భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1952: బ్యాలెట్ పేపర్ మీద ముద్ర వేయకుండా ఓటు ఎలా వేశారు?

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, PHOTO DIVISION

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ

దేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినప్పటికీ, మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఐదేళ్ళు పట్టింది. స్వాతంత్రం తరువాత కూడా భారత్ కొంత కాలం బ్రిటిషర్ల పర్యవేక్షణలో నే ఉంది. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

భారత రాజ్యంగ రచన నవంబర్ 26, 1949లో పూర్తయింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత తొలి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఐసీఎస్ అధికారి సుకుమార్ సేన్ పేరు నెహ్రూ మదిలో మెదిలింది. అప్పట్లో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. అప్పటిదాకా భారతదేశం చూడని ఓ బృహత్కార్యాన్ని సుకుమార్ సేన్ భుజాలపై మోపారు.

అయితే, జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నికలు త్వరగా జరపాలని ఆరాటపడినప్పటికీ సుకుమార్ సేన్ మాత్రం తొందరపడలేదు.

దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడమంటే చిన్న విషయం కాదు కాబట్టి ప్రతి పని ఆచితూచి చేయాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సుకుమార్ భావించారు.

ఎన్నిలక ప్రక్రియ 1951లో మొదలైంది. 21 ఏళ్ళ వయసుపైబడిన వారందరూ ఓటు వేయవచ్చని ప్రకటించారు.

ఎవరైనా ఒక నియోజకవర్గంలో 180 రోజులకు పైబడి నివసిస్తుంటే వారు ఆ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకుని, ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ప్రకటించారు.

ఆ రోజులలో చాలామంది ప్రజల వద్ద తాము భారత పౌరులమని చెప్పడానికి ఎటువంటి పత్రాలూ ఉండేవి కావు. దీంతో ఓటర్ల జాబితా తయారీ అనేది క్లిష్టమైన ప్రక్రియగా మారింది. దీనికితోడు అప్పటికి ఇంత పెద్దఎత్తున ఎన్నికలు నిర్వహించిన అనుభవం కూడా లేదు. ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చే విధానం కూడా ఏదీ లేదు.

1944లో రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించినప్పటికీ, అప్పట్లో ఎన్నికల బాధ్యతలు చూసినవారిలో చాలామంది చనిపోయారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా సుకుమార్ సేన్ ఎటువంటి సంకోచం లేకుండా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారు.

మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 489 నియోజకవర్గాలు ఉండేవి. వీటిల్లో 314 నియోజకవర్గాల నుంచి ఒక సభ్యుడిని, 172 నియోజకవర్గాల నుంచి ఇద్దరు సభ్యులను (ద్విసభ్య విధానం, ఒకరు జనరల్ నుంచి మరొకరు రిజర్వ్‌డ్ వర్గం నుంచి) ఎన్నుకోవాల్సి ఉంది. మరో మూడు నియోజకవర్గాల నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.

ఇక ఎన్నికల బరిలో 53 రాజకీయ పార్టీలు నిలిచాయి. వీటిల్లో 14 జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి.

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, PHOTO DIVISION

ఫొటో క్యాప్షన్, భారతదేశ తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్

ఏ గుర్తుపై ముద్ర వేయాలి?

అప్పటికి దేశ విభజన జరిగి నాలుగేళ్ళు గడిచాయి. భారత పౌరులు అనేదాన్ని పూర్తిగా నిర్వచించని కాలమది. దీంతో ఎవరైతే ఒక నియోజకవర్గంలో 180 రోజులకు పైగా నివసిస్తారో వారికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించారు. ఓటర్ల జాబితాలో తమ పేరుంటే తాము భారతదేశ పౌరులమైపోయినట్టేనని అప్పట్లో చాలామంది నమ్మేవారు.అనేక మంది పౌరులు పోటీపడి తమ పేర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

అప్పటి భారతదేశ జనాభాలో 49 శాతం అంటే దాదాపు 17,32,12,343 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. రాష్ట్రాల ఎన్నికలలో పాల్గొన్నవారికి ఓటు అంటే ఏమిటో తెలుసుకానీ, మిగతావారికి ఎన్నికలంటే తెలియదు.

ఈ క్రమంలో ప్రతి పార్టీకి ఓ గుర్తును కేటాయించి, వాటిని బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. దీంతో పాటు ఆయా గుర్తులున్న బ్యాలెట్ బాక్సులను ప్రతి పోలింగ్ బూత్‌లో విడి విడిగా ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు తమ కు నచ్చిన గుర్తున్న బ్యాలెట్ పేపర్ ను దానిపై ఎటువంటి ముద్ర వేయాల్సిన అవసరం లేకుండానే సంబంధిత గుర్తు ఉన్న బ్యాలెట్ బాక్సులో వేస్తే చాలన్నమాట.

తొలి సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంట్ లో 489 స్థానాలు, అసెంబ్లీలలో 4000 స్థానాలు ఉన్నాయి. ఈమేరకు 2,24,000 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 56వేలమంది ఎన్నికల అధికారులను నియమించారు.

ఈ సన్నాహాలన్నీ ముగిశాకా అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 1952 వరకు అనేక దశలలో నిర్వహిస్తున్నటు ప్రకటించారు.

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, PHOTO DIVISION

ఫొటో క్యాప్షన్, ఓటు హక్కు ఉంటే భారత పౌరసత్వం లభించినట్టేనని ప్రజలు భావించారు

ఎన్ని పార్టీలు పోటీచేశాయి?

ఎన్నికల నాటికి 14 జాతీయ పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ వాటిల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ జన సంఘ్, సోషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ముఖ్యమైనవిగా ఉన్నాయి.

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావించింది.

ఈ ఆలోచన నుంచే భారతీయ జన సంఘ్ పురుడుపోసుకుంది. నెహ్రూ తాత్కాలిక మంత్రి మండలిలో సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో ఈ పార్టీని స్థాపించారు.

దీని తరువాత దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలంగా ఉంది. దేశమంతటా పేదరికం, వివిధ సమస్యలపై తాము చేసే పోరాటాలే తమ బలంగా భావించి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బరిలోకి దిగింది.

సీనియర్ కాంగ్రెస్ నేత జేపీ కృపలానీ పార్టీని వీడి సొంతంగా కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించారు.

జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా కలిసి సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు.

వీటితోపాటు ఇండియన్ ముస్లిం లీగ్, అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ కూడా ఎన్నికల బరిలో నిలిచాయి.

అయితే, అన్ని పార్టీలలోనూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటమే కాక, ప్రతి నియోజకవర్గంలో తన అభ్యర్థులను నిలపగలిగింది. సోషలిస్ట్ పార్టీ 250కు పైగా స్థానాలలో పోటీచేయగా, కమ్యూనిస్టు పార్టీ 50 పై చిలుకు స్థానాలలో పోటీచేసింది.

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నెహ్రూకు దేశవ్యాప్త ఆదరణ ఉండేది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (కుడి) జన సంఘ్ వ్యవస్థాపకుడు

నెహ్రూకు పోటీ లేదు

జవహర్ లాల్ నెహ్రూ, కమ్యూనిస్టు పార్టీ నుంచి అజయ్ ఘోష్, ఆచార్య కృపాలని, జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ అంబేడ్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ స్థాయి నాయకులుగా పేరుగాంచారు.

ఆ సమయంలో జాతీయస్థాయిలో జవహర్ లాల్ నెహ్రూకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఆయన ఈ ఎన్నికలలో దేశవ్యాప్తంగా పర్యటించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, జయప్రకాష్ నారాయణ్, కృపలానీకి ఉత్తర భారతంలో ఉన్నట్టుగా దక్షిణ భారతంలో జనాదరణ లేదు. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దేశాన్ని పాలించే పార్టీగా గుర్తింపు వచ్చింది.

ఇదే ఎన్నికలలో ఫలితాలలోనూ ప్రతిఫలించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 364 స్థానాలు గెలుచుకుంది. దీని తరువాత కమ్యూనిస్టు పార్టీ 16 స్థానాలు గెలిచింది. సోషలిస్టు పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. కానీ ఆ పార్టీ 12 సీట్లకే పరిమితమైంది. కిసాన్ మజ్దూర్ పార్టీకి 9, భారతీయ జన సంఘ్‌కు 3 స్థానాలు దక్కాయి.

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, PHOTO DIVISION

హైదరాబాద్ స్టేట్ ప్రజాపార్టీ స్థాపించిన టంగుటూరి ప్రకాశం పంతులు

అప్పట్లో ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మలబార్ భాగం, కలిపి మద్రాసు రాష్ట్రంగా వ్యవహరించేవారు.

మద్రాసు రాష్ట్రంలో 62 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 75 మంది సభ్యులు ఎన్నికవుతారు. వీటిల్లో 49 జనరల్ స్థానాలనుంచి ఒకరి చొప్పున,13 ద్విసభ్య స్థానాల నుంచి ఇద్దరి చొప్పున 26 మందిని ఎన్నుకుంటారు.

అదేవిధంగా 309 అసెంబ్లీ స్థానాలు, 66 ద్విసభ్య స్థానాలు కలిపి మొత్తం 375 అసెంబ్లీ స్థానాలు ఉండేవి.

ద్విసభ్య స్థానాలలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉండేది. గతంలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన జస్టిస్ పార్టీ పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం నుంచి పుట్టిన ద్రవిడ కళగం పార్టీలో కలిసిపోవడంతో ఎన్నికల నుంచి తప్పుకున్నట్టయింది.

దీంతో కమ్యూనిస్ట్ పార్టీ చెన్నై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ పక్షాన బిఎస్ కుమారరాజ భక్తవత్సలం, కామరాజ నాడర్ వంటి పలుకుబడిన గలిగిన నేతలు ఉండేవారు. 1946 ఎన్నికల తరువాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఉలికిపాటుకు గురైంది.

చెన్నై ప్రావిన్స్ కు ప్రధానిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీని స్థాపించారు. తరువాత ఆ పార్టీ కృపలానీ కిసాన్ ప్రజా మజ్దూర్ పార్టీలో విలీనమైంది. అయితే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ నేత కామరాజ్ బలంగా ఉండేవారు. కానీ రాజాజీ మద్దతు దారులకు కూడా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉండేది.

ఇక కమ్యూనిస్టు పార్టీ విషయానికొస్తే పీ. జీవనాదం, బి. రామ్మూర్తి వంటి బలమైన నేతలు ఉండేవారు. వీరు ఆంధ్రప్రదేశ్, తంజావూరు లాంటి ప్రాంతాలలో లభించే మద్దతుపై ఆధారపడేవారు.

ఇవే కాకుండా రామస్వామి పెదయాచియార్ నేతృత్వంలోని తమిళనాడు లేబర్ పార్టీ, మణికావల్ నాయక్ ఆధ్వర్యంలోని కామన్ వీల్ పార్టీ ఎన్నికలలో పోటీ చేశాయి.

సోషలిస్టులు, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలు కూడా రంగంలో నిలిచాయి.

జస్టిస్ పార్టీ ఆత్మగౌరవ ఉద్యమంలో విలీనమైందని చెప్పినప్పటికీ , కొంతమంది జస్టిస్ పార్టీ సభ్యులు దానిని అంగీకరించలేదు. వారు రాజన్ నేతృత్వంలో విడిగా కొన్ని స్థానాలలో పోటీ చేశారు.

డీఎంకే ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ, పెరియార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులను బలపరుస్తున్నట్టు ప్రకటించింది. కమ్యూనిస్టులకు కూడా డీఎంకే మద్దతు అవసరమైంది. కానీ డీఎంకే కొన్ని షరతులు విధించింది. ద్రవిడనాడు విధానానికి మద్దతు పలకాలని, ఈ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌లో లేవనెత్తాలని లిఖిత పూర్వక హామీని కోరింది. వామపక్షాలకు ఇది రుచించలేదు.

కానీ తమిళనాడు లేబర్ పార్టీ, కామన్వెల్త్ పార్టీ ఈ షరతులను అంగీకరించాయి. దీంతో ఈ పార్టీ నిలిపిన అభ్యర్థులను బలపరుస్తామని డీఎంకే ప్రకటించింది.

ఫస్ట్ ఎలక్షన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

అంబేడ్కర్ ఓటమి

నార్త్ సెంట్రల్ ముంబాయి నుంచి పోటీచేసిన అంబేడ్కర్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ సదోబ్రా కజోల్కర్ చేతిలో 15వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ నుంచి పోటీచేసిన ఆచార్య కృపలానీ కూడా ఓడిపోయారు.

జాతీయస్థాయిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని గా ప్రమాణస్వీకారం చేశారు. నెహ్రూ విదేశీవ్యవహారాలు, రక్షణ శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అబుల్ కలామ్ ఆజాద్ విద్యాశాఖామంత్రిగా, గుల్జారీ లాల్ నందాకు, విద్యుత్, ప్రణాళిక శాఖ, లాల్ బహదూర్ శాస్త్రికి రైల్వే శాఖ, జగజ్జీవన్ రామ్ కు సమాచార మంత్రిత్వశాఖ కేటాయించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)