కచ్చతీవు దీవిపై కాంగ్రెస్, డీఎంకేలను మోదీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలేంటీ వివాదం?

కచ్చతీవు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు సమీపంలో ఉన్న కచ్చతీవు ద్వీపం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

భారతదేశ సమైక్యతను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

“కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్ ఎలా అప్పగించిందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది భారతీయులందరికి కోపం తెప్పించేది. కాంగ్రెస్‌ను నమ్మలేమని మరోసారి స్పష్టమైంది. భారత ఐక్యతను బలహీనపరచడం, దేశ ప్రయోజనాలకు హాని కలిగించడమే 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని" అని ఎక్స్‌లో మోదీ విమర్శించారు.

దేశ ఐక్యతను ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

మీరట్ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ- “ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరో దేశ వ్యతిరేక చర్య వెలుగులోకి వచ్చింది. తమిళనాడు సముద్ర తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కచ్చతీవు ద్వీపం ఉంది. భద్రతా కోణం నుంచి చూస్తే ఈ ద్వీపం చాలా ముఖ్యమైనది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అది భారతదేశంతో ఉంది. కానీ నాలుగైదు దశాబ్దాల క్రితం వీళ్లంతా ఈ ద్వీపం పనికిరానిదని, అవసరం లేదని చెప్పారు. భారతమాతలో కొంత భాగాన్ని విడదీశారు'' అని అన్నారు.

తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే ఏమీ చేయలేకపోయిందని, కచ్చతీవు విషయంలో డీఎంకే ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయని మోదీ ఎక్స్‌ (ట్విటర్)లో విమర్శించారు.

కాంగ్రెస్, డీఎంకే కేవలం వారి కుమారులు, కూతుళ్ల కోసమే ఆలోచిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

కచ్చతీవు

ఫొటో సోర్స్, GOOGLE

ఫొటో క్యాప్షన్, కచ్చతీవు గూగుల్ మ్యాప్

'కచ్చతీవు' అకస్మాత్తుగా తెర మీదకు ఎందుకొచ్చింది?

ఆదివారం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిక ఒక కథనంతో ఈ చర్చ మొదలైంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అందించిన ఆర్టీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆ పత్రిక కచ్చతీవుపై కథనం ప్రచురించింది.

1974లో భారత ప్రభుత్వం 'మెతక వైఖరి' కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని ఆ కథనం ఆరోపించింది.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కచ్చతీవు దీవిపై మీడియా సమావేశంలో స్పందించారు.

"డీఎంకే, కాంగ్రెస్‌ వాళ్లకు ఏమీ తెలియనట్లుగా, అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నట్లు చూస్తున్నాయి. అంతా ఇపుడే జరిగినట్లు, అసలు చరిత్ర లేనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ వివాదం ఎలా మొదలైందో ప్రజలకు తెలియాలి కాబట్టి, చర్చకు వచ్చింది. ఈ ద్వీపానికి సంబంధించి పార్లమెంటులో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు" అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.

"నేను స్వయంగా తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు సమాధానమిచ్చాను. 1974 జూన్‌లో భారత విదేశాంగ కార్యదర్శి, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి మధ్య చర్చ జరిగింది. కచ్చతీవుపై భారత్, శ్రీలంక దేశాలవి ఎవరి వాదనలు వారివే" అని ఆయన చెప్పారు.

"తమిళనాడు అది రాజా రామ్‌నాథ్ రాచరిక ప్రాంతమని చెబుతోంది. కచ్చతీవు శ్రీలంకలో భాగమని చెప్పుకునే పత్రం ఏదీ లేదని భారత్ అంటోంది. ఈ సమస్య 1960లలో ప్రారంభమైంది. 1974లో భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దును నిర్ణయించారు" అని జైశంకర్ గుర్తుచేశారు.

కచ్చతీవు దీవి

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టీఐ కాపీలో ఏముంది?

కచ్చతీవుపై వార్తను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఆదివారం ప్రముఖంగా ప్రచురించింది.

వార్తాపత్రిక కథనం ప్రకారం- భారత తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల భూమిపై క్లెయిమ్‌ను భారత్ వదులుకున్నట్లు పత్రాలు చూపిస్తున్నాయి.

భారత్ దశాబ్దాలుగా కచ్చతీవు ద్వీపాన్ని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది, చివరకు వదిలేసింది.

శ్రీలంకను గతంలో సిలోన్ అని పిలిచేవారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ద్వీపాన్ని ఆ దేశం తనదిగా చెప్పుకొంది.

అనుమతి లేకుండా కచ్చతీవుపై భారత నౌకాదళం (అప్పటి రాయల్ ఇండియన్ నేవీ) విన్యాసాలు చేయకూడదని సూచించింది. అనంతరం 1955 అక్టోబర్‌లో 'సిలోన్ ఎయిర్ ఫోర్స్' ఈ ద్వీపంలో విన్యాసాలు ప్రారంభించింది.

1961 మే 10న అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ద్వీపం సమస్యను అసంబద్ధమైనదంటూ కొట్టిపడేశారు.

ఈ చిన్న ద్వీపానికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వడంలేదని, దానిపై క్లెయిమ్‌ను వదులుకోవడానికీ సిద్ధమేనని ప్రధాని నెహ్రూ చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ అంశాన్ని నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం, మళ్లీ పార్లమెంటులో లేవనెత్తడం తనకు ఇష్టం లేదని నెహ్రూ చెప్పారు.

దీనికి సంబంధించిన నోట్ అప్పటి కామన్వెల్త్ సెక్రటరీ వైడీ గుండేవియా రూపొందించారు. ఈ నోట్‌ను 1968లో విదేశీ వ్యవహారాల శాఖ పంచుకుంది.

ఆ నోట్ భారత వైఖరిని చూపుతుందంటూ..

ఈ నోట్ కచ్చతీవుపై భారత వైఖరిని చూపుతుందని, 1974లో భారత్ అధికారికంగా ఈ ద్వీపాన్ని వదులుకుందని ఆ కథనం తెలిపింది.

కాగా, 1960లో కచ్చతీవుపై భారత్‌కు హక్కు ఉందని అప్పటి అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాద్ అభిప్రాయపడ్డారని ఆ 'టైమ్స్' కథనం పేర్కొంది.

"ఈ క్లెయిమ్ క్లిష్టంగానే ఉన్నా, సాక్ష్యాధారాల ప్రకారం కచ్చతీవు ద్వీపంపై సార్వభౌమాధికారం భారతదేశానిదే" అని ఆయన అన్నారు. దీనికి ఆయన జమీందారీ హక్కులను ఉదాహరణగా చూపారు.

ఈస్టిండియా కంపెనీ రామనాథపురం రాజుకు కచ్చతీవు ద్వీపం, దాని చుట్టుపక్కల చేపలు పట్టడం, ఇతర వనరుల కోసం జమీందారీ హక్కులు ఇచ్చిందని సెతల్వాద్ గుర్తుచేశారు. ఈ హక్కులు 1875 నుంచి 1948 వరకు కొనసాగాయని తెలిపారు, తర్వాత హక్కులు మద్రాసు రాష్ట్రానికి వెళ్లాయని చెప్పారు.

కచ్చతీవు వివాదం

కచ్చతీవు ఎక్కడుంది?

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో, భారత్, శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు.

ప్రస్తుతం శ్రీలంక అధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్‌లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వమే ఒక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించింది.

భారత్, శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్‌గా పని చేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు.

వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం. ఇక్కడ పగడపు దిబ్బలు(కోరల్ రీవ్స్), ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించ లేవు.

సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు ద్వీపం ఉంది. రామేశ్వరం నుంచి సుమారు 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 285 ఎకరాలు కాగా, గరిష్ఠంగా 300 మీటర్ల వెడల్పు ఉంటుంది.

1976 వరకు ఈ దీవి తనదేనని భారత్ చెప్పుకునేది. అప్పటికి అది శ్రీలంక అధీనంలో ఉంది.

1974-76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండరునాయకె మధ్య చర్చలు జరిగాయి. సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక అధీనంలోకి వెళ్లింది. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుంచి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

కేంద్రంతో తమిళనాడు తగవు

1991లో తమిళనాడు శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, కచ్చతీవును భారత్‌లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేసింది.

అయితే, ఇది కేవలం తీర్మానాలతోనే ఆగిపోలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు.

కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న రెండు ఒప్పందాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

బ్రిటిష్ హయాంలో ఏం జరిగింది?

కచ్చతీవు 1974 వరకు భారతదేశంలో భాగమని, అది రామనాథపురం రాజు అధీనంలో ఉండేదన్న వాదనలు ఉన్నాయి.

రామనాథపురం రాజు 1902లో అప్పటి భారత ప్రభుత్వం నుంచి కచ్చతీవును పొందారు. బ్రిటిషర్ల నుంచి లీజుకు తీసుకున్న భూభాగాలపై రామనాథపురం రాజు చెల్లించాల్సిన అద్దెల ఖాతాలో కచ్చతీవు ప్రాంతం పేరు కూడా ఉంది.

అంతకుముందు 1880లో మహమ్మద్ అబ్దుల్ కదిర్ మరైకెరె, ముత్తుచామి పిళ్లై, రామనాథపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎడ్వర్డ్ టర్నర్ మధ్య ఒక లీజు ఒప్పందం జరిగింది.

ఈ లీజు కింద 70 గ్రామాలు, 11 దీవులలో రంగుల తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించుకునేందుకు లీజుదారులు అధికారం పొందారు. ఆ 11 దీవుల్లో కచ్చతీవు కూడా ఒకటి.

1885లో కూడా ఇదే తరహాలో మరొక లీజు ఒప్పందం జరిగింది. 1913లో రామనాథపురం రాజు, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ లీజులో కచ్చతీవు పేరు కూడా చేర్చారు.

భారత్, శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం, కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ చెప్పలేదు.

కచ్చతీవు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికలున్నాయనే జాతీయ భద్రత సమస్యలపై మోదీ అకస్మాత్తుగా మేల్కొన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఏమంటోంది?

కచ్చతీవుపై తమను మోదీ ఇరుకున పెట్టడంతో కాంగ్రెస్ స్పందించింది.

ఎన్నికలున్నాయనే దేశ సమగ్రత, జాతీయ భద్రత సమస్యలపై మోదీ అకస్మాత్తుగా మేల్కొన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దులకు సంబంధించి’ ఒప్పందం చేసుకున్నట్లే 1974లో ‘స్నేహపూర్వక ఒప్పందం’ కింద కచ్చతీవు దీవిని అప్పగించారని ఖర్గే అన్నారు.

బీజేపీ ప్రభుత్వం హయాంలో స్నేహపూర్వక ఒప్పందం కింద బంగ్లాదేశ్‌కు 111 ఎన్‌క్లేవ్‌లు (సరిహద్దులో ఉన్న చిన్న ప్రాంతాలు) ఇచ్చారని, కేవలం 55 ఎన్‌క్లేవ్‌లు మాత్రమే భారత్‌కు వచ్చాయని ఖర్గే గుర్తుచేశారు.

2015 ఆగస్టు 1న భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 162 ఎన్‌క్లేవ్‌లు పంచుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌తో ఉన్న 51 ఎన్‌క్లేవ్‌లు ఇండియాకు, 111 ఎన్‌క్లేవ్‌లు బంగ్లాదేశ్‌కు వెళ్లాయి.

కచ్చతీవు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్

మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తారు: డీఎంకే

ప్రధాని నరేంంద్ర మోదీ ఆరోపణలపై డీఎంకే స్పందించింది. 1974లో ఈ ఒప్పందాన్ని డీఎంకే వ్యతిరేకించిందని ఆ పార్టీ తెలిపింది.

ఈ సందర్భంగా 'భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం' గురించి మోదీ నుంచి సమాధానం కోరింది.

ప్రధానికి చూపించే విజయాలు ఏమీ లేవని, ఆయన కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని డీఎంకే కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)