ఆఫీసులోని తెల్ల కాగితం కూడా సొంతానికి వాడని 'భారత ప్రధాని'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తుషార్ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహాత్మా గాంధీ ఆదర్శాలు, ఆయన నిర్ధేశించిన మార్గాన్ని అనుసరించే వ్యక్తిని గాంధేయవాది అంటారు. భారత రాజకీయాల్లో గుల్జారీలాల్ నందా అలాంటి వారిలో ఒకరు.
తన కార్యాలయంలోని చిన్న తెల్ల కాగితం కూడా వ్యక్తిగత పనులకు ఉపయోగించకుండా చూసుకున్న నాయకుడిగా గుల్జారీలాల్ నందాకు పేరుంది.
రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆయన అద్దె ఇంట్లో నివసించారు.
ఆయన చనిపోయే ముందు, తన వస్తువులన్నీ ఒక పెట్టెలో సరిపోతాయని కూతురికి చెప్పారు గుల్జారీలాల్.
ఇంతకీ ఆయననే ప్రధానమంత్రిగా ఎందుకు చేశారు? ఆయనలోని ప్రత్యేకత ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మహాత్మా గాంధీ పిలుపుతో వీధుల్లోకి..
గుల్జారీలాల్ నందా 1898 జులై 4న ప్రస్తుత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ జిల్లాలో జన్మించారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆయన అలహాబాద్ నుంచి ముంబయికి మారారు.
అక్కడి నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ముంబయిలోనే గాంధీజీని కలిశారు.
గాంధీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
"నేను బ్రిటీష్ వారికి ఏ విధంగానూ సహకరించను. నేను చెప్పినట్లు చేస్తే ఏడాదిలోపు నీకు స్వరాజ్యం వస్తుంది" అని గాంధీజీ అన్నారు.
దీంతో చాలామంది తమ ఉద్యోగాలు వదిలి, గాంధీతో నడిచారని గుల్జారీలాల్ ఒక సందర్భంలో తెలిపారు.
గుల్జారీలాల్ నందా బయోగ్రఫీ అయిన 'గుల్జారీలాల్ నందా: ఎ లైఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ పీపుల్' గాంధీజీ, నందాల భేటీ వివరాలు పొందుపరిచారు.
ఆ వివరాలను నంద తన డైరీలో రాసుకున్నారని ఈ పుస్తక రచయిత్రి ప్రమీలా కానన్ తెలిపారు.
దాని ప్రకారం గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి ముందు, ఆయన మనస్సులో ఏదో అలజడి ఉంది.
నందాకు 1916 లో వివాహమైంది, ఒక బిడ్డ, వాళ్లను ఎవరు చూసుకుంటారనే ప్రశ్న కూడా ఆయన మదిలో నెలకొంది.
“గాంధీజీతో వెళ్లడానికి ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇల్లు గడవడానికి నాకు 40 రూపాయలు కావాలి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. గాంధీజీని కలిసిన తర్వాత నాలో అశాంతి నెలకొంది, నా మదిలో చాలా ఆలోచనలు వచ్చాయి, చివరికి నేను ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నా'' అని నందా భావించినట్లు ఆ బయోగ్రఫీలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నందానే ప్రధానమంత్రిగా ఎందుకు?
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1964 మే 27న కన్నుమూశారు.
నెహ్రూ మరణం తర్వాత, గుల్జారీలాల్ నందా జూన్ 9 వరకు దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.
నెహ్రూ కేబినెట్‌లో సీనియారిటీ కారణంగా ఆయనను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారని చెబుతారు. అయితే కేబినెట్‌లో అతని కంటే మొరార్జీ దేశాయ్ రెండేళ్లు పెద్దవాడు.
అలా అయితే, మొరార్జీ దేశాయ్‌నే తాత్కాలిక ప్రధానమంత్రిని చేయాలి కానీ అది జరగలేదు. కాంగ్రెస్ మొరార్జీ దేశాయ్ కంటే నందాకే ప్రాధాన్యత ఇచ్చింది. నెహ్రూ మరణానంతరం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. కానీ నందా ఆ రేసులో లేరు, అంతేకాకుండా ఆయనకు సీనియర్‌గా గుర్తింపు ఉంది. అందుకే నందాకు ప్రధాని పదవి దక్కిందని అంటున్నారు.
అనంతరం పదమూడు రోజుల పాటు గుల్జారీలాల్ నందా ప్రధాని పదవిలో కొనసాగారు. అనంతరం శాస్త్రికి బాధ్యతలు అప్పగించారు.
శాస్త్రి మంత్రివర్గంలో గుల్జారీలాల్ నందా హోంమంత్రి అయ్యారు.
అయితే, 1966 జనవరి 11న తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. దీంతో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు నిర్వర్తించాల్సిన కర్తవ్యం మళ్లీ నందాపై పడింది.
ఆ సమయంలో ఇందిరా గాంధీ, కె. కామరాజ్, మొరార్జీ దేశాయ్, యశ్వంతరావు చవాన్, ఎంసీ చాగ్లా వంటి ప్రముఖ నాయకులు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు.
మళ్లీ పదమూడు రోజులు పదవిలో ఉండి, తర్వాత ఇందిరాగాంధీకి బాధ్యతలు అప్పగించారు. నందాకు అధికార దాహం లేదని 'ది ప్రింట్'కు రాసిన కథనంలో శృతి జోషి పేర్కొన్నారు.
ఇందిర కేబినేట్‌లో కూడా గుల్జారీలాల్ నందా హోంమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర హోం మంత్రిగా ఇబ్బందులు
గుల్జారీలాల్ నందా 1966లో కేంద్ర హోం మంత్రిగా ఉండగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఆందోళన చేపట్టాయి. దేశంలోని పలు చోట్ల ఆందోళనలు జరిగాయి.
అంతేకాదు ఈ చట్టం కోసం సన్యాసులు, సాధువులు 1966లో దిల్లీలోని పార్లమెంటుకు పాదయాత్ర చేశారు.
పాదయాత్ర సందర్భంగా వచ్చిన సన్యాసులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను ధ్వంసం చేశారు. అదుపు చేసేందుకు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది.
కాల్పుల్లో 8-9 మంది మృతి చెందడంతో గుల్జారీలాల్ హోంమంత్రి పదవిని వీడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
సొంత పనులకు ఆఫీసు పేపర్లు కూడా వాడరు
గుల్జారీలాల్ నందా 1977 నుంచి 1998 వరకు ఏ రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.
ఆయన కూతురు పుష్పాబెహన్ నాయక్‌తో కలిసి అహ్మదాబాద్‌లో నివసించారు.
పుష్ప తన తండ్రి జ్ఞాపకాలను ఒకసారి 'ఇండియా టుడే'తో పంచుకున్నారు. తన కుమారుడు తేజస్, తాత గుల్జారీలాల్‌కు శ్రీకృష్ణుడి బొమ్మను గీసి బహుమతిగా ఇచ్చాడని తెలిపారు.
మొదట నందా తేజస్‌ని మెచ్చుకున్నారు, తర్వాత ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఖాళీ కాగితం ఎక్కడ నుంచి వచ్చిందని అడిగారు. మీ ఆఫీసు నుంచే తీశానని చెబితే, తేజస్ కోసం ప్రత్యేకంగా పేపర్లు కొనిచ్చారు నందా.
1998 జనవరి 15న ఆయన మరణించారు. చనిపోయిన తర్వాత తన వస్తువులు ఉంచుకోవడానికి ఒక పెట్టె సరిపోతుందని ఒక సందర్భంలో ఆయన మీడియాతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణ: పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా ఎంపీల సంఖ్య ఎందుకు పెరగడం లేదు?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














