ఏపీ, తెలంగాణ: పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా ఎంపీల సంఖ్య ఎందుకు పెరగడం లేదు?

మహిళలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ సెప్టెంబర్ 29న ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

అడ్డుగోడలను బద్దలు కొడుతూ విద్యలో, ఉద్యోగాల్లో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మగవారితో దీటుగా పోటీ పడుతున్న నేటి ఆధునిక మహిళ, చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో మాత్రం సమాన అవకాశాలను చేజిక్కించుకోలేకపోతోంది.

నారీ శక్తి వందన రాజ్యాంగ సవరణ చట్టం వెనక ఈ నేపథ్యం ఉంది. ఇది ఇంకా అమల్లోకి రాలేదు.

గతంతో పోలిస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం, ప్రత్యేకించి లోక్‌సభలో పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తోందా? ఈ కథనంలో చూద్దాం.

ఏపీ, తెలంగాణల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత?

ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17 కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు మహిళలు లోక్ సభలో అడుగుపెట్టగలిగారు.

వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తెలంగాణ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఎంపీగా ఉన్నారు.

ఏపీలోని అనకాపల్లి నుంచి డాక్టర్ బి.వెంకట సత్యవతి, అమలాపురం (ఎస్సీ) నుంచి చింతా అనురాధ, అరకు (ఎస్టీ) నుంచి గొడ్డేటి మాధవి, కాకినాడ నుంచి వంగా గీత ఎంపీలుగా ఎన్నికయ్యారు.

తెలంగాణలో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి మాలోతు కవిత ఎంపీగా ఉన్నారు.

అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కేవలం ఒకే ఒక్క మహిళ లోక్‌సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు.

అదే సమయంలో, ఏపీ నుంచి ఇద్దరు మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. కర్నూలు నుంచి బుట్టా రేణుక, అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీలుగా గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉండేది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత 1957లో రెండో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు తొలిసారి దిగువ సభకు ఎన్నికయ్యారు. ఏలూరు నుంచి మోతే వేద కుమారి, విజయవాడ నుంచి కొమర్రాజు అచ్చమాంబ గెలిచారు.

ఆ తర్వాత 15 సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరిగినా ఆ సంఖ్య ఎప్పుడూ ఐదుకి మించింది లేదు.

1989 ఎన్నికల్లో తొలిసారి ఐదుగురు మహిళలు ఎంపీలుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

తొమ్మిదో లోక్‌సభకు జరిగిన ఆ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఉమా గజపతి రాజు, రాజమండ్రి నుంచి సినీ నటి జమున, విజయవాడ నుంచి చెన్నుపాటి విద్య, సికింద్రాబాద్ నుంచి మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య భార్య టి.మణెమ్మ, భద్రాచలం నుంచి కరియెద్దుల కమలకుమారి విజయం సాధించారు.

13వ లోక్ సభలోనూ ఐదుగురు మహిళా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1999లో జరిగిన ఈ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, నెల్లూరు నుంచి వుక్కాల రాజేశ్వరమ్మ, పెద్దపల్లి నుంచి సీహెచ్ సుగుణ కుమారి, భద్రాచలం నుంచి దుంపా మేరీ విజయకుమారి గెలుపొందారు.

అమలాపురం నుంచి గెలిచి, స్పీకర్‌గా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2002లో జరిగిన ఉప ఎన్నికలో బాలయోగి భార్య గంటి విజయకుమారి ఎంపీ అయ్యారు. దీంతో 13వ లోక్‌సభ‌లో ఏపీ నుంచి మహిళా సభ్యుల ప్రాతినిధ్యం ఐదుకు చేరింది.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖపట్నం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, బాపట్ల నుంచి పనబాక లక్ష్మి, మెదక్ నుంచి విజయశాంతి విజయం సాధించారు.

1951 నుంచి 2019 వరకు లోక్ సభకు 17 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే, కేవలం మూడుసార్లు మాత్రమే ఐదుగురు మహిళలు లోక్‌సభలో అడుగుపెట్టగలిగారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీ

మెదక్ నుంచి ఇందిరా గాంధీ

ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్ దళ్(బీఎల్డీ) అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఓడిపోయారు.

అప్పుడు బీఎల్డీ సహా ప్రతిపక్షాలు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో ఏకమయ్యాయి. ఇందిరపై గెలిచిన రాజ్ నారాయణ్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి.

1978లో జరిగిన ఉప ఎన్నికలో కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు నుంచి ఆమె ఎంపీగా గెలిచారు.

1977 ఎన్నికల్లో చిక్‌మగ్‌ళూరు స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత డీబీ చంద్రెగౌడ రాజీనామాతో జరిగిన ఎన్నికల్లో ఇందిర దిగువ సభకు ఎన్నికయ్యారు. ఇందిర కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతారు.

1980లో ఏడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇందిర రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ స్థానం నుంచి ఆమె బరిలో నిలిచారు. రెండు చోట్ల విజయం సాధించారు. మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు.

అనంతరం రాయ్‌బరేలీ స్థానానికి రాజీనామా చేసిన ఇందిర మెదక్ ఎంపీగా కొనసాగారు.

1984 అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యారు.

దేశాన్ని పాలించిన ఏకైన మహిళా ప్రధాని అయిన ఇందిర, మెదక్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు.

తోట సీతారామలక్ష్మి

ఫొటో సోర్స్, Thota Sita Rama Lakshmi/FB

రాజ్యసభలో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది మహిళలు రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినట్లు రాజ్యసభ వెబ్‌సైట్‌‌ చెబుతోంది. వారిలో సినీ నటి జయప్రద, రేణుకా చౌదరి, వంగా గీత, ఎన్‌పీ దుర్గా, టి రత్నాబాయి, సి.అమ్మన్న రాజా, ఎంఎల్ మేరీ నాయుడు, యశోదా రెడ్డి, రత్నాబాయి శ్రీనివాసరావు, సీతా యుధ్వీర్ ఉన్నారు.

రేణుకా చౌదరి మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1986 నుంచి 1992 వరకు, 1992 నుంచి 1998 వరకు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగారు.

యశోదా రెడ్డి, సీతా యుధ్వీర్ రెండేసి సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం తెలంగాణ నుంచి ఒకే ఒక్క మహిళా ఎంపీ రాజ్యసభకు వెళ్లారు. 2014 నుంచి 2016 వరకు వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణి టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తోట సీతారామ లక్ష్మి 2014 నుంచి 2020 వరకూ టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు.

ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వారిలో ఒక్కరు కూడా మహిళ లేరు.

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహువా మొయిత్రా

దేశవ్యాప్తంగా మహిళా ఎంపీలు?

దేశవ్యాప్తంగా 82 మంది మహిళా ఎంపీలు ప్రస్తుత 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారిలో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఇద్దరు మహిళా ఎంపీలు, రాజస్థాన్‌కి చెందిన మహిళా ఎంపీ ఒకరు, మధ్యప్రదేశ్‌కి చెందిన మరో మహిళా ఎంపీ ఇటీవల రాజీనామా చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రిపై సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న అభియోగాలతో బహిష్కరణ వేటు పడింది. దీంతో దిగువ సభలో మహిళా ఎంపీల సంఖ్య 77కి చేరింది.

మొత్తం లోక్‌సభ సభ్యులు 543 మందిలో వీరి సంఖ్య 15 శాతం కంటే తక్కువ.

రాజ్యసభలో 33 మంది మహిళా సభ్యులు ఉన్నట్లు రాజ్యసభ వెబ్‌సైట్‌ చెబుతోంది.

ప్రస్తుత రాజ్యసభకు మొత్తం 238 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందులో మహిళలు 15 శాతం కూడా లేరు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం పది శాతం కంటే తక్కువగా ఉంది.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

కొత్త చట్టంతో సభ్యుల సంఖ్య పెరుగుతుందా?

లోక్‌సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, దిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ కొత్త చట్టం చెబుతోంది. అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్ చేయలేదు.

ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీల) కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్‌ చేసిన స్థానాల్లోనూ మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.

ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లోంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు.

అంటే, మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో, 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఈ సంఖ్యలు మారవచ్చు.

ఆధారం: లోక్‌సభ, రాజ్యసభ వెబ్‌సైట్లు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)