పుట్టగొడుగులు: దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి వీటిని ఎలా వాడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి?

క్లీవ్ ల్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిక్ హిల్డెన్
    • హోదా, ఫీచర్స్ కరస్పాండెంట్

క్లీవ్‌ల్యాండ్‌లో పాడుబడిన ఇళ్లు సమస్యగా మారాయి. వీటిలో చాలా పాత గృహాలు శిథిలావస్థకు చేరుకుని సీసం వంటి హానికరమైన పదార్థాలతో నిండిపోతున్నాయి.

ముఖ్యంగా వేల సంఖ్యలో ఉన్న ఈ ఇళ్లన్నింటినీ కూల్చివేసి శుభ్రం చేయడం పెద్ద సవాలు. దీంతో ఈ భవనాల నుంచి విషపూరిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి, శుభ్రపరచడానికి శిలీంధ్రాలను ఉపయోగించే విధానంపై శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

క్లీవ్‌ల్యాండ్‌లోని 'రెడ్‌హౌస్ స్టూడియో' ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించిన క్రిస్ మౌరర్, కూల్చివేసిన భవనాల నుంచి వచ్చే సీలింగ్ టైల్స్, సెల్యులోసిక్ మాస్ వంటి పదార్థాలను సబ్‌స్ట్రేట్ అనే పదార్థంలో కలపవచ్చని సూచిస్తున్నారు.

ఈ మిశ్రమం ఫంగస్ పెరగడానికి మంచిదంటున్నారు. క్లీవ్‌ల్యాండ్ హౌసింగ్, హెల్త్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సబ్‌స్ట్రేట్ సహాయం చేయవచ్చని మౌరర్ అభిప్రాయపడ్డారు.

శిలీంధ్రాలు ఆహారంగా తీసుకునే పదార్థమే ఈ సబ్‌స్ట్రేట్. శిలీంధ్రాలు పాడుబడిన ఇళ్ల నుంచి హానికరమైన వ్యర్థాలను తినేస్తాయి. హెవీ మెటల్స్, టాక్సిన్లను సంగ్రహిస్తాయి, తరువాత అవి పెరుగుతున్న పుట్టగొడుగులలో నిల్వ ఉంటాయి.

భవనం కోసం శుభ్రమైన ఇటుకలను తయారు చేయడానికి మైసిలియంతో పాటు మిగిలిన సబ్‌స్ట్రేట్ వేడి చేస్తారు. ఈ "మైకోబ్లాక్‌లు" ఆకృతిలో గట్టి చెక్క మాదిరి ఉంటాయి, తయారీ ప్రక్రియ ప్రత్యేకతలను బట్టి, ఇది కాంక్రీటు కంటే గణనీయంగా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది రెడ్‌హౌస్‌కు చెందిన 'బయోసైక్లర్ ప్రోగ్రామ్'. కాలుష్యాన్ని తొలగించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ప్రకృతి పురాతన బయోటెక్నాలజీలలో ఒకటైన శిలీంధ్రాల ద్వారా దాని ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న విభిన్న ప్రయత్నాలలో ఒకటి.

మైకోసైకిల్ అనే సంస్థ కార్పొరేట్ క్లయింట్‌ల కోసం నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుంటుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోవాన్ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ వ్యర్థాలను ప్రభావవంతంగా తరలిస్తున్నామని చెబుతున్నారు.

ప్రపంచంలోని 11 శాతం కార్బన్ ఉద్గారాలు భవన శిథిలాల నుంచే వస్తాయి. 2027 నాటికి మైకోసైకిల్ దాదాపు 160,000 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించగలదని జోవాన్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

క్లీవ్ ల్యాండ్

ఫొటో సోర్స్, redhouse studio

పుట్ట గొడుగులు ఏం చేస్తాయి?

పుట్టగొడుగుల్లో కొన్ని జాతులు వ్యర్థాలను తినేస్తాయి, కాలుష్య కారకాలను తొలగిస్తాయి, మన పరిసరాలను శుభ్రం చేయడానికి సాయపడతాయి. దీనిని మైకోరెమీడియేషన్ అంటారు. ఇది తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సర్క్యులర్ బయోఎకానమీకి దారి తీస్తుంది. వీటికి చాలానే ఉదాహరణలున్నాయి.

దిల్లీలో, కలుషితమైన గాలిని శుభ్రం చేయడానికి పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు, న్యూజిలాండ్‌లో కాలువల నుంచి నూనెను ఫిల్టర్ చేస్తారు. యూరప్ అంతటా లైఫ్ మై సోయిల్ వంటి పైలట్ ప్రాజెక్టుతో నేల కాలుష్య కారకాలను 90 శాతం తగ్గిస్తున్నాయి.

"శిలీంధ్రాలు ఎంజైమ్‌లను ఉపయోగించి కలప వంటి సంక్లిష్ట అణువులను విచ్ఛిన్నం చేయగలవు" అని పర్యావరణ శాస్త్రవేత్త బ్రెండన్ ఓబ్రియన్ వివరించారు.

పెట్రోలియం, ఫరెవర్ కెమికల్స్’‌గా పిలిచుకునే పీఎఫ్ఏఎస్, హెర్బిసైడ్లు, పురుగుమందుల వంటి కాలుష్య కారకాలను వాటి 'సారూప్య రసాయన నిర్మాణాల' కారణంగా శిలీంధ్రాలు విచ్ఛిన్నం చేయగలవని తెలిపారు. భారీ లోహాల వంటి కలుషితాలను కూడా శిలీంధ్రాలు కదలకుండా చేసి, సీసం తొలగించడంలో సహాయపడతాయి.

కోరెన్యువల్ సంస్థ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. వీటిలో అడవిలో మంటలు చెలరేగిన అనంతరం పచ్చదనం పునరుద్ధరణ, పర్యావరణంలో విషాన్ని తగ్గించడం మొదలైనవి ఉంటాయి.

వాస్తవానికి, ఈ సంస్థ పెట్రోలియంను విచ్ఛిన్నం చేయడం కోసం ఓస్టెర్ పుట్టగొడుగులను ఉపయోగించి ఈక్వెడారియన్ అమెజాన్‌లో చమురు కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2017 ఉత్తర కాలిఫోర్నియా అడవి మంటల తర్వాత, అక్కడ విషపూరిత బూడిద ప్రవాహాన్ని నిరోధించడానికి, పర్యావరణ వ్యవస్థలను పునరుత్పత్తి చేయడానికి శిలీంధ్ర పదార్థాలను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం, అమెరికా వెస్ట్ కోస్ట్ వెంబడి అటవీ మంటలు సంభవించే ప్రాంతాల్లో కోరెన్యువల్ సంస్థ ఈ పద్ధతిని పరీక్షిస్తోంది.

క్లీవ్ ల్యాండ్

ఫొటో సోర్స్, Christopher Maurer

పీఎఫ్ఏఎస్‌ను విచ్ఛిన్నం చేసే సాంకేతిక

పెట్రోలియంను విచ్ఛిన్నం చేసే శిలీంధ్రాల సామర్థ్యం బాగా తెలిసినప్పటికీ, పీఎఫ్ఏఎస్ వంటి ఇతర కాలుష్య కారకాల సామర్థ్యాల అన్వేషణకు మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇటీవల టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు పీఎఫ్ఏఎస్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.

"పీఎఫ్ఏఎస్‌ చికిత్సకు బయోరెమీడియేషన్ మిగతావాటికన్న ఖర్చుతో కూడుకున్న పద్ధతి" అని పరిశోధనలో పాల్గొన్న టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సూసీ డై వివరించారు. ఉదాహరణకు "థర్మల్ విధ్వంసం అందుబాటులో ఉన్నది, కానీ దీనికి చాలా శక్తి అవసరం" అని గుర్తుచేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె బృందం పీఎఫ్ఏఎస్‌ రసాయనాలను తొలగించడానికి, విచ్ఛిన్నం చేయడానికి మెరుగైన సామర్థ్యాలతో ఫంగల్ జాతుల కోసం శోధిస్తోంది.

ఈ నిరంతర, పెరుగుతున్న సాధారణ రసాయనాలను తొలగించడం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి గణనీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలందిస్తుంది.

మానవ ఆరోగ్యానికి పీఎఫ్ఏఎస్‌ ద్వారా కలిగే ఖచ్చితమైన ప్రమాదాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

జంతు నమూనాలు పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్తి, థైరాయిడ్ పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, అధిక మోతాదులతో కాలేయ పనితీరుపై దీని ప్రభావాలను సూచిస్తున్నాయి.

కొన్ని శిలీంధ్ర జాతులు పీఎఫ్ఏఎస్‌ హానికరమైన రసాయనాలను "డీఫ్లోరినేట్ (ఫ్లోరిన్ తొలగించడం)" చేయగలవని, వాటి విషాన్ని తగ్గించగలవని నిరూపించే సైంటిఫిక్ అధ్యయనంపై మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని బృందం పని చేస్తోంది.

"ఫ్లోరినేటెడ్ కార్బన్ బాండ్ చాలా బలమైన బంధం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో పర్యావరణం, పారిశ్రామిక మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జివీ జాంగ్ అంటున్నారు.

"అందుకే దీనిని ఎదుర్కోవడం చాలా కష్టం. మా పరిశోధన ప్రాథమికంగా ఉన్నప్పటికీ కొన్ని శిలీంధ్ర జాతులు ఈ స్థితిస్థాపక బంధాన్ని విచ్ఛిన్నం చేయగలవని కనుగొన్నాం. ఇది ఒక ప్రాథమిక విజయం. అంతర్లీనంగా సాగే చర్యలను అర్థం చేసుకోవడం మా తదుపరి దశ" అని అన్నారు.

పరిశోధన పురోగమిస్తున్న కొద్దీ, మైకోరెమీడియేషన్ పొటెన్షియల్ అప్లికేషన్లు విస్తరిస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.

క్లీవ్ ల్యాండ్

ఫొటో సోర్స్, Redhouse Studio

పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం

కానీ, దాన్ని అలా కొనసాగించడమే మంచిదని జాంగ్ హెచ్చరించారు.

‘‘పర్యావరణాన్ని సరిదిద్దేందుకు శీలీంద్రాలను ఉపయోగించడం అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం జీవావరణంలో కొత్త పరిస్థితులను సృష్టిస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఎత్తున పుట్టగొడులను వృద్ధి చేస్తున్నాం. అవి సాధారణ వాతావరణంలోకి వస్తున్నాయి. పొలాల్లో సహజంగా పెరిగే పుట్టగొడుగులకు ఇవి పోటీ అవుతాయి. అలాగే వాటిని నాశనం చేసే అవకాశం కూడా ఉంది. ఇది సహజంగా పుట్టే పుట్టగొడుగు జాతులకు పెను ప్రమాదం కావచ్చన్న ఆందోళన ఉంది’’ అని అన్నారు.

జాంగ్ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ఈ మానవ ప్రయత్నం ఎంతో ఉపయోగపడవచ్చు.

ఉదాహరణకు, నమీబియాలో గృహ సంక్షోభాన్ని నివారించడానికి మౌరర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మైకోరెమీడియేషన్, మైకోకన్‌స్ట్రక్షన్‌ విధానంతో ప్రయోగాలు చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా నమీబియాలో గృహ సంక్షోభం ఏర్పడింది.

పూర్తిగా మైకోరెమీడియేటెడ్ మెటీరియల్‌తో నిర్మించిన మొట్టమొదటి ఇంటిని మౌరర్ ఇటీవలే నిర్మించారు.

నమీబియాలో పనిచేస్తున్నప్పుడు, చెదపురుగులు, ఒమాజోవా అనే నమీబియా పుట్టగొడుగుల మధ్య సంబంధం గురించి మౌరర్ తెలుసుకున్నారు. చెదపురుగులు వాటి పుట్టలలో ఆకులను పేర్చుతాయి. అవి ఒమాజోవా మైసిలియంను అనే రసాయనాన్ని సేకరించడానికి వీటిని ఉపయోగిస్తాయి. ఈ ఒమాజోవా మైసిలియం ఆ చెదపురుగులు ఆకులను సులభంగా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

రెండోది, గాలి చొరబడగలిగే ప్రాంతంలో ఇది తేమ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే ఇది వాటి పుట్టల్లో ఒకరకంగా ఎయిర్ కండిషన్‌లాగా ఉపయోగపడుతుంది. ఒమజోవా పుట్టగొడుగులు పుట్టల నుంచి బయటకు వచ్చినప్పుడు నమీబియన్లు వాటిని సేకరించి తింటారు.

ఇలా ప్రకృతిలో దొరికే సూక్ష్మ స్థాయి టెక్నాలజీలను పెద్ద స్థాయిలో వినియోగించడం ఆచరణాత్మకంగా ప్రయోజనాన్ని కలిగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)