భారత్‌లో ఎమర్జెన్సీకి కారణమైన ఎన్నిక, రాయ్‌బరేలీలో ఇందిర ఎలా గెలిచి ఓడారంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నీలేశ్ ధోత్రే
- హోదా, బీబీసీ ప్రతినిధి
''సోదర, సోదరీమణులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు'' అని 1975 జూన్ 25న ఇందిరా గాంధీ రేడియోలో ప్రకటించారు. ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. 1977 మార్చి 21 వరకూ ఎమర్జెన్సీ కొనసాగింది.
ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి.
1966 జనవరి 24న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీకి 1971 లోక్‌సభ ఎన్నికల వరకూ దేశంపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టుంది.
ఇందిరా గాంధీపై వ్యతిరేకత అంటే, దేశంపై వ్యతిరేకత అనేలా అప్పట్లో ఆమె మద్దతుదారులు చిత్రీకరించారు.
1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్‌నారాయణ్‌పై లక్షా 11 వేల 810 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు.
ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజ్‌నారాయణ్ ప్రతిష్టాత్మకంగా మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆయన మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు. అయితే, ఫలితాల్లో రాజ్‌నారాయణ్ ఓడిపోయారు. అయినా రాజ్‌నారాయణ్ పట్టువీడలేదు. ఇందిరా గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.
ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరా గాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు. మొత్తం ఏడు ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇందిర తన ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్‌పాల్ కపూర్‌ను నియమించుకున్నారనేది ఆయన మొదటి ఆరోపణ.
ఎన్నికల ప్రచార సమయంలో సభలకు అవసరమైన స్టేజీల నిర్మాణానికి, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను ఉపయోగించుకున్నారనేది మరో ఆరోపణ. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.
ఓట్ల కోసం ఇందిరా గాంధీ డబ్బులు పంచారనేది ఆయన మూడో ఆరోపణ.
ఇంకా, బోగస్ ఓటింగ్ తదితర ఆరోపణలు చేశారు.
రాజ్‌నారాయణ్ హడావిడిగా కోర్టుకు వెళ్లడం తొలుత రాజకీయ విన్యాసంగా అనిపించింది. ఎవరూ దానిని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, వాదనలు వినేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
'ఇది ప్రధాన మంత్రి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసు.' అప్పట్లో లండన్ టైమ్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.

ఫొటో సోర్స్, DHARMENDRA SINGH
కోర్టుకు హాజరైన ప్రధాని ఇందిర
ఈ కేసులో 1975 మార్చి 18న ఇందిరా గాంధీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరుకావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి.
జస్టిస్ జగ్మోహన్‌లాల్ సిన్హా ఎదుట ఇందిరా గాంధీ హాజరయ్యారు. ఆ రోజు కోర్టులో దాదాపు 5 గంటలపాటు విచారణ జరిగింది.
ఇందిరా గాంధీ వాంగ్మూలం తర్వాత, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
ఈ పరిణామాలతో కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావొచ్చని ఇందిరా గాంధీ, ఆమె మద్దతుదారులు అప్పటికే గ్రహించారు.
జస్టిస్ సిన్హా తీర్పుని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని దివంగత సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ ఆరోపణలు కూడా చేశారు.
ఆయన గతంలో బీబీసీతో మాట్లాడుతూ, ''డాక్టర్ మాథుర్ ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎస్. ఆయన మాథుర్ బంధువు. దాని గురించి చాలాకాలం తర్వాత సిన్హా నాకు చెప్పారు. ఇందిరా గాంధీ వాంగ్మూలం ఇచ్చి, తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఒకరోజు మాథుర్ తన భార్యతో కలిసి సిన్హా ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ తీర్పు తర్వాత మిమ్మల్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తిని చేసే ఆలోచనలో ఉన్నారని సిన్హాకు చెప్పారు. ఇందిరకు అనుకూలంగా తీర్పు ఇస్తే సుప్రీం కోర్టు న్యాయమూర్తి అవుతారని మాథుర్ సిన్హాకు చెప్పారు.''
కానీ, అది సిన్హాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సిన్హా దేనికీ లొంగలేదు.

ఫొటో సోర్స్, ANI
ఆ తీర్పు రోజు రానేవచ్చింది..
1975 జూన్ 12 ఉదయం పది గంటల కంటే ముందే అలహాబాద్ హైకోర్టులోని 24వ నంబర్ కోర్టురూమ్ కిక్కిరిసిపోయింది. అక్కడ నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు.
న్యాయమూర్తి జగ్మోహన్‌లాల్ సిన్హా తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా 10 గంటలకు ఆయన తన చాంబర్ నుంచి కోర్టు హాలుకి వచ్చారు. అందరూ లేచి నిల్చున్నారు.
తీర్పు చదవడం ప్రారంభించిన వెంటనే రాజ్‌నారాయణ్ అభ్యర్థనలోని కొన్ని అంశాలు సరైనవేనని భావిస్తున్నట్లు మొదట చెప్పారు.
అప్పుడు ఇందిరా గాంధీ ఎన్నిక రద్దవుతుందని కోర్టులో కూర్చున్న వాళ్లంతా ఊహించారు.
ఇంతలో న్యూదిల్లీలోని వార్తాసంస్థల కార్యాలయాల్లో టెలీప్రింటర్లు మోగడం ప్రారంభమైంది. అలాగే, ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ వార్తా సంస్థ యూఎన్‌ఐ టెలీప్రింటర్‌ను ఏర్పాటు చేశారు.
అందులో ఒక ఫ్లాష్ వచ్చింది - 'ఇందిరా గాంధీ అభ్యర్థిత్వం రద్దయింది' అని.
అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా తన తీర్పును వెలువరించారు.
రాజ్‌నారాయణ్ చేసిన మొత్తం 7 ఆరోపణల్లో 5 ఆరోపణలకు సంబంధించి జస్టిస్ సిన్హా ఇందిరా గాంధీకి ఊరట కల్పించారు. కానీ, రెండు ఆరోపణల్లో ఇందిరా గాంధీని కోర్టు దోషిగా నిర్ధరించింది.
కోర్టు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. మరో 6 సంవత్సరాల పాటు లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది.
తన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరా గాంధీ ఉపయోగించుకున్నారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని సిన్హా తన తీర్పు ప్రతిలో రాశారు.
ఒక ఎక్స్-అఫీషియో ప్రధాన మంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా, మొత్తం ప్రపంచంలోనే అది మొదటిసారి.
కోర్టు తీర్పు తర్వాత, కాంగ్రెస్ నేతలు పెద్దయెత్తున దిల్లీలోని ఇందిరా గాంధీ నివాసానికి తరలివచ్చారు.

ఫొటో సోర్స్, SHANTI BHUSHAN
దివంగత సీనియర్ జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్ అప్పటి పరిణామాలను బీబీసీకి వివరిస్తూ, ''ఆ తీర్పు తర్వాత, నేను బాబూ జగ్జీవన్‌రామ్‌ను కలవడానికి వెళ్లి, తర్వాత ఏం జరుగుతుందని అడిగా. రాజీనామా చేయాలని చట్టంలో ఉందని ఆ సమయంలో ఆయన చెప్పారు.
కానీ, ఆ అవకాశం ఇవ్వరు, కాబట్టి మీరు ఎవరికీ చెప్పలేదా? అని అడిగినప్పుడు, అంత ధైర్యం ఎవరికీ లేదన్నారు. కానీ, ఆమె రాజీనామా చేస్తే ఆ తర్వాతి ప్రధాని ఎవరనే దానిపై తగాదాలు మొదలవుతాయి. ఆ సమయంలో ఇందిరా గాంధీ సందిగ్ధంలో ఉన్నారు.''
అలాగే, తన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఇందిరా గాంధీకి జస్టిస్ సిన్హా 20 రోజుల గడువు ఇచ్చారు.
అప్పట్లో ప్రముఖ న్యాయవాది నాని పాల్కీవాలాను ఇందిరా గాంధీ పిలిపించారు. పేపర్లన్నీ సిద్ధం చేసి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
1975 జూన్ 22న సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ కృష్ణ అయ్యర్ కంటే ముందు వీఆర్ ఎదుట విచారణకు వచ్చింది.
పాల్కీవాలా ఇందిరా గాంధీ తరఫున వాదించగా, రాజ్‌నారాయణ్ తరఫున శాంతి భూషణ్ వాదనలు వినిపించారు.
ఈసారి కూడా అయ్యర్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. అయ్యర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అయ్యర్ ఇలా అన్నారు, "అప్పటి న్యాయ శాఖ మంత్రి గోఖలే నాకు మిత్రుడు. ఆయన నాకు ఫోన్ చేసి కలవాలన్నారు. ఎందుకు కలవాలనుకుంటున్నారని అడిగినప్పుడు, ఇందిరా గాంధీ కేసు గురించి ప్రస్తావించారు.
ఈ కేసులో స్టే కావాలని ప్రధాన మంత్రి కోరుకుంటున్నారని నాతో చెప్పారు. అందుకు నన్ను కలవాల్సిన అవసరం లేదు, సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఆయనకు చెప్పాను.''
అయ్యర్ కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, అదేరోజు దీనిపై నిర్ణయం తీసుకోవాలని అయ్యర్ నిర్ణయించుకున్నారు.
మధ్యాహ్న భోజన విరామం కూడా తీసుకోకుండా సాయంత్రం ఐదున్నర గంటల వరకూ విచారణ జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ అయ్యర్ తన తీర్పు రాస్తూ ఉన్నారు.

1975 జూన్ 24న జస్టిస్ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించారు.
ప్రధానిగా ఇందిరా గాంధీ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ప్రసంగాలు చేసేందుకు అనుమతించారు. కానీ, పార్లమెంట్‌లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించింది.
అంటే, ఎంపీ పదవిని సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. కానీ, కొన్ని షరతులు విధించింది.
కానీ, అప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఇందిరా గాంధీపై నిప్పులు చెరిగాయి. జూన్ 25న దిల్లీలోని రాంలీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది.
ప్రముఖ కవి దినకర్ కవిత 'సింహాసన్ ఖాలీ కరో కీ జనతా ఆతీ హై'తో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
జయప్రకాశ్ నారాయణ్ సభ తర్వాత, రేడియోలో ఇందిరా గాంధీ ఇలా అన్నారు - ''సోదర, సోదరీమణులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భయాందోళన అవసరం లేదు.''
ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర.
1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మరోసారి రాజ్‌నారాయణ్ రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీని సవాల్ చేశారు.
ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు.
అయితే, ఆయన రాయ్‌బరేలీ ఎంపీ కావడం, ఆరోగ్య శాఖ మంత్రి కావడం యాదృచ్ఛికంగా మిగిలిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?
- హిజాబ్: ‘కొరడా దెబ్బలు తింటాం, జైలుకైనా వెళతాం’ అంటున్న ఇరానీ మహిళలు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














