ఈ దీవి ప్రజలు ఏం తిని నూరేళ్లు బతుకుతున్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, క్రిస్టియానా స్లాటరీ
- హోదా, బీబీసీ ట్రావెల్
ఇకారియా- దీర్ఘాయువుతో జీవించే ప్రదేశాలుగా చెప్పే ఐదు బ్లూ జోన్లలో ఒకటి.
ఇకారియా ఒక గ్రీక్ దీవి.
తూర్పు ఏజియన్‌లో ఉన్న ఈ చిన్న దీవిలోని ప్రజలు ఇతర ప్రాంతాల్లో నివసించేవారి కన్నా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా తక్కవ.
ఈ దీవిలో సుమారు 8 వేల మందికి పైగా ఎక్కువ ఆయుర్ధాయం ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే, ఇకారియన్లలో మూడోవంతు వారు 90 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.
బలమైన సామాజిక బంధాలు, కుటుంబ సంబంధాలు, రోజువారీ దినచర్యలో భాగమైన వ్యాయామం, తరచూ నిద్రపోవడం లాంటి అంశాలు వీరి జీవితకాలం పెరగడంలో దోహదం చేస్తున్నాయని నమ్ముతారు. అలా చాలా మంది నూరేళ్ల జీవితాన్ని చూస్తున్నారు.
అయితే, మరొక్క ముఖ్యమైన విషయముంది. అదేంటంటే- ఆహారం.
మరి, వీరేం తింటారు?

ఫొటో సోర్స్, CHRISTOPHER BIERLEIN
మెడిటెరేనియన్ డైట్‌లాగానే ఇకారియా డైట్‌లోనూ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారమే ఉంటుంది.
ఎక్కువగా కాయగూరలు, దుంపలు, తృణధాన్యాలు, బీన్స్, వంటకాల్లో ఆలివ్ ఆయిల్.. వంటివి శరీరానికి కావల్సిన కొవ్వును అందించే ప్రధాన వనరులు.
యోగర్ట్, చీజ్, చేపలు, పౌల్ట్రీ, రెడ్ వైన్‌ల వంటివి మితంగానే తీసుకుంటారు. మాంసం కూడా నెలలో కొన్నిసార్లు మాత్రమే తింటారు.
ఇలాంటి ఆహార అలవాట్లు హృద్రోగాలు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు(హైబీపీ) లాంటి అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయి.
‘ది ఇకారియా వే’ పేరిట పుస్తకం రచించిన గ్రీక్-అమెరికన్ షెఫ్ డియన్ కొచిలాస్, ఇకారియా ఆహార అలవాట్లు, జీవనశైలిని అనుసరించాలనుకునే ఔత్సాహికులకు ‘బ్లూప్రింట్’ ఇస్తున్నారు. అక్కడి ప్రజల నుంచి స్ఫూర్తిపొంది ఆ పుస్తకంలో చాలా విషయాలు చర్చించారు.
ఆ పుస్తకం ప్రధానంగా రెండు ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఆమె చెప్పారు.
వాటిలో మొదటిది- మీ శరీరం పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉన్నారు?
రెండోది- వంట ఎలా చేసుకోవాలి? ప్రశాంతంగా, హాయిగా ఎక్కువ జీవితకాలాన్ని ఇచ్చే ఇకారియా జీవనశైలి స్ఫూర్తితో ప్రజలు ఆహార అలవాట్ల ద్వారా ఒకరికొరు కలిసి ఉండే స్ఫూర్తితో వంటలు ఎలా చేయాలి?
పుస్తకంలో ఆమె ప్రస్తావించిన వంటకాల్లో యోగర్ట్, వాల్‌నట్ సూప్, ఫెటా చీజ్‌తో అరుగులా సలాడ్, రెడ్‌వైన్‌లో ఉడికించిన స్పైసీ బ్రాడ్ బీన్స్, అన్నం, పప్పులు కలిపి చేసే వంటకం ఉన్నాయి.
“అన్నింటికన్నా ఇకారియన్లలో నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, వారు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు అని. అమెరికాలో ఒత్తిడి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మెదడు మొదలుకొని ప్రతి పనిని ప్రభావితం చేస్తుంది” అన్నారు.
తన పుస్తకం వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధను చూపేందుకు సహాయపడుతుందని కొచిలాస్ చెప్పారు. వారికి “ఆహారమూ ప్రేమను కురిపించేదే” అని చెప్పాలనుకున్నానని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బీన్స్ సీక్రెట్ ఏంటి?
కొచిలాస్ చాలా వంటకాల పుస్తకాలను ప్రచురించారు.
పీబీఎస్ మీడియాలో నిర్వహించిన మై గ్రీక్ టేబుల్ కుకింగ్ షోలో వ్యాఖ్యాతగా కూడా ఆమె వ్యవహరించారు. అదేకాక, ఇకారియాలో కుకింగ్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఆమె కుటుంబం ఇకారియాకు చెందినదే, తన జీవితంలో ఎక్కువ కాలం అక్కడే ఉన్నారు కొచిలాస్.
కుకింగ్ క్లాసులు చెప్తున్న సమయంలో ప్రేరణ పొంది మొక్క ఆధారిత 100 వంటకాల తయారీ విధానాలు(రెసపీలు) సిద్ధం చేశారు. తన కొత్త పుస్తకంలో వాటిని కూడా చేర్చారు.
పుస్తకంలో ఓ పేజీలో, “మోంటానా నుంచి ఇద్దరు అతిథులు వచ్చారు. వారికి వంటల పాఠాలు చెబుతున్న మూడో రోజు కిచెన్ కౌంటర్ దగ్గరకు రాగానే అక్కడ కనిపించిన మొక్కల ఆధారిత వంటకాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే- వారు రోజుకు మూడుసార్లు తీసుకునే ఆహారంలో మాంసం ఉంటుంది. ఇక్కడ అందుకు విరుద్ధం. మొక్కల ఆధారిత వంటకాలు వారికి వైవిధ్యంగా అనిపించాయి. నా కుకింగ్ క్లాసుల్లో అవి కనిపిస్తాయి” అని రాశారు.
ఇకారియాలో ఉన్న శాకాహార వంటలు ఆరోగ్యాన్ని పంచేవే కాకుండా, అనుకూలమైనవి కూడా.
అయితే, గ్రీస్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇకారియా దీవిలో కొంత మంది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ క్యాలెండర్‌ను అనుసరిస్తారు. ఆ ప్రకారం ఏడాదిలో కొన్ని సమయాల్లో మాంసం తినరు.
కొచిలాస్ తన పుస్తకంలో- “వంటల్లో కావాల్సిన పదార్థాలైన యోగర్ట్, తేనె, సముద్రపు ఉప్పు, ఆలివ్ నూనె, బీన్స్, తృణధాన్యాలు, వెల్లుల్లి, ఆకుకూరలు, పలు రకాల గింజలు ఇకారియాలో సమృద్ధిగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉన్నాయి” అని రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
“బీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ పాళ్లు తక్కువ ఉంటాయి. బీన్స్ గింజల్లో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది. అది కొలెస్ట్రాల్ అణువులను శరీరం నుంచి వేరు చేస్తుంది” అని పుస్తకంలో రాశారు కొచిలాస్.
“టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ, నిరోధించడంలోనూ ఇవి పనిచేస్తాయి” అని కొచిలాస్ చెబుతున్నారు.
‘‘బీన్స్ తినండి.. ఎక్కువకాలం జీవించండి’’ అనే అంశాన్ని తన పుస్తకంలో వివరించారు.
“బ్లూ జోన్లలో నివసించే ప్రజల ఆహారంలో అవి భాగం. వారు ఎందుకు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారో చెప్పే ఆధారం” అన్నారు.
“రోజూ ఒక కప్పు బీన్స్ తీసుకుంటే మరో నాలుగేళ్ల ఆయుష్షు పెరిగినట్లే” అని పరిశోధకులు డాన్ బట్నర్ చెప్పిన మాటలను కొచిలాస్ ఇక్కడ మరోలా చెప్పారు.
బీన్స్‌తో పలు రకాల సలాడ్‌లు, సూప్‌లు, ప్రధాన వంటలకు సంబంధించి తయారీ విధానాలు చాలానే ఆ పుస్తకంలో ప్రస్తావించారు కొచిలాస్.
వంకాయ, టొమాటో, ఫెటా చీజ్‌తో ‘వైట్ బీన్ క్యాస్రోల్’ తయారీ గురించి ఆమె రాసిన రెసపీలో, “గ్రీకు వంటకాల్లో ముఖ్యంగా బీన్స్, చిక్కుళ్లు కలిపి చేసే సులభమైన వంటకాల్లో ఇదీ ఒకటి” అని రాశారు.
ఇళ్లలో సులభంగా చేసుకోగలిగే ఈ వంటకం వల్ల గుండెకు మంచిది. అంతేగాకుండా, పోషకాలు సమపాళ్లలో లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- గాజా: యుద్ధ భూమిలో పారాచూట్లతో వదులుతున్న ఆహారం ఏమవుతోంది?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
- లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














