ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పవన్ కల్యాణ్ పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నారు, కారణమదేనా..

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Janasena party

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్, ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. పోయినసారిలా కాకుండా ఈసారి ఒక్కచోటు నుంచే ఆయన పోటీ చేస్తున్నారు.

ఒకనాడు అన్న(చిరంజీవి) పార్టీ ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత, నేడు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పవన్‌ను ఢీకొడుతున్నారు.

మరి పిఠాపురం ఓటరు నాడిని పవన్ కల్యాణ్ పట్టుకోగలరా? ఈ నియోజకవర్గం చరిత్ర ఏం చెబుతోంది?

పిఠాపురం

అధికార పార్టీలకు ఓటమి

ఒకనాటి సంస్థానమైన పిఠాపురంలో 1989 తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. 1994 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయాన్ని చూడలేదు. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత.

1999లో పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన టీడీపీ నేత సంగిశెట్టి వీరభద్రరావు రెబల్‌గా బరిలో దిగి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ హవా కనిపించింది.

2004లో రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభావం కనిపించగా పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు విజయం సాధించారు. ఆయనకు అప్పుడు టీడీపీ మద్ధతు ఇచ్చింది.

2009 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా ప్రజారాజ్యం తరఫున వంగా గీత స్వల్ప తేడాతో విజయం సాధించారు. టీడీపీ రెండోస్థానం దక్కించుకోగా, అప్పటి అధికారపక్షం కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం మూడోస్థానానికి పరిమితమయ్యారు.

2014లో మళ్లీ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్వీఎస్ఎన్ వర్మ రెబల్‌గా బరిలో పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. గెలిచిన తర్వాత వర్మ మళ్లీ టీడీపీలో చేరారు. ఆపార్టీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు.

ఇలా చాలా ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు పిఠాపురంలో ఓడిపోతూ రావడం ఒక ఆనవాయితీగా ఉంది. కానీ, 2019 ఎన్నికల్లో ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడింది.

20 సంవత్సరాల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. నాడు 14,992 ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబు గెలిచారు. దాంతో 1994 తర్వాత తొలిసారి పిఠాపురం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినట్టయ్యింది.

2024 ఎన్నికల్లో గెలిచి పిఠాపురం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో వంగా గీత ఉన్నారు.

పిఠాపురం

విలక్షణ తీర్పులకు కేంద్రంగా..

సంస్థానాల కాలం నుంచి పిఠాపురానికి ప్రాధాన్యం ఉంది. పిఠాపురంతో పాటుగా కాకినాడ అభివృద్ధిలోనూ పిఠాపురం జమీందార్లదే పెద్ద పాత్ర. నేటికీ కాకినాడలోని విద్యా, సాంస్కృతిక రంగాల్లో పిఠాపురం సంస్థానాధీశుల ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఆధ్యాత్మికంగానూ పిఠాపురం ప్రాధాన్యత కలిగిన కేంద్రం. పాదగాయ, దత్తక్షేత్రం వంటి వాటితో పాటుగా గోపాల్ బాబా ఆశ్రమం వంటి వాటికి మహారాష్ట్ర, ఒడిశా వంటి చోట్ల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు.

2009కి పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యూ కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది. దాంతో మెట్ట, డెల్టాతో పాటుగా సముద్రతీర ప్రాంతం కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది.

కొన్నేళ్ల కిందట గొల్లప్రోలు నగర పంచాయతీ అయ్యింది. మొత్తంమీద రెండు మునిసిపాలిటీలు, మూడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 242 పోలింగ్ బూత్‌లలో 2,30,188 మంది ఓటర్లున్నారు. అందులో దాదాపు 90 వేల మంది అర్బన్ ఓటర్లు.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ. పిఠాపురంలో యూ కొత్తపల్లి మండలం చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు.

1972 తర్వాత చూస్తే ఎస్వీఎస్ఎన్ వర్మ(2014) మినహా కాపు నేతలే పిఠాపురం నుంచి గెలిచారు.

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారే.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, TWITTER

ఆ వైరుధ్యాన్ని అధిగమించగలరా?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానంటూ పవన్ ప్రకటించారు. సొంత ఊరులా చేసుకుని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఇప్పటికే తన మ్యానిఫెస్టో ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, బీసీలు నిర్ణయాత్మకంగా ఉన్న చోట పవన్ ఎలా నెగ్గుకురాగలరనే దానిపై ఆయన విజయం ఆధారడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

"పవన్ కల్యాణ్‌కి పిఠాపురంలో సానుకూల అంశాలతో పాటుగా ప్రతికూలతలు కూడా అదే మోతాదులో ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారిని ఆయన ఎలా ఆకట్టుకుంటారన్నది కీలకం అవుతుంది. 2014లో టీడీపీ రెబల్ గెలుపులో బీసీలదే పెద్ద పాత్ర. కాపులకు, బీసీలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పవన్ అధిగమించగలిగితే ఇక్కడ అవకాశాలు మెరుగవుతాయి. అర్బన్ ఓటర్లు గణనీయంగా ఉండడం కలిసొచ్చే అంశం. కానీ, గెలుపు కోసం ఆయన టీడీపీ మీద ఆధారపడే పరిస్థితిలో ఉండడంతో ఏ మేరకు సహకారం దక్కుతుందన్నదే ఫలితాలను నిర్దేశిస్తుంది" అని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ముమ్మిడి లక్ష్మణ్ అన్నారు.

పిఠాపురంలో ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మతో సఖ్యతతో మెలుగుతున్నారు.

"టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సమన్వయం ఏ మేరకు ఉంటుందనే సందేహాలు ఇంకా ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ గట్టెక్కగలరని" లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

పిఠాపురంతో ఉన్న అనుబంధం, స్థానికురాలిని కావడం, సమస్యలపై అవగాహన కారణంగా ప్రజలు మళ్లీ తనకు పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి వంగా గీత భావిస్తున్నారు. కాపు ఆడపడుచుగా తనకు కాపులతో పాటుగా అన్ని కులాల్లో ఆదరణ ఉందని, అదే విజయానికి కారణం కాబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పిఠాపురం

పిఠాపురమే ఎందుకు?

పవన్ కల్యాణ్ పిఠాపురం ఎంచుకోవడంలో కుల సమీకరణాల పాత్ర కూడా ఉంటుందని సామాజిక విశ్లేషకుడు బీ. రామకృష్ణ అన్నారు.

"పిఠాపురంలో కాపులు సుమారు 32 శాతం వరకూ ఉంటారు. అన్ని అంశాల్లో నిర్ణయాత్మక పాత్ర వారిది. భీమవరం, గాజువాక తో పోలిస్తే ఇక్కడ ప్రభావిత పాత్రలో ఉంటారు. భీమవరంలో క్షత్రియులకి అలాంటి శక్తి ఉంది. దాంతో గోదావరి జిల్లాల్లో ఈ రెండు సీట్ల మీద చివరి వరకూ కసరత్తులు చేసిన పవన్ ఇటు మొగ్గినట్టు కనిపిస్తోంది" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

భిన్నమైన తీర్పులు వెలువడుతూ ఉండడం కూడా తోడ్పడి ఉంటుందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)