ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: టీడీపీకి చిక్కవు, వైసీపీకి దొరకవు

వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, FB/Ysrcpofficial , TDP.Official

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్ష టీడీపీ రెండూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

టీడీపీ ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 1983 నుంచి 2019 వరకు తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న 2024 ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న పదో అసెంబ్లీ ఎన్నికలు.

అయితే, ఈ నలభై ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అయిదుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి కొరుకుడుపడని నియోజకవర్గాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ స్థానాలలో టీడీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు.

అందులో కొన్ని నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో ఏర్పడినవి కాగా ఇంకొన్ని టీడీపీ ఆవిర్భావానికి ముందు నుంచి మనుగడలో ఉన్న స్థానాలు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) గెలవని సీట్లూ రాష్ట్రంలో ఉన్నాయి.

పదమూడేళ్ల వయసు గల ఈ పార్టీ 2012 ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 సాధారణ ఎన్నికలను మాత్రమే ఎదుర్కొన్నప్పటికీ గత ఎన్నికలలో 175లో ఏకంగా 151 సీట్లను గెలవడంతో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో తన ఉనికి చాటుకున్నట్లయింది.

కానీ, ఇప్పటికీ ఆ పార్టీ ఖాతా తెరవని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు ఏవి? అక్కడి రాజకీయ పరిస్థితులేమిటి?

N T Rama Rao

ఫొటో సోర్స్, facebook/Nara Chandrababu Naidu

ఫొటో క్యాప్షన్, ఎన్టీ రామారావు

1982 మార్చి నెలలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి కొద్ది రోజుల కిందటే 42 ఏళ్లు పూర్తయ్యాయి. టీడీపీ ఆవిర్భవించిన ఏడాదికే తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో జరిగిన ఆ అసెంబ్లీ ఎన్నికలలో 294 సీట్లకు గాను 289 చోట్ల పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 201 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.

ఆ తరువాత 1985 అసెంబ్లీ ఎన్నికలలో 205 సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ 202 సీట్లు గెలిచి రెండోసారి అధికారం చేపట్టింది.

1989లో 74 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ 1994లో 216 సీట్లు సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

1999లో 180 నియోజకవర్గాలలో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ, 2004 ఎన్నికలలో పెద్ద మొత్తంలో సీట్లను కోల్పోయి 47 స్థానాలకే పరిమితమైంది. 2009లో 92 నియోజకవర్గాలలో విజయం సాధించింది.

2014లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలలో 102 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది.

2019లో 23 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్నికలలో 144 స్థానాలలో సొంతంగా పోటీ చేస్తోంది. మిగతా 31 సీట్లలో ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలు పోటీ చేస్తున్నాయి.

అయితే, ఇప్పటివరకు జరిగిన 9 అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు.

YS Jagan Mohan Reddy

ఫొటో సోర్స్, facebook/YS Jagan Mohan Reddy

పట్టుచిక్కని పులివెందుల

కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు.

ఇది మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పూర్తిగా పట్టున్న నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన, ఆయన కుటుంబీకులు గెలుస్తూ వచ్చారు.

రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పోటీలో నిలవడానికి ముందు 1955 నుంచి 1972 వరకు నాలుగు ఎన్నికలలో మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పెంచికల బసిరెడ్డి గెలిచారు. మధ్యలో 1962లో స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలి రెడ్డి గెలిచారు.

కడప జిల్లాలో చిత్రావతి నదిపై నిర్మించిన రిజర్వాయర్‌కు ఈ బసిరెడ్డి పేరే పెట్టారు.

ఆ తరువాత 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందినవారే గెలుస్తున్నారు ఈ నియోజకవర్గంలో.

1978, 1983, 1985 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు.

1989లో రాజశేఖర్ రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడంతో పులివెందులలో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు.

1991‌లో వివేకానందరెడ్డి రాజీనామా చేయడంతో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి బాబాయి(రాజారెడ్డికి సోదరుడు), నేత్ర వైద్యుడు అయిన వైఎస్ పురుషోత్తమరెడ్డి పోటీ చేసి గెలిచారు.

అనంతరం 1994 ఎన్నికలలో మళ్లీ వివేకానందరెడ్డే పోటీ చేసి విజయం సాధించారు.

1999లో రాజశేఖర్ రెడ్డి కడప లోక్‌సభ స్థానానికి బదులు పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్లీ పోటీ చేశారు. అప్పటి నుంచి అంటే 1999, 2004, 2009 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు పులివెందుల నుంచి గెలిచారు.

అనంతరం రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన భార్య వైఎస్ విజయమ్మ పోటీ చేసి గెలిచారు.

కానీ, అక్కడికి కొద్దిరోజులలోనే కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించడంతో ఆయనతో పాటు విజయమ్మ కూడా కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పులివెందులకు మరోసారి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఆ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ పులివెందుల నుంచి గెలిచారు.

అనంతరం 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికవడంతో పాటు తన పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు.

ఇలా 1978 నుంచి 2019 వరకు మూడు ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 13 సార్లు పులివెందుల నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన అయిదుగురు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, వైసీపీ, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప తెలుగుదేశం మాత్రం ఇంతవరకు బోణీ చేయలేకపోయింది.

ప్రస్తుత 2024 ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

Yerragonda Palem

ఫొటో సోర్స్, bbc

యర్రగొండపాలెంలో..

ప్రకాశం జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గం యర్రగొండపాలెం. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1972 తరువాత రద్దయింది. మళ్లీ మూడు దశాబ్దాల తరువాత 2009 నుంచి ఉనికిలోకి వచ్చింది. అయితే, 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇది 2009 నుంచి ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది.

కాగా 1978 నుంచి 2004 వరకు దాదాపు ఇదే పరిధిలో ఉన్న కంభం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ రెండు సార్లు గెలిచింది.

ఒక ఉప ఎన్నిక సహా ఎనిమిది సార్లు యర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ, రెండు సార్లు సీపీఐ, రెండు సార్లు వైసీపీ గెలిచాయి.

జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ ఈ నియోజకవర్గంలో 2009, 2019 ఎన్నికలలో రెండుసార్లు గెలిచారు.

అంతకుముందు 1962, 1967లో పూల సుబ్బయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. వీరిద్దరు మినహా ఈ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు.

సీపీఐ నుంచి రెండు సార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పూల సుబ్బయ్య పేరునే వెలిగొండ ప్రాజెక్టుకు పెట్టారు.

ప్రస్తుత ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌కు వైసీపీ ఇక్కడ సీటివ్వలేదు. ఆయన స్థానంలో గూడూరి చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును ప్రకటించింది.

డీలిమిటేషన్ తరువాత

డీలిమిటేషన్ తరువాత ఏర్పడిన మరికొన్ని నియోజకవర్గాలలోనూ టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. అలాంటివాటిలో పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం ఉన్నాయి.

వీటితో పాటు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలోనూ టీడీపీకి విజయం దక్కలేదు.

కానీ, 2009లో ఇవి రెండు నియోజకవర్గాలుగా ఏర్పడడానికి ముందు ఉనికిలో ఉన్న నెల్లూరు స్థానంలో టీడీపీ 1983, 1994 ఎన్నికలలో విజయాన్ని అందుకుంది.

2009కి ముందు నుంచి ఉంటూ ఇప్పటికీ కొనసాగుతున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ రేట్ బాగా తక్కువగా ఉన్నవి ఇంకో రెండు ఉన్నాయి.

అవి కోడుమూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు.

కొరుకుడుపడని కోడుమూరు

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్కసారే.

1985లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ శిఖామణి విజయం సాధించిన తరువాత ఆ పార్టీ నుంచి ఇంకెవరూ ఇక్కడ విజయాన్ని అందుకోలేదు.

శిఖామణి 1985 తరువాత 1994, 1999, 2004లో ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆ మూడుసార్లూ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికలలో కోడుమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించారు. వైసీపీ నుంచి ఆదిమూలపు సతీశ్ పోటీలో ఉంటున్నారు.

విజయవాడ
ఫొటో క్యాప్షన్, విజయవాడ

విజయవాడలో పరాజయాలు

ఇక ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్లుగా విజయం ఊరిస్తోంది. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 1983లో ఆ పార్టీ విజయవాడ వెస్ట్‌లో గెలిచింది.

ఆ తరువత ఇంతవరకు మళ్లీ ఆ పార్టీకి అక్కడ గెలుపు దక్కలేదు. 1983లో బీఎస్ జయరాజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు.

ఈ నియోజకవర్గానికి మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగ్గా అయిదుసార్లు కాంగ్రెస్ పార్టీ, మూడుసార్లు కమ్యూనిస్ట్ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి.

2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ వెస్ట్ సీటు నుంచి పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ అసీఫ్ పేరు ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సుజనాచౌదరిని ప్రకటించారు.

దీంతో ఈ ఎన్నికలలోనూ ఈ సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశం లేదు.

jagan

ఫొటో సోర్స్, ysrcongress

ఈ సీట్లకు ఫ్యాన్ గాలి తగల్లేదు

తెలుగుదేశం ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలున్నట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు గెలవని నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట 2012 ఉప ఎన్నికలలో పోటీ చేసింది. ప్రస్తుత ఏపీలోని 17 సీట్లకు పోటీ చేసి అందులో 15 సీట్లు గెలిచింది. అనంతరం 2014లో ప్రస్తుత ఏపీలోని 67 సీట్లను గెలిచింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలోని 175 సీట్లకు గాను 151 చోట్ల వైసీపీ గెలిచింది.

2019 ఫలితాల ప్రకారం చూస్తే ఆ ఎన్నికలలో ఏపీలోని 24 స్థానాలలో వైసీపీ గెలవలేదు. కానీ, అందులో కొన్ని చోట్ల వైసీపీ 2014, 2012లో విజయం సాధించింది.

వైసీపీ ఇప్పటికీ గెలవని నియోజకవర్గాలలో మొదట చెప్పుకోవాల్సినవి టెక్కలి, హిందూపురం, కుప్పం వంటి నియోజకవర్గాలు. ఇవి టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు కావడంతో వైసీపీ ఇక్కడ విజయం సాధించలేకపోతోంది.

Tekkali

టెక్కలిలో దక్కని గెలుపు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది.

1983 నుంచి ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో కలిపి మూడు సార్లు ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. మిగతా అన్నిసార్లూ ఆ పార్టీయే గెలుస్తోంది.

వైసీపీ ఆవిర్భావం తరువాత 2014లో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్ ఇక్కడ పోటీ చేసినా అచ్చెన్నాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడే మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరును ఆ పార్టీ ప్రకటించింది.

NTR

ఫొటో సోర్స్, facebook/telugudesam

హిందూపురం అందని ద్రాక్షా?

రాయలసీమలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. 1983లో టీడీపీ ఇక్కడ తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి ఆ పార్టీ అభ్యర్థులు తప్ప వేరే ఎవరూ గెలవలేదు.

ఈ నియోజకవర్గం నుంచి ఎన్టీ రామారావు మూడుసార్లు పోటీ చేసి గెలవగా ఆయన కుమారుడు హరికృష్ణ 1996 ఉప ఎన్నికలో గెలిచారు.

2014 నుంచి ఇక్కడ ఎన్టీ రామారావు మరో కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు. వైసీపీ నుంచి 2014లో నవీన్ నిశ్చల్, 2019లో షేక్ మహ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. రెండుసార్లూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు.

2024 ఎన్నికలలో టీడీపీ నుంచి ఆయనే మరోసారి అభ్యర్థి కాగా వైసీపీ నుంచి తిప్పెగౌడ నారాయణ దీపిక పోటీచేస్తున్నారు.

Nara Chandrababu Naidu

ఫొటో సోర్స్, facebook/Nara Chandrababu Naidu

కుప్పంలో ఏం జరగబోతోంది?

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి బాగా దృష్టి కేంద్రీకరిస్తున్న నియోజకవర్గాలలో కుప్పం ఒకటి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది.

గత ఏడు అసెంబ్లీ ఎన్నికలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు 1983, 1985 ఎన్నికలలో ఎన్.రంగస్వామినాయుడు ఇక్కడ టీడీపీ నుంచి విజయం సాధించారు.

టీడీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ వేరే ఏ పార్టీ గెలవలేదు. అయితే, ఈసారి ఎలాగైనా ఇక్కడ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని వైసీపీ ముఖ్యనేతలు తరచూ అంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతలు తరచూ ఇదే మాట అంటున్నారు.

‘వై నాట్ 175’ అనే నినాదం వినిపిస్తూ కుప్పంలోనూ గెలుస్తామని చెప్పుకొస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబు బోగస్ ఓట్లతో గెలుస్తున్నారని ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు వైసీపీ నాయకులు.

అదేసమయంలో టీడీపీ నాయకులు కూడా వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులతో అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు.

కుప్పంలో తనను ఓడించడం వైసీపీ తరం కాదంటూ చంద్రబాబు కూడా ధీటుగా స్పందిస్తున్నారు.

మరోవైపు హంద్రీనీవా ప్రాజెక్ట్ నీరు కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చామంటూ వైసీపీ ఓట్లు అడుగుతోంది. ఆ ప్రాజెక్టు తన హయాంలోనే 90 శాతం పూర్తయిందని.. మరోసారి తనను గెలిపిప్తే హంద్రీనీవా నీటితో కుప్పం నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతానని చంద్రబాబు చెప్తున్నారు.

ఇలా.. రెండు పార్టీలు ఇప్పుడు అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

2014, 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి ఇక్కడ కె.చంద్రమౌళి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత 2024 ఎన్నికలలో ఆయన కుమారుడు కె.ఎస్.భరత్‌ను వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు మరోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు.

ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం

ఫొటో సోర్స్, facebook

చీరాలలో..

చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గత ఎన్నికలలో గెలిచింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి.

2019లో ఆమంచి కృష్ణమోహన్, 2014లో యడం బాలాజీ చీరాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

2014లో ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు.

2019లో ఆమంచి కృష్ణమోహన్‌పై టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం అనంతర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రస్తుతం కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల టికెట్ కేటాయించింది. టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

పుచ్చలపల్లి సుందరయ్య

ఫొటో సోర్స్, CPM

ఫొటో క్యాప్షన్, పుచ్చలపల్లి సుందరయ్య

గన్నవరంలో..

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు విజయం దక్కలేదు.

గన్నవరంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పుచ్చలపల్లి సుందరయ్య మూడు సార్లు గెలిచారు. సుందరయ్య తరువాత ఈ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచింది వల్లభనేని వంశీయే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ 2014లో దుట్టా రామచంద్రరావు, 2019లో యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు.

రెండు సందర్భాలలో తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ ఇక్కడ విజయం సాధించారు. అయితే, 2019 ఎన్నికల తరువాత వంశీ టీడీపీని వీడి వైసీపీ పక్షం వహించారు.

ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తున్నారు.

ఇవే కాకుండా గుంటూరు వెస్ట్, ఇచ్ఛాపురం, పెద్దాపురం, కొండపి, పాలకొల్లు, ఉండి, రేపల్లె, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలలోనూ వైసీపీ ఇంతవరకు గెలవలేదు.

వీటిలో ఇచ్ఛాపురం, ఉండి నియోజకవర్గాలలో 2004లో తప్ప టీడీపీ ఆవిర్భావం తరువాత అన్ని ఎన్నికలలోనూ టీడీపీయే గెలిచింది.

వైసీపీ ఆవిర్భావం తరువాత కూడా ఈ పరిస్థితి మారలేదు.

మరోవైపు 2009 తరువాత కొత్తగా ఏర్పడిన వైజాగ్ ఈస్ట్, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, మండపేట, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలలోనూ వైసీపీ ఇంతవరకు బోణీ చేయలేదు.

మరి 2024 ఎన్నికలలో టీడీపీ, వైసీపీలు తమకు ఇంతవరకు పట్టుచిక్కని నియోజకవర్గాలలో ఈసారైనా గెలుస్తాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)