రాహుల్ గాంధీ: ఓ బ్రాండ్‌గా మారగలిగారా? (COPY)

రాహుల్ గాంధీ: ఓ బ్రాండ్‌గా మారగలిగారా?

ఫైసల్ మొహమ్మద్ అలీ

బీబీసీ ప్రతినిధి

చలి తగ్గుముఖం పడుతుండగా దేశంలో మొదలైన ఎన్నికల సందడి రాజకీయ వేడిని పెంచుతోంది. ఒకవైపు ఎన్డీయే రోజురోజుకూ బలపడుతున్నట్లు కనిపిస్తుంటే, మరోవైపు విపక్షాల కూటమి- ‘ఇండియా’ విచ్ఛిన్నం అవుతోందనే చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోరు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని అధికార బీజేపీకి, 50లోపు పార్లమెంట్ స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి మధ్యే కనిపిస్తోంది.

ప్రధాని మోదీ తన రాజకీయ ప్రసంగాలలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీల పైనే ప్రధానంగా దృష్టి సారించడానికి బహుశా ఇదే  కారణం కావచ్చు.

ఎప్పటిలాగే మోదీ రాహుల్ గాంధీని ‘యువరాజు’ అని సంబోధించారు. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఒక నాయకుడి స్థాయికి తీసుకురాలేకపోయారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ, ఆయన పార్టీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీని లక్ష్యంగాచేసుకుని, ఆయనకు ఒక నిర్దిష్టమైన ఇమేజ్‌ను అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా చేయడానికి కారణం ఏమిటన్నదే ప్రశ్న?

బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇప్పటికీ రెండో అతిపెద్ద పార్టీగా ఉండడం దానికి ఒక కారణం కావచ్చు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకున్నా, దాదాపు 20 శాతం ఓట్లను సాధించింది.

కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాహుల్ గాంధీపై నిరంతరం జరుగుతున్న రాజకీయ దాడులపై వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు.

“ఇప్పుడు దేశం, దేశంలోని పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న కొద్దిమంది నాయకులలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన బీజేపీకి సవాలు విసురుతున్నారు. అందుకే ఆ పార్టీ ఆయనను లక్ష్యంగా చేసుకుంది’’

బ్రాండ్ గురు సందీప్ గోయల్ ఏమన్నారంటే..

‘రాహుల్ గాంధీ ఏదో ఓ పనిని బాగా చేస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ పోటీలో ఉండటానికి బ్రాండ్ రాహుల్ఒక ప్రధాన కారణం

సందీప్ గోయల్ ముంబయి నుంచి బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

"నరేంద్ర మోదీతో పోలిస్తే రాహుల్ బ్రాండ్ చిన్నది" అని ఆయన అన్నారు

నరేంద్ర మోదీ నుంచి బ్రాండ్ మోదీ వరకు

కానీ, "సమకాలీన రాజకీయాల్లో మోదీని సవాలు చేసేంత బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా?" అని ఆయన ప్రశ్నించారు.

తారిఖ్ అన్వర్ లేదా సందీప్ గోయల్ వాదనలను మనం అంగీకరిస్తే, బీజేపీని రాహుల్ గాంధీ ఎలా సవాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నదే ప్రశ్న?

ప్రధాని మోదీ ఆశ్చర్యపోయిన వేళ

దాదాపు ఆరేళ్ల క్రితం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ:

మీకు నాపై ద్వేషం, కోపం ఉన్నాయి. మీరు నన్ను పప్పుఅంటారు. మీరు నన్ను దుర్భాషలాడొచ్చు. కానీ, నేను కాంగ్రెస్‌కు చెందిన వాడిని. అందుకే, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. ఇక్కడున్న వాళ్లంతా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ పార్టీ, ఈ సెంటిమెంట్ రెండూ ఈ దేశాన్ని నిర్మించాయి’’ అని అన్నారు.

తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం రాహుల్ గాంధీ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు.

సామాజిక శాస్త్రవేత్త, శివ్ విశ్వనాథన్ ఆ సంఘటనను 'చరిత్ర పునరావృతం'గా పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకులు ముఖ్యమైన సమయంలో తమ విభేదాలను పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, అటల్ బిహారీ వాజ్‌పేయి సోనియా గాంధీని చాలా గౌరవించేవారు. రాహుల్ గాంధీ ఇవాళ ఆ చరిత్రను గుర్తు చేశారు. మోదీ చరిత్రను అర్థం చేసుకోవాలని ఇది మనకు తెలియజేస్తోందని’’ ఆయనఅన్నారు.

అయితే, ఆ తర్వాత నరేంద్ర మోదీ తన ప్రసంగంలో, ఆ సంఘటనను రాహుల్ గాంధీని విమర్శించడంలో భాగంగా వర్ణించారు.

‘సామరస్య భావన’

బీజేపీ రాజకీయ ప్రచారంలో జాతీయ భద్రత, జాతీయవాదం, ప్రత్యేకించి సాంస్కృతిక జాతీయవాదం అన్నవి ప్రధానాంశంగా ఉన్నాయి.

దీనిని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ ప్రేమను వ్యాప్తి చేయడమే తన లక్ష్యమంటూ - ‘యే ప్యార్ కి దుకాణ్, ఇదొక భావజాల యుద్ధం,’ అని చెప్పడం మనం చూస్తున్నాము.

దీని ద్వారా ఆయన జాతీయవాదం, భారతీయ సంస్కృతిని నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు భావిస్తున్నారు.

ఆయన ఇటీవల చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’, ‘భారత్ న్యాయ్ యాత్ర’ల రెండింటి వెనుక ఉన్న ఆలోచన ఇదే అనేది వారి అభిప్రాయం. 

డిసెంబర్‌లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

"ఇది అధికారం కోసం చేస్తున్న రాజకీయ యుద్ధం అని ప్రజలు అనుకుంటారు, కానీ ఈ యుద్ధం ఒక సిద్ధాంతంపై ఆధారపడింది," అన్నారు.

ప్రేమను పంచండి కానీ...

రాహుల్ గాంధీ తన పార్టీనిసెక్యులర్‌గాను, 'బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వంటి విద్వేషపూరిత శక్తులకు' వ్యతిరేకంగా పోరాడుతున్నదిగానూ పరిగణిస్తారు.

తన భావజాలం ప్రేమను వ్యాప్తి చేయడాన్ని విశ్వసిస్తుందని, అందుకోసం తాను ప్రేమ దుకాణంతెరిచానని రాహుల్ గాంధీ అంటారు.
ఆయన ఇంకా ఏమంటారంటే..

“నేను ద్వేషపు మార్కెట్‌లో ‘ప్రేమ దుకాణం’ తెరుస్తున్నాను. మీరు నన్ను దుర్భాషలాడొచ్చు లేదా ద్వేషించొచ్చు. అది మీ ఇష్టం. మీది ద్వేషపు మార్కెట్‌ అయితే, నాది ప్రేమ దుకాణం. అంతే కాకుండా, నేను నా గురించి మాత్రమే మాట్లాడటం లేదు’’ అన్నారు.

దానితో పాటు

‘‘రాహుల్ గాంధీ మాత్రమే ఇలా అంటున్నారని అనుకోవద్దు. ఈ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్‌లాంటి వ్యక్తులు అందరూ 'ప్రేమ దుకాణం' ఏర్పాటు చేశారు, మేమూ అదే చేస్తున్నాము’’ అని చెబుతారు.

ప్రేమ దుకాణం తెరవాలని ఆయన బీజేపీనీ  ఆహ్వానించారు.

అయితే, రాహుల్ గాంధీ ప్రేమ దుకాణాన్ని బీజేపీ 'రాజవంశ సంస్కృతి, బంధుప్రీతి, ద్వేషం, కులతత్వాలను విక్రయించే విద్వేషాల మాల్' అని అభివర్ణించింది.

భారతదేశపు పునాదికి సూత్రాలు ఇవేనని రాహుల్ గాంధీ భావిస్తున్నారని ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల వ్యూహకర్త, జన్‌స్వరాజ్ అభియాన్ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్రసమయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

"రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యాలయం(దిల్లీ)లో ఉండాల్సిన సమయంలో, యాత్ర చేయడం సరైనది  కాదు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

జనతాదళ్ (యునైటెడ్) ప్రధాన కార్యదర్శి కె. సి. త్యాగి,

లౌకికవాదం అంటే కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ను తిట్టడం, ముస్లింలను మభ్యపెట్టడం కాదు. ఇది స్వాతంత్ర్య ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన సంపూర్ణ ప్రక్రియ,’’ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ,

"దీనిని నమ్మాలంటే ఆచరణ అవసరం, ఆయన తను చెప్పేవన్నీ ఆచరించాలి" అన్నారు.

బాబ్రీ మసీదు ధ్వంసం కాకుండా కాపాడే ప్రయత్నంలో ములాయం సింగ్ భారీ వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది, మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి మాజీ ప్రధాని వీపీ సింగ్ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాని ఫలితంగా ప్రభుత్వం పడిపోయినా ఆయన దానికి కట్టుపడ్డారని త్యాగి ఉదాహరణలను చూపారు.

కె.సి. త్యాగి పార్టీ కొంత కాలం క్రితం వరకు కాంగ్రెస్‌తో పాటు ఇండియా (INDIA) కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే ఇటీవల నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకోవడంతో, జేడీయూ ఎన్డీయేలో భాగమైంది. త్యాగి పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పుడు బీబీసీ ఆయనతో మాట్లాడింది. 

రాహుల్ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై దాడి చేసినా, ఆయన, ఆయన సొంత పార్టీవారు మితవాద హిందుత్వను (సాఫ్ట్ హిందుత్వ) అనుసరిస్తారని అనేక ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్: మితవాద హిందుత్వ  

రాహుల్ గాంధీ లౌకికవాదం, మితవాద హిందుత్వం గురించి చెప్పే మాటలు ఆయనకు తన తండ్రి రాజీవ్ గాంధీ నుంచి వచ్చాయని సీనియర్ జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ భావిస్తారు. రాజీవ్‌ గాంధీ ఏకకాలంలో హిందూ-ముస్లిం కార్డులను ప్రయోగించే వారని ఆయన అన్నారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన..

‘‘పేద ముస్లిం మహిళ షాబానోకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ మొదట ఒక చట్టం తెచ్చారు. ఆయన ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వచ్చినప్పుడు, దశాబ్దాలుగా తాళం వేసిన బాబ్రీ మసీదు గేట్లను తెరవడానికి అనుమతించారు,’’ అని వివరించారు.

రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించడంలోనూ ఒక వైరుధ్యం ఉందని ఖుర్బాన్ అలీ అంటారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “రాహుల్ గాంధీ ఒకవైపు సెక్యులరిజం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ని వ్యతిరేకిస్తూనే మరోవైపు గుజరాత్‌లో దేవాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆయన తనను తాను శివభక్తుడిగా, బ్రాహ్మణుడిగా చెప్పుకుంటారు. మరోవైపు కుల ఆధారిత జనగణన గురించీ మాట్లాడతారు’’ అన్నారు.

రాహుల్ గాంధీ తనను తాను దత్తాత్రేయ బ్రాహ్మణుడిగా చెప్పుకున్నది ఒక్కసారే కాదు. ఐదేళ్ల క్రితం 2019లో, పార్లమెంటరీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, అప్పుడు కాంగ్రెస్‌కు లోక్‌సభలో 44 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.

రాజస్థాన్‌లోని పుష్కర్‌లోని ఒక ఆలయంలో చుట్టూ చేరిన  హిందూ పూజారుల మధ్యన, నుదుటిపై తిలకం ధరించి, పవిత్ర గ్రంథాలను చూస్తున్న రాహుల్ గాంధీ ఫొటోను పీటీఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

ఆ తర్వాత ఒక వార్తా కథనంలో, రాహుల్ గాంధీ తన గోత్రం దత్తాత్రేయ గోత్రమని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడినని తెలిపారని, ఒక పూజారి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘బీజేపీకి ఇంకా ఎన్ని సాక్ష్యాలు కావాలి?’ అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆ ఫొటోను విడుదల చేసారు.

ఒకవైపు రాహుల్ గాంధీ కుల వివక్షను అంతం చేయడమే లక్ష్యంగా, కుల ఆధారిత జన గణనను చేపట్టడం గురించి మాట్లాడుతున్నారని, మరోవైపు తనను తాను బ్రాహ్మణుడిగా అభివర్ణించుకుంటూ కులతత్వాన్ని మరింత పెంచుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

బిహార్‌లో కుల ఆధారిత జనగణన నిర్వహించిన తర్వాత, రాహుల్ గాంధీ కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణనను నిర్వహిస్తామన్నారు.

కుల సమస్యపై రాహుల్ గాంధీ విధానంలో స్పష్టత లేకున్నా, మతతత్వంపై కూడా ఆయన, ఆయన పార్టీలు పెద్దగా మాట్లాడినట్లు కనిపించదు. 

ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్‌లో నాటి కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్ ప్రభుత్వం హిందూ-ముస్లిం మత హింస బాధితులకు పరిహారం ఇవ్వడంలో రెండు వర్గాలతో భిన్నంగా వ్యవహరించింది.

బస్తర్‌లోని గ్రామంలో తమ వాళ్ల మృతదేహాలను ఖననం చేయకుండా క్రైస్తవమతాన్ని అనుసరించే గిరిజనులనూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, హిందూ రాజ్యం ఆలోచనకు మద్దతిచ్చే వివాదాస్పద గురువు గురు ధీరేంద్రశాస్త్రి పాదాలకు నమస్కరిస్తూ కనిపించారు.

ఈ విషయాలపై రాహుల్ గాంధీ ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కాంగ్రెస్‌ ‘సరళ హిందుత్వ’వాదంపై ఆరోపణలు రావడానికి ఇవి కొన్ని కారణాలు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వామపక్షం వైపు, మితవాదం వైపు మొగ్గు చూపే చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశారని పలువురు నిపుణులు చెబుతున్నారు, అయితే అది వేరే సంగతి.

 

కార్పొరేట్ ప్రపంచం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ‘సూటు బూటు’ ప్రభుత్వం అని, ‘మోదీ ప్రభుత్వం కాదు, అదానీ-అంబానీ ప్రభుత్వం’ అని అభివర్ణిస్తుంటారు. ఇలాంటి మాటల ద్వారా రాహుల్ గాంధీ, ఈ ప్రభుత్వం ధనవంతులదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఇది రాహుల్ గాంధీ కార్పొరేట్ వ్యతిరేకి అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడింది. 

దిల్లీని ఆనుకుని ఉన్న భట్టా పర్సౌల్‌లోని రెండు గ్రామాల రైతులకు నష్టపరిహారం విషయంలోనూ, ఒడిశాలోని నియామ్‌గిరిలో మైనింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ జరిగిన ఆందోళనలోనూ రాహుల్ గాంధీ ముందున్నారు.ఈ రెండు సంఘటనలు జరిగిన సమయంలో ఆయన పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఈ రెండు కేసులు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కావు.

రాహుల్ గాంధీ 1960, 1970ల నాటి రాజకీయాలను అనుసరిస్తున్నారని ఒక కార్పొరేట్ సంస్థలో సీనియర్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి అన్నారు. భారతదేశ ఆర్థిక పురోగతికి రాహుల్ వద్ద ఎలాంటి నమూనా లేదని  ఆయన విమర్శించారు.

ముంబయికి చెందిన మరో కార్పొరేట్ హౌస్‌ సీనియర్ అధికారి, “ఈ (పోస్ట్ క్యాపిటలిస్ట్ ప్రపంచం) కాలంలో, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆకాంక్ష ఉంది. భవిష్యత్తులో భారత్‌ను ఎక్కడ చూడాలనుకుంటున్నారు అన్నదానికి రాహుల్ గాంధీ దగ్గర సమాధానాలు లేవు. నరేంద్ర మోదీ ఆ కలను సాకారం చేయగలరు’’ అన్నారు.

అనేక కార్పొరేట్ సంస్థలతో సంబంధాలు కలిగి, మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో బోధించే జయశ్రీ సుందర్ మాట్లాడుతూ, వ్యాపార సంస్థలకు రాహుల్ వైఖరిపై కొన్ని అనుమానాలు ఉండొచ్చని అన్నారు.

అయితే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం, కాంగ్రెస్‌ ధనవంతులకు వ్యతిరేకం కాదంటూ తమ పార్టీని సమర్థించుకున్నారు. “వాళ్లు ఉపాధిని సృష్టిస్తారని మాకు తెలుసు. మా పార్టీ అధికారంలో ఉన్న చోట ఆర్థిక సరళీకరణను ప్రారంభించి, దానిని ముందుకు తీసుకెళ్లాం,’’ అని దిగ్విజయ్ అన్నారు.

ఈరోజు ప్రధాని మోదీ, గౌతమ్ అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లాగే, గతంలో ధీరూభాయ్ అంబానీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ఇతరులు ప్రశ్నలు లేవనెత్తిన విషయాన్ని బీబీసీ దిగ్విజయ్ సింగ్‌కు గుర్తు చేసింది.

దీనికి దిగ్విజయ్ సింగ్ సమాధానమిస్తూ,

“డబ్బు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సంబంధించి మా విధానం ఎప్పుడూ స్పష్టంగా ఉంది, మేం వాటన్నిటి అభివృద్ధినీ కాంక్షిస్తాం’’ అన్నారు.  

కానీ, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మైనింగ్ లాబీ కారణంగానే వామపక్షాల అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు అతుల్ అంజన్ ఆరోపించారు.

కాంగ్రెస్‌లో సిద్ధాంతాలు క్షీణించాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.

"కాంగ్రెస్ నాయకులు నెహ్రూ సోషలిస్ట్ నమూనాను స్వీకరించాలా లేదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మార్కెట్ అనుకూల విధానాలను స్వీకరించాలా అనే సందిగ్ధంలో ఉన్నారు."

రాహుల్ గాంధీ

పోటీదారా, సిద్ధాంతకర్తా?

కాంగ్రెస్‌పై ‘24 అక్బర్‌ రోడ్‌అనే పుస్తకాన్ని రాసిన సీనియర్‌ జర్నలిస్టు రషీద్‌ కిద్వాయ్‌

“తన రాజకీయ వైఖరి ఏమిటో రాహుల్‌ గాంధీ నిర్ణయించుకోవాలి. ఆయన ప్రధానమంత్రి పదవికి పోటీదారుడా, లేక కేవలం పార్లమెంటు సభ్యుడా లేక తన పార్టీ సిద్ధాంతకర్త మాత్రమేనా?’’ అని ప్రశ్నించారు.

‘‘ఆయన 2014లో ప్రధానమంత్రి పదవికి పోటీదారు కాదు, ఇప్పుడూ కాదు. కానీ, ఆయన దానిని స్పష్టంగా తోసి పుచ్చడం లేదు’’ అన్నారు కిద్వాయ్.

కాంగ్రెస్ పార్టీని బాగా అర్థం చేసుకున్న కిద్వాయ్

‘‘ప్రతి బ్రాండ్‌కు అది నిర్వహించాల్సిన పాత్ర ఒకటుంటుంది. దానికో వినియోగ విలువ, ప్రయోజనం ఉంటాయి. రాహుల్ గాంధీ బ్రాండ్ ప్రయోజనం ఏమిటి? దాన్ని ఎందుకు సృష్టించారు, దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు?” అని ప్రశ్నించారు.

‘‘ఈ కాంగ్రెస్ నేత తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అక్కడికి ఎలా చేరుకోవాలో నిర్ణయించుకోవాలి. మోదీ ఒక త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడంతో పాటు, 'అందరి కోసం అభివృద్ధి, అందరితో కలిసి అభివృద్ధి' అని ప్రచారం చేసుకుంటున్నారు. దానిలో హిందువులు భారత ఆర్థికాభివృద్ధి, ప్రపంచ వేదికపై ఒక ఉన్నత స్థానంలో ఉండొచ్చు. అలాగే రాహుల్ తనకంటూ ఒక ఇమేజ్‌ను, ఒక ప్రచార నినాదాన్ని సృష్టించుకోవాలి,' అని కిద్వాయ్ రాసుకొచ్చారు.

రాహుల్ గాంధీ వద్ద వీటికి ఏం సమాధానాలు ఉన్నాయని కిద్వాయ్ ప్రశ్నిస్తారు.

బ్రాండ్ ఇమేజ్‌కు సంబంధించిన ప్రశ్న

దిల్లీ యూనివర్శిటీకి చెందిన మేనేజ్‌మెంట్ స్కూల్ ప్రొఫెసర్ హర్ష్ వర్మ మాట్లాడుతూ, “ప్రతి బ్రాండ్‌కు దాని సొంత గుర్తింపు, ఇమేజ్ ఉంటాయి. ఉదాహరణకు, ఒక కస్టమర్‌కు క్లోజ్ అప్ టూత్‌పేస్ట్‌ అంటే తాజాదనమని లేదా లక్స్ సబ్బు అంటే అందమని దానితో ఒక సంబంధం ఉంటుంది,’’ అన్నారు.

రాహుల్ గాంధీలోని అస్థిరత గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ వర్మ,

“ఒకరోజు ఆయన రైతులతో కనిపిస్తారు, ఆ తర్వాత ఆయన గిరిజనుల గురించి మాట్లాడతారు, కొన్ని రోజుల తర్వాత కుల ఆధారిత జన గణన చేపడతామని అంటారు. ఆయన ఒకే సమస్య మీద ఎక్కువ కాలం ఉండరు. కుల ఆధారిత జనగణన వంటి అనేక అంశాలు నిజానికి ఆయనవి కావు. నిజానికి వాటిని లేవనెత్తింది వి.పి. సింగ్, ములాయం సింగ్, లాలూ యాదవ్. ఆయన చేస్తున్నదల్లా తిరిగి ఆ సమస్యలను లేవనెత్తడమే,’’ అని వివరించారు.

రాహుల్ గాంధీ దీర్ఘకాలం పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం నేర్చుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ అన్నారు. అయితే దీనికి బాధ్యత రాహుల్ గాంధీది కాదని, కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. 


గత ఏడాది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి చర్చిస్తూ వినోద్ శర్మ, “రాహుల్ గాంధీ తన 4500 కిలోమీటర్ల పాదయాత్రలో ఎవరెవరిని కలవాలో పార్టీ ప్లాన్ చేసిందా? ఆయన పాదయాత్ర ముగిశాక ఇతర పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ప్రజలను కలిశారా, వాళ్లు పాదయాత్ర గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి, ఆ సందేశాన్ని జనంలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారా? పాదయాత్ర తర్వాత వాళ్లు చేయాల్సిన పనులు చేశారా?" అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఆ యాత్రలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక స్థూపాన్నీ సందర్శించారు, లాలూ యాదవ్ ఇంట్లో మాంసాన్నీ వండారు. అయితే ఆయన మీడియా బృందం ఈ సంఘటనలకు సంబంధించిన ప్రతీకాత్మక అంశాలను జనంలోకి తీసుకు పోవడంలో విఫలమైంది.

తన యుద్ధం వ్యక్తిగత పోరాటం కాదని, భావజాలానికి సంబంధించినదని రాహుల్ గాంధీ చెబుతుంటారు. అందువల్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో రాహుల్ గాంధీ మాంసం వండిన సన్నివేశం నిజానికి ఒక బలమైన సంకేతంగా మారి ఉండేది. ముఖ్యంగా, చాలామంది ముస్లింలను వారి ఆహార ఎంపిక ఆధారంగా హత్య చేసిన సందర్భంలో అదొక శక్తిమంతమైన ప్రతీక అయ్యేది. కానీ, దీన్ని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.

కానీ, అదే ఘటనను బీజేపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకుంది. నిజమైన హిందువులు పవిత్రమైన శ్రావణ మాసంలో మాంసాహారం తినడం గురించి ఎలా ఆలోచిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా ప్రశ్నించారు. జంధ్యం ధరించే బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ శ్రావణ మాసంలో మాంసం ఎలా తింటారని బీజేపీ నేత సంబిత్ పాత్ర ప్రశ్నించారు.

బీజేపీని భయపెడుతున్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు 2012-2013 నుండి బీజేపీతో సంబంధాలున్న నెట్‌వర్క్ మొత్తం నరేంద్ర మోదీని గొప్పగా చేసి చూపుతోందని కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ రాజకీయ ప్రత్యర్థులు ఆయనకు ఒక నిర్దుష్టమైన ఇమేజ్‌ను అంటగట్టడంలో చాలా వరకు విజయం సాధించారనేది నిజం.

తన ఇటీవలి పాదయాత్ర తర్వాత, రాహుల్ గాంధీకి ఆపాదించిన లక్షణాలు అబద్ధమని సాధారణ ప్రజలు గ్రహిస్తున్నారని తారిఖ్ అన్వర్ చెప్పారు.

రాహుల్ గాంధీ ఒక బ్రాండ్ అని, ఆ బ్రాండ్ వల్ల తమకు ముప్పు ఉందని భావించిన ప్రత్యర్థులు ఆయన ఇమేజ్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశారని సింగపూర్‌కు చెందిన అడ్వర్టైజింగ్ కంపెనీ కాంప్ ఇన్‌ఫార్మో ఇండియా రీజియన్ డైరెక్టర్ అనిల్ ఎల్హామ్ చెప్పారు

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన

"రాహుల్ గాంధీ గురించి అనేక చెడ్డ విషయాలను ప్రచారం చేసినా, యువతలో చాలా మంది రాహుల్ గాంధీతో కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది" అని అన్నారు.

బెంగుళూరుకు చెందిన అనిల్ ఎల్హామ్, తెలంగాణ, కర్ణాటకలలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి పని చేశారు.

భారతదేశంలో చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఒక భిన్నమైన మార్పు కోసం వేచి చూస్తున్నారు. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని ప్రజలు భావిస్తున్నట్లు జయశ్రీ సుందర్ అన్నారు.

దమ్మున్న నేత

కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ ఇలా చెప్పారు

“రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మొదలు పెట్టినప్పుడు ఆయన దానిని పూర్తి చేయలేరని చాలా మంది అన్నారు. భారీ వర్షాలు, చలిలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా ఆయన తన లక్ష్యాన్ని సాధించగలనని నిరూపించారు,’’

'స్ట్రేంజ్ బర్డెన్స్: ది పాలిటిక్స్ అండ్ ప్రొడికామెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ' పుస్తక రచయిత సుగతా శ్రీనివాస్ రాజు తన పుస్తకంలో, “రాహుల్ గాంధీతో సెల్ఫీలు తీసుకుంటున్న వ్యక్తులు, తనను తాను ఫకీర్ అని పిలుచుకునే ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీలు దిగిన వాళ్లకు చాలా భిన్నంగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ ఫొటోలలో ఫోకస్ మొత్తం నరేంద్ర మోదీపైనే ఉంటుంది. ఫ్రేమ్‌లో ఆయన ఒక్కరే వేర్వేరు డ్రెస్‌లు ధరించి, రకరకాల మూడ్‌లను ప్రదర్శిస్తూ కనిపిస్తారు. ఎవరైనా పొరపాటున ఫ్రేమ్‌లోకి ప్రవేశిస్తే వెంటనే వాళ్లను తీసేస్తారు’’ అని రాశారు.

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఎవరికైనా ఒక గుర్తింపు ఉంటుందని, వాళ్లు రాహుల్ గాంధీతో దిగిన సెల్ఫీని తమ ఇంటి గోడపై పెట్టుకోవచ్చని సుగతా శ్రీనివాస్ రాజు చెప్పారు. మరోవైపు నరేంద్ర మోదీ ఫొటోలకు, దేవుళ్లు, దేవతల ఫొటో ఫ్రేమ్‌ల మధ్య మాత్రమే స్థానం ఉంటుంది.

పౌరుషానికి భిన్నమైన చిహ్నం

53 ఏళ్ల రాహుల్ గాంధీ ఇమేజ్ ‘56 అంగుళాల ఛాతీ’ కథనానికి భిన్నంగా కనిపిస్తుంది.

రచయిత్రి, చిత్ర నిర్మాత పరోమితా వోహ్రా  ఏం రాశారంటే:

“భారత్ జోడో యాత్ర వీడియోలు పౌరుషత్వానికి భిన్నమైన నిర్వచనాన్ని ఇచ్చాయి. ఇది ప్రజలు తన ముందు సాగిలపడాలని కోరుకునే అధికారపు పౌరుషం కాదు. ఇది నిష్కపటం, చిరునవ్వు, సున్నితత్వం, ఆత్మీయ ఆలింగనం చేసుకునే పౌరుషత్వం’

ఆమె ఇంకా ఏం అన్నారంటే,

“ఈ ఇమేజ్‌లో స్నేహం, సహజీవనపు స్ఫూర్తి, వాగ్దానాలను మించి స్వీయ ఆత్మపరిశీలన కోసం తపన ఉన్నాయి. అనిశ్చితి, బలహీనతలు ఉన్నా స్థిరంగా ఉండాలనే తపన. ఇది ఒక భావోద్వేగాన్ని సృష్టించింది. నరేంద్ర మోదీ బలంగా, శక్తిమంతంగా, ప్రభావవంతంగా, కలిపి ఉంచే బంధంగా కనిపిస్తే, రాహుల్ గాంధీ తన చుట్టుపక్కల ఉన్న వారందరి మధ్య సంగీతంలా వ్యాపించి, వారిని అర్థవంతం చేస్తారు’’

అయితే, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అని ప్రజలు మళ్లీ చెప్పుకోవడం ప్రారంభించినా, ఆయన రాజకీయాలకు సరిపోరని పరోమితా తన కథనంలో పేర్కొన్నారు.  

రాహుల్- మిత్ర పక్షాలు

కాంగ్రెస్ రాహుల్ గాంధీని 'పార్టీ సిద్ధాంతాల మార్గదర్శకుడు', యోగి, అపురూపమైన వ్యక్తి, మానవాతీతుడు అని అభివర్ణించేంత వరకు వెళ్లింది. మిత్రపక్షాలు రాహుల్ గాంధీలో దేశ నాయకుడిని చూడటం ప్రారంభించాయి. ఆయన భారత్ జోడో యాత్రను నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా వందల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుడు చేసిన ధర్మయాత్రతో పోల్చారు. రాహుల్ గాంధీ భవిష్యత్తులో దేశానికి నాయకత్వం వహిస్తారని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్, ‘ఒక యువకుడు తీవ్రమైన చలిలో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అభినందనీయం’ అని అన్నారు.

‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకంపై విభేదిస్తున్నా, దాని అధినేత్రి మమతా బెనర్జీ ‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. మమతా బెనర్జీ అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ బలమైన అభ్యర్థి కాదని, ఆయన ఆకర్షణీయమైన బ్రాండ్ కాదని ఇది సూచించింది. రచయిత, రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్, "రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో వర్తమాన, భవిష్యత్తు రాజకీయ భావజాలం గురించి ఎక్కువగా చెబుతారు, అయితే అందులో ఎన్నికల వ్యూహాలు కనిపించవు" అంటారు.

సంకీర్ణ ధర్మ ఆచరణలో వైఫల్యంపై ఆరోపణలు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి అతుల్ అంజన్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అహంకారం వల్లే ఓడిపోయిందని అన్నారు.

‘‘ఈ దురహంకారానికి కారణం పాదయాత్రకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ల పార్టీ అది ప్రజల మద్దతు అని విశ్వసించారు. రాజస్థాన్‌లో వామపక్షాలు బలంగా ఉన్న చాలా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో మాతో సీట్లు పంచుకోవడానికి వాళ్లు నిరాకరించారు,’’ అని ఆయన అన్నారు.

ఆయనింకా ఏమన్నారంటే..

“వాళ్లు బీజేపీతో పోరాడాలనుకుంటున్నారు, కానీ తమ మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టారు. ఇది కేవలం సీట్ల ప్రశ్న కాదు, ఈ కొన్ని సీట్లే ప్రజలకు ఒక బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతాయి.’’

అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే రాహుల్ గాంధీ బ్రాండ్ అంచనా వేసిన దానికంటే చాలా మెరుగ్గా పని చేసిందని ఇమేజ్ మేనేజ్‌మెంట్ కంపెనీ టార్క్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సుప్రియో గుప్తా చెప్పారు.

కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సందర్బాన్ని ఆయన ఇలా అభివర్ణించారు

రాహుల్ గాంధీ తన రాజకీయ విలువలతో సరితూగే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడంలో విజయం సాధించారు. కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎక్కువగా స్థానిక నాయకులు, సంప్రదింపుల నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఆ కోణంలో రాహుల్ గాంధీ సిద్ధం చేసిన క్షేత్రస్థాయి పరిస్థితులను ఉపయోగించుకుని బలమైన నాయకులు రాజకీయ లబ్ధి పొందగలిగారు. బలహీనంగా ఉన్నవారు లేదా పార్టీలో అంతర్గత పోరుతో సతమయ్యేవారు ఆ పని చేయడంలో విఫలమయ్యారు’’

పార్టీని వీడుతున్న నేతలు

ఇటీవల ఓ ఫొటో దేశవ్యాప్తంగా విస్తృతంగా చక్కర్లు కొట్టొంది. కొన్ని సంవత్సరాల క్రితం తీసిన ఈ ఫొటోలో, ఒకప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితులుగా భావించే జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, ఆర్.పి.ఎన్. సింగ్, జితిన్ ప్రసాద్, మిలింద్ దేవరా వంటి నాయకులు నవ్వుతూ నిలబడి ఉండడం కనిపిస్తుంది.

ముంబయి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మిళింద్ దేవరా మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన(షిండే)లో చేరేందుకు కాంగ్రెస్‌ను వీడారు.

ఫిబ్రవరి 14న మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ తన న్యాయ్‌యాత్రను ప్రారంభించిన రోజున మిళింద్ దేవరా కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.

'రాహుల్ బ్రిగేడ్' సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీని వీడడం రంభించిన తర్వాత, పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రజలను ఏకం చేయగలరా అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి.

మిళింద్ దేవరా నిష్క్రమణ తర్వాత, 'రాహుల్ బ్రిగేడ్'లో సచిన్ పైలట్ మాత్రమే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

కొద్ది రోజుల క్రితం, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రభావశీలి అయిన కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

“అధికారం చెలాయించడానికి బదులుగా రాహుల్ గాంధీ, తనను తాను ఆ అధికారానికి ట్రస్టీగా భావిస్తున్నారు. అలాగే, తన సన్నిహితులూ, ఎరుపు రంగు దీపాలతో మెరిసే కార్లు, అధికారంతో సంబంధం ఉన్న ఇతర వస్తువులకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నారు," అని రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయ్ అన్నారు.

అయన ఇంకా ఏమన్నారంటే..

"రాజకీయ విధేయతలు ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటాయని రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు, లేదా ఆయన అర్థం చేసుకోవడానికి ఇష్టపడం లేదు"

అయితే తారిఖ్ అన్వర్ మాత్రం దీన్ని మరోలా విశ్లేషించారు

“కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వాళ్లు ఆ పార్టీ వల్ల, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల చాలా ప్రయోజనాలను పొందారు. కాంగ్రెస్‌లో తొలిసారి ఎన్నికల్లో గెలిచిన వాళ్లకూ  మంత్రివర్గంలో చోటిచ్చారు. వాళ్లు పార్టీని వీడడం రాహుల్ గాంధీకి మంచిదే. వాళ్లు పార్టీని వీడాలనుకున్నది ఏ భావజాలం కారణంగానో కాదు, ఒత్తిడికి గురై లేదా ఏదో ఒక ఆకర్షణ కారణంగానే కాంగ్రెస్‌ను వీడారు”

యువ నేతలకు తక్కువ అవకాశాలు

హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ కొత్త ముఖాలకు పదవులు ఇచ్చిన తీరును చాలా మంది ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటిది జరగదని, అందుకే యువనేతలు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారని వారన్నారు.

అయితే, లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ మాత్రం, కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఉదాహరణకు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సిఖు నియమితులు కాగా, 54 ఏళ్ల రేవంత్ రెడ్డి కొన్ని నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడాన్నిగుర్తు చేశారు.

2018లో చాలా మంది సీనియర్ నేతల కంటే భూపేష్ బఘేల్‌కు ప్రాధాన్యమిచ్చి ఆయనను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా నియమించారు.

తననే ఒక ఉదాహరణగా పేర్కొంటూ గౌరవ్ గొగోయ్, పార్టీ తనను లోక్‌సభలో ఉప నాయకుడిగా నియమించినప్పుడు తన వయస్సు కేవలం 41 సంవత్సరాలే అని చెప్పారు.

రాహుల్ గాంధీ అంతర్గత బృందంలో వారివారి సొంత సబ్జెక్ట్‌లో నిష్ణాతులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, కానీ, వారికి రాజకీయ పరిజ్ఞానం అంతగా లేదని, వారు కేవలం పుస్తకాల పైనే ఆధారపడి రాజకీయ ఆలోచనలు చేస్తారని  రాజకీయ నేతల మీడియా మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు కలిగిన వి.కె. చెరియన్ వివరించారు. నిజానికి రాహుల్ గాంధీకి హిందీ ప్రాంతాలకు చెందిన వాళ్లు, ఆ ప్రాంత ప్రజలను అర్థం చేసుకునే వ్యక్తుల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుగుబాటుదారు, కోపిష్టి అహంబావి?

తమ సొంత ప్రభుత్వం చేసిన చట్టాల కాపీలను చించేసి, అహంకారి అనిపించుకున్న వ్యక్తి, ‘పప్పు’ అని ముద్ర పడ్డ వ్యక్తి నిజానికి ఎలాంటి వారు?

మేనేజ్‌మెంట్ పాఠాలు చెప్పే జయశ్రీ సుందర్, రాహుల్ గాంధీలో తనకెప్పుడూ అహంకారం కనిపించలేదని చెప్పారు. ఆయనను మంచి రాజకీయ నాయకుడిగా అంగీకరించడానికి ఇష్టపడని చాలా మంది బీజేపీ నాయకులు సైతం ఆయన మంచి వ్యక్తి అని ఒప్పుకుంటారని తెలిపారు.

2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం, వ్యూహాన్ని సిద్ధం చేసిన ఢిల్లీలోని లియో బర్నెట్ ఇమేజ్ మేనేజ్‌మెంట్ కంపెనీకి జయశ్రీ సుందర్ అధిపతి.

ఆ సమయంలో కాంగ్రెస్ చాలా కాలం నుంచి అధికారానికి దూరమై, సమాజంలోని అతి పెద్ద వర్గం ఆమోదం పొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొంటోంది.

'డోంట్ ఫర్గెట్ 2004: అడ్వర్టైజింగ్ సీక్రెట్స్ ఆఫ్ యాన్ ఇంపాజిబుల్ ఎలక్షన్ విక్టరీ' అన్న పుస్తకంలో జయశ్రీ సుందర్ - గాంధీ నెహ్రూ కుటుంబం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ఇతర నాయకులతో కలిసి వ్యూహరచన చేసి, ఎన్నికలలో విజయం కోసం నిర్వహించిన సమావేశాల ప్రక్రియ గురించి సుదీర్ఘంగా వివరించారు.

ఈ పుస్తకం జనవరి 6వ తేదీ ఉదయం వాతావరణం అతి చల్లగా ఉన్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్త షమీమ్ ఆమెకు చేసిన ఫోన్ కాల్‌తో ప్రారంభమవుతుంది. ఆ కాల్‌ను మొదట ఆమె ఆకతాయితనంగా భావించారు.

ఫిల్టర్ కాఫీ సిప్‌ల మధ్య జయశ్రీ ఓ రిపోర్టర్‌తో రాహుల్, ప్రియాంక గాంధీని మొదటిసారి కలిసిన రోజు గురించి వివరించారు. ఆమె అప్పటికే సోనియా గాంధీని కలిసి ఉన్నారు.

“సోనియా గాంధీయే నాకు రాహుల్, ప్రియాంక గాంధీలను పరిచయం చేశారు. వాళ్లు అందరికీ తెలిసిన వాళ్లే కదా, మళ్లీ ప్రత్యేకంగా పరిచయం ఎందుకని నాలో నేను అనుకున్నాను. కానీ, సోనియా గాంధీ తన పిల్లలు అందరికీ తెలుసని అనుకోలేదు. ఇది నాకు ఆమెలో నచ్చిన నిరాడంబరతకు ఉదాహరణ,’’ అని జయశ్రీ తెలిపారు. 

అప్పటి నుంచి జయశ్రీ రాహుల్, ప్రియాంకలను క్రమం తప్పకుండా కలిసేవారు. ఆ సమయంలో రాహుల్‌ ఆమెకెప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతో కనిపించేవారు. ఆయన ప్రతిదీ సూక్ష్మంగా, వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని తనకు అనిపించిందని జయశ్రీ అన్నారు.

అయితే, ఒక విధమైన పొలిటికల్ బ్రాండ్ అయిన రాహుల్ గాంధీ, భవిష్యత్తులో ప్రత్యర్థులకు సవాలుగా మారతారా?

బ్రాండ్ గురు సందీప్ గోయల్, ఇతర బ్రాండ్ల మాదిరిగానే, బ్రాండ్ రాహుల్‌కూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని అన్నారు. 

“రాహుల్ గాంధీని యువతకు చిహ్నంగా చూస్తారు, ఆయన గాంధీ-నెహ్రూ వంశానికి చెందినవారు. పాదయాత్ర సందర్భంగా ఆయనను సులభంగా ప్రజలతో కలిసిపోయే మాస్ లీడర్‌గా చూపించారు. మనం ఆ కోణంలో చూస్తే, ఆయన అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న ఒక బ్రాండ్’’ అని సందీప్ గోయల్ అన్నారు.

రిపోర్ట్ : ఫైసల్ మొహమ్మద్ అలీ
ఫోటో: గెట్టీ
ప్రొడక్షన్: షాదాబ్ నజ్మీ