సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేశాక వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆలోచన ఏమిటి?

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, రాఘవేంద్రరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి, దానిని వెల్లడించే లోపు వేల కోట్లు విలువజేసే కొత్త బాండ్లను ముద్రించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌‌పై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2023 అక్టోబర్‌ నుంచి విచారణ జరిపింది. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.

సమాచార హక్కు(ఆర్టీఐ ) చట్టం కింద ద్వారా అందిన సమాచారం ప్రకారం.. కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగా చివరి విడతగా ముద్రించిన ఎలక్టోరల్ బాండ్ల సంఖ్య 8,350.

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2024 ఫిబ్రవరి 21న ఈ బాండ్ల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి.

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ చేపట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.12 కోట్లు (జీఎస్టీ సహా) కమీషన్‌ రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 8.57 కోట్లు చెల్లించింది.

అలాగే, నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో బాండ్లను ముద్రించినందుకు ప్రభుత్వానికి రూ.1.93 కోట్ల (జీఎస్‌టీతో కలిపి) బిల్లు వచ్చింది, అందులో రూ.1.9 కోట్లు చెల్లించారు.

ఈ పథకం అమలు చేయడానికి, మొత్తంగా దాదాపు రూ.13.98 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అంటే పన్ను చెల్లింపుదారుల లేదా ప్రజల సొమ్మును చెల్లించాల్సి వస్తోంది.

ఎందుకంటే బాండ్ల రూపంలో విరాళంగా అందించిన వారి (వ్యక్తి లేదా కంపెనీ) నుంచి సేవా రుసుముల వసూలు ఉండదు.

ఎలక్టోరల్ బాండ్ల అంశంపై ఆర్టీఐ కార్యకర్త కమోడోర్ లోకేష్ బాత్రా కొన్నేళ్లుగా దరఖాస్తులు చేస్తున్నారు. ఆయనకు అధికారులు అందించిన సమాచారంలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

ఆర్టీఐ దరఖాస్తుకు ప్రతిస్పందనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఎన్ని ఎలక్టోరల్ బాండ్లు ముద్రించారో తెలిపే సమాచారాన్ని 2024 మార్చి 14న వెల్లడించింది.

ఎలక్టోరల్ బాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఏ సంవత్సరంలో ఎన్ని బాండ్లు?

ఆర్టీఐ సమాచారం ప్రకారం 2018లో గరిష్ఠంగా 6,04,250 ఎలక్టోరల్ బాండ్లు ముద్రించారు.

వీటిలో అత్యధికంగా రూ.1,000, రూ. 10,000 విలువ చేసే బాండ్లు ఉండగా, రూ. కోటి విలువగల బాండ్లు అత్యల్పంగా ఉన్నాయి.

2019లో 60 వేల బాండ్లు ముద్రించగా, ఆ ఏడాది రూ.1,000, రూ.10,000 విలువగల ఒక్క బాండ్ కూడా ముద్రించలేదు. రూ. లక్ష విలువజేసే బాండ్లను అధికంగా ముద్రించారు.

2022లో 10 వేల బాండ్లు ముద్రించారు. ఈ బాండ్లన్నీ ఒక్కొక్కటి రూ.1 కోటి విలువైనవి. ఇంకా ఏ ఇతర విలువ కలిగిన బాండ్లు ముద్రించలేదు.

2020, 2021, 2023 జనవరి నుంచి నవంబర్ వరకు ఎలాంటి ఎలక్టోరల్ బాండ్లను ముద్రించలేదు. 2023 డిసెంబర్ నుంచి ఒక్కసారిగా వేల బాండ్లను ముద్రించారు.

ఇలా చివరి విడతగా ముద్రించిన 8,350 బాండ్లన్నీ కూడా ఒక్కొక్కటి రూ. 1 కోటి విలువైనవి. ఇది కాకుండా ఏ ఇతర విలువ కలిగిన బాండ్లు ముద్రించలేదు.

ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్థికశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) అందించిన సమాచారం ద్వారా ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

2023 డిసెంబర్ 27 వరకు మొత్తంగా 6,74,250 ఎలక్టోరల్ బాండ్లను ముద్రించారు.

సరిగ్గా రెండు నెలలు అంటే 2024 ఫిబ్రవరి 27 ఆర్టీఐ దరఖాస్తుకు అందిన స్పందన ప్రకారం ఆ రోజు వరకు మొత్తం 6,82,600 ఎలక్టోరల్ బాండ్లను ముద్రించారు.

దీనర్థం 2023 డిసెంబర్ 27 నుంచి 2024 ఫిబ్రవరి 27 మధ్య 8,350 ఎలక్టోరల్ బాండ్‌లు ముద్రించారు.

ఎలక్టోరల్ బాండ్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు తీర్పు రాక ముందే కొత్త ఎలక్టోరల్ బాండ్ల ముద్రణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

"సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎంత నమ్మకంతో ఉందంటే, వాళ్లు మరిన్ని బాండ్ల ముద్రణ కొనసాగించారు" అని లోకేష్ బాత్రా అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఆర్టీఐ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం గత విడత 8,350 బాండ్లను ముద్రించక ముందే, అప్పటికే రూ.12,013 కోట్ల విలువైన బాండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎవరూ కొనలేదు. వాటిలో రూ. కోటి విలువైన బాండ్ల సంఖ్య 9,019.

"అప్పటికే చాలా బాండ్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం రూ. 8,350 కోట్ల విలువైన కొత్త బాండ్లను ముద్రించడానికి అనుమతిచ్చింది. అంటే వాళ్లు 2024 ఎన్నికలకు ముందు బాండ్ల భారీ విక్రయాన్ని ఆశించినట్లు అర్థమవుతోంది" అని లోకేష్ బాత్రా అన్నారు.

"సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించే వరకు ప్రభుత్వం తన పని కొనసాగించింది. కోర్టు ఈ స్కీం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తుందని ప్రభుత్వం అనుకొని ఉండకపోవచ్చు" అని మరో ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

15 రోజుల్లోగా ఎన్‌క్యాష్ చేసుకోని బాండ్ల డబ్బులు ఏమయ్యాయి?

ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం ప్రకారం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ డేటా ప్రకారం..

ఇప్పటివరకు ఎస్బీఐ విక్రయించిన బాండ్ల మొత్తం విలువ రూ.16,518 కోట్లు. ఈ బాండ్లలో కోటి రూపాయల విలువైన బాండ్లు 95 శాతం ఉన్నాయి.

30 దశల్లో విక్రయించిన బాండ్లలో కేవలం రూ.25 కోట్ల విలువైన 219 బాండ్లను మాత్రమే రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకోలేదు.

సాధారణంగా నిబంధనల ప్రకారం బాండ్లు కొన్న 15 రోజుల్లోనే వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవాలి. లేకపోతే అది రద్దయిపోతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్‌క్యాష్ చేసుకోని ఆ రూ. 25 కోట్లు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డిపాజిట్ చేశారు.

మొత్తంగా 2018 నుంచి 2024 మధ్య కాలంలో విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల సంఖ్య 28,030. ఇది మొత్తం ముద్రించిన బాండ్లలో 4.1 శాతం మాత్రమే.

ఎలక్టోరల్ బాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎక్కువ బాండ్లు ఏ బ్రాంచ్‌లో అమ్ముడయ్యాయి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబయి ప్రధాన శాఖ నుంచి రూ. 4,009 కోట్ల విలువైన బాండ్లు విక్రయించారు.

ఎస్‌బీఐ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ రూ. 3,554 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రెండో స్థానంలో ఉంది.

కోల్‌కతా మెయిన్ బ్రాంచ్ రూ.3,333 కోట్ల విలువైన బాండ్లను విక్రయించగా, న్యూదిల్లీ మెయిన్ బ్రాంచ్ రూ.2,324 కోట్ల విలువైన బాండ్లను విక్రయించింది.

ఇక పాట్నా మెయిన్ బ్రాంచ్ నుంచి కేవలం రూ.80 లక్షల విలువైన బాండ్లు విక్రయించారు.

ఎక్కడ ఎక్కువగా ఎన్‌క్యాష్ అయ్యాయి?

ఎస్బీఐ న్యూదిల్లీ మెయిన్ బ్రాంచ్ నుంచి గరిష్ఠంగా రూ. 10,402 కోట్ల విలువైన బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్నారు.

హైదరాబాద్ ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి రూ.2,252 కోట్ల విలువైన బాండ్లను, ఎస్బీఐ కోల్‌కతా మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.1,722 కోట్ల విలువైన బాండ్‌లు రీడీమ్ చేశారు.

శ్రీనగర్‌లోని ఎస్బీఐ బాదామి బాగ్ శాఖ నుంచి కేవలం రూ. 50 లక్షలు విలువజేసే బాండ్లు ఎన్‌క్యాష్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)