చక్కెర కన్నా బెల్లం మంచిదా?

జిలేబీ తింటున్న ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరు రోజూ తాగే టీ నుంచి పండుగలకు చేసే స్వీట్ల వరకు అన్నింటిలో చక్కెర బదులు బెల్లం వాడుతున్నారు.
    • రచయిత, గౌతమీ ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొన్నామధ్య నేనొక ఫ్రెండ్ ఇంటికి వెళ్లా. టీ పెడుతూ నా ఫ్రెండ్ చక్కెర వేయలేదు.

‘‘చక్కెర లేకపోతే టీ ఏం రుచిగా ఉంటుంది?’’ అని అన్నాను.

‘‘మేం చక్కెర మానేసి చాలా కాలమైంది. బెల్లం, అది కూడా ఆర్గానిక్ మాత్రమే వాడుతున్నాం’’ అని కాస్త గర్వంగా చెప్పింది.

అంతేనా...‘‘అయ్యో! ఇంకా మీరు చక్కెరే వాడుతున్నారా?’’ అంటూ ఆశ్చర్యపోతూ నా మీద కాస్త జాలి కూడా చూపించింది.

ఇలా ‘‘చక్కెర కంటే బెల్లం మంచిది’’ అనే మాట ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తోంది. మీరు కూడా వినే ఉంటారు.

ఈ మధ్య కాలంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెరిగింది. డయాబెటిస్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. కొందరు తీపిని తగ్గించుకుంటుంటే ఇంకొందరు చక్కెరకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు.

అలా కొందరు షుగర్‌కు బదులు బెల్లం, తేనె వాడుతున్నారు. రోజూ తాగే టీ నుంచి పండుగలకు చేసే స్వీట్ల వరకు అన్నింటిలో బెల్లం వాడుతున్నారు.

మరి నిజంగానే చక్కెర కన్నా బెల్లం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

చక్కెర, బెల్లం
ఫొటో క్యాప్షన్, కొందరు రోజూ తాగే టీ నుంచి పండుగలకు చేసే స్వీట్ల వరకు అన్నింటిలో చక్కెర బదులు బెల్లం వాడుతున్నారు.

చక్కెరకు, బెల్లానికి తేడా ఏమిటి?

చక్కెర, బెల్లం.. రెండూ చెరకు నుంచే తయారవుతాయి. కానీ, వాటిని ప్రాసెస్ చేసే విధానంలో తేడా ఉంటుంది. తెల్లగా ఉండే చక్కెర అనేది రిఫైన్డ్ స్వీట్నర్. దీని తయారీలో సల్ఫర్ డై ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఫాస్పోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్‌ వాడతారు. అందువల్ల చెరకులో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు నశిస్తాయి. మొత్తానికి ఇందులో కేలరీలు తప్ప పోషకాలు ఉండవు.

ఇక బెల్లం తయారీలో చెరకు రసాన్ని మరిగిస్తారు. చెరకు రసంలోని నీళ్లు పూర్తిగా ఆవిరి అయ్యే వరకు మరగ పెడతారు. అలా చిక్కగా అయిన పాకాన్ని ముద్దలుగా దిమ్మెలుగా అచ్చు పోస్తారు. ఇందులో రిఫైన్ చేయడం ఉండదు కాబట్టి బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి.

మొత్తానికి చక్కెరకు బెల్లానికి తేడా ఏంటంటే పోషకాలు. బెల్లంలో పోషకాలు ఉంటాయి. చక్కెరలో దాదాపు ఉండవు.

కేలరీల విషయంలో రెండూ ఒకటే.

బెల్లం, చక్కెరలోని పోషకాలు
చక్కెర, బెల్లం

చక్కెర తిన్నప్పుడు ఏమవుతుంది?

చక్కెరతో చేసిన పదార్థాలను లేదా నేరుగా చక్కెరను తిన్నప్పుడు అవి వెంటనే జీర్ణమవుతాయి. చక్కెరలో ప్రోటీన్లు, ఖనిజాలు ఏమీ లేకపోవడం వల్ల వేగంగా జీర్ణమవడంతోపాటు అది అంతే వేగంగా రక్తంలో కలుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది.

గ్లూకోజ్ పెరగడంతో క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్‌ను తీసుకోవాలంటూ కణాలకు ఇన్సులిన్ చెబుతుంది.

చాకొలెట్లు వంటివి తిన్నప్పుడు కాస్త ఎనర్జిటిక్‌గా అనిపించడానికి కారణం ఇదే.

బెల్లం తీసుకున్నప్పుడు కూడా దాదాపు ఇదే జరుగుతుంది.

కాకపోతే బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండటం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. తద్వారా రక్తంలోని షుగర్ స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుంది.

బెల్లం

ఫొటో సోర్స్, GANESH

తీపి ఎక్కువగా తీసుకొంటే ఏమవుతుంది?

బెల్లం, చక్కెరలో ఉండే కేలరీలలో పెద్దగా తేడా ఉండదు. చక్కెర అయినా బెల్లం అయినా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

తీపి ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనంగా వచ్చే గ్లూకోజ్‌ను కాలేయం, కండరాల కణాల్లో శరీరం నిల్వ చేస్తుంది. ఇది మెల్లగా కొవ్వుగా మారుతుంది.

‘‘మెదడుతోపాటు శరీర భాగాల మీద దీని ప్రభావం ఉంటుంది. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి వృద్ధాప్యం ఛాయలు వచ్చే అవకాశం ఉంది’’ అని సీనియర్ డైటీషియన్ జానకి శ్రీనాథ్ తెలిపారు.

‘‘బెల్లంలో కొంత వరకు పోషకాలు ఉండటం వల్ల మితంగా తీసుకోగలిగితే కొంత వరకు మేలు’’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అన్నారు.

చక్కెరకు ప్రత్యామ్నాయాలు వెతకడం కంటే తీపిని తగ్గించుకోవడం మంచిదని ఆమె సూచించారు.

చక్కెర

ఫొటో సోర్స్, AVERAGE PA

చక్కెర మానేయడమే మేలా?

‘‘చక్కెరను ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి కలిగే లాభం ఏమీ లేదు. చక్కెర బదులు బెల్లం, తేనె లాంటివి తీసుకున్నా అవి కూడా అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. శరీరం బరువు అదుపులో ఉండాలన్నా రక్తంలోని చక్కెర స్థాయులు స్థిరంగా ఉండాలన్నా తీపిని తీసుకోవడం తగ్గించుకోవడమే మంచిది’’ అని సుజాత స్టీఫెన్ చెప్పారు.

అనారోగ్య కారణాల దృష్ట్యా లేదా ఫిట్‌నెస్ కోసం ప్రత్యామ్నాయాల కోసం చూడకుండా తీపిని తగ్గించడమే మంచిదని ఆమె తెలిపారు. షుగర్-ఫ్రీ పదార్థాలను రోజూ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరించారు.

ఇక చక్కెరను పూర్తిగా మానివేయాలా అంటే మానేయాల్సిన అవసరం లేదని, కానీ మితంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

బయటి నుంచి తెచ్చుకునే స్వీట్లు, కూల్ డ్రింక్స్, చాకొలెట్లు వంటి వాటి రూపంలో కూడా చక్కెర శరీరంలోకి చేరుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

చక్కెర

ఫొటో సోర్స్, Getty Images

షుగర్ పేషెంట్లు చక్కెర బదులు బెల్లం తినొచ్చా?

షుగర్ పేషెంట్లకు చక్కెర వల్ల ఎంత ముప్పు కలుగుతుందో బెల్లం వల్ల కూడా అంతే ముప్పు వాటిల్లుతుంది.

చక్కెర, బెల్లం, తేనె వీటిలో ఏవైనా శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్‌గా మారతాయి. కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు బెల్లం , చక్కెర, తాటిబెల్లం లాంటివాటికి దూరంగా ఉండటం మంచిదని సుజాత స్టీఫెన్ తెలిపారు.

అయితే మధుమేహాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకొనేవారు, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకునేవారు అప్పుడప్పుడు తీపి తినడం వల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదని చెప్పారు.

బెల్లం చిక్కీ

ఫొటో సోర్స్, Getty Images

రోజుకు ఎంత బెల్లం తినొచ్చు?

బెల్లం, చక్కెర, తేనె వీటిలో ఏదైనా రోజుకు 20 నుంచి 36 గ్రాములకు మించి తినకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది.

మగవాళ్లు 9 టీ స్పూన్లు అంటే 36 గ్రాములు, ఆడవాళ్లు 6 టీ స్పూన్లు అంటే 25 గ్రాములు తీసుకోవాలని సూచిస్తోంది.

రోజూ తీసుకునే కేలరీలలో తీపి వాటా 5 శాతం కంటే తక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)