చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, ప్రపంచం మీద ప్రభావం ఏంటి? 5 కీలక పరిణామాలు

చైనా
ఫొటో క్యాప్షన్, చైనా స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ఆరంభంలో ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి
    • రచయిత, యాన్ చెన్
    • హోదా, బీబీసీ చైనా

చైనా తమ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు (1978) మొదలుపెట్టినప్పటి నుంచి జీడీపీ వృద్ధి, ఏడాదికి సగటున 9 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ అభివృద్ధితో చైనా ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజిన్‌గా మారింది.

కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనంతో 2020లో చైనా అత్యల్ప వృద్ధి రేటు (2.2 శాతం)కి పరిమితమైంది.

ఆ మరుసటి ఏడాది జీడీపీ వృద్ధి 8 శాతానికి పైగా పెరిగింది. కానీ, 2022లో మళ్లీ ఇది 3 శాతానికి పడిపోయింది.

కాబట్టి, ఇప్పుడు చైనా దీర్ఘకాల తక్కువ వృద్ధి పీరియడ్‌లోకి ప్రవేశించింది అని అనుకోవచ్చా?

చైనా ఆర్థికవ్యవస్థకు వ్యతిరేకంగా మారిన అంశాలేంటి? ఈ ప్రభావం ప్రపంచదేశాల మీద ఎలా ఉండబోతుందో అని వివరించే 5 అంశాల గురించి ఇక్కడ చూద్దాం.

చైనా ఆర్థిక వ్యవస్థ

1. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది?

చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2023లో 5.3 శాతానికి పెరిగిందని జనవరిలో వెల్లడించింది. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల్లో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు చైనా ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లకు పైగా ఉంటుంది.

కానీ, చైనా ప్రజలు మాత్రం వేరేలా భావిస్తున్నారు. గత అయిదేళ్లలో తొలిసారిగా 2023లో చైనా నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. గత ఏడాది జూన్‌లో యువత నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో అత్యధికంగా 20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది ఆరంభంలో స్టాక్ మార్కెట్లు అయిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి.

కరోనా మహమ్మారి తర్వాత చైనా బలహీనంగా కోలుకోవడానికి కారణం, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి చైనా ఇతర దేశాల తరహాలో ఆల్ట్రా-అగ్రెసివ్ విధానాలను వాడకపోవడమే అని డచ్ బ్యాంక్ ఐఎన్‌జీలోని గ్రేటర్ చైనా చీఫ్ ఎకనమిస్ట్ లిన్ సోంగ్ వివరించారు.

అమెరికా వంటి ఇతర దేశాలు కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఉపశమన (రెస్క్యూ) ప్రణాళికలను అమలు చేశాయి. అమెరికా రూ. 1,58,32,690 కోట్ల (1.9 ట్రిలియన్ డాలర్లు)తో అమలు చేసిన రెస్క్యూ ప్రణాళిక కరోనా సమయంలో నిరుద్యోగులు, అదనపు సహాయం అవసరమైన చిన్న వ్యాపారాలు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు అండగా నిలిచింది.

‘‘ఈ దశ అంతటా చైనా ఆర్థిక విధానం మరింత సంయమనంతో ఉంది. ఫలితంగా చైనాలో ద్రవ్యోల్బణం సమస్యగా మారలేదు. కానీ, ఆర్థిక పురోగతి బలహీనంగా మారింది’’ అని సోంగ్ వివరించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ

చైనా బలహీన రికవరీకి మరో ప్రధాన కారణం గురించి యూబీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కు చెందిన వాంగ్ తావో వివరించారు. చైనాలో ఆస్తి కొనుగోళ్లు తిరోగమనంలో ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘చైనాలో 60 శాతానికి పైగా కుటుంబాల సంపద హౌజింగ్ నుంచే వస్తుంది. ఇళ్ల ధరలు పడిపోయినప్పుడు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఖర్చు చేయడానికి వెనుకాడతారు. ఉదాహరణకు, భారీ గృహోపకరణాల వాడకం గణనీయంగా తగ్గిపోవడమే దీనికి స్పష్టమైన సంకేతం’’ అని తావో చెప్పారు.

చైనా ప్రాపర్టీ మార్కెట్‌లోని సమస్యలు ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా మూడో వంతు ఉంటుంది.

పెద్ద ప్రాపర్టీ కంపెనీలు అప్పు తీసుకోగల రుణ మొత్తాన్ని తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటి (2021) నుంచి ఈ రంగం ప్రధాన ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటోంది.

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, బాండ్లను జారీ చేయడం, కొనుగోలుదారులకు కొత్త ఇళ్లను విక్రయించడం ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం కొన్నేళ్లుగా చైనా ప్రాపర్టీ రంగం నిధుల్ని సేకరించింది.

చాలా దేశాలు చాలా కాలంగా ఈ వ్యాపార నమూనాను పాటిస్తున్నాయి. కానీ, చైనా డెవలపర్లు విపరీతంగా రుణాలు తీసుకుంటున్నారు.

ఈ మధ్య కొన్నేళ్లలో అనేక మంది పెద్ద ప్రాపర్టీ డెవలపర్లు, రుణాల ఎగవేతదారులుగా మారారు.

చాలా మంది చైనీయులు తమ అపార్ట్‌మెంట్‌లు, ప్రాపర్టీల కోసం ఈ డెవలపర్లకు డౌన్‌ పేమెంట్‌లు చెల్లించారు. ఇప్పుడు వీరంతా తమ డబ్బును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కొంతమంది జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని పణంగా పెట్టారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మించడానికి వేలకోట్లు అప్పులు చేసి, ఆదాయం కోసం భూముల అమ్మకాలపై ఆధారపడిన స్థానిక ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం, వారి రుణం 92 ట్రిలియన్ యువాన్లకు చేరింది. 2022 చైనా ఆర్థిక ఉత్పత్తిలో ఇది 76 శాతం.

‘‘చైనా ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా సంక్షోభంలో అయితే లేదు’’ అని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని సీనియర్ ఆర్థికవేత్త టియాన్‌చెన్ షు అన్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థ

2. అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందా?

జీడీపీ పరిమాణం పరంగా 2010లో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు, అమెరికా జీడీపీని కూడా చైనా దాటేస్తుందని అంచనా వేశారు.

ఎందుకంటే, రెండు పర్యాయాల్లో (1992-95, 2003-07) చైనా రెండంకెల వార్షిక వృద్ధిని నమోదు చేయడంతో ఈ అంచనాలు పెరిగాయి.

ఆనాటి పరిస్థితుల ప్రకారం, 2028 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని లెక్కలేశారు.

కానీ ఇప్పుడున్న ఈ అనిశ్చిత పరిస్థితుల్లో చైనా దీన్ని అందుకోగలదా?

"అవును. కానీ, బహుశా దీన్ని సాధించడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చు’’ అని హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆన్ కాంటెంపరరీ చైనా అండ్ ది వరల్డ్ (సీసీసీడబ్ల్యూ) వ్యవస్థాపక డైరెక్టర్, ప్రొఫెసర్ లీ చెంగ్ చెప్పారు.

2040లలో చైనా ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని టియాన్‌చెన్ షు అన్నారు.

ఈ ఏడాది చివరిలో జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సహా అమెరికా ముందు అనేక అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని ప్రొఫెసర్ లీ వివరించారు.

‘‘చైనా ముందు కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, కొన్నేళ్లలోనే ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో చైనా అగ్రగామిగా మారింది. చాలా మందికి ఇది ఆశ్చర్యం కలిగించింది.

కానీ, సొసైటీలో వృద్ధుల సంఖ్య పెరగడం చైనాకు దుర్వార్త. చైనాతో పోల్చి చూస్తే అమెరికాలో జననరేటు ఎక్కువ. వలస వచ్చిన వారు శ్రామిక శక్తిలో తోడైనందున అమెరికాపై ఎక్కువ ఒత్తిడి లేదు’’ అని లీ వివరించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

3. చైనా ఎదుర్కొనే పర్యవసానాలు ఏంటి?

ఆర్థికవ్యవస్థ మందగమనానికి ‘‘నెగెటివ్ కాన్ఫిడెన్స్ ఫీడ్‌బ్యాక్ లూప్’’ కారణమవుతుందని డచ్ బ్యాంక్ ఐఎన్‌జీలోని గ్రేటర్ చైనా చీఫ్ ఎకనమిస్ట్ లిన్ సోంగ్ అన్నారు.

విశ్వాసం లేకపోవడం వల్ల పెట్టుబడులు, వినియోగం తగ్గుతాయని, ఫలితంగా ఇది కార్పొరేట్ లాభాలను తగ్గిస్తుందని చెప్పారు. తక్కువ ఆస్తి ధరల్లో (లోయర్ ప్రాపర్టీ ప్రైజెస్) ఇదే వైఖరి ప్రతిబింబిస్తోందని, ఇది బలహీన విశ్వాసానికి దారి తీస్తుందని ఆయన నమ్ముతున్నారు.

"దీన్నుంచి బయటపడటానికి సహాయక విధానాలు అవసరం" అని సోంగ్ చెప్పారు.

అంతర్గత అసంతృప్తిని తిప్పికొట్టేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, తైవాన్‌పై దాడి చేస్తారని కొందరు భయపడుతున్నారు.

"నిజానికి చైనాకు ప్రధాన సమస్య తైవాన్. చైనా నాయకత్వం కూడా ఈ సమస్యకు అంతిమ పరిష్కారం యుద్ధమే అని గ్రహించింది. అయితే, ఆర్థిక స్తబ్దత దానికి తగిన కారణం కాదు" అని సోంగ్ వివరించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

4. ప్రపంచాన్ని ఈ మందగమనం ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈ మందగమనం సరుకులు, చైనా టూరిజం, భౌగోళిక రాజకీయాలు అనే మూడు విధాలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని టియాన్‌చెన్ షు భావిస్తున్నారు.

"చైనా ప్రధానంగా సరుకుల్ని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, చైనా ఆర్థిక మందగమనం సరుకుల డిమాండ్‌ను తగ్గిస్తుంది.

ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇనుప ఖనిజం, బాక్సైట్ డిమాండ్ పడిపోతుంది.

రెండోది టూరిజం. చైనా పర్యాటకులు తగ్గిపోవడం వల్ల ప్రధాన పర్యాటక ప్రాంతాలకు రాబడి తగ్గుతుంది. ఫలితంగా టూరిజం రంగం కరోనా పూర్వపు స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది.

మూడవది ఏంటంటే, స్వదేశంలోనే పబ్లిక్ ఫైనాన్స్ సంక్షోభం ఉంటే సహాయం చేయడం(ఎయిడ్), అధికారిక రుణాల ద్వారా భౌగోళిక రాజకీయాలను మార్చే చైనా సామర్థ్యం తగ్గిపోతుంది.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

5. చైనా మళ్లీ పుంజుకోగలదా?

ఆర్థిక పరివర్తన దశను విజయవంతంగా అధిగమించి, మళ్లీ అగ్రస్థానానికి వెళ్లడమే చైనా తదుపరి లక్ష్యం అని సోంగ్ చెప్పారు.

"నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ గత రెండు సెషన్లలో చైనా విధాన కర్తలు ఎప్పటిలాగే దీర్ఘకాల ప్రాధాన్య అంశాలపై దృష్టిసారించారు. ఇదే చైనా తదుపరి దశకు చేరుకోగలదా అనే అంశాన్ని నిర్ణయిస్తుంది’’ అని సోంగ్ అన్నారు.

ఈ విషయంలో టియాన్‌చెన్ షు కొన్ని సూచనలు చేశారు.

ప్రాపర్టీ సంక్షోభాన్ని మరింత బాధ్యతాయుతంగా ఎదుర్కోవడమే చైనాకు ఇప్పుడు అత్యంత కీలకమని షు అన్నారు.

"రెండోది, ఆర్థిక వ్యవస్థకు చెందిన సరఫరా రంగం వైపు దృష్టి కేంద్రీకరించే బదులు డిమాండ్‌ రంగం దృష్టి పెట్టాలి. ప్రైవేట్, విదేశీ సంస్థల కోసం నిబంధనలను సరళీకరించాలి’’ అని సూచించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)