ఏపీ: బీజేపీ సీట్లను కూడా జగనే నిర్ణయిస్తున్నారా, రఘురామ కృష్ణరాజు ఆరోపణలకు కారణం ఏంటి?

రఘురామ కృష్ణరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక ఎంపీ టికెట్ ఒక వ్యక్తికి ఇవ్వకపోవడమనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలీని ఒక వ్యక్తికి పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నలు, ఆయనకు టికెట్ ఇవ్వాలని బయట పూజలు చేసేలా మారిపోయింది రాజకీయం. అది ఏకంగా ఒక ప్రధాన కూటమి మధ్య బంధాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లింది.

ఒక పార్టీ, ఒక భావజాలం, ఒక సైద్ధాంతిక నేపథ్యం, లేదా క్షేత్ర స్థాయిలో బలమైన పోరాటం, ఏదైనా అంశంపై తీవ్రమైన కృషి చేయడంలాంటి అంశాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ, నియోజకవర్గానికి దూరంగా ఉన్న బడా వ్యాపారికి ఏ పార్టీ కూడా పిలిచి టికెట్ ఇవ్వకపోవడం చుట్టూ ఆంధ్రా రాజకీయాల్లో చర్చ జరగడం దేనికి సంకేతం? ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు చుట్టూ జరుగుతున్న చర్చ ఆంధ్రా రాజకీయాలు ప్రస్తుత స్థితిని చెబుతోందా?

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

టికెట్ విషయంలో అసలేం జరిగింది?

సోషల్ మీడియాలో రోజూ రచ్చబండ నడిపి తెలుగునాట బాగా పేరు సంపాదించిన రఘురామ కృష్ణరాజు బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు.

ఆయన బీజేపీలో సభ్యుడు కాకపోయినప్పటికీ, తనకు బీజేపీతో సాన్నిహిత్యం ఉన్నట్టుగా చెప్పుకున్న తీరును బట్టీ, ఆయనకు టికెట్ మీద ఉన్న విశ్వాసాన్ని బట్టీ, వీడియోల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన ఘాటు విమర్శలతో రఘురామకు టికెట్ వస్తుందనే చాలా మంది భావించారు కూడా. కానీ, బీజేపీ మరో ఆలోచన చేసింది. భూపతిరాజు శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది.

క్షత్రియ-రాజు కులానికి చెందిన శ్రీనివాస వర్మది భీమవరం. ఆయన 2009 ఎన్నికల్లో ఇదే నరసాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసి 12 వేల ఓట్లు తెచ్చుకున్నారు. రఘురామది కూడా అదే కులం.

బీజేపీ వర్మగా పేరుగాంచిన శ్రీనివాస వర్మ సుదీర్ఘ కాలం ఆ పార్టీలో పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

మరోవైపు రఘురామ అటు ఇటు పార్టీ మారుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ, ఆ తర్వాత బీజేపీ, మళ్లీ వెనక్కి వైఎస్సార్సీపీకి వెళ్లి, జగన్‌తో తేడాలు వచ్చాక మళ్లీ బీజేపీకి చేరువయ్యారు. ప్రస్తుతానికి రఘురామ బీజేపీ సభ్యుడు కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ టీడీపీ సభ్యుడు కూడా కాదు.

టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ఆ పార్టీ ఇష్టం. అందుకే రఘురామ టికెట్ వ్యవహారంలో ఏ పార్టీ నాయకుడూ బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడడం లేదు.

అదే సమయంలో ‘‘అసలు మా పార్టీలోనే చేరని ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఎలా అడుగుతారు’’ అని బీబీసీతో అన్నారు ఒక బీజేపీ నేత.

అదే సమయంలో ఆదివారమే బీజేపీలో చేరి, అదే రోజు టికెట్ తెచ్చుకున్నారు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్.

దీంతో రఘురామకు టికెట్ ఇవ్వకపోవడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తనకు టికెట్ రాకపోవడం వెనక జగన్ హస్తం ఉందని రఘురామ ఆరోపించారు.

టికెట్ విషయమై ఆదివారం ఒక వీడియో విడుదల చేసిన రఘురామ, అందులో జగన్-సోము వీర్రాజు కలిసి తనకు టికెట్ రాకుండా చేశారని అన్నారు.

సోము వీర్రాజు బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు.

రఘురామ

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

‘‘నీలి మీడియా ముందే చెప్పింది. జగన్ నాకు సీటు రానివ్వడు అని ప్రచారం చేశారు. గతంలో నన్ను అరెస్టు చేస్తే బయటకు వచ్చాను. అనర్హత వేటు వేయించాలని చూశారు. కానీ, నేను ఆపాను. తాత్కాలికంగా ఈ విషయంలో జగన్‌కు విజయం దక్కింది. జగన్ ఇంత పని చేస్తారని ముందు నుంచీ అనుమానం ఉండేది. ఈ తాత్కాలిక ఓటమిని అంగీకరిస్తాను. నాలుగేళ్ళ కష్టం వృథా అయింది. ప్రజల అండతో రాజకీయంగా జగన్‌ను అథ: పాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘే కాదు’’ అని రఘురామ అన్నారు.

‘‘జగన్‌తో సోము వీర్రాజుకు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. సోము వీర్రాజు ద్వారా జగన్ సఫలం అయినట్టు నాకు తెలిసింది. ఇది నా చిన్న ఓటమి. జగన్‌‌కు ఓటేసినా, ఆ పార్టీకి ఓటేసినా ఒకటే అని ఊహ కల్పించి తన పబ్బం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్లను కొన్ని పార్టీలకు దూరం చేయాలని ఆయన పన్నిన కుట్ర తాత్కాలింగా సఫలం అయినట్టు కనిపించినా, అందరూ నిజం తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది’’ అని రఘురామ అన్నారు.

అంతేకాదు చేతులతో డబ్బులు సైగ చేస్తూ, పరోక్షంగా జగన్ డబ్బు ప్రభావంతో తనకు టికెట్ రాకుండా చేశారన్న ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ, ఆయన ఇంకా టికెట్‌పై ఆశ ఉన్నట్టే మాట్లాడారు.

‘‘ఇక్కడి నుంచే పోటీ చేస్తానా మరో చోటు నుంచి పోటీ చేస్తానా అన్నది చూద్దాం. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. తప్పులు సరి చేసుకోవడానికి సమయం ఉంది’’ అని రఘురామ చెప్పారు.

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

రఘురామకు జగన్‌కు ఎక్కడ చెడింది?

జగన్‌తో చాలా మంది విభేదించినా వారిలో ఈ రఘురామ శైలి వేరు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తరువాత ఆయన క్రమంగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. వారి మధ్య ‘ఈగో’ ఇష్యూసే ప్రధానం అని చాలా మంది చెబుతారు.

కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక లావాదేవీల సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఇదే సమస్య అని చెబుతారు. అనేక సందర్భాల్లో జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తాను ఎలా భంగపడ్డదీ రఘురామ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

దిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలందరూ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిల కనుసన్నల్లోనే ఉంటారు. సభలో మాట్లాడాలన్నా, బయట ఎవరైనా కేంద్ర మంత్రులను కలవాలన్నా ఈ ఇద్దర్ని దాటి ఏ ఎంపీ ముందుకు వెళ్లరు.

రఘురామ ఈ ఇద్దర్ని లెక్క చేయకుండా, స్వతంత్రంగా తన పరిచయాలతో ఇతరులను కలవడం, ఆ విషయంలో తమ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం – ఇలా ఒక్కోటి పెరుగుతూ వెళ్లాయి.

స్థూలంగా ఎవరి స్థాయి ఎంత? ఏంటి? అనే ఈగో సమస్య వచ్చింది. రోజువారీగా రచ్చబండ పేరుతో వీడియోలు చేసే రఘురామ ఆ వీడియోల్లో పళ్లు కొరుకుతూ, హావభావాలు పలికిస్తూ జగన్‌ను విమర్శించేవారు. ఆ వీడియోలతోనే ఆయన ఆర్ఆర్ఆర్‌గా ప్రాచుర్యం పొందారు. ఒక రకంగా ఆయన సోషల్ మీడియాలో ‘పొలిటికల్ స్టార్‌డమ్’ సంపాదించారు.

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరకు తాను నేరుగా వెళ్లగలనని రఘురామ తరచూ చెప్పుకునేవారు. దానికితోడు బీజేపీ దగ్గర తన పలుకుబడి ఎంత ఉపయోగించినా ఆయనపై అనర్హత వేటు వేయించలేకపోయింది వైఎస్సార్సీపీ. దీంతో ఆయనకూ బీజేపీతో ఉన్న సాన్నిహిత్యాన్ని అంతా గుర్తించారు.

బీజేపీ కూడా ఆయన మాటల్ని ఎప్పుడూ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక ఏపీ పోలీసులు రఘురామను అరెస్టు చేసినప్పుడు, కోర్టులో చురుగ్గా వాదించి తనను మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించేలా చేయడం.. ఇవన్నీ ఆయనకు దిల్లీలో చాలా పలుకుబడి ఉందన్న భావనను బలపరిచాయి. కానీ, క్షేత్రస్థాయి వాస్తవం మరోలా ఉంది. బీజేపీ ఆలోచన మరోలా ఉంది.

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

ఏపీ రాజకీయాలు బలహీన స్థితిలో ఉన్నాయని రఘురామ భావించారా?

బీజేపీ – తెలుగుదేశం – జనసేన.. ఏ పార్టీ అయినా తాను అడగడమే ఆలస్యం పిలిచి టికెట్ ఇస్తాయనే పూర్తి విశ్వాసంలో ఉండేవారు రఘురామ.

తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన సభలో స్టేజీ మీద చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌లను పెట్టుకుని, ‘నాదే నరసాపురం టికెట్’ అన్నారాయన.

‘‘నేనూ తొందర్లోనే మీ దగ్గరకు వచ్చేస్తాను. సాక్షి వాళ్లు రాస్తారు వాడికి ఆయన టికెట్ ఇవ్వడు, ఈయన టికెట్ ఇవ్వడు, వాడి పని ఔట్ అని. నేను వాళ్లిద్దరి ముందే(బాబు-పవన్) చెబుతున్నాను. మళ్లీ ఇదే నరసాపురం నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్నా. ఇంత కంటే పెద్ద సభ అప్పుడు వాళ్లిద్దరి సమక్షంలో పెడతాను. ఇప్పుడు ఏ పార్టీలో లేను కాబట్టి వెనకున్నాను. అప్పుడు ముందు ఉంటాను’’ అన్నారు రఘురామ.

సాధారణంగా రాజకీయాల్లో తరచూ కనిపించే హిపోక్రసీ అక్కడ రఘురామ చూపించలేదు. ఎంత పెద్ద స్థాయి నాయకుడు అయినా తమ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే డిప్లొమేటిక్‌గా మాట్లాడతారు.

ఇద్దరు పార్టీల అధ్యక్షులను పక్కన పెట్టుకుని, ‘నాదే టికెట్’ అని ప్రకటించే తెగువ చాలా మంది చేయరు. కానీ రఘురామ విశ్వాసం అలాంటిది.

కానీ, ఆ అతి విశ్వాసమే ఇప్పుడు దెబ్బతీసినట్టు చెబుతున్నారు. తనకు టికెట్ పక్కా అనే ఆలోచనతో కనీసం పార్టీలో ముందుగానే చేరిపోవడం వంటి లాంఛనాలు ఆయన పూర్తి చేయలేదు.

పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే, అప్పటికప్పుడు చేర్చుకుంటారు అన్న ధీమా ఆయనది. కానీ పార్టీ మరొకటి తలచింది.

తనకు బలంగా ఉపయోగపడుతుందనుకున్న ఉత్తర భారత క్షత్రియ కుల లాబీ, టికెట్ విషయంలో ఉపయోగపడలేదు.

అలాగని ఆ కులానికి వ్యతిరేకంగా కాకుండా, అదే కులానికి చెందిన పూర్వం నుంచీ బీజేపీని నమ్ముకున్న శ్రీనివాస వర్మను ముందు పెట్టారు.

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

పిలిచి టికెట్ ఇవ్వాలని ఆశించడాన్ని ఎలా చూడాలి?

ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ముందు ఆంధ్రాలో ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవాలి అంటారు రాజకీయ విశ్లేషకుడు గాలి నాగరాజు.

‘‘ఆంధ్రా రాజకీయ హద్దులు చెరిగిపోయాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ ఈ మూడింటిలోనూ ఇదే పరిస్థితి. బీజేపీ వారు పోటీ చేస్తోన్న ఆరు స్థానాల్లో ఒక్కరు తప్ప మిగతా వారంతా ఫిరాయింపుదారులే. గతంలో చంద్రబాబు ఇలానే చేశారు. అసలు ఆంధ్రాలో సైద్ధాంతిక, భావజాలపరమైన రాజకీయమే లేదన్న నేపథ్యంలో నుంచి చూస్తేనే అప్పుడు రఘురామ రాజు ఏ పార్టీలో చేరకుండా టికెట్ ఆశించడం అనే విషయం అర్థం అవుతుంది’’ అని చెప్పారు గాలి నాగరాజు.

‘‘రఘురామ రాజు నిలకడగా తన నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని లేరు. ఆయన దూరంగా ఉన్నారు. సోషల్ మీడియా స్టారుగా ఉంటే క్షేత్ర స్థాయిలో కష్టం కదా.. గెలవలేని వారికి ఎవరు సీటు ఇస్తారు?’’ అని ప్రశ్నించారు గాలి నాగరాజు.

‘‘ఒకటి వాస్తవం. రఘురామ ఎంపీ కాకూడదు అని జగన్ బలంగా కోరుకుంటారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసి తన అధికారాన్ని ప్రశ్నించిన వ్యక్తిని జగన్ సహించరు. అందుకే జైల్లో పెట్టించారు కూడా. అదే సమయంలో ఆంధ్రా బీజేపీలో ప్రో-జగన్, యాంటీ-జగన్ బ్యాచులు ఉన్నాయి. అయితే రఘురామ ఆరోపించినట్టు సోము వీర్రాజు వల్లనో, లేదా విష్ణువర్ధన రాజు వల్లనో అది అయ్యే పని కాదు’’ అని చెప్పారు.

‘‘మోదీ, అమిత్ షాలకు చెప్పి రఘురామకు టికెట్ ఇప్పించే, లేదా అడ్డుకునే శక్తి వీరికి ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఆ శక్తి జగన్‌కి ఉంది. మోదీ-జగన్ మధ్య ఆ కెమిస్ట్రీ ఉంది. ఆ మధ్య విశాఖలో జరిగిన సభలో తమ మధ్య అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని జగన్ మోదీని ఉద్దేశించి అన్నారు. జగన్ దిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి టికెట్ ఆపించాలని అనుకుంటే, అలా చేయడం పెద్ద సమస్య కాదు’’ అని అన్నారు నాగరాజు.

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

టికెట్ కూటమిపై ప్రభావం చూపిస్తుందా?

ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే అది ఆ పార్టీ ఇష్టం. సాధారణంగా టికెట్ రాని వ్యక్తి అలగడం, నిరసనలు వ్యక్తం చేయడం, ఒక్కోసారి భోరుమని ఏడవడం వంటివి చూస్తుంటాం. తర్వాత బుజ్జగింపులు అవీ జరిగి సద్దుమణుగుతుంది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగానే ఉంటుంది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. రఘురామకు టికెట్ రాకపోవడం అనేది మొత్తం మూడు పార్టీల కూటమి బంధంపైనే అనుమానాలు కలగజేసే చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో చర్చనీయాంశం ఒకటే. రఘురామకు టికెట్ ఇవ్వకపోవడానికి నిజంగా బీజేపీ విధానమే కారణమా లేక జగన్ ప్రభావమా అని.

రఘురామకు టికెట్ రాకపోవడంతో ఒకవైపు వైఎస్సార్సీపీ అభిమానులు సంతోషంగా ఉంటే, జగన్‌ని అందరి కంటే ఎక్కువ విమర్శించిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వలేదంటే ఏదో జరిగిందన్న అనుమానం టీడీపీ-జనసేన నాయకుల్లో మొదలైంది.

‘‘అయితే దీని ప్రభావం కూటమి మీద ఏమాత్రమూ ఉండదు.. కూటమి రాజకీయ అవసరాల ముందు రఘురామ ఒక చిన్న వ్యక్తి’’ అని అన్నారు గాలి నాగరాజు.

‘‘రఘురామను రాజకీయాల నుంచి దూరం చేయాలన్న పంతం జగన్‌‌కు ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. ఆ క్రమంలో జగన్ తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది’’ అని అమరావతిలో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్టు బీబీసీకి చెప్పారు.

దాదాపు రెండేళ్ల నుంచి తెలుగుదేశం, బీజేపీ పొత్తు కోసం తపించిన వారిలో రఘురామ ఒకరు. చంద్రబాబును బీజేపీకి దగ్గర చేయాలని ప్రయత్నం చేసిన రఘురామ, తానూ బీజేపీకి దగ్గరే అనుకున్నారు. భరోసా కూడా పెట్టుకున్నారు.

రఘురామ కృష్ణంరాజు

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju

టికెట్ దగ్గరకు వచ్చేసరికి బీజేపీలో అనేక అంశాలు పనిచేస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీలోని జగన్ అనుకూల వర్గం చక్రం తిప్పింది అంటున్నారు విశ్లేషకులు.

ఆంధ్రా బీజేపీలో పూర్వం నుంచీ ఉన్న సిద్ధాంతపరమైన బీజేపీ వారే కాకుండా, జగన్ సానుభూతి వర్గం, బాబు సానుభూతి వర్గం అని రెండు మూడు వర్గాలు ఉన్నాయి. జగన్ సానుభూతి వర్గం రఘురామకు టికెట్ రాకుండా ప్రయత్నం చేసిందనేది వారి వాదన.

‘‘ఆంధ్రా బీజేపీలోని ఒక వర్గం రఘురామకు వ్యతిరేకంగా బలంగా పనిచేసింది. ఆయన విషయంలో బీజేపీని జగన్ ప్రభావితం చేయగలిగారు అని పక్కాగా నమ్మవచ్చు’’ అని బీబీసీతో అన్నారు రాజకీయ విశ్లేషకుడు అయినం ప్రసాద్.

‘‘ఆయినా రఘురామ కచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. బహుశా తెలుగుదేశంలో చేరి విజయనగరం ఎంపీగా లేదా ఉండి (ప.గో. జిల్లా) ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది’’ అన్నారు.

టికెట్ల కేటాయింపు పూర్తిగా అంతర్గత వ్యవహారమే కావచ్చు కానీ కూటమి సభ్యుల మధ్య అనుమానం అంతర్గత వ్యవహారం కాదు. ఇప్పుడు కూటమి మిత్రులకు నమ్మకం కల్గించాల్సిన బాధ్యత బీజేపీ తీసుకుంటుందా, నమ్మకపోతే నాకేం నష్టం అని ఊరుకుంటుందా అనేది ప్రశ్న.

రఘురామ ఆరోపణలపై స్పందన కోసం సోము వీర్రాజును సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పిల్లలు.. ఇంగ్లిష్‌లో 18 కథలు రాశారు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)