పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డ్రైనేజ్‌లో దిగి 30 గంటల పాటు చిక్కుకుపోయాడు, చివరకు ఎలా రక్షించారంటే

డ్రైనేజీలో వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హానా రిట్చి
    • హోదా, బీబీసీ న్యూస్

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి దిగిన ఓ వ్యక్తి అందులోనే 30 గంటలపాటు చిక్కుకుపోయాడు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటనలో ఆ వ్యక్తిని చివరకు పోలీసులు రక్షించారు.

క్వీన్స్‌లాండ్‌లో స్థానికుడైన జేమ్స్ లింగ్‌వుడ్ డ్రైనేజీలో ఎవరో చిక్కుకుపోయినట్టుగా గుర్తించారు.

డ్రైనేజ్‌లో ఉన్న వ్యక్తిని బయటకు తేవడానికి సాయం చేేసేందుకు ఆయన ప్రయత్నించారు.

అయితే, తన ఫోన్ డ్రైనేజ్‌లో పడిపోవడంతో దాన్ని తీయడానికి లోపలికి దిగానని, తాను బయటకు రాగలనని ఆయన చెప్పడంతో జేమ్స్ తన దారిన తాను వెళ్లిపోయారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

కానీ మరుసటి రోజు (సోమవారం) జేమ్స్ డ్రైనేజీలో ఆ వ్యక్తి ఆపదలోనే ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

తరువాత రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది డ్రైనేజీ మూత తీసి అతనిని బయటకు తీసుకువచ్చారు.

తాను ఫోన్ కోసమే డ్రైన్‌లో దిగినట్టు అతను చెబుతున్నప్పటికీ అతను ఆదివారం తెల్లవారుజామున పోలీసు వాహనాలను ఢీకొట్టి పరారైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

బాధితుడిని ఐదు నిమిషాలలో రక్షించామని క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక, అత్యవసర సేవల ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, విచారణకు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)