ఆర్కిటిక్: కరుగుతున్న మంచు ధ్రువపు ఎలుగుబంట్లను ఆకలితో చిక్కిపోయేలా చేస్తోందా?

ధ్రువపు ఎలుగుబంటి

ఫొటో సోర్స్, DAVID MCGEACHY

    • రచయిత, మేట్ మెక్‌గ్రాత్
    • హోదా, పర్యావరణ ప్రతినిధి

ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుతుండడంతో కొన్ని ధ్రువపు ఎలుగుబంట్లు ఆకలికి లోనవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మంచు కరగడం వల్ల భూమిపై ఉండే ఆహారాన్ని అవి తినాల్సిన పరిస్థితి వస్తోందని.. అందుకు అవి అలవాటుపడలేక ఆకలికి గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆర్కిటిక్ ధ్రువపు ఎలుగుబంట్లు సాధారణంగా తీరానికి దూరంగా సముద్రంలో మంచు ఫలకాల మధ్య ‘రింగ్డ్ సీల్‌’లను వేటాడుతుంటాయి.

కానీ.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా మంచు కరుగుతుండడంతో చాలా ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా తీరానికే పరిమితం కావాల్సి వస్తోంది.

తీరంలో తిరిగే పక్షులు, వాటి గుడ్లు, గడ్డి, పండ్లను అవి ఆహారంగా తినాల్సి వస్తోంది.

దీనివల్ల ఈ భారీ జంతువులు తొందరగా బరువును కోల్పోతూ చనిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ముప్పు ఎదుర్కొంటున్న జీవులలో ధ్రువపు ఎలుగుబంట్లు ప్రధానమైనవి. అయితే, వీటిపై పడే అసలు ప్రభావం ఏంటనేది చాలా సంక్లిష్టమైన అంశం.

నిజానికి 1980లతో పోల్చితే వీటి సంఖ్య భారీగా తగ్గిపోవడానికి వీటిని వేటాడడం ఎక్కువవడం కూడా ఒక కారణమే.

వేటను నియంత్రించి చట్టపరంగా వీటికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టడం వల్ల వీటి సంఖ్య పెరిగినప్పటికీ ఇప్పుడు భూవాతావరణంలో వేడి పెరగుతుండడం వల్ల మరో ముప్పును ఎదుర్కొంటున్నాయి.

వీటి మనుగడ ఆర్కిటిక్ సముద్రం గడ్డకట్టడంపైనే ఆధారపడి ఉంది.

ఇవి సముద్రంపై గడ్డ కట్టిన మంచుపై వెళ్లి ‘రింగ్డ్ సీల్స్’ను వేటాడుతాయి. రింగ్డ్ సీల్స్‌లో కొవ్వు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది. వసంత కాలం చివర్లో, వేసవికి ముందు ధ్రువపు ఎలుగుబంట్లు వీటినే తింటాయి.

కానీ, వేడి నెలల్లో ఇప్పుడు ఆర్కిటిక్‌లోని చాలా ప్రాంతాలలో మంచు కరవవుతోంది.

ఈ అధ్యయనం జరిపిన పశ్చిమ మానిటోబాలో 1979 నుంచి 2015 మధ్య మంచులేని కాలం మూడు వారాలపాటు పెరిగింది.

మంచు లేకపోతే ఈ ధ్రువపు ఎలుగుబంట్లు ఎలా మనుగడ సాధిస్తాయనేది తెలుసుకోవడానికి అధ్యయనకర్తలు 20 ధ్రువపు ఎలుగుబంట్లను మూడేళ్ల పాటు వేసవి కాలాల్లో పరిశీలించారు. అవేం చేస్తున్నాయో నిరంతరం గమనించారు.

వాటి బరువు ఎప్పటికప్పుడు నమోదు చేయడం, వాటికి రక్త పరీక్షలు చేయడంతో పాటు జీపీఎస్ పరికరాలు అమర్చిన వీడియో కెమేరా కాలర్లు కూడా వాటి మెడలో వేశారు.

దీనివల్ల ఆ జంతువుల కదలికలను గమనించడానికి శాస్త్రవేత్తలకు అవకాశమేర్పడింది. అంతేకాదు.. అవి ఏం చేస్తున్నాయి, ఏం తింటున్నాయనేది కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు.

మంచు గడ్డకట్టని వేసవి కాలంలో ఈ ఎలుగుబంట్లు మనుగడ కోసం రకరకాల వ్యూహాలు అనుసరించాయి. కొన్ని ఎలుగుబంట్లు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ తమలోని శక్తి ఖర్చయిపోకుండా కాపాడుకుంటూ వచ్చాయి.

ఎక్కువ శాతం ఎలుగుబంట్లు శాకాహారం కోసమో, పండ్లు కోసమో వెతికాయి. మరికొన్ని మాత్రం చేపలు, ఇతర ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని సముద్రంలో ఈత కొడుతూ తిరిగాయి.

అయితే రెండు ప్రయత్నాలూ విఫలమే అయ్యాయి. మొత్తం 20 ఎలుగుబంట్లను పరిశీలించగా అందులో 19 ఎలుగుబంట్లు బరువు కోల్పోయాయి. సుమారు 11 శాతం వరకు బరువు తగ్గాయి.

ధ్రువపు ఎలుగుబంటి

ఫొటో సోర్స్, DAVID MCGEACHY

రోజుకు కేజీ బరువు తగ్గాయి

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అలస్కాలోని యూఎస్ జియాలజికల్ సర్వేకు చెందిన డాక్టర్ ఆంథోనీ పగానో మాట్లాడుతూ.. ఎలాంటి వ్యూహంతో అవి నడుచుకున్నప్పటికీ అవి నేలపై మనుగడ సాగించాలని ప్రయత్నించినంత కాలం వాటికి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.

సగటున అవి రోజుకు కేజీ బరువు తగ్గాయన్నారు.

ధ్రువపు ఎలుగుబంట్లు మిగతా రకాల ఎలుగుబంట్ల కంటే పూర్తిగా భిన్నమైనవని.. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ బేర్ సెంటర్‌కు చెందిన సహ అధ్యయనకర్త చార్లెస్ రాబిన్స్ అన్నారు.

నీట్లో ఆహారం వేట కొనసాగించిన మూడు ధ్రువపు ఎలుగుబంట్లలో రెండింటికి చనిపోయిన జీవులు దొరికినప్పటికీ ఆ ఎలుగుబంట్లు మాత్రం ఎక్కువసేపు వాటిని తింటూ నీట్లో ఉండలేకపోయాయి.

ఒక ఆడ ధ్రువపు ఎలుగుంబటికి నీట్లో చనిపోయిన బెలూగా తిమింగలం కనిపించినప్పటికీ రెండు మూడు ముక్కలు మాత్రమే అది కొరికింది. ఎక్కువ సమయం ఆ ఎలుగుబంటి ఆ తిమింగలం కళేబరాన్ని తినడం కంటే తెప్పలా వాడుకుందని డాక్టర్ పగానో చెప్పారు.

ఈ ఎలుగుబంట్లు ఈత కొట్టడం, తినడం ఒకేసారి చేయలేవని మాకు అర్థమైంది అన్నారు పగానో.

వీరి అధ్యయనం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ధ్రువపు ఎలుగుబంటి

ఫొటో సోర్స్, Getty Images

ధ్రువపు ఎలుగుబంట్ల గురించి మీకిది తెలుసా?

ప్రపంచంలో సుమారు 26 వేల ధ్రువపు ఎలుగుబంట్లు మాత్రమే ఇప్పుడు మిగిలున్నాయి. అందులో అత్యధికం కెనడాలోనే ఉన్నాయి. అమెరికా, రష్యా, గ్రీన్‌లాండ్, నార్వేలోనూ ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) ధ్రువపు ఎలుగుబంట్లను అంతరించిపోయే ముప్పు ఉన్న జీవుల జాబితాలో చేర్చింది.

మగ ధ్రువపు ఎలుగుబంట్లు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. 600 కేజీల వరకు బరువు ఉంటాయి.

ఇవి భారీ సముద్ర జీవులను తినేటప్పుడు ఒక్కసారికి 45 కేజీల కొవ్వు వరకు తినేస్తాయి.

వాసన పసిగట్టే సామర్థ్యం వీటికి చాలా ఎక్కువ. 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరను కూడా పసిగట్టేస్తాయి.

ఇవి ఈత బాగానే కొట్టగలవు. తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో కూడా సముద్రంలో వీటిని గుర్తించిన సందర్భాలున్నాయి. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఇవి ఈదగలవు.

ధ్రువపు ఎలుగుబంటి

ఫొటో సోర్స్, USGS/WASHINGTON STATE UNIVERSITY

అయితే, ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు మరో ఆసక్తికర అంశాన్నీ గుర్తించారు. ఈ ఎలుగుబంట్లలో ఒకటి మిగతావాటికి భిన్నంగా 32 కిలోల బరువు పెరిగింది.

దీనికి ఒక జంతువు కళేబరం దొరికింది. అంతేకాదు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ శక్తి ఖర్చు కాకుండా కాపాడుకుంది.

అయితే.. ఈ అధ్యయనానికి భిన్నంగా మరికొన్ని అధ్యయనాలు ధ్రువపు ఎలుగుబంట్లపై వాతావరణ మార్పుల ప్రభావం అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండకపోవచ్చని సూత్రీకరించాయి.

సముద్రం గడ్డకట్టని ప్రాంతాల నుంచి ధ్రువపు ఎలుగుబంట్లు కనుమరుగు కావొచ్చు.. కానీ, అది ఎక్కడ అనేది స్పష్టంగా చెప్పలేం అన్నారు నార్వేజియన్ పోలార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జాన్ ఆర్స్ .

ఈ అధ్యయనంలో ఆయన పాల్గొనలేదు.

కొన్ని ప్రాంతాలు పోలార్ బేర్స్‌ మనుగడకు చాలాకాలంగా అనుకూలంగా ఉన్నాయని ఆర్స్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)