నరేంద్ర మోదీ: 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ నాలుగు హామీలను నెరవేర్చారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని నిర్దిష్ట హామీలను ఇచ్చింది.
2024 నాటికి ఈ హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందా?
నాలుగు పథకాలకు సంబంధించిన హామీల అమలు తీరుపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా బీబీసీ చేసిన పరిశీలనలో ఏం తేలిందో ఈ కథనంలో చదవండి.
1. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)
హామీ: రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకు ఆర్థిక మద్దతు అందిస్తాం. తర్వాత ఈ పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపచేస్తాం.
పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018-19లో తీసుకొచ్చారు. రెండు హెక్టార్ల వరకు సాగుభూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల (ఎస్‌ఎంఎఫ్) కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున నగదు సహాయాన్ని ఈ పథకం కింద అందిస్తామని హామీ ఇచ్చారు. 2019 జూన్‌లో ఈ పథకాన్ని విస్తరించారు. సాగుభూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతులందరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చారు.
ఈ నిధులను మూడు విడతలుగా, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. పథకం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 520 మిలియన్లకు పైగా లబ్ధిదారులకు అందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85 మిలియన్ల మంది ఈ నిధులను పొందారు. మొత్తం 18 మంది మిలియన్ల లబ్ధిదారులతో ఉత్తరప్రదేశ్ ఈ పథకాన్ని పొందుతున్నవారిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకం మొత్తం లబ్ధిదారుల్లో యూపీ వాటా 21శాతం.

పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి అనేది వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ (ఎంఓఏఎఫ్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో అమలు అవుతున్న అతిపెద్ద పథకం.
2021-22 బడ్జెట్‌లో వ్యవసాయ శాఖ నిధుల్లో 49 శాతం ఈ పథకానికే కేటాయించినట్లు అంచనా. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయి.
2018-19 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించగా, 2019-20 బడ్జెట్‌లో ఈ నిధులను రూ. 75 వేల కోట్లకు పెంచారు. అయితే, కొన్ని సర్దుబాట్ల తర్వాత ఆ ఏడాది పీఎం కిసాన్ బడ్జెట్‌ను రూ. 54,370 కోట్లకు సరిపెట్టారు. అంటే కేటాయించిన బడ్జెట్ కంటే 28 శాతం తక్కువ.
ఈ తగ్గుదల ఎందుకు సంభవించిందంటే, అంచనా వేసిన అర్హులైన రైతుల సంఖ్యకు, వాస్తవంగా పథకం కోసం నమోదు చేసుకున్న రైతుల సంఖ్యకు మధ్య భారీ తేడా ఉండటంతో పాటు, 2019 ఫిబ్రవరి-మార్చి ఎన్నికల సమయంలో కొన్ని చెల్లింపులను నిలిపేశారు.

2. జల్ జీవన్ మిషన్ (నల్ సే జల్)
హామీ: 2024 నాటికి అన్ని ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్
2024 నాటికి అన్ని గ్రామాల్లోని ప్రతీ ఇంటికి నల్లా నీటి కనెక్షన్ (ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు-ఎఫ్‌హెచ్‌టీసీ) అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, 2009లో ఏర్పాటైన జాతీయ గ్రామీణ తాగు నీటి పథకాన్ని(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీని) పునరుద్ధరించి జల్ జీవన్ మిషన్ (జేజేఎం)లో కలిపింది.
190 మిలియన్ల కుటుంబాల్లో దాదాపు 73 శాతం అంటే 140 మిలియన్ల కుటుంబాలకు ఇప్పుడు నల్లా నీటి కనెక్షన్ ఉంది.
2019లో కేవలం 16.80 శాతం కుటుంబాలకు మాత్రమే నల్లా నీటి కనెక్షన్ ఉండేది. కాబట్టి దీన్ని నల్లా కనెక్షన్లలో వచ్చిన గణనీయ పెరుగుదలగా చూడొచ్చు.
అత్యల్పంగా కుళాయి కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ (41 శాతం) ఉంది. ఆ తర్వాత రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 50 శాతం చొప్పున నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గోవా, హరియాణా, తెలంగాణ, గుజరాత్, పంజాబ్‌లలో 100 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు అందాయి.
ఈ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2024 జనవరి నాటికి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశాయి. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం నిధుల్ని పెంచడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా పెరిగింది.
ఉదాహరణకు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం నిధుల్లో రాష్ట్రాల వాటా 40 శాతం కాగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 44 శాతానికి పెరిగింది.
అయినప్పటికీ, ఇంకా 5 కోట్లకు పైగా ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదు. జల్ జీవన్ మిషన్ కింద ఏటా సగటున దాదాపు 2 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు అయ్యాయి.
2019-20లో అత్యధికంగా దాదాపు 3.2 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు.

ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 2023-24 చివరి నాటికి అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు అందుతాయో లేదో తెలుసుకోవడానికి, కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్న వేగాన్ని అంచనా వేయడానికి మేం ప్రతి ఏడాదిలో కనెక్షన్ల పెరుగుదల శాతాన్ని పరిశీలించాం.
మునుపటి ఏడాది కంటే 2022-23లో 15 శాతం (2 కోట్ల నుంచి 2.33 కోట్ల కుటుంబాలకు) పెరిగింది. అయితే, 2023-24 నాటికి ఈ వేగం 6 శాతానికి పడిపోయింది. అంటే ఈ ఏడాదిలో నల్లా కనెక్షన్లు ఇచ్చిన గృహాల సంఖ్య 2.48 కోట్లకు పెరిగింది.
అంటే కేవలం 15 లక్షల ఇళ్లకు మాత్రమే కొత్తగా కనెక్షన్లు అందించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 80 శాతానికి పైగా కుటుంబాలు కనెక్షన్లను కలిగి ఉండాలని డేటా సూచిస్తోంది.

3. బేటీ బచావో బేటీ పడావో
హామీ: ఆడపిల్లల మనుగడ, వారి భద్రతను నిర్ధారించడం. ఆడపిల్లల విలువను పెంపొందించడం, విద్యలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం.
లింగ వివక్షను నిరోధించి, మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2015లో బేటీ బచావో, బేటీ పడావో (ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
మొదట ఈ కార్యక్రమానికి రూ. 100 కోట్లను కేటాయించారు. తర్వాత 2017-18లో ఈ బడ్జెట్‌ను రూ. 200 కోట్లకు పెంచారు.
ఇందులో దాదాపు 84 శాతం నిధుల్ని అంటే రూ. 164 కోట్లను మీడియా, ప్రచార కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది.
తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం మొత్తం వ్యయం తగ్గినప్పటికీ, 2018 నుంచి 2022 మధ్య 40 శాతం నిధుల్ని మీడియా, ప్రచార కార్యక్రమాల కోసమే కేటాయించారు.
ఈ పథకం ఆడపిల్లల విద్యపై కూడా దృష్టి సారిస్తుంది.
దీన్ని అంచనా వేయడానికి మేం బాలికల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్)ను పరిశీలించగా సానుకూల ఫలితాలు కనిపించాయి.
2016-17లో బాలికల జీఈఆర్ (23.8) బాలుర (24.3) కంటే తక్కువ ఉండగా, 2020-21 నాటికి బాలుర నిష్పత్తి (27.3)ని అధిగమించి 27.9కి పెరిగింది.
అలాగే, సెకండరీ పాఠశాలల్లో బాలికలు చదువు మానేసే రేటు కూడా తగ్గింది.
ఈ రేటు 2018-19లో 17.1 గా ఉండగా, 2020-21 నాటికి 12.3కు పడిపోయింది. బాలుర డ్రాపౌట్ రేటు (13)తో పోలిస్తే ఇది తక్కువ.

4. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)
హామీ: రైతులందరికీ నష్ట పరిహారం, బీమా అందించడం
ప్రకృతి విపత్తులు, చీడపీడలు, వ్యాధుల కారణంగా పంట నష్టాన్ని ఎదుర్కొంటున్న రైతులందరికీ బీమా, ఆర్థిక సహాయం అందించేందుకు 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా గ్రాస్ క్రాప్డ్ ఏరియా (జీసీఏ), రుణం పొందలేని రైతులు ఇందులో నమోదు అయ్యారు.
తాజా గణాంకాల ప్రకారం, రైతులు చెల్లించిన రూ. 30,800 కోట్ల ప్రీమియానికి, తిరిగి రూ.1,50,589 కోట్లను ఈ స్కీమ్ కింద రైతులకు అందించారు.
అదే విధంగా 2018-19లో 577 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు 2021-22 నాటికి 827.3 లక్షలకు పెరిగినట్లు డేటా సూచిస్తోంది.
అయితే, బీమా చేసిన భూమి విస్తీర్ణం 525 లక్షల హెక్టార్ల నుంచి 2021-22 నాటికి 456 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. తమ రాష్ట్రాల్లో అమలవుతున్న పంట సహాయ కార్యక్రమాల్లో చేరేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం నుంచి వైదొలగడమే ఇందుకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇంకా చెల్లించాల్సిన పెండింగ్ క్లెయిమ్‌ల విషయంలో రాజస్థాన్, మహారాష్ట్ర ముందున్నాయి.
2021-22 నాటికి చెందిన 430 కోట్ల రూపాయల విలువైన క్లెయిమ్‌లను రాజస్థాన్, 443 కోట్ల రూపాయల క్లెయిమ్‌లను మహారాష్ట్ర చెల్లించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














