ఈ దేశాల్లో డ్యామ్‌లను కూలగొడుతున్నారు... ఎందుకు?

ఫొటో సోర్స్, Mikko Nikkinen / Storymakers 2021
- రచయిత, లుక్రెజియా లోజ్జా,
- హోదా, బీబీసీ ఫీచర్స్ కరస్పాండెంట్
యూరప్‌లోని సహజ సిద్ధ నీటి ప్రవాహాలకు అడ్డంగా కట్టిన ఆనకట్టలు (డ్యామ్‌లు) ఆటంకంగా మారాయి. ఈ డ్యామ్‌లు కాలం చెల్లినవిగా మారుతుండటంతో, వీటిని కూలదోసి నదీ ప్రవాహాలు సహజంగా సాగిపోయేలా చూడాలనే ఉద్యమం ఊపందుకుంటోంది.
మూడేళ్ళ కిందట ఫిన్లాండ్‌లోని హిటోలాంజోకి నదిపై ఉన్న మూడు ఆనకట్టలను తొలగించడం మొదలు పెట్టినప్పుడు, నిర్మాణ కార్మికులకు ఆశ్చర్యకరంగా అక్కడి నీటి ప్రవాహాలలో సాల్మన్ చేపలు కనిపించాయి.
ఎన్నో ఏళ్ళపాటు తమ సహజసిద్ధ ఆవాసాలలో కనిపించకుండా పోయిన ఈ చేపలు ఇప్పుడు కంటపడటం పర్యావరణ వ్యవస్థ కోలుకుంటోందనేందుకు సంకేతమంటారు పౌలీనా లూహీ. పౌలీనా లూహీ ఫిన్లాండ్‌లోని నేచరల్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్ లో పర్యావరణవేత్తగా పనిచేస్తున్నారు.
‘‘సాల్మన్ చేపలు పెద్దవే కాదూ, పిల్లచేపలూ కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడకు కనిపించే ముందే నది దిగువ భాగంలో గుడ్లు పెట్టి వచ్చినట్టుగా ఉంది. అందుకే పిల్ల చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఆనకట్టను తొలగించాకా ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి’’ అని చెప్పారు లౌహి.
రష్యా సమీపంలో ఉన్న లాడోగ సరస్సు నుంచి ఫిన్లాండ్‌లోని హిటోలాంజోకి నది మధ్యన ఈ చేపలు రాకపోకలు సాగిస్తుండేవి. 1911 నుంచి 1925 మధ్యన జల విద్యుత్కేంద్రాల కోసం నిర్మించిన మూడు ఆనకట్టలు సాల్మన్ చేపలకు, వాటి సంతానోత్పత్తి స్థావరాలకు మధ్య అడ్డుగోడగా మారాయి. ఈ డ్యామ్ ల వల్ల సాల్మన్ చేపలు, బ్రౌన్ ట్రౌట్ లాంటి చేపలు ఫిన్లాండ్ వైపు ఉన్న నదిలో వందేళ్ళ నుంచి బందీలుగా మారిపోయాయి.
‘‘ఆనకట్టలను తొలగించాక,పెద్ద పెద్ద చెట్ల మధ్యన నదీ ప్రవాహం ఎత్తుపల్లాల్లో పడుతూ లేస్తూ సాగిపోతోంది. డ్యామ్‌లను తొలగించిన ప్రతిసారీ నదిలోని కొత్త కొత్త ప్రాంతాలను సాల్మన్ చేపలు సరికొత్తగా హత్తుకుంటున్నాయి’’ అని సౌత్ కరెలియన్ రిక్రియేషన్ ఏరియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హన్నా ఒల్లికైనెన్ వివరించారు. ఈ సంస్థే డ్యామ్‌లను స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతాలను పర్యావరణ, పర్యాటక యుతంగా మార్చే బాధ్యతను తీసుకుంది.
2021లో మొదటి డ్యామ్ కూల్చిన తరువాత అయిదు సాల్మన్ చేపల గుడ్ల స్థావరాలు కనిపించాయి. ఏడాది తరువాత 2022లో పిల్ల సాల్మన్ చేపలు రికార్డు స్థాయులో ఎకరా విస్తీర్ణంలో 200 దాకా ఎదిగాయి. 2023 డిసెంబర్‌లో నది ఎగువ భాగంలోని రిటాకోస్కి డ్యామ్ తొలగింపు పూర్తయినప్పుడు, నది ఎగువ భాగంలోనూ, దాని ఉప నదులలో సాల్మన్ చేపలకు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి మార్గం దొరికింది.
మూడు డ్యామ్‌ల తొలగింపు అనేది దశాబ్దాల తరబడి నది ఆరోగ్యం, ఆర్థిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని చేసిన పనికి దక్కిన ఫలితం అని ఒల్లికైనెన్ చెప్పారు.
ఈ డ్యామ్‌ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ లాభదాయకంగా లేకపోవడం, విద్యుత్ ప్లాంట్ల నిర్వహణా వ్యయం పెరిగిపోవడం, చేపల పరిరక్షణకు తీసుకువచ్చిన పర్యావరణ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వీటిని తొలగించాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకే డ్యామ్‌లను అమ్మేసి, కూలదోశారని ఆయన వివరించారు.
డ్యామ్‌ల తొలగింపు అనేది కేవలం ఫిన్లాండ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. యూరప్ అంతటా అనేక డ్యామ్‌ల జీవిత కాలం ముగిసిపోవడమో, లేదంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే నిర్వహణకు అయ్యే ఖర్చు ఎక్కువ కావడమనే సమస్య ఉంది.
అమెరికాలో కూడా కాలం చెల్లిన డ్యామ్‌ల విషయంపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. యూరప్‌లో కేవలం పెద్ద డ్యామ్‌లే కాదు,లక్షలాది చిన్న చిన్న ఆనకట్టలు నదీ ప్రవాహాలకు అడ్డంకిగా మారాయి.
అయితే, ఇటీవల దాకా నదీ విచ్ఛిన్నత (ఆటంకాల కారణంగా నది పాయలుగా చీలిపోవడం)పై సమగ్రమైన అంచనాలేవీ లేవు. కానీ ఇప్పడా సమాచారం అందుబాటులోకి రావడం వల్ల మరిన్ని డ్యామ్‌లను తొలగించాలనే ఉద్యమం ఊపందుకుంటోంది.

ఫొటో సోర్స్, Mikko Nikkinen / Storymakers
కొన్ని నదులే సాఫీగా...
యూరప్, అమెరికాలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చెందిన ప్రాంతాలోలని నదీ ప్రవాహాలు శతాబ్దాల తరబడి మార్పునకు గురయ్యాయి. వాటిపైన రహదారి నిర్మాణాలు, వ్యవసాయ అవసరాల కోసం నీటిని తోడటం, అలుగులు, కల్వర్టులు, చిన్న చిన్న ఆనకట్టలు, జలవిద్యుత్కేంద్రాలు, నీటి మరలు లాంటివి వీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి.
పరిశోధకుల అంచనా మేరకు ప్రపంచంలో వెయ్యి కిలోమీటర్లు (621 మైళ్ళు) మేర పొడవుండే నదులలో మూడింట ఒక వంతు నదులు మాత్రమే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రవాహిస్తున్నాయి.
నీటిపైన మానవ నిర్మిత అడ్డంకులు తీవ్రమైన సమస్యలను సృష్టించాయి. ఇది జీవ వైవిధ్యానికి నష్టం , చేపలు, సూక్ష్మజీవులను ప్రభావితం చేయడమే కాక, పోషకాలు, అవక్షేపాలు దిగువకు ప్రవహించకపోవడం వల్ల మత్స్య సంపద తరిగిపోయి, దానిపై ఆధారపడిన మానవ జీవనోపాధికి ఇబ్బందిగా మారింది.
ఆనకట్టలు తమ వెనుక అవక్షేపాలను నిరోధించడంవలన దిగువ భాగంలో ప్రవాహించే నీటికి ప్రవాహ శక్తి ఎక్కువవుతుంది. దీనికితోడు నీటిపై నిర్మాణాలు నీటి మట్టాన్ని తగ్గించడంతోపాటు భూగర్భజలాలను కూడా ప్రభావితం చేస్తాయి.
పునరుత్పత్తి కోసం వలస వచ్చే జీవులకు, ముఖ్యంగా చేపలకు ఆనకట్టలు ఆందోళనకరంగా మారాయి. కాప్ 28 ఐక్యరాజ్య సమితి క్లైమెట్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన ఐయూసీఎన్ ముప్పు ఎదుర్కొంటున్న జీవుల జాబితా ప్రకారం స్వచ్ఛమైన జలాల్లో ఈదులాడే చేప జాతులలో 25 శాతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని, డ్యామ్‌లు, నీటి తోడివేత ఈ 25 శాతంలోని 45 శాతం చేపలపై ప్రతికూల ప్రబావం చూపుతున్నాయని పేర్కొంది.
అయితే ఇది కేవలం వలసపోయే చేపలకు జరిగే నష్టం గురించి మాత్రమే కాదు, చిన్నచిన్న అవరోధాలు ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే నదీతీరంలో చేపల కదలిలకను పెద్ద ఎత్తున పరిమితంచేస్తోంది.
నదులలోని జీవుల సహజ ఆవాసాలకు ఆటంకం కలిగించడమనేది జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తున్న ఐదు కీలక అంశాలలో ఒకటి.

ఫొటో సోర్స్, Kim Birnie-Gauvin
డ్యామ్‌ల కూల్చివేతకు మద్దతు
యూరప్‌లోని 36 దేశాలలో కనీసం 12 లక్షల నదీ అవరోధాలు ఉన్నాయని పరిశోధనలు చూపుతున్నాయి.
వీటిలో 2 మీటర్ల ఎత్తు (6.6 అడుగులు)కన్నా తక్కువ ఉన్నవి 68శాతం ఉన్నాయి.
‘‘ఇరవై సెంటిమీటర్ల చిన్న అవరోధం కూడా జలచరాల కదలికలను ప్రభావితం చేస్తాయి’’ అని కార్లోస్ గార్సియా డి లీనిజ్ చెప్పారు. స్వాన్‌సీ అక్వాటిక్ బయోసైన్సెస్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే యురోపియన్‌లో నదీ విచ్ఛిన్నత మొదటి మ్యాప్‌ను రూపొందించిన అంబర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు.
అంబర్ ప్రాజెక్ట్ 2016లో మొదలైనప్పుడు గార్సియా నేతృత్వంలోని బృందం 2000 కిలోమీటర్లు మేర నదులలో, ఎక్కడెక్కడ నది విచ్ఛిన్నానికి గురైందో గుర్తించారు.
వీరి అధ్యయనం కేవలం డ్యామ్‌లకే పరిమితం కాలేదు. ఎక్కడెక్కడ తూములు, కల్వర్టులు, ఇతర చిన్న చిన్న అవరోధాలు నది విచ్ఛిన్నతకు కారణమవుతున్నాయో రికార్డ్ చేశారు.
డ్యామ్ లేదా ఇతర ఏ అడ్డుకట్టనైనా తొలగించే విషయంలో వాటికి సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటి లైసెన్స్, చట్టాలు, ఇంజనీరింగ్ పనులకు నిధులు, దాని సాధ్యాసాధ్యాలు తదితర అంశాలను చూడాల్సి ఉంటుంది.
ఇంకా యూరోప్‌లోని 150,000వేల డ్యామ్ ల లాంటి ఆనకట్టలను ప్రస్తుతం కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.
కాలం చెల్లిన డ్యామ్‌ల నిర్వహణా వ్యవయం ఎక్కువ అవడమే కాకుండా, అవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. భారీ వర్షాల కారణంగా ఇలాంటి డ్యామ్‌లు మునిగిపోయే ప్రమాదం కూడా ఎక్కువ.
యూరప్‌లో జీవితకాలం ముగిసిన డ్యామ్‌లు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అవి అందించే విద్యుత్ ప్రయోజనాల కంటే వాటి ఖర్చే అధికంగా ఉందని డ్యామ్ రిమూవల్ యూరప్ ప్రాజెక్ట్ మేనేజర్ పావో ఫెర్నాండెజ్ గారీడో చెప్పారు.
ఈ సంస్థ ఏడుగురు భాగస్వాములతో 2016లో ఏర్పడింది. ఈ ఈ రిమూవల్ మూమెంట్ ద్వారా యూరప్‌లో 2022లో 325 డ్యామ్‌లను తొలగించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 36 శాతం ఎక్కువ.
ఆనకట్టలు పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయని చెప్పడం అవి అందించే జలవిద్యుత్ ప్రయోజనాలను తిరస్కరించడం కాదు. ‘‘ప్రస్తుతం వాడకంలో ఉన్న అడ్డుకట్టలను తొలగించమని ఎవరూ చెప్పలేదు. కానీ మేం కాలం చెల్లిన ఆనకట్టలను, ఇకపై సమాజానికి ఎంత మాత్రం ఉపయోగం లేనివి, పూడిక పెరిగిపోయి, ప్రవాహానికి ఆటంకంగా మారినవాటిని లక్ష్యంగా చేసుకున్నాం’’ అని గార్సియా డి లీనిజ్ వివరించారు.
డ్యామ్‌ల తొలగింపు ప్రక్రియలో దేశాలకు, దేశాలకు మధ్య తేడాలు ఉన్నా, ప్రభుత్వాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి.
యూరప్‌లో డ్యామ్‌ల తొలగింపులో స్పెయిన్ ముందు వరుసలో నిలుస్తోంది. 2022లో ఇక్కడ 133 ఆనకట్టలను తొలగించారు. దీని తరువాత స్వీడన్, ఫ్రాన్స్ ఉన్నాయి.
2030 నాటికల్లా 25,000 కిలోమీటర్ల మేర (15,530 మైళ్ళు) నదీ గమనం సాఫీగా సాగిపోవడమే లక్ష్యంగా మానవ నిర్మిత ఆనకట్టలను తొలగించాలనే ప్రాథమిక అంగీకారానికి యురోపియన్ దేశాలు వచ్చాయి.
ఇందుకోసం నదీ అనుసంధానమే ప్రధాన అంశంగా చేసుకుని యురోపియన్స్ కమిషన్ ప్రకృతి పునరుద్ధరణ చట్టాన్ని చేసింది.
ఈ చట్టాన్ని ఫిబ్రవరి 27న యురోపియన్ పార్లమెంట్ ఆమోదించింది.ఈ చట్టం డ్యామ్‌ల తొలగింపు ప్రక్రియను మరింత క్రియాశీలకం చేస్తుందని నమ్ముతున్నారు.
అయితే ఈ విధానం యూరప్‌కే పరిమితం కాలేదు. అమెరికాలో డ్యామ్‌లను తొలగించే ప్రక్రియ యూరప్ ప్రయత్నాలకు మరింత స్ఫూర్తినిచ్చిందని ఫెర్నాండెజ్ గారీడో చెప్పారు.
అమెరికా 62 ఏళ్ళ సగటు వయసు గల 92000 డ్యామ్‌లకు పుట్టినిల్లుగా ఉంది.
1999లో అతిపెద్ద ఎడ్వర్డ్స్ డ్యామ్ను తొలగించారు. దీనిని 1837లో నిర్మించారు. దీని నిర్వాహణా లైసెన్స్ 1997లో ముగిసింది. అయితే ఫెడరల్ రెగ్యులేటర్ కమిషన్ మొదటిసారి పర్యావరణ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ఆ లైసెన్స్‌ను పునరుద్ధరించలేదు.
ఇప్పటిదాకా అమెరికాలో దాదాపు నదులపై ఉన్న 2000వేల డ్యామ్‌లను తొలగించారు. ఎడ్వర్డ్స్ డ్యామ్ తొలగించినప్పటి నుంచి మొత్తం 76 శాతం డ్యామ్‌లను కూలగొట్టారు.

ఫొటో సోర్స్, Mikko Nikkinen/Storymakers
డ్యామ్‌లను ఎలా తొలగిస్తారు?
డ్యామ్‌ల తొలగింపు అనేది జాగ్రత్తగా నిర్వహించే ఓ ఇంజనీరింగ్ ప్రక్రియ. అందరూ అనుకున్నట్టు దానిని పేల్చివేయడమే, లేదంటే హఠాత్తుగా నీటింతనటిని వదిలివేసి కూలదోయడమో చేయరు.
హిటోలాంజికీ నదిపై బుల్డోజర్లు మెల్లిగా కాంక్రీట్ గోడలను తవ్వుతూ, నీరు కొంచెం కొంచెంగా అవతలి వైపునకు ప్రవాహించేలా చేస్తున్నాయి.
‘‘డ్యామ్ వెనుక భాగంలో ఏముందనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. డ్యామ్ వెనుక భాగంలో పూడిక పరిస్థితి ఏంటి, అది వరద ప్రవాహ గతిని మార్చుతుందా? పూడిక మొత్తాన్ని తొలగించాలా, దీనికి సంబంధించిన ముందుజాగ్రత్త వ్యూహాలు ఏమిటి? అనేవి గమనంలోకి తీసుకోవాలని ఫోలే చెప్పారు.
కొన్ని సందర్భాలలో డ్యామ్‌లను తొలగించలేనప్పుడు వాటిని ఫిష్ లాడర్‌లాగా ఉపయోగిస్తారు. ఫిష్ లాడర్లు అంటే డ్యామ్‌లో ఒకవైపు ఉండే చేపలను మరో వైపుకు ఒక గొట్టం లాంటిద్వారా చేరవేయడం. అయితే దీని వల్ల కొన్ని చేపలకు ప్రయోజనం కలిగినా, చాలా జలచరాలకు పెద్దగా ఉపయోగం ఉండదు. అలాగే నదులలోని అవక్షేపాల ప్రవాహానికి కూడా ఒరిగేదేమీ ఉండదు.
డ్యామ్‌ల తొలగింపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, చిన్న చిన్న ఆనకట్టలపై దృష్టి సారించాలని, తొలగింపు ప్రాధాన్యాలను ఎంచుకోవడం వల్ల నదీ అనుంధానత చక్కగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఫ్రాన్స్‌లో ప్రస్తుతానికి అతిపెద్ద నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ నార్మండీ నదిపై జరిగింది.
దీనిపై ఉన్న అతిపెద్ద డ్యామ్‌లను 2019, 2023 మధ్యన తొలగించారు.
దీనివల్ల 60 కిలోమీటర్ల మేర (37 మైళ్ళు) నది ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేందుకు మార్గం ఏర్పడింది.
1920 నుంచి ఈ డ్యామ్‌లు శతాబ్దానికి పైబడి అట్లాంటిక్ సాల్మన్, లాంప్రెస్, యూరోపియన్ ఈల్స్ వలసలను పూర్తిగా అడ్డుకున్నాయి.
భారీ ఇంజనీరింగ్ పనుల ద్వారా రిజర్వాయర్ల తొలగింపు మెల్లిగా సాగిన తరువాత, డ్యామ్ వెనుక భాగంలో పేరుకుపోయిన అవక్షేపాలను నది ఒడ్డుల పునర్ నిర్మాణానికి ఉపయోగించారు.
అవక్షేపాలలో విలువైన పోషకాలు ఉండటం వల్ల ఒడ్డున వృక్ష సంపద త్వరగా పెరిగింది’’ అని లారా సాయీసన్స్ తెలిపారు. ఇన్రేన్‌లో సెల్యూన్ సైంటిఫిక్ కార్యక్రమానికి లారా సమన్వయకర్తగా ఉన్నారు. ‘‘ ఒడ్డున ఉండే వృక్ష సంపద తీరాన్ని ధృడంగా చేయడమే కాకుండా అనేక జీవులకు, నీడగా, రక్షణగా నిలుస్తోంది’’. అని తెలిపారు.
డ్యామ్‌ల కారణంగా ఏర్పడిన అందమైన ప్రాంతాలతో ప్రజలకు ఉన్న అనుబంధం దృష్ట్యా వాటిని తొలగించడం వెనుక ఉన్న కారణాలను వారికి అర్థవంతంగా వివరించడ వల్లే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది.
‘‘ఈ డ్యామ్‌లు దీర్ఘకాలంగా ఉండటం వల్ల, నదులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రవాహించడాన్ని ప్రజలకు చూపడమనే విషయం సవాల్ లాంటిదే’’ అని ఫోలే చెప్పారు.
సెల్యూన్ నదిపై డ్యామ్ తొలగించక ముందు అక్కడి ప్రజలు డ్యామ్ వెనుక ఉన్న సరస్సులలో బోటింగ్, చేపలు పట్టడం లాంటి అనేక పనులు చేస్తుండేవారు.
కానీ రిజర్వాయర్‌లో విషతుల్యమైన సైనో బాక్టిరియా పెరిగిపోయింది. దీని కారణంగా నీరంతా కలుషితమైపోవడం వల్ల ప్రజలు ఈ నీటిలో ఈతకు దిగలేని పరిస్థితి ఏర్పడింది’’ అని ఇన్రేలో సెల్యూన్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ రీసెర్చ్ డైరక్టర్ జీన్ మార్క్ రస్సెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Joshua Royte/The Nature Conservancy
తిరిగొచ్చిన చేపలు
డ్యామ్‌ల తొలగింపు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది.
సెల్యూన్ నది వద్ద కేవలం వృక్ష సంపద మాత్రమే పెరగడం కాదు, ఒకనాడు తమకు అందుబాటులోని లేని ప్రాంతాలకు చేపలు కూడా తిరిగి వచ్చాయి. రెండో డ్యామ్ తొలగింపు తరువాత కొన్ని సాల్మన్ చేపలు నది ఎగువ భాగంలో కనిపించాయి.
అలాగే యురోపియన్ ఈల్స్ , నదీ పరివాహక ప్రాంతమంతా తమ ఆవాసంగా చేసుకున్నాయి. సీ లాంప్రే లు కూడా తాము గుడ్లు పెట్టడానికి కొత్త ఆవాసాలను ఉపయోగిస్తున్నాయి.
డ్యామ్‌ల తొలగింపు ప్రజలకు ఓ మార్పు లాంటిదే. నదులలో పేరుకుపోయిన విషతుల్య పదార్థాలను తొలగించడం వల్ల పర్యటక అవకాశాలు పెరుగుతాయి.
ఇప్పటికే హిటోలాంజిక్ నది ఓ పర్యాటక ప్రాంతం. ఇప్పుడిక్కడ సందర్శకుల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోందని ఓలీకైనిన్ చెప్పారు.
అమెరికాలో కూడా డ్యామ్‌ల నిర్మూలన ప్రజలను నదుల పట్ల ఆకర్షణ పెంచేలా చేసింది. మైనే రాష్ట్రంలో పెనోబాస్కట్ నదిపై డ్యామ్‌ను తొలగించిన ఐదేళ్ళ తరువాత ఈత, పాడిలింగ్, తదితర కార్యకలాపాలు పెరిగాయి.
నదీ గమనం సజావుగా సాగడానికి సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది. డ్యామ్‌ల తొలగింపునకు పెనోబాస్కట్ ఇండియన్ నేషన్ అనే తెగ అనుకూలంగా ఉంది.
ప్రారంభంలో డ్యామ్‌ల తొలగింపు అనేక సందేహాలను కలిగించింది అని జాషువా రైట్ చెప్పారు. పెనోబాస్కట్ నదిపై డ్యామ్ తొలగింపు ప్రాజెక్ట్ లో భాగస్వామి అయినా నేచర్ కన్జర్వెన్సీలో ఆయన సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.
కొందరు స్థానికులు డ్యామ్ తొలగింపుపై ఆవేదన చెందారు. పిల్లలైతే ఈ డ్యామ్‌ను ‘‘గ్రాండ్ మా జలపాతం’’ అని పిలుచుకునేవారు అని ఆయన చెప్పారు.
కానీ డ్యామ్ తొలగించిన తరువాత పడుతూ లేస్తూ సాగే నదీ ప్రవాహం బోటు ప్రయాణికులకు , కయాక్ పోటీలకు ఆటస్థలంగా మారింది. అలాగే అనేక విద్యా సంబంధ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. నదిని ప్రేమించడమనేది మునుపటి కంటే ఎక్కువైంది’’ అని రైట్ చెప్పారు.

ఫొటో సోర్స్, OPP Sélune, Univ Paris Nanterre/SMBS
ఆచరణ సాధ్యమే
నదీ అనుసంధానతకు డ్యామ్‌ల తొలగింపు అనేది ఓ ఆచరణ సాధ్యమయ్యే పనేనని యూరప్, అమెరికా చాటి చెప్పినా ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది.
అమెజాన్, కాంగో, మెకాంగ్ బేసిన్‌లలోని పెద్ద నదులపై కొత్త డ్యామ్ ల నిర్మించాలనే ప్రణాళికలు పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇలాంటి ఆందోళనలే బాల్కన్స్ దేశాలకు సంబంధించి కూడా ఉన్నాయి.
ఈ దేశాలలో అనేక చిన్నపాటి జలవిద్యుత్కేంద్రాలు నిర్మించాలనే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇవి వేలాదిగా నిర్మించినా, ఓ పెద్ద జల విద్యుత్కేంద్రం ఇచ్చే ప్రయోజనాలు ఇవ్వలేవని, ఈ చిన్నపాటి కేంద్రాల వల్ల నదీ అనుసంధానానికి విచ్ఛిన్నత ఏర్పడటమేకాక, చాలినంత విద్యత్ ఉత్పత్తి అవదు కాబట్టి, వీటి నిర్మాణం నిష్ప్రయోజనమని చెబుతున్నారు.
యూరప్‌లో డ్యామ్‌లను తొలగించడానికి అర్థం ప్రపంచంలో ఎక్కడైనా చిన్నపాటి తక్కువ ప్రభావం చూపే హైడ్రోపవర్ డ్యామ్స్ కట్టమని చెప్పడం కాదంటారు గార్సియా డీ లినిజ్.
‘‘దీనిని మనం పెద్ద స్థాయులో చూడాల్సిన అవసరం ఉంది. ఈ చిన్నపాటి హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల మనం పెద్ద ఎత్తున విదుయత్ ఉత్పత్తి చేయకపోగా, అమితమైన నష్టాన్ని కలగచేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ కాలం చెల్లిన డ్యామ్‌లను తొలగించాలి అంటే మొత్తం డ్యామ్‌లన్నింటినీ తొలగించాలని కాదు, వీటిల్లో మంచి కంటే చెడు ఎక్కువ చేస్తున్నవాటినే తొలగించడం’’ అని ఆయన చెప్పారు.
ఇవికూడా చదవండి:
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- మిషన్ కనెక్ట్ పాడేరు: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు...బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, ప్రపంచం మీద ప్రభావం ఏంటి? 5 కీలక పరిణామాలు
- జాస్మిన్ పారిస్: 125 ఏళ్ల చరిత్రలో 20 మంది మగవాళ్లు మాత్రమే పూర్తిచేసిన అత్యంత కఠినమైన 100 మైళ్ల మారథాన్‌లో రికార్డ్ సృష్టించిన తొలి మహిళ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














