ఆంధ్రప్రదేశ్: పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం జరిగింది? సచివాలయాల వద్ద పడిగాపులు ఎందుకు?

ఫొటో సోర్స్, Laxman
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై పెద్దయెత్తున చర్చ కొనసాగుతోంది.
ఏప్రిల్ 3 బుధవారం ఉదయం నుంచే గ్రామ/ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, చాలా మంది లబ్ధిదారులు సచివాలయాల వద్ద వరుస కట్టారు.
కానీ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో బుధవారం సాయంత్రానికిగానీ పెన్షన్ల పంపిణీ మొదలు కాలేదు.
నిధుల విడుదలలో ఆలస్యమే దీనికి కారణమని వివిధ సచివాలయాల సిబ్బంది బీబీసీతో చెప్పారు.
నిధుల విడుదలలో జాప్యంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆ శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించలేదు.
నిధుల విషయంలో తాత్సారం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 65.92 లక్షల మందికి పెన్షన్లు అందించాల్సి ఉంది. అందుకు నెలకు సుమారు రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది.
అయితే, ఈసారి పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసినట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
పెన్షన్ల పంపిణీ కోసం ఇప్పటివరకు ఎంత విడుదల చేశారు, దానిలో ఎంత పంపిణీ చేశారన్నది అధికారికంగా వెల్లడించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది.
మార్చి నెల వరకు ఒకటో తేదీన గంటకు ఎంత శాతం మందికి పెన్షన్లు అందించారనే లెక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించేది. కానీ, ఈసారి మాత్రం దాన్ని విస్మరించారు.
ఇప్పుడు పెన్షన్ల కోసం ఎంత మొత్తం విడుదల చేశారన్నది వెల్లడించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ సమాచారం కోసం బీబీసీ ప్రయత్నించినప్పటికీ, సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) నుంచి సమాధానం రాలేదు.

ఫొటో సోర్స్, UGC
లబ్ధిదారుల పడిగాపులు
పింఛన్ల పంపిణీ గురించి గుంటూరు జిల్లా తాడేపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూలస్థానం, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరాల్లోని సచివాలయాల్లో బీబీసీ ఆరా తీసింది.
మూడు చోట్లా పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతోనే, సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ ప్రారంభించలేదని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత నుంచి మొదలుపెట్టామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ద్వారా సచివాలయాలకు పెన్షన్ల సొమ్ము జమ చేస్తుంది. వాటిని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి తీసుకుని వాలంటీర్లకు అందిస్తారు. వారు తమ పరిధిలోని పింఛనుదారులకు ఇంటింటికీ వెళ్లి పంచేవారు.
కానీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పంపిణీని నిలిపివేశారు.
నడవలేని స్థితిలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన వారికి సచివాలయం వద్దే పెన్షన్ల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
పెన్షన్ల పంపిణీలో మార్గదర్శకాలను ఏప్రిల్ 2న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం (ఏప్రిల్ 3) ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
సాధారణంగా, ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు తీసుకునే వారు ఏప్రిల్‌లో మాత్రం ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో 3వ తేదీన పెన్షన్ అందుకుంటారు.
అయితే, 3వ తేదీన పెన్షన్ల పంపిణీ మొదలవుతుందని ఆశించిన వారికి ఈసారి నిరాశ ఎదురైంది. పెన్షన్ల కోసం ఎదురుచూసే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బధువారం పొద్దున్నే సచివాలయాల వద్దకు వచ్చారు. కానీ, సిబ్బంది మాత్రం అప్పుడు పెన్షన్ల పంపిణీ చేపట్టలేదు.

ఫొటో సోర్స్, Laxman
‘మూడు సార్లు వెళ్లినా పెన్షన్ ఇవ్వలేదు’
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని ఓ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ బాధ్యత చూసే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉదయం నుంచే బ్యాంకు వద్ద ఎదురుచూశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కేవలం లక్ష రూపాయలే జమయ్యాయి.
వాస్తవానికి వారి పరిధిలో చెల్లించాల్సిన మొత్తం రూ. 19. 5 లక్షలు. అందులో పదో వంతు కూడా జమ కాకపోవడంతో, వాటిని విత్ డ్రా చేసి పంపిణీ బాధ్యతను చేపట్టలేదు.
"బ్యాంకులో పడిన మొత్తం కేవలం 30 మందికి పంచడానికి సరిపోతాయి. కానీ, ఆఫీసు దగ్గర 100 మందికి పైగా ఉన్నారు. కొందరికి ఇచ్చి, మిగిలిన వాళ్లను రేపు రమ్మంటే ఊరుకోరు. అందుకే, ఎవరికీ పంచలేదు. ఈ రోజు మాకు రూ. 6 లక్షల వరకు వేస్తామని చెప్పారు. అరగంటకు ఒకసారి చెక్ చేశాం. కానీ, సాయంత్రం 4 గంటల వరకు రాలేదు. దాంతో ఏం చేయాలో మాకు పాలుపోలేదు" అంటూ పేరు వెల్లడించానికి ఇష్టపడని సచివాలయ ఉద్యోగి ఒకరు బీబీసీకి తెలిపారు.
బ్యాంకు తెరిచినప్పటి నుంచి ఎదురుచూస్తుండటమే తప్ప నిధులు విడుదల కాలేదని వెల్లడించారు.
"ఒకటో తేదీన పెన్షన్లు వస్తాయి కాబట్టి ఆ రోజుకు సరిపడ మందులు కొనుక్కుంటాం. పెన్షన్ రాగానే థైరాయిడ్ మందులు కొనుక్కోవాలి. రెండు రోజులుగా డబ్బుల్లేక అప్పు చేసి తీసుకున్నాను. ఈ రోజు ఇస్తారని ఆశపడితే మూడు సార్లు వెళ్లినా పెన్షన్ రాలేదు. ఉదయం వెళ్లాను, ఇంకా రాలేదన్నారు. మధ్యాహ్నం మళ్లీ వెళ్లాను. సాయంత్రం రమ్మన్నారు. కానీ పెన్షన్ ఇవ్వలేదు" అని తాడేపల్లి సుందరయ్య నగర్‌కు చెందిన ఆర్.రామేశ్వరమ్మ చెప్పారు.
‘‘పెన్షన్ ఎప్పుడిస్తారన్నది స్పష్టంగా చెబితే సమస్య ఉండేది కాదు. కానీ, మమ్మల్ని తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని ఆమె వాపోయారు.

ఫొటో సోర్స్, UGC
‘అన్ని వైపులా రాజకీయమే’
ప్రభుత్వమే ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అని ప్రకటించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప వృద్ధుల సమస్యను పట్టించుకోవడం లేదంటూ రాజకీయ విశ్లేషకుడు బి.రామ్ నాథ్ అభిప్రాయపడ్డారు.
"పెన్షన్ల విషయంలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరం. ప్రత్యామ్నాయ విధానాలు చూసి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది’’ అని అన్నారు.
‘‘వృద్ధులు ఇబ్బంది పడితే వారికి అవతలి పార్టీపై కోపం పెరుగుతుందని ఒక పార్టీ, వృద్ధులు ఇబ్బంది పడితే వాళ్లు నిజంగానే తామే బాధ్యులం అనుకుంటారేమో అని ఇంకో పార్టీ ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. అన్ని వైపులా కేవలం రాజకీయమే ఉంది. ఎక్కడా వృద్ధుల పట్ల దయ కనిపించడం లేదు. మానవత్వంతో కూడిన బాధ్యత ఉండాలి కదా" అంటూ రామ్ నాథ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం తీరు చూస్తుంటే సమస్య పరిష్కారం కన్నా ఎన్నికల ప్రయోజనాలను ఆశించడమే కనిపిస్తోందన్నారు. ఈ విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు, ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీతో స్నేహం కోసం ప్రధాన పార్టీలు ఎందుకు ఆరాటపడుతున్నాయి
- ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
- కచ్చతీవు దీవిపై కాంగ్రెస్, డీఎంకేలను మోదీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలేంటీ వివాదం?
- బైపోలార్ డిజార్డర్: ఆత్మహత్యకు పురిగొల్పే మానసిక వ్యాధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














