మేఘా నుంచి రూ. 110 కోట్ల విరాళం తీసుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేయగలదా?

ఫొటో సోర్స్, congress party
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల బాండ్ల విషయంలో మేఘా ఏ పార్టీకి ఎంత ఇచ్చిందన్న స్పష్టమైన లెక్క బయటకు వచ్చింది.
మేఘా ఇంజినీరింగ్, వెస్టర్న్ యూపీ పవర్ – ఈ రెండు కంపెనీలు కలపి దేశంలోని 9 రాజకీయ పార్టీలకు అక్షరాలా రూ. 1,186 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చాయి.
ఇందులో బీఆర్ఎస్, బీజేపీలకు తెలంగాణ ఎన్నికల వేళతో సహా అనేక సందర్భాల్లో నిధులు ఇచ్చారు.
2021 ఏప్రిల్ 3న రూ.40 కోట్ల విలువైన 40 బాండ్లను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కొనుగోలు చేసింది.

తమిళనాడులో 2021 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు కంపెనీ కొనుగోలు చేసింది. ఆ బాండ్లు డీఎంకే పార్టీకి చేరాయి.
ఆ ఎన్నికలలో డీఎంకే విజయం సాధించి, తమిళనాడులో అధికారం చేపట్టింది. ఇతర సందర్భాల్లో కూడా డీఎంకేకి విరాళాలు ఇచ్చింది మేఘా.

ఫొటో సోర్స్, I&PR TELANGANA
ఆరోపణల వరకే పరిమితమైన పార్టీలు
కాంగ్రెస్‌కి ఇచ్చిన విరాళంలో సింహభాగం, అంటే రూ. 128 కోట్లలో రూ. 110 కోట్లు కేవలం తెలంగాణ ఎన్నికల ముందు అంటే 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లోనే మేఘా గ్రూపు ఇచ్చింది.
ఆ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ, అయితే అదే ప్రాజెక్టులో ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉంది ఈ మేఘా సంస్థ. మరి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు కాళేశ్వరంపై విచారణ జరుగుతుందా?.
అటు బీజేపీ కూడా కాళేశ్వరంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి వరంగా మారిందని ఆరోపించింది. దానిపై సీబీఐ విచారణ వేయించాలని కాంగ్రెస్ పార్టీని తరచూ డిమాండ్ చేసింది.
అయితే, తెలంగాణ-కర్ణాటక ఎన్నికల సమయంలోనే మేఘా నుంచి బీజేపీ సుమారు రూ. 450 కోట్లు విలువజేసే బాండ్లు తీసుకుంది.

ఫొటో సోర్స్, MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LTD/FACEBOOK
ఎదుగుదల ఎలా ఉంది?
తెలంగాణలోని మూడు పెద్ద పార్టీలకూ భారీ విరాళం ఇచ్చిన ఆ మేఘా ఇంజినీరింగ్ చరితం మామూలుది కాదు. కేవలం దశాబ్ద కాలంలోనే కనీవినీ ఎరుగని వేగంతో మేఘా విస్తరించింది. మేఘా పెరుగుదల వేగం అదానీలతో పోల్చదగినది.
మేఘా ఇంజినీరింగ్ ఆంధ్ర, తెలంగాణల్లో పలు కాంట్రాక్టులు చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన పిచ్చిరెడ్డి, ఆయన మేనల్లుడు కృష్ణా రెడ్డిలు ఈ సంస్థ యజమానులు.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని షార్ట్ ఫామ్‌లో meil అని పిలుస్తారు.
చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ, ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కువగా చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, లక్ష కోట్ల విలువైన, ప్రపంచంలోనే పెద్దదైనదిగా చెబుతున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈ కంపెనీనే నిర్మించింది.
రూ.14 వేల కోట్ల విలువైన మహారాష్ట్రలోని థానే-బొరివాలీ జంట టన్నెల్స్ ప్రాజెక్టు కూడా మేఘా చేతుల్లోనే ఉంది.
సాగునీరు, రవాణా, పవర్.. ఇలా రకరకాల వ్యాపారాల్లో ఆ సంస్థ ఉంది. దాదాపు 15 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు ఉన్నట్టు ఆ సంస్థ చెప్పుకుంది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ కూడా వీరిదే.
బర్గుండీ ప్రైవేట్, హురూన్ ఇండియా అనే రేటింగ్ సంస్థల ప్రకారం, స్టాక్ మార్కెట్లో లిస్టు కాని, భారతదేశపు టాప్ 10 మోస్ట్ వేల్యుబుల్ కంపెనీలలో మూడో స్థానంలో ఉంది మేఘా.
అలాగే బయటి పెట్టుబడులు లేని, అంటే బూట్ స్ట్రాప్డ్ కంపెనీలో దేశంలో రెండో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, PPREDDYOFFICIAL/INSTA
రైతు కుటుంబం నుంచి..
రైతు కుటుంబం నుంచి వచ్చిన పామిరెడ్డి పిచ్చి రెడ్డి, 1989లో హైదరాబాద్‌లో ఈ సంస్థను ప్రారంభించారు.
కొంతకాలం తరువాత ఆయన మేనల్లుడు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి ఆ సంస్థలో చేరి ఎండీగా ఎదిగారు.
పది మంది కంటే తక్కువ మందితో మొదలైన ఈ సంస్థ గత పదేళ్లలో బాగా విస్తరించింది. మేఘా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌గా మొదలై, 2006లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మారింది.
మేఘా కంపెనీ మొదట హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రారంభంలో పైప్ లైన్లు వేసే పనులు ఎక్కువ చేసేవారు.
సబ్ కాంట్రాక్టులు కూడా చేశారు. 2014 తరువాత మేఘా కంపెనీ ప్రస్థానమే మారిపోయింది.
ఇప్పుడు ఆ సంస్థ ఆంధ్ర, తెలంగాణలే కాకుండా ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేపడుతోంది.
ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితులుగా మేఘా కృష్ణా రెడ్డి పేరు సంపాదించారు.
ఇప్పుడు బీజేపీతో కూడా ఆయన సన్నిహితంగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌తోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు.
ఫోర్బ్స్‌లోనూ చోటు..
2023 ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో పిచ్చి రెడ్డి, కృష్ణా రెడ్డి ఉమ్మడిగా చోటు సంపాదించుకున్నారు.
వారి నెట్‌వర్త్‌ను 4.05 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.
దేశంలోని ధనవంతుల్లో వారు 54వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది.
‘‘వీరు తెలంగాణలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సివిల్ వర్క్స్ చేశారు. ఎక్కడ చూసినా మేఘా వారి కాంట్రాక్టు వర్కులే కనిపించేవి. 2014 తరువాత వీరి వ్యాపారం బాగా పెరిగింది. బీఆర్ఎస్‌కి దగ్గరయ్యారు. అన్ని పార్టీలతోనూ స్నేహంగా ఉంటారు. ఆయా పార్టీలకు, పెద్ద నాయకులకు ఆర్థికంగా సహాయపడతారని పేరుంది. ఆ క్రమంలోనే బీజేపీకి కూడా దగ్గరై దేశమంతా విస్తరించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని స్థాయిలో వారి వ్యాపారం పెరిగిపోయింది. అదే స్థాయిలో ఆరోపణలూ ఉన్నాయి. కాళేశ్వరం విషయంలో కాగ్ నివేదిక పరిశీలించొచ్చు. ఎక్కువ పనులు సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం, రివైజ్డ్ ఎస్టిమేషన్లను పెద్ద సంఖ్యలో ఇవ్వడం వల్ల వీరు ఎక్కువ లాభాలు పొందారని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతుంటారు. వాళ్లిచ్చిన బాండ్లలో కూడా ఎక్కువ భాగం, బీజేపీ బీఆర్ఎస్‌లకే వెళ్లి ఉండొచ్చు. వైఎస్ హయాంలో మేఘా కేవలం వందల కోట్ల టర్నోవర్‌గా ఉండేది. గతంలో ఈ సంస్థ జీఎస్టీ చెల్లింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా ప్రభుత్వాల అండదండలతో వీరు ఎదిగారు’’ అని స్వేచ్ఛ అనే స్వతంత్ర ఈ-పేపర్ నడుపుతున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దేవేంద్ర రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఐటీ, ఈడీ రైడ్స్..
2019 అక్టోబర్లో ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ మేఘా గ్రూపులో సోదాలు నిర్వహించింది. ఈడీ కూడా విచారణ జరిపింది.
హైదరాబాద్‌తో పాటూ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఆ సోదాల తరువాత ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు బయట వార్తలు రాలేదు.
తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రలో పట్టిసీమ, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్‌లలో ప్రాజెక్టులు చేపట్టింది.
ఈ సంస్థ విద్యుత్, నీటి పారుదల, మౌలిక వసతులకు సంబంధించి వ్యాపారాల్లో ఉంది. దేశంలోని పెద్ద నెట్ వర్క్ గ్రూపుల్లో ఒకటైన టీవీ9 లో కృష్ణా రెడ్డి బంధువులు వాటాదారులుగా ఉన్నారు.
మేఘా సంస్థ ఎండీ కృష్ణా రెడ్డి భార్య సుధారెడ్డి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటూ ఫ్యాషన్ రంగంలోనూ చురుగ్గా ఉంటారు.
2021లో న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఒకే ఒక భారతీయ మహిళ సుధారెడ్డి.
ఇవి కూడా చదవండి:
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














