అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ఎందుకు స్పందించింది? భారత్ ఏమని బదులిచ్చింది

దిల్లీ లిక్కర్ స్కాం కేసు

ఫొటో సోర్స్, ANI/SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్, జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.

దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన అరెస్టయ్యారు.

న్యాయస్థానం శుక్రవారం ఆయనకు ఏడు రోజుల పాటు రిమాండ్ విధించింది.

అయితే, కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలని అందులో పేర్కొంది.

దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జర్మనీ చర్య తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం జర్మనీ ప్రకటనను సమర్థించింది.

జర్మనీ ప్రకటన అనంతరం.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అందులో.. “అలాంటి వ్యాఖ్యలను మా న్యాయప్రక్రియలో జోక్యంగా, మా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేవిగా చూస్తాం” అని స్పష్టం చేసింది.

జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్

ఇంతకీ జర్మనీ ఏమంది?

భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో కేజ్రీవాల్‌కు నిష్పాక్షిమైన, న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు జర్మనీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్‌‌ అరెస్ట్‌ను ఏ విధంగా చూస్తారని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని అడగ్గా.. “మాకు ఆ విషయం తెలిసింది. భారత్ ప్రజాస్వామ్య దేశం. న్యాయవిచారణ, ప్రజాస్వామ్య ప్రాథమిక విలువలు ఈ కేసుకు కూడా వర్తిస్తాయని మేం నమ్ముతున్నాం.

అందరిలాగానే కేజ్రీవాల్‌ కేసులో కూడా నిష్ఫక్షపాతమైన విచారణ జరగాలి. న్యాయపరమైన సహాయ సహకారాలు అన్ని అందాలి” అన్నారు.

“నేరం రుజువయ్యేవరకు వ్యక్తిని నిర్దోషిగా పరిగణించాలి. అందరికీ ఇది వర్తించాలి. అదే ప్రధాన అంశం” అని ఆయన అన్నారు.

సౌరభ్ భరద్వాజ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సౌరభ్ భరద్వాజ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంది?

జర్మనీ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది.

ఎక్స్‌ (ట్విటర్)లో దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తన స్పందన తెలియజేస్తూ, “జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు, న్యాయాన్ని పునరుద్ఘాటించింది. ప్రజాస్వామ్య దేశాలు ఇదే విషయాన్ని దశాబ్దాలుగా చెప్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది?” అని పోస్ట్ చేశారు.

విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ మాత్రం జర్మనీ జోక్యాన్ని తప్పుబట్టారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం వద్దని అన్నారు.

“మా దేశ అంతర్గత వ్యవహారాల్లో అహంకార పూరిత జోక్యం ఇది. జర్మనీని కచ్చితంగా హెచ్చరించాలి” అని రాశారు.

జర్మనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇదేమీ మొదటిసారి కాదు..

అక్టోబర్ 2022లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ జర్మనీని సందర్శించారు.

ఆ సమయంలో జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నాలెనా బేర్బొక్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జమ్మూకశ్మీర్‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అన్నాలెనా జమ్మూ కశ్మీర్‌‌ను ఉద్దేశించి, “కేవలం యూరప్‌లో నెలకొన్న పరిస్థితుల గురించే కాదు, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలపై కూడా దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. కశ్మీర్ విషయంలో జర్మనీకి కూడా బాధ్యతలు ఉన్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితి విధానాలను అనుసరించి, శాంతియుత పరిష్కారానికి మేం కూడా మద్దతునిస్తున్నాం” అన్నారు.

అంతకుముందు జులై 2022లో ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహమ్మద్ జుబైర్ అరెస్ట్‌పై జర్మనీ స్పందించింది.

“భారత్ తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటుంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్య విలువలైన భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా భంగం వాటిల్లకూడదు. పత్రికా స్వేచ్ఛను కల్పించాలి” అని ప్రకటించింది.

అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు మేం మద్దతునిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యం. భారత్‌లోనూ ఇది వర్తిస్తుంది. ఇండిపెంటెండ్ జర్నలిజం ఏ సమాజానికైనా చాలా కీలకం. జర్నలిజంపై ఆంక్షలు ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా గళం విప్పే జర్నలిస్టులను జైలులో పెట్టకూడదు” అని ప్రకటనలో తెలిపింది .

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)