రఘురామ్ రాజన్: ‘మోదీ హయాంలో భారత ఆర్థిక వృద్ధి రేటు చెబుతున్నంత గొప్పగా ఏమీ లేదు, మిశ్రమంగా ఉంది’

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆర్థిక వృద్ధి రేటు గురించి అతిశయోక్తులు చెబుతున్నారని, పటిష్టంగా కనిపిస్తోన్న భారత వృద్ధిరేటు మీద ఆధారపడుతూ భారత్ పెద్ద తప్పు చేస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, ఆర్థికశాస్త్ర నిపుణుడు రఘురామ్ రాజన్ అన్నారు.
భారత్ నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించుకోవాలని, అప్పుడే మరింత బలంగా ఎదగగలదని అన్నారు.
బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనాందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి రఘురామ్ రాజన్ వివరంగా చెప్పారు.
గత కొన్నేళ్లలో ప్రజలపై పెట్టుబడి పెట్టలేదని ఆయన నమ్ముతున్నారు.
“మౌలిక సదుపాయాల స్థాయిలో పాలసీ అమలు చాలా బలంగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేయాలనే ఆందోళనలు ఉన్నాయి. కానీ, అతిపెద్ద సవాలు, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మనం ఇంకా మానవ మూలధనాన్ని అభివృద్ధి చేసుకోలేదు. మనం ప్రజలపై పెట్టుబడులు పెట్టలేదు’’ అని రఘురామ్ రాజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
“మహమ్మారి నుంచి బయటకు వచ్చాం. కొన్ని రాష్ట్రాల్లో మినహాయించి చాలా మంది పిల్లలు చదువుల్లో వెనుకబడ్డారు. అలాంటి పిల్లలపై పెట్టుబడి పెట్టలేదు. ఆ పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకురావడంలో విఫలమయ్యాం. పోషకాహార లోపం ఇప్పటికీ 35 శాతంగా ఉంది. ఇది సబ్-సహారా ఆఫ్రికాలోని చాలా దేశాల కంటే ఎక్కువ. ఎంతమాత్రం ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని ఆయన అన్నారు.
కానీ, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఇది అత్యుత్తమ దశాబ్దమని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ విధంగా ప్రదర్శిస్తోంది.
ఈ అంశంపై రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, "గణాంకాలు వేరేలా ఉన్నాయి. మనం ఏడు, ఏడున్నర శాతం చొప్పున వృద్ధి చెందుతున్నామని గణాంకాలు చెబుతున్నాయి. మహమ్మారి ముందు పరిస్థితి కంటే నాలుగైదు శాతం మనం వెనుకబడి ఉన్నాం. నిరుద్యోగుల లెక్కలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా మీకు అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి లెక్కలు చూస్తే, కోటి 20 లక్షల మంది రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా మిశ్రమ పరిస్థితికి సంకేతం. మంచి జరిగింది కానీ పరిస్థితులు మరీ అంత బాగా ఏమీ లేవు’’ అని వివరించారు.
షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన రఘురామ్ రాజన్, బ్లూమ్‌బెర్గ్‌కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల తర్వాత భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల విద్య, నైపుణ్యాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
"140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది. అతిశయోక్తి వాదనలను ప్రజలు నమ్మడం పెద్ద తప్పు. ఈ అతిశయోక్తి వాదనలను ప్రజలు నమ్మాలని రాజకీయ నాయకులు కోరుకుంటారు’’ అని రాజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘‘మోదీ లక్ష్యం నెరవేరదు’’
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రఘురామ్ రాజన్ ఈ లక్ష్యాన్ని ఖండించారు.
పెద్ద సంఖ్యలో భారతీయ పిల్లలు ఉన్నత విద్యను పొందలేకపోతున్నారని, డ్రాపౌట్ రేటు చాలా ఎక్కువగా ఉన్నందున మోదీ అనుకున్న ఈ లక్ష్యం నెరవేరేలా కనిపించట్లేదని రాజన్ అన్నారు.
‘‘మన శ్రామిక శక్తి పెరుగుతోంది. మంచి ఉపాధిని కల్పించినప్పుడే శ్రామికశక్తి ప్రయోజనాలను అనుభవించవచ్చు. భారత్ చేయాల్సిన అతిముఖ్యమైన పని ఏంటంటే శ్రామిక శక్తికి ఉపాధి కల్పించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం’’ అని రఘురామ్ రాజన్ చెప్పారు.
వియత్నాం వంటి ఆసియా దేశాల కంటే భారత్ అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ‘‘ఇలాంటి గణాంకాలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి. మానవ వనరుల్లో నాణ్యత లోపించడం మనల్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తుంది.
8 శాతం సుస్థిర వృద్ధిరేటును సాధించేందుకు భారత్ ఇంకా చాలా చేయాల్సి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న అంచనాలను ఈ గణాంకాలు నిరాశపరుస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చిప్‌ల తయారీ కంటే ఉన్నత విద్య ఉత్తమం
భారత్‌లో జరుగుతున్న వేగవంతమైన విస్తరణను సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుంది.
ఉన్నత విద్యకు వార్షిక బడ్జెట్‌ను పెంచకుండా చిప్‌ల తయారీలో రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని, ఇది తప్పుడు మార్గమని రఘురామ్ రాజన్ అన్నారు.
భారత్‌లో సెమీ కండక్టర్ వ్యాపారాన్ని నిర్వహించడానికి రూ. 760 కోట్ల సబ్సిడీని అందించారు. ఉన్నత విద్య కోసం బడ్జెట్‌లో రూ. 476 కోట్లు కేటాయించారు.
విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికంటే చిప్‌ల తయారీ వంటి ఉన్నత స్థాయి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తుందని రాజన్ అన్నారు. ఈ పరిశ్రమల కోసం శిక్షణ పొందిన ఇంజినీర్లను తయారు చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు పెంచాలనే సూచన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత విధానాల గురించి రఘురామ్ రాజన్ తరచుగా బహిరంగంగా మాట్లాడతారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీకాలం 2016లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తిరిగి బోధనా వృత్తిలోకి వెళ్లారు. షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ఆయన సహరచయితగా ఉన్న 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది. భారత్ అభివృద్ధికి సంబంధించిన తన అభిప్రాయాలను ఆయన లింక్డిన్‌లో వీడియోల ద్వారా పంచుకున్నారు.
విద్యను మెరుగుపరచడమే కాకుండా, అసమానతలను తగ్గించడం, కార్మిక ఆధారిత ఉత్పత్తిని పెంచడం వంటి అనేక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
భారత పాలక వ్యవస్థ కేంద్రీకృతమైనదని, రాష్ట్రాలకు అధికార వికేంద్రీకరణ జరగడం అనేది అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.
మనకు ‘‘ప్రాక్టికల్ అప్రోచ్ అవసరం ఉందని’ ఆయన చెప్పారు.
చైనా మాజీ నాయకుడు డెంగ్ జియావోపింగ్ మాటలను రఘురామ్ రాజన్ ఉటంకించారు. చైనా నుంచి భారత్ ఏదైనా నేర్చుకోగలిగితే, పిల్లి నల్లగా ఉందా, తెల్లగా ఉందా అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అది ఎలుకను పట్టుకుంటుందా లేదా అనేది చూడాలని అన్నారు.
చైనా ఆర్థిక పునరుజ్జీవనానికి డెంగ్ జియావోపింగ్‌ను నాయకుడిగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ ప్రభుత్వంపై విమర్శలు
మోదీ ప్రభుత్వాన్ని రఘురామ్ రాజన్ టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా మోదీ ప్రభుత్వం ఆధిపత్య, నిరంకుశ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
ఆధిపత్య ధోరణులు, నిరంకుశత్వం అనేవి దేశాన్ని అంధకారంలోకి తీసుకువెళతాయని, అస్థిరత పెరుగుతుందని 2019 అక్టోబర్‌లో రాజన్ అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నిలకడగా లేదని, లాటిన్ అమెరికా దేశాల మాదిరిగా మారే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నోట్ల రద్దు, జీఎస్టీలే కారణమని ఆయన ఆరోపించారు.
రఘురామ్ రాజన్, ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త కూడా.
మోదీ ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్రీకృతం కావడమే భారత ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకు కారణమని రాజన్ ఆరోపించారు.
‘‘మోదీ తొలి పదవీకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు చేయలేదు. అప్పుడు అధికారాలన్నీ ఒకేచోట కేంద్రీకృతంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదు. మంత్రుల వద్ద అధికరాలు లేవు. బ్యూరోక్రాట్లు నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడారు. సంస్కరణలు చేసే ఆలోచనే లేదు.
ఎలాంటి ఆధారాలు లేకుండా సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విచారణ లేకుండానే మాజీ ఆర్థిక మంత్రిని వారాల పాటు జైల్లో ఉంచడం బాధాకరం. సంస్థలు బలహీనంగా మారడం వల్ల ప్రభుత్వాలన్నీ నిరంకుశంగా మారే అవకాశం ఉంది. 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 2019లో మోదీ హయాంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది’’ అని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందా, ప్రపంచం మీద ప్రభావం ఏంటి? 5 కీలక పరిణామాలు
- మిషన్ కనెక్ట్ పాడేరు: వేయని రోడ్డుకు రూ.65 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు...బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














