ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 - జనసేన: పదేళ్ళ ఈ పార్టీ రూటు మార్చిందా... ఏపీలో జేడీఎస్‌లా మారిందా?

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Janasena/FB
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. ఎన్డీయే కూటమి పార్టీలు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై స్పష్టతకు వచ్చేస్తున్నాయి.
అయితే, జనసేన కొన్ని ప్రాంతాల మీదనే దృష్టి కేంద్రీకరించి, అందుకు తగ్గట్టుగానే సీట్లు కోరుకోవడం కీలక పరిణామం. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల నుంచి పోటీ చేయడానికి జనసేన ఆసక్తిచూపలేదు.
2019 ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకునే తక్కువ స్థానాల్లో పోటీకి పరిమితమయినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈసారి అసెంబ్లీలో ప్రవేశించి, ప్రభావం చూపడం ద్వారా పునాది ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు జనసేన చెబుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలే కీలకమని, అందుకు అనుగుణంగానే మూడు జిల్లాల్లో జనసేన సీట్లు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది..
అసలు జనసేన ఎందుకిలా చేస్తోంది? ఆ పార్టీలో కర్ణాటకలో జనతాదళ్(సెక్యూలర్) పార్టీ నిర్ణయాలే ప్రతిబింబిస్తున్నాయా?
మూడు జిల్లాల మీదే ఫోకస్ ఎందుకు?
పొత్తులో భాగంగా టీడీపీ 144, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉంటాయని అధికారికంగా ప్రకటించారు. జనసేన 21 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
బీజేపీ తరఫున పోటీ చేసే పది మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. టీడీపీ కూడా విడతల వారీగా విడుదల చేసిన జాబితాలో 138 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
జనసేన తరఫున 18 మందిని అధికారికంగా ప్రకటించారు. ఆ లెక్కన, టీడీపీ తరఫున ఆరుస్థానాలు, జనసేన తరఫున మూడు స్థానాలకు అభ్యర్థుల విషయమై ప్రకటనలు రావాల్సి ఉంది.
జనసేన తరుపున ఇప్పటికే ప్రకటించిన 18 మంది అభ్యర్థుల్లో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలుపుకుని మొత్తం 9 మంది కాపు కులానికి చెందినవారు.
మూడు ఎస్సీ , ఒక ఎస్టీ రిజర్వుడు సీట్ల నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక మిగిలిన వాటిలో ఒక బ్రాహ్మణ, ఒక గవర, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక మత్స్యకార కులాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు.
జనసేన ఇప్పటి వరకూ ప్రకటించిన అభ్యర్థుల్లో 12 మంది ఓసీలు, ఎస్సీలు ముగ్గురు, బీసీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు చొప్పున ఉన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన సిట్టింగ్ సీటు రాజోలుతోపాటుగా పి.గన్నవరం, కాకినాడ రూరల్, రాజానగరం నుంచి ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు.
పార్టీ ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీలో ఉండనున్నట్లు ప్రకటించారు.
ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పోలవరం అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
దాంతో విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు, తూర్పు గోదావరి జిల్లాలో ఐదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాల నుంచి ఆ పార్టీ పోటీలో ఉండబోతోంది.
మిగిలిన వాటిలో ఉత్తరాంధ్ర నుంచి మరో రెండు సీట్లు పాలకొండ, నెల్లిమర్ల నుంచి కూడా జనసేన బరిలో ఉంటుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుంటూరు జిల్లా తెనాలి నుంచి కూడా పోటీలో ఉండబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకూ కలుపుకుని 19 సీట్లకు పోటీలో ఉన్నట్లయింది.
కేవలం గోదావరి, విశాఖ ఉమ్మడి జిల్లాలు కలిపి మొత్తం 49 స్థానాలకు గానూ జనసేన 15 సీట్లను తీసుకుంది. జనసేన మొత్తం అభ్యర్థుల్లో రెండింట మూడొంతులకు పైగా ఈ మూడు జిల్లాల వారే ఉన్నారు.
అంటే మిగిలిన 126 సీట్లకు గానూ జనసేన పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య కేవలం ఆరు మాత్రమే కావడం విశేషం.

ఫొటో సోర్స్, FACEBOOK/JANASENAPARTY
ఆ జిల్లాల్లో ఒక్క సీటూ లేదు..
మిగిలిన వాటిలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీలో ఉండడం లేదు.
రాయలసీమలోని తిరుపతి, రైల్వే కోడూరు స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు.
జిల్లాల పునర్విభజనకు ముందున్న 13 జిల్లాల ప్రకారం చూస్తే జనసేన 4 జిల్లాల్లో ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయబోవడం లేదు.
ప్రస్తుత జిల్లాల విభజన ప్రకారం చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా-1, విజయనగరం-1, విశాఖ-1, అనకాపల్లి-3, కాకినాడ-2, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా- 2, తూర్పు గోదావరి-2, పశ్చిమ గోదావరి-3, ఏలూరు-2, కృష్ణా-1, గుంటూరు-1, తిరుపతి- 1, అన్నమయ్యజిల్లా -1 నుంచి చొప్పున పోటీలో ఉంది.
ఈ లెక్కన చూస్తే, మొత్తం 26 జిల్లాలకు సగం జిల్లాల్లో జనసేన అభ్యర్థులు ఉండబోరు. అంటే, కేవలం 13 జిల్లాలకే ఆ పార్టీ పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
జేడీఎస్‌తో పోలిక
కర్ణాటక రాజకీయాల్లో జనతాదళ్ సెక్యూలర్ పార్టీ మూడో బలమైన పార్టీ. అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి చూస్తే 19 మంది ఎమ్మెల్యేలున్నారు. 13.29% శాతం ఓట్లతో ఆ పార్టీ కాంగ్రెస్, బీజేపీల తర్వాతి స్థానంలో నిలిచింది.
జేడీఎస్ విజయం సాధించిన 19 సీట్లను పరిశీలిస్తే కేవలం 15 స్థానాలను పూర్వపు మైసూర్ ప్రాంతంలోనే దక్కించుకుంది. అందులోనూ ఒక్కలిగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే గెలిచింది. ప్రాంతీయ పార్టీల్లో ఉప ప్రాంతీయశక్తిగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కర్ణాటక సార్వత్రిక ఎన్నికల కోసం జేడీఎస్ ఈసారి బీజేపీతో జతగట్టింది. నాలుగు పార్లమెంట్ స్థానాల నుంచి జేడీఎస్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు.
ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామిగా జేడీఎస్‌కి కేటాయించిన ఎంపీ సీట్లన్నీ మళ్లీ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోనివే కావడం గమనార్హం.
అలా జేడీఎస్ కూడా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, అందులోనూ దేవగౌడ సొంత కులస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికే పరిమితం అయింది.
ఏపీలో జనసేన పార్టీని కూడా పలువురు జేడీఎస్‌తో పోలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీనే ఎక్కువ జిల్లాల్లో
పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల బరిలో నిలిచింది. అప్పట్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగడంతో అన్ని స్థానాలకు ఆ పార్టీ పోటీ చేసింది.
ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 18 సీట్లను దక్కించుకోగా, వాటిలో 16 స్థానాలు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం నుంచే దక్కాయి.
విశాఖ నుంచి 4 , తూర్పు గోదావరి 4, పశ్చిమ గోదావరి 1, కృష్ణా 2, ప్రకాశం 1, నెల్లూరు 1, కర్నూలు 2 చొప్పున అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ప్రజారాజ్యం పార్టీ.
పునర్విభజన జరగకముందు జిల్లాల ప్రకారం చూస్తే 7 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం దక్కించుకుంది ప్రజారాజ్యం పార్టీ.
గతంలో పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేలు విజయం సాధించిన ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాలను ఈసారి జనసేన విస్మరించింది.
ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ కేవలం 10 సీట్లలో పోటీ చేస్తుండగా కేవలం కడప, కృష్ణా జిల్లాల్లో మాత్రమే రెండేసి సీట్లు తీసుకుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ అన్ని ప్రాంతాలను కవర్ చేసినట్టుగా ఉంది.
"జనసేన కూడా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది. పవన్ కల్యాణ్ స్వయంగా పలు సమస్యలపై కదిలారు. అనంతపురం వంటి జిల్లాల్లో రోడ్ల సమస్య మీద ఆయన ఆందోళన చేశారు. నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్య మీద స్పందించారు. కౌలుదారుల మరణాలపై అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేశారు. అలాంటిది ఎన్నికలకు వచ్చే సరికి కొన్ని జిల్లాలకే పరిమితం కావడం ఆశ్చర్యంగానే ఉంది. ప్రతి జిల్లాకు కనీసం ఒక్క సీటునయినా ఆ పార్టీ కోరుకుంటుందని అంతా అంచనా వేశారు. కానీ ఆయన అందుకు భిన్నంగా బలం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది" అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఉమా మహేశ్వర రావు అన్నారు.
భవిష్యత్ పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణం మీద కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పవన్ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
కాపుల బలం మీదనే కేంద్రీకరించారా?
కర్ణాటకలో జేడీఎస్ ఒక్కలిగల మద్ధతు కూడగట్టినట్టే, ఏపీలో జనసేన కూడా కాపుల్లో కొంత పట్టు సాధించింది. పవన్ కళ్యాణ్ కి సొంత కులస్తుల్లో ఆదరణ ఉన్నట్టు 2019 ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.
జనసేనకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి 14.84 శాతం ఓట్లు వచ్చాయి. గెలిచిన ఒక్క సీటు కూడా ఆ జిల్లాకే చెందిన రాజోలు.
పశ్చిమ గోదావరి జిల్లాల్లో 11.68 శాతం ఓట్లు దక్కగా, విశాఖలో 8.58 శాతం ఓట్లు పడ్డాయి. ఇక మిగిలిన ఏ జిల్లాలోనూ 6 శాతం ఓట్లు పడిన దాఖలాలు లేవు. దానిని బట్టి కాపులు ప్రభావితం చేసే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు దక్కినట్టు కనిపిస్తోంది.
అందుకు అనుగుణంగానే ఈసారి కూడా గత ఎన్నికల ఫలితాల ఆధారంగా తనకు బలమున్న ప్రాంతం మీదనే పవన్ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది.
"జనసేన తన బలాన్ని అంచనా వేసుకుని ప్రయోగాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, భవిష్యత్ లో కొన్ని ప్రాంతాల పార్టీగా మిగిలిపోతుంది. కాపుల అండదండలున్నప్పటికీ ఇతరులను సమీకరించే ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే పార్టీని పరిమితం చేస్తున్నారు. కాపులకు రాజ్యాధికార కాంక్ష లేదా పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పీఠం వంటి కలలు నెరవేరాలంటే అన్ని చోట్లకు విస్తరించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకో దానిని విస్మరించినట్టుగా ఉంది" అని విశ్లేషకులు ఐనం ప్రసాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైటెన్షన్ విద్యుత్ టవర్ల దగ్గర సెల్‌ఫోన్ మాట్లాడటం ప్రమాదమా, అక్కడ ఇళ్లు కూడా కట్టుకోకూడదా?
- రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









