రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, RahulGandhi/Facebook

ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను నియంత్రించాలని చూస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.

ఆమె మాట్లాడుతూ, “ప్రతి ఏడాది దసరా రోజున ఈ మైదానంలోనే రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాం. ఇదే మైదానం నుంచి, రాముడి భక్తులమని చెప్పుకునే అధికారంలో ఉన్నవారికి ఈరోజు వేలఏళ్లనాటి కథను గుర్తుచేయాలని అనుకుంటున్నాను. రాముడు సత్యం కోసం పోరాటం చేసినప్పుడు ఆయన దగ్గర పదవి లేదు. వనరులు లేవు. రథం లేదు. కానీ, అవన్ని రావణుడి దగ్గర ఉన్నాయి” అన్నారు.

“రాముడు దగ్గర సత్యం, ఆశ, ధైర్యం, ప్రేమ, సహనం ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీకి రాముడి జీవితాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అధికారం శాశ్వతం కాదు. అధికారం వస్తుంది, పోతుంది, అహం అంతా నశించేలా చేస్తుంది” అన్నారు.

ఇండియా కూటమి తరఫున ఐదు డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం ముందు ఉంచారు.

ఐదు డిమాండ్లు..

  • ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల్లో అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలి.
  • ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, ఈడీ, సీబీఐలు దాడులు చేసి, చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడాలనే లక్ష్యంతోనే ఇదంతా చేస్తున్నారు.
  • దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ ముఖ్యంత్రి హేమంత్ సోరేన్‌లను వెంటనే విడుదల చేయాలి.
  • ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ఆర్థికంగా నిర్వీర్యం చేసే చర్యలను వెంటనే ఆపేయాలి.
  • ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ సేకరణ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి.
సునీతా కేజ్రీవాల్

ఫొటో సోర్స్, AAP

ఫొటో క్యాప్షన్, సునీతా కేజ్రీవాల్

“ఇవి సాధారణ ఎన్నికలు కావు. దేశాన్ని, పేదలు, అణగారిన ప్రజల హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

మద్యం విధానం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా విపక్షాల కూటమి (ఇండియా) ఆదివారం దిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీ చేపట్టింది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మీరు గనుక ఆలోచనతో ఓటు వేయకపోతే, వారి మ్యాచ్ ఫిక్సింగ్ విజయవంతమవుతుంది. మన రాజ్యాంగానికి ముగింపు పలుకుతుంది” అన్నారు.

“ఇవి సాధారణ ఎన్నికలు కావు. దేశాన్ని, పేదలు, అణగారిన ప్రజల హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా కనిపిస్తోంది” అరోపించారు.

రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, “మోదీనే ఎన్నికల కమిషన్‌ను నియమించారు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రిని కూడా జైలులో పెట్టారు. మా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. ఒకవేళ ఈ పని చేయాలంటే, ఎన్నికలకు ఆరు నెలల ముందో, లేదా తరువాతో చేయొచ్చు. కానీ, ఎన్నికల సమయంలో చేశారు” అన్నారు.

మెగా ర్యాలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జైల్లో ఉన్న జేఎంఎం నాయకుడు, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు పాల్గొంటున్నారు.

మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మల్లికార్జున్ ఖర్గే

బీజేపీ, ఆర్ఎస్సెస్‌లు విషంతో సమానం- ఖర్గే

బీజేపీ, ఆరెస్సెస్‌లు విషం లాంటివని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే.

ఆయన మాట్లాడుతూ “బీజేపీ, ఆరెస్సెస్‌లు విషం లాంటివి. ఆ విషాన్ని తాగడం కాదు.. రుచి చూద్దామని ప్రయత్నించినా మరణం తప్పదు. ప్రజాస్వామ్యం కావాలో నియంతృత్వం కావాలో మీరే నిర్ణయించుకోండి. నియంతృత్వానికి మద్దతిచ్చేవారిని దేశం నుంచి తరిమికొట్టాలి” అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

“రాజ్యాంగం ఉనికిలో ఉంటేనే రిజర్వేషన్లు, ప్రాథమిక హక్కులు ఉంటాయి. రాజ్యాంగమే లేకపోతే అది అంతమే. ఒకవేళ బీజేపీకి గనుక రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం వచ్చి ఉంటే, మహిళలకు ఓటు హక్కు కల్పించేవారు కాదు” అన్నారు.

తేజస్వి యాదవ్

ఈడీ, సీబీఐ, ఐటీలు బీజేపీలో భాగమయ్యాయి - తేజస్వి యాదవ్

ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ దర్యాప్తు ఏజెన్సీలపై ఆరోపణలు చేశారు.

“వారికి వ్యతిరేకంగా గళమెత్తితే, మోదీ జీ సెల్, ఆయన పార్టీ నుంచి వేధింపులు మొదలవుతాయి. ఇంతకూ ఆయన సెల్‌లో ఉన్నదెవరంటేఈడీ, సీబీఐ, ఐటీలు” అని ఆరోపణలు చేశారు.

“లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను చాలాసార్లు వేధించారు. నేను, నా తల్లి, నా సోదరిలు, నా తండ్రి బంధవులు..ఇలా మా అందరిపైనా కేసులు నమోదు చేశారు. ఒకసారి బీహార్‌కు వచ్చి చూడండి, మా నేతల్లో చాలామంది ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈడీ చాలా చోట్ల సోదాలు చేస్తోంది. ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయి. కానీ, మేం వీటికి భయపడే వ్యక్తులం కాదు” అన్నారు.

దిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ

ఫొటో సోర్స్, YouTube/Indian National Congress

ఫొటో క్యాప్షన్, దిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ

తేజస్వి యాదవ్ మాట్లాడుతూ “ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే మేం ఇక్కడికి వచ్చాం” అని చెప్పారు.

“మొదటి ర్యాలీ పాట్నాలో నిర్వహించాం. రెండో ర్యాలీ ముంబయిలో చేశాం. మూడో ర్యాలీ దిల్లీలో చేపట్టాం..ఇలా దేశంలో ఎక్కడికి వెళ్లినా మాకు ప్రజల మద్దతు లభిస్తోంది” అన్నారు.

మెగా ర్యాలీలో వేదికపై ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, AICC

ఫొటో క్యాప్షన్, మెగా ర్యాలీలో వేదికపై ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్, సోనియా గాంధీ

‘కేజ్రీవాల్‌ను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు’

‘‘నా భర్తను ప్రధాని నరేంద్ర మోదీ జైల్లో పెట్టారు, ఆయన చేసింది సరైనదేనా’’ అని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ప్రజల కోసం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు నుంచి లేఖ పంపించారని సునీత తెలిపారు.

కేజ్రీవాల్ పంపిన లేఖను చదవడానికి ముందు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని సునీత చెప్పారు.

‘‘కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు. నిజాయతీపరుడని మీరు నమ్ముతారా? జైల్లో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అంటోంది. ఆయన రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు. కోట్ల మంది గుండెల్లో కేజ్రీవాల్ ఉన్నారు’’ అని అమె అన్నారు.

రాంలీలా మైదానంలో ర్యాలీ

తర్వాత కేజ్రీవాల్ రాసిన లేఖను ఆమె చదివి వినిపించారు.

లేఖలో పేదరికం, ద్రవ్యోల్బణం, విద్యా-వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆయన ప్రస్తావించినట్లు సునీత చెప్పారు.

కల్పనా సోరెన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ర్యాలీలో ప్రసంగిస్తున్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్

కల్పనా సోరెన్ ఏమన్నారు?

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ మాట్లాడుతూ, "140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో,ఎన్డీయే ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది" అని ఆరోపణలు చేశారు.

"మాకు మద్దతు తెలిపి, ఓటు వేయడం ద్వారా ఇండియా కూటమిని బలపర్చండి. ఇక్కడి జనసంద్రం అణిచివేస్తున్న శక్తుల పట్ల వ్యతిరేకతను చూపిస్తోంది. మన దేశాన్ని నాశనం చేస్తోన్న వారి పట్ల వ్యతిరేకంగా నిలబడటాన్ని సూచిస్తోంది" అన్నారు.

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, YouTube/Indian National Congress

దర్యాప్తు లేకుండానే జైళ్లకు పంపుతున్నారు: మెహబూబా ముఫ్తీ

ప్రస్తుతం దేశం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఎలాంటి దర్యాప్తు లేకుండానే ప్రజల్ని జైళ్లకు పంపుతున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.

ఇది కలియుగానికి అమృత కాలం అంటూ వ్యాఖ్యానించారు.

‘‘నేను ఉమర్ ఖాలిద్, మొహమ్మద్ జుబైర్‌ల గురించి మాట్లాడటం లేదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గురించి చెబుతున్నాం. ఇదేమీ నాకు ఆశ్చర్యంగా లేదు. నాతో పాటు మాజీ ముఖ్యమంత్రులైన ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేశారు’’ అని ఆమె చెప్పారు.

మల్లికార్జున్ ఖర్గే, శరద పవార్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, AICC

ఫొటో క్యాప్షన్,
ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, ANI

ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఆధారిత ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం ఇది: ఉద్ధవ్

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల కోసం తపిస్తోందని, అయితే ఒకే పార్టీ, ఒకే వ్యక్తి ఆధారిత ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సరైన సమయం ఇదేనని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఈ వేదికపైకి వచ్చామని, ఇది ఎన్నికల ప్రచారం కాదని చెప్పారు.

ఒకప్పుడు కొందరిని అవినీతిపరులని ఆరోపించిన బీజేపీ ఇప్పుడు వారినే పార్టీలోకి తీసుకుందని విమర్శించారు. అవినీతిపరులతో కూడిన ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తుందంటూ ప్రశ్నించారు.

మెగా ర్యాలీలో వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు

ఫొటో సోర్స్, AICC

సీఎంను జైల్లో పెట్టడం ఏమిటని ఉద్ధవ్ ప్రశ్నించారు.

‘‘దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మళ్లీ ఇక్కడ చెప్పను. మన దేశం నియంతృత్వం వైపు పయనిస్తోందనే అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లను అరెస్ట్‌ చేసిన తర్వాత ప్రజలు భయపడతారని బీజేపీ ప్రభుత్వం భావిస్తే, ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల గురించి వారికి తెలియదనే అనుకోవాలి.

దేశంలోని పౌరులందరూ పోరాట యోధులే. బీజేపీ భాగస్వామ్య పార్టీలకు ఈడీ, ఐటీ విభాగం, సీబీఐ ఉండగా, మేం ఇండియా కూటమిగా ఏర్పడ్డాం.

ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం ఏంటి? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. ఈ అవినీతిపరులు దేశాన్ని అభివృద్ధి చేయగలరా’’ అని ఉద్ధవ్ అడిగారు.

ఈ సభకు బీజేపీ "దొంగల సభ" అని పేరు పెట్టిందని ఉద్ధవ్ ప్రస్తావించారు. ‘‘అంటే ఇక్కడికి వచ్చిన మీరంతా దొంగలా’’ అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు.

దిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై కర్రలతో దాడి చేశారని, బాష్పవాయు గోళాలను ప్రయోగించారని ఆయన విమర్శించారు.

‘‘రైతులను టెర్రరిస్టులుగా పిలిచే ప్రభుత్వాన్ని దిల్లీలోకి రాకుండా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఉద్ధవ్ తెలిపారు.

ఆందోళన

ఫొటో సోర్స్, AICC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)