుంచి ఉపయోగించడం ప్రారంభించారు. కానీ లాపిస్ లాజులి ఆకర్షణ నేటికీ కొనసాగుతోంది.

రంగులు

ఫొటో సోర్స్, GERALD CORSI/GETT

వెర్మిలియన్

సిన్నబార్ అంటే వెర్మిలియన్ పాదరసం ధాతువు. దీనిని విషపూరితంగా కూడా పరిగణిస్తారు.

ఈ అగ్నిపర్వత ధాతువును పురాతన కాలంలో ప్రకాశవంతమైన ఎరుపు పెయింట్ తయారీకి ఉపయోగించారు. ఈ రంగును సిందూరి రెడ్ అని కూడా పిలుస్తారు.

ఈ వెర్మిలియన్‌ను చైనా, భారత్, మాయ (మెసో అమెరికన్ ఆఫ్ మెక్సికో) నాగరికతలో రంగులను తయారు చేయడానికి ఉపయోగించారు.

మమ్మీ బ్రౌన్ కలర్‌తో చేసిన చిత్రం

ఫొటో సోర్స్, CHRISTOPHEL FINE ART/GETTY

ఫొటో క్యాప్షన్, మమ్మీ బ్రౌన్ కలర్‌తో వేసిన చిత్రం

మమ్మీ బ్రౌన్

16వ, 17వ శతాబ్దాలలో మమ్మీ బ్రౌన్ అనే గోధుమ రంగు ఈజిప్టులో ప్రసిద్ధి చెందింది.

కళా చరిత్రకారుడు విక్టోరియా ఫిన్లే ఈ విషయాన్ని తన 'కలర్స్-ట్రావెల్స్ త్రూ ది పెయింట్‌బాక్స్' పుస్తకంలో తెలిపారు.

ఈ రంగు కొంతవరకు పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి, పెయింటింగ్స్‌లో మానవ శరీరాల ఆకారాలలో రంగు వేయడానికి, నీడలను సృష్టించడానికి ఉపయోగించారు.

దీన్ని తయారు చేయడానికి చాలా పురాతన మమ్మీల అవశేషాలు ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)