డిజిటల్ లెగసీ విల్: మనం చనిపోయాక ఫేస్‌బుక్, ట్విటర్‌ అకౌంట్లను ఏం చేస్తారు?

హేలీ, మాథ్యూ
ఫొటో క్యాప్షన్, హేలీ భర్త మాథ్యూకు 2016 జులైలో గ్లియోబ్లాస్టోమా వ్యాధి నాలుగో స్టేజీలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది
    • రచయిత, సెలిన్ గిరిట్, గ్రుజికా ఆండ్రిక్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

‘‘మాథ్యూ చనిపోయాడనే విషయం కొంతమందికి తెలియదు. వారంతా మాథ్యూ పుట్టినరోజున ఆయన సోషల్ మీడియా పేజీలో శుభాకాంక్షలు తెలుపుతారు. అది చూస్తే ఏదోలా ఉంటుంది.’’

హేలీ స్మిత్ భర్త మాథ్యూ (33) క్యాన్సర్‌తో చనిపోయి రెండేళ్లు దాటింది. ఆయన సోషల్ మీడియా అకౌంట్లను ఏం చేయాలో తెలియక ఆమె ఇబ్బంది పడుతున్నారు.

‘‘మాథ్యూ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఒక స్మారక పేజీగా మార్చేందుకు నేను ప్రయత్నించాను. అప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.

20 సార్లకు పైగా ఆ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ, అది తీసుకోలేదు.

ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని కలిసి ఈ సమస్యను పరిష్కరించుకునేంత శక్తి నాకు లేదు’’ అని హేలీ స్మిత్ చెప్పారు. ఆమె యూకేలో నివసిస్తారు.

సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, అన్ని సోషల్ మీడియా మాధ్యమాలు మరణించిన వారి డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తాయి

స్మారక ఖాతా అంటే ఏంటి?

ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లను వాడుతున్నారు. అయితే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి చెందిన ఆన్‌లైన్ ఉనికి ఏమవుతుందనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు వారి బంధువులు సమాచారం ఇచ్చేంతవరకు సదరు వ్యక్తి ఖాతాలు యాక్టివ్‌, లైవ్‌గా ఉంటాయి.

సోషల్ మీడియా ఖాతాదారు చనిపోయిన విషయం అధికారికంగా తెలిసిన తర్వాత కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలు, ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను మూసివేసే అవకాశం ఇస్తాయి. మరికొన్ని మాధ్యమాలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తాయి.

ఉదాహరణకు, మెటాకు ఇలా ఒక వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం అందితే, చనిపోయిన వ్యక్తి ఖాతాను డిలీట్ చేయొచ్చు లేదా స్మారక ఖాతా (మెమొరియలైజ్డ్)గా మార్చవచ్చు. స్మారక ఖాతా అంటే ఆ అకౌంట్‌ను స్తంభించేలా చేసి దాన్ని సదరు వ్యక్తి స్మారక పేజీగా మార్చుతారు. ఆ పేజీలో మరణించిన వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు, ఫోటోలు పంచుకునేందుకు ఇతరులను అనుమతిస్తారు.

మెటా

ఫొటో సోర్స్, Getty Images

ఖాతాదారుని పేరు (యూజర్ నేమ్) పక్కన ‘‘in memoriam’’ అనే మెసేజ్ ఉంటుంది.

ఒకవేళ మరణానికి ముందు సదరు ఖాతాదారు, ‘‘లెగసీ కాంటాక్ట్’’ పేరును సంస్థకు అందించకపోతే ఇక ఆ ఖాతాను ఎవరూ లాగిన్ చేయలేరు, నిర్వహించలేరు. లెగసీ కాంటాక్ట్ అంటే ఒరిజినల్ ఖాతాదారుకు బదులుగా ఆయన స్నేహితుడు లేదా బంధువుకు ఆ ఖాతాను నిర్వహించే లేదా ఆ ప్రొఫైల్‌ను డీయాక్టివేట్ చేయమని అడిగే అధికారం ఉంటుంది.

ఫేస్‌బుక్‌లో స్మారక ఖాతాల పేర్లను ‘‘పీపుల్ యు మే నో’’ సెక్షన్‌లో చూపించదు. ఆ ఖాతాలోని ఫ్రెండ్స్‌కు మరణించిన వ్యక్తి పుట్టినరోజు నోటిఫికేషన్లు వెళ్లవు.

గూగుల్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ సంస్థలు తమ యూజర్లకు కాస్త వెసులుబాటు ఇస్తున్నాయి. నిర్ణీత సమయం పాటు తాము ఇనాక్టివ్‌గా మారితే తమ అకౌంట్లు, అందులోని డేటాను ఏమి చేయాలో నిర్ణయించుకునేందుకు వీలుగా ‘‘ఇనాక్టివ్ అకౌంట్’’ సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఇస్తున్నాయి.

మరణించిన వారి గుర్తుగా ఆ ప్రొఫైల్‌ను భద్రపరుచుకునే (సేవ్) అవకాశం ట్విటర్ ఇవ్వట్లేదు. మరణించినా లేదా యజమాని ఆ అకౌంట్ వాడలేకపోతే దాన్ని డీయాక్టివేట్ చేయడం మాత్రమే సాధ్యమవుతుంది.

‘‘అన్ని కంపెనీలు, మరణించిన వారి డేటా ప్రైవసీకే ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే వివిధ విధానాలు పాటిస్తాయి. లాగిన్ వివరాలను ఇవ్వరు. కేవలం ఫోటోలు, వీడియోలను చూడొచ్చు’’ అని బీబీసీ వరల్డ్ సర్వీస్ టెక్నాలజీ రిపోర్టర్ జో టైడీ చెప్పారు.

టిక్‌ టాక్, స్నాప్‌చాట్ వంటి కొత్త సామాజిక మాధ్యమాలకు ఎలాంటి ప్రొవిజన్లు లేవని ఆయన అన్నారు.

డిజిటల్ వారసత్వ వీలునామా
ఫొటో క్యాప్షన్, డిజిటల్ లెగసీ విల్ తయారు చేయించాలని జేమ్స్ నోరిస్ సూచించారు

డిజిటల్ లెగసీ విల్

మరణించిన వారి యాక్టివ్ ప్రొఫైళ్లలోని డేటా, ఫోటోలు, ఇతర కంటెంట్ అనేవి ఆగంతుకుల చేతుల్లో పడితే సమస్యాత్మకంగా మారతాయని సైబర్ క్రైమ్ నిపుణుడు సాషా జివానోవిక్ హెచ్చరించారు. ఆయన సెర్బియా హోం మంత్రిత్వ శాఖలో హై టెక్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా వ్యవహరించారు.

‘‘ఫోటోలు, డేటా, వీడియోలను ఉపయోగించి అదే పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించవచ్చు. మరణించిన వ్యక్తి పేరిట ఆయన స్నేహితులు, పరిచయస్థులను డబ్బులు అడగవచ్చు’’ అని ఆయన అన్నారు.

జేమ్స్ నోరిస్, యూకే డిజిటల్ లెగసీ అసోసియేషన్ అధ్యక్షుడు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోన్న కంటెంట్ గురించి ఆలోచించడం, వీలైనప్పుడల్లా దాన్ని బ్యాకప్ చేయడం చాలా ముఖ్యమని జేమ్స్ నోరిస్ నొక్కి చెబుతున్నారు.

ఉదాహరణకు, ఫేస్‌బుక్‌లోని ఫోటోలు, వీడియోలు అన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వాటిని కావాలంటే బంధువులకు పంపించవచ్చని ఆయన చెప్పారు.

‘‘ఒకవేళ నాకు ప్రాణాంతక వ్యాధి ఉందనుకోండి. నాకు ఒక చిన్నారి ఉన్నాడనుకోండి. అతను ఫేస్‌బుక్‌ వాడట్లేదు. నేను ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటోలు, వీడియోలు అన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని మెసేజ్‌లను డిలీట్ చేయవచ్చు. ఎందుకంటే, నా బిడ్డ నా ప్రైవేట్ మెసేజ్‌లు చూడటం, నా ఫేవరెట్ ఫోటోలను దాచి పెట్టుకోవడం, వాటి చుట్టూ కథలు అల్లుకోవడం నాకు ఇష్టం లేదు’’ అని ఆయన అన్నారు.

డిజిటల్ వారసత్వ లెగసీ

చనిపోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్లను ఏమి చేయాలనుకుంటున్నారో ముందే ప్లాన్ చేయడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. డిజిటల్ లెగసీ విల్‌ను తయారు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

‘‘అంతిమంగా, సోషల్ నెట్‌వర్కింగ్ అనేది ఒక వ్యాపారం. మీ డిజిటల్ లెగసీకి ఈ ప్లాట్‌ఫారాలు సంరక్షకులు కావు. మీ లెగసీకి మీరే సంరక్షకులు’’ అని అన్నారు.

డిజిటల్ లెగసీ, సోషల్ మీడియాకే పరిమితం కాదు

డిజిటల్ లెగసీ ఒక పెద్ద టాపిక్ అని ఒక రీసెర్చ్ నర్స్ సారా అటాన్లీ అన్నారు. యూకేకు చెందిన మేరీ క్యూరీ అనే చారిటీలో ఆమె పనిచేస్తున్నారు. ప్రాణాంతక సమస్యతో బాధపడుతున్న వారికి ఈ చారిటీ సహాయకంగా ఉంటుంది.

ఒకవేళ చనిపోతే, తమ సోషల్ మీడియా ఖాతాలే కాకుండా, డిజిటల్‌గా తమకు చెందిన అన్నింటినీ ఏం చేయాలనే అంశంపై ప్రజలు ఆలోచించాలని సారా అన్నారు.

‘‘డిజిటల్ ఫోటోలు, వీడియోల్లో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మనం బ్యాంకింగ్‌కు సంబంధించి చాలా లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా జరుపుతాం. ప్లే లిస్టుల కోసం మ్యూజిక్ అకౌంట్లు తీసుకుంటాం. ఆన్‌లైన్ గేమింగ్ కూడా పెరిగింది. ఆన్‌లైన్ అవతారాలను తయారు చేస్తున్నారు. కాబట్టి, డిజిటల్ లెగసీ అనేది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే చెందినది కాదని చెప్పొచ్చు’’ అని ఆమె అన్నారు.

‘‘మనం లేకపోతే మన సోషల్ మీడియా ఖాతాలను వేరొకరు స్వాధీనం చేసుకోవాలా? మన ఖాతాలను స్మారకాలుగా మార్చాలనుకుంటున్నామా? మన డిజిటల్ ఫోటోలను మన పిల్లలకు అందించాలనుకుంటున్నామా? లేదా వాటిని ముద్రించి, ఆల్బమ్ రూపంలో మనం చనిపోయిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నామా? అనేది నిర్ణయించుకోవాలి. డిజిటల్ లెగసీ అనేది కచ్చితంగా ఆలోచించాల్సింది, మాట్లాడుకోవాల్సిన అంశం’’ అని సారా వివరించారు.

హేలీ, మాథ్యూ
ఫొటో క్యాప్షన్, మాథ్యూ ఫేస్‌బుక్ పేజీని స్మారకంగా మార్చాలనుకుంటున్నట్లుగా హేలీ చెప్పారు

కానీ హేలీ, మాథ్యూలకు ఇది చర్చించడానికి అంత సులభమైన అంశం కాదు.

‘‘మాథ్యూ చనిపోతున్నప్పుడు నేను దీని గురించి అతనితో మాట్లాడలేదు. వీలైనంత దీర్ఘకాలం ఆయన బతకాలి అనుకున్నారు. చావు గురించి ఎప్పుడూ మాట్లాడాలని ఆయన అనుకోలేదు. కానీ, తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. అసలు ఆయన, ఆయనలా లేరు. నా ప్రశ్నలకు బదులిచ్చే పరిస్థితులో లేరు’’ అని హేలీ గుర్తు చేసుకున్నారు.

వారికి పెళ్లి అయిన ఏడాదికే మాథ్యూకు స్టేజ్ 4 గ్లియోబ్లాస్టోమా నిర్ధరణ అయింది. అప్పుడు ఆయన వయస్సు 28 ఏళ్లు. 2016 జులైలో ఆయనకు వ్యాధి ఉందని తేలింది.

‘‘నీ జీవితం పూర్తిగా మారనుంది. చాలా కష్టంగా మారుతుంది’’ అని వైద్యులు వారికి చెప్పారు. మాథ్యూ మెదడులో కణితి ఉందని, వెంటనే శస్త్రచికిత్స అవసరమని వారితో అన్నారు.

ఆ సర్జరీతోపాటు తర్వాత కీమోథెరపీ కూడా సజావుగానే జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ కణితి మళ్లీ తిరగబెట్టింది. మాథ్యూ కేవలం ఒక ఏడాది మాత్రమే బతకగలడని వైద్యులు వెల్లడించారు.

మాథ్యూ ఫేస్‌బుక్ పేజీని స్మారకంగా మార్చాలనుకుంటున్నట్లుగా ఆమె చెప్పారు.

‘‘తరచుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని చూడటం చాలా బాధగా ఉంటోంది. అందుకే పేజీని స్మారకంగా మార్చే ప్రక్రియను పక్కనబెడుతున్నా. అదొక భయంకరమైన పత్రం. ఇది నిజంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. బాధిత కుటుంబాల కోసం ఈ ప్రక్రియను సంస్థలు సులభతరం చేయాలి’’ అని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)