గాజా: యుద్ధ భూమిలో పారాచూట్లతో వదులుతున్న ఆహారం ఏమవుతోంది?

గాజాలో ఆకాశం నుంచి ఆహారాన్ని జారవిడుస్తున్న దృశ్యాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం అందించేందుకు ఆకాశం నుంచి మానవతా సాయాన్ని జారవిడచడమే చివరి పరిష్కారంగా ఉంది.
    • రచయిత, లూసీ విలియమ్‌సన్
    • హోదా, బీబీసీ న్యూస్

గాజాకు తూర్పున సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో అమెరికా మిలిటరీ రవాణా విమానంలో పెద్ద మొత్తంలో సహాయ సామాగ్రి నింపే పని జరుగుతోంది.

అక్కడున్న సిబ్బంది 80 బాక్సులను విమానంలోని తీసుకెళుతున్నారు. ప్రతి బాక్సుకు పైన ఒక పారాచూట్ కట్టి ఉంది.

గాజా ప్రజలకు ఆహారం అందించడం కోసం జరుగుతున్న ఒక క్లిష్టమైన ఆపరేషన్ ఇది. రాయల్ ఎయిర్ ఫోర్స్ తన రెండు విమానాలతో ఈ వారంలోనే ఈ తరహా సహాయ కార్యక్రమాలను అందించింది. ఈ ఆపరేషన్‌లో ఫ్రాన్స్, జర్మనీ, జోర్డాన్, ఈజిప్ట్, యుఏఇ కూడా పాల్గొంటున్నాయి.

అమెరికా బలగాలు పంపిస్తున్న 18వ మిషన్ ఇది. ఇప్పటికే దాదాపు 40వేల ఆహారపు పొట్లాలను యుద్ధ పీడిత గాజా ప్రాంతంలో వదలడానికి దోహా నుంచి 6 గంటలపాటు విమానాలు ప్రయాణించాల్సి ఉంది.

దూరం కారణంగా ఇది ఇప్పటి వరకు అందిస్తున్న అత్యంత ఖరీదైన సహాయంగా మారింది. పైగా ఈ ఆపరేషన్ నిర్వహించడంలో అనేక సమస్యలున్నాయి. ప్రమాదం జరిగితే అదుపు చేయడం కూడా కష్టమే.

మానవతా సాయ విమానం

ఈవారం ప్రారంభంలో సముద్రంలో పడిపోయిన ఆహారపు పొట్లాలను తీసుకోవడం కోసం వెళ్లి 12 మంది గాజా వాసులు నీళ్లలో మునిగి చనిపోయారు. మరొకచోట ఈ ప్యాకెట్ల కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారని వార్తలు వచ్చాయి.

‘‘మాకు ఈ విషయాలన్నీ తెలుసు. అందుకే ప్రాణనష్టం లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని మిషన్ కమాండర్ మేజర్ బూన్ అన్నారు.

‘‘అక్షరాలా మేం చేయగలిగినదంతా చేస్తున్నాము. పారాచూట్‌ నెమ్మదిగా దిగేలా చూస్తున్నాం. దీని వల్ల గాజా ప్రజలు వాటిని గుర్తించేందుకు ఎక్కువ సమయం ఇస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

"డ్రాప్ జోన్‌లలో జనం లేకుండా క్లియర్ చేసే వ్యవస్థ కూడా మా దగ్గర ఉంది. అందువల్ల ఎక్కువమంది జనం గుమిగూడిన ప్రాంతంలో ఈ ఆహారపు పొట్లాలు చేయడం లేదు’’ అని ఆయన అన్నారు.

గాజా తీరం వెంబడి సురక్షితమైన, ఓపెన్ స్పేస్‌లలో సహాయ సామాగ్రిని దింపాలనే లక్ష్యంతో సిబ్బంది మార్గన్ని జాగ్రత్తగా మ్యాప్ చేశారని ఆయన చెప్పారు. ఒకవేళ పారాచూట్ పని చేయకపోతే ఈ బాక్సులు ఇళ్ల మీద మనుషుల మీదా పడకుండా నీటిలో పడేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

అంత తేలికైన పని కాదు.

భారీ సైజులో ఉండే మిలిటరీ కార్గో విమానం చేసే శబ్ధం పదుల కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో జనం ఆహారం కోసం గుమిగూడే, ఎగబడే అవకాశం ఉంది.

నిస్పృహలో ఉన్న గాజా ప్రజలు సహాయ సామాగ్రి కోసం రిస్క్ చేయడానికి కూడా వెనకాడరు. అయినా సరే..చాలామంది ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ప్రాణ నష్టం పెరిగిపోవడంతో ఈ విధానం సరైంది కాదని, ఆకలితో ఉన్న ప్రజలకు ఇది మరో ప్రమాదమని, కాబట్టి వాటిని జారవిడవడం ఆపేయాలని హమాస్ డిమాండ్ చేసింది.

భూమి మీదకు చేరిన సహాయ సామాగ్రిని పంపిణీ చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది.

''పారాచూట్ల ద్వారా కిందపడుతున్న సాయం ఆ ప్రాంతంలోని వేల మంది పౌరులకు కనిపిస్తోంది. కానీ, వారిలో కేవలం 10 నుంచి 20 మందికి మాత్రమే అవి దక్కుతున్నాయి. మిగిలిన వారు ఒట్టిచేతులతో వెనుదిరగాల్సిందే. దురదృష్టం ఏంటంటే, ఆకాశం నుంచి సాయం జారవిడిచే పద్ధతి గాజా ఉత్తర ప్రాంతానికి అంత అనువైనది కాదు'' అని బీబీసీ అరబిక్‌కు చెందిన లైఫ్‌లైన్ రేడియోతో గాజా నివాసి ఇస్మాయిల్ మోక్బెల్ చెప్పారు.

''భూమార్గంలో లేదా జలమార్గంలో వచ్చి సాయం చేయడం ఉత్తమం. ఈ ఎయిర్‌డ్రాప్ విధానం ఇక్కడి జనం అవసరాలను తీర్చలేదు.'' అని అన్నారు.

గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో పడిన బాక్సుల ద్వారా సాయం పొందలేక పోయానని అబూ యూసెఫ్ అనే మరో వ్యక్తి చెప్పారు.

మొదట ఈ బాక్సులు వేగంగా కిందికి సాగడం కనిపించింది. తర్వాత పారాచూట్లు తెరుచుకోవడంతో అవి సముద్రం మీద ఎగురుతూ కనిపించాయి. రెండు బాక్సులు మాత్రం పారాచూట్లు తెరుచుకోకపోవడంతో సముద్రంలో పడిపోయాయి.

అమెరికా సైనిక విమానం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మానవతా సాయాలను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్న విమానాల ఫోటోలను విడుదల చేసిన అమెరికా సైన్యం

గాజా ప్రజల ఆకలి తీర్చడానికి ఇదే సరైన మార్గమా అని అని నేను అడిగినప్పుడు ‘‘ఇది కరెక్టు కాదని మాకు అనిపిస్తుంది. కింద ఆహారం ఎదురుచూస్తున్న 20 లక్షలమందికి పైగా ప్రజలున్నారు. కానీ మేం కేవలం 10 వేలమందికి మాత్రమే భోజనం అందించగలుగుతున్నాం’’ అని అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి మేజర్ ర్యాన్ డీక్యాంప్ అన్నారు.

‘‘ఇది ఒక బకెట్‌లో నీటి చుక్కలా అనిపిస్తుంది కదూ. నిజమే. కానీ, కొందరి ప్రాణాలనైనా నిలబెట్టే అవకాశమైతే ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

బీబీసీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రచయిత లైసీ విలియమ్‌సన్, గాజాలో దిగుతున్న అమెరికా పారాచూట్‌లను చూశారు. ఆ రోజు 11 ఎయిర్ డ్రాప్‌లు దిగినట్లు గుర్తించారు.

తమ కోసం ఆహారాన్ని తీసుకొచ్చే విమానాల కోసం గాజాలోని ఉత్తర భూభాగంలో కొందరు ప్రజలు రోజుల తరబడి ఆకాశంలోకి చూస్తున్నారని చెప్పారు.

‘‘ఈ ఉదయం రెండుసార్లు మేం ప్రయత్నించాం. కానీ, దొరకలేదు.’’ అని గాజా నగరంలోని నివాసి అహ్మద్ తఫేష్ చెప్పారు. ‘‘బీన్స్ క్యాన్‌నుగానీ, హుమున్స్‌నుగాని దొరకబుచ్చుకుంటే ఆ రోజుకు తిండి ఉంటుందనే ఆశ ఉండేది. ఆకలి చాలామందిని చంపేస్తుంది. వారిలో శక్తి లేదు’’ అని అన్నారు.

ఇటీవల విడుదలైన గ్లోబల్ అసెస్‌మెంట్ నివేదిక, గాజాలో ఆహారపు కొరత తీవ్రస్థాయిలో ఉండబోతుందని హెచ్చరించింది. మానవతా సాయానికి ఎలాంటి అడ్డంకి లేకుండా తక్షణమే ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని ఐరాస అత్యున్నత న్యాయస్థానం ఈ వారం ఆదేశాలు జారీ చేసింది.

‘‘ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం అందించేందుకు మేం చేయగలిగిందంతా చేస్తున్నాం’’ అని మేజర్ బూన్ చెప్పారు.

గాజా

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘‘ఇతరులు కూడా ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు. కానీ, వారు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని మా సీ17 టీమ్ గుర్తించింది. ఇక్కడి నుంచి 36 గంటల్లో, అవసరమైన వారికి ఆహారం అందించేందుకు మేం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

అయితే, క్షామం అంచనాలను, ఐరాస కోర్టు ఆదేశాలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. మానవతా సాయాన్ని అడ్డుకుంటున్నామన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పింది. ఈ సాయాన్ని హమాస్ దొంగలిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో విభేదాలకు గాజాకు అందించే మానవతా సాయం కూడా ఒక అంశంగా నిలుస్తోంది.

గాజా ప్రజలకు వేగంగా మానవతా సాయన్ని అందించేందుకు గాజాలో అమెరికా తాత్కాలికంగా ఒక పియర్(సముద్రం మీద నిర్మించే బ్రిడ్జిలాంటి నిర్మాణం) ఏర్పాటు చేసింది.

గాజా నగరానికి 48 కిమీల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ కార్గో పోర్టు మానవతాసాయానికి అందుబాటులో లేదు.

ల్యాండ్ కాన్వాయ్‌లకు యాక్సస్‌ను విస్తరించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒత్తిడి తెస్తున్నారు.

గాజా ఆస్పత్రుల్లో చాలా మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో మరణిస్తున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారు.

అరబ్, పశ్చిమ దేశాలలో మానవతా సాయం అందించే విమానాలు పెరుగుతున్నాయి. కష్టమైనా, పెద్దగా ఫలితమివ్వకపోయినా, ఆకలితో ఉన్న ప్రజలకు తక్కువ మొత్తంలో అయినా ఆహారం అందించేందుకు చూస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఇది దురదృష్టకరమే అయినా, యుద్ధంలో ఇవి మామూలేనన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)