రంజాన్-గాజా: రోజుల తరబడి పస్తులతో ప్రాణాలు విడుస్తున్న చిన్నారులు

రఫీక్ దగ్మౌస్

ఫొటో సోర్స్, Mohammed Shahin/BBC

ఫొటో క్యాప్షన్, గాజా నగరంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న 16 ఏళ్ల రఫీక్ దుగ్మౌస్
    • రచయిత, జోయెల్ గుంటెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, జెరూసలేం

నెలవంక దర్శనంతో గత సోమవారం ఉదయం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. కానీ, గాజాలోని ప్రజలకు మాత్రం దారుణమైన పరిస్థితులను తీసుకొచ్చింది.

ముస్లిం ప్రజలు పగలంతా ఉపవాసం ఉండే రంజాన్ మాసం ఈసారి గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో వచ్చింది.

గాజా ప్రజలు గత ఐదు నెలలుగా భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆ దేశ ప్రజలంతా ప్రస్తుతం మానవతా సాయం కింద అందే ఆహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు.

‘‘ఇప్పటికే ఇక్కడ ప్రజలు గత కొన్ని నెలలుగా ఉపవాసం ఉండాల్సి వచ్చింది’’ అని గాజా నగరంలోని అల్-షైఫా హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అమ్జాద్ ఎలీవా చెప్పారు.

‘‘బతికేందుకు వారు ఆహారం కోసం చూస్తున్నారు. కానీ, ఎక్కడా దొరకడం లేదు’’ అని అన్నారు.

గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో ఆహారం కోసం క్యూ కట్టిన పాలస్తీనా చిన్నారులు

హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడులకు ప్రతిగా, ఇజ్రాయెల్ గాజాలో బాంబుల వర్షం కురిపిస్తోంది.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులకు ఆ ప్రాంతంలోని పంట భూములు దెబ్బతిన్నాయి. ఆహార సదుపాయాలు నాశనమయ్యాయి.

మానవతా సాయం కింద వస్తున్న డెలివరీ ట్రక్కులపై ఇజ్రాయెల్ చేస్తున్న భద్రతా తనిఖీల వల్ల అవి గాజా ప్రజలను చేర్చేందుకు ఇబ్బందికరంగా మారుతోందని సహాయక సంస్థలు చెబుతున్నాయి.

గాజాలో సగం జనాభా అంటే 11 లక్షల మంది ఈ సోమవారం తమకు తెలియకుండానే ఉపవాసంతో ఉన్నారని, జూలై నాటికి మిగతా ప్రజలు కూడా ఈ క్షామాన్ని ఎదుర్కొంటారని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేస్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) నివేదించింది. ఈ సంస్థ దేశాల్లోని క్షామ పరిస్థితులను అంచనా వేస్తుంటుంది.

ఉత్తర గాజాలో ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. అంతకుముందటి రంజాన్‌లాగా కాకుండా, ఇక్కడి ప్రజలు సూర్యోదయానికి ముందే అల్ఫాహారాన్ని తీసుకుని, రోజంతా ఉపవాస దీక్షలు చేపట్టే రోజులు లేవు. ఇఫ్తార్‌తో వారి ఉపవాసాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు.

రంజాన్ మాసంలో వీధుల్లో కనిపించే అలంకరణ, డ్రమ్మర్లు, కళకళలాడే స్టాళ్లు ఏవీ లేవు.

గాజాలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ధ్వంసమైన భవంతులు, మరణాలు, ఆహారం కోసం ఎదురుచూపులే కనిపిస్తున్నాయి.

గోధుమ పిండి ధరలైతే ఐదింతలు మేర పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి.

ఖలేద్ నాజి, ఆయన కుటుంబం

ఫొటో సోర్స్, Majdi Fathi/BBC

ఫొటో క్యాప్షన్, గాజాలో కూలిన తమ ఇంటి శిథిలాలపైనే రంజాన్ ప్రార్థనలు చేసుకుని, దొరికిన కాస్తంత భోజనంతో ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్న ఖలేద్ నాజి, ఆయన కుటుంబం

‘‘గత రంజాన్ నాకు గుర్తుంది. జ్యూస్‌లు, డేట్స్, మిల్స్ ఇలా మాకు కావాల్సిన ప్రతిదీ దొరికేది’’ అని 57 ఏళ్ల నదియా అబు నాహెల్ చెప్పారు. గాజా నగరంలో 10 మంది పిల్లలున్న కుటుంబాన్ని ఆమె చూసుకునేవారు.

‘‘ఈ ఏడాదితో పోల్చి చూస్తే, అది స్వర్గం, ఇది నరకం మాదిరి ఉంది. పిల్లలు ప్రస్తుతం వారు కోరుకునే రొట్టె ముక్క కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బక్కచిక్కిపోయారు. నీరసపడిపోతున్నారు. నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆమె చెప్పారు.

పావర్టీ చారిటీ కేర్ ప్రకారం, ఇటీవల కాలంలో ఉత్తర గాజాలో చనిపోయిన 27 మంది పిల్లల్లో 23 మంది పౌష్టికాహార లోపం లేదా డీహైడ్రేషన్ వల్లనే చనిపోయినట్లు తెలిసింది.

ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఉత్తర గాజాలోని పలు ఆస్పత్రిల్లోని డాక్టర్లు చెప్పారు.

‘‘రంజాన్ నెలలో గత వారం 10 నుంచి 12 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి చనిపోయాడు. తల్లి మరణించడంతో, పాలు లేక నాలుగు నెలల పిల్లాడు చనిపోయాడు. 18 ఏళ్ల బాలిక ఇప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది’’ అని పౌష్టికాహార లోపానికి చికిత్స అందించే అల్-షైఫా హాస్పిటల్‌లోని డాక్టర్ ఎలీవా చెప్పారు.

‘‘ఇప్పటికే ఆ బాలిక అనారోగ్యంతో ఉంది. ఆమెకు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో లేదు. ఆమె కుటుంబం ఆహారం అందించలేని పరిస్థితుల్లో ఉంది’’ అని ఎలీవా తెలిపారు.

‘‘చివరికి ఆమె శరీరం కుచించుకుపోయింది. కేవలం చర్మం, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. శరీరంలో కొవ్వు పదార్థమే లేదు’’ అని తెలిపారు.

ఆయన చికిత్స చేస్తున్న వారిలో 16 ఏళ్ల బాలుడు రఫీక్ దుగ్మౌస్ ఒకరు. ఈ బాలుడు బెడ్‌పై ఒక వైపుకి తిరిగి పడుకుని ఉన్నాడు. రఫీక్‌లో ఎముకలు, బక్కచిక్కిపోయిన ఆయన ఒక కాలు తప్ప శరీరమే లేదు. ఆయనకు కోలోస్టోమీ బ్యాగ్‌ను అమర్చారు.

రఫీక్ దుగ్మౌస్

ఫొటో సోర్స్, Mohammed Shahin/BBC

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడిలో ఒక కాలును పోగొట్టుకున్న రఫీక్ దుగ్మౌస్, పౌష్టికాహార లోపంతో కదలేని స్థితిలో ఉన్నాడు

‘‘నేను కృశించిపోయాను’’ అని మెల్లగా శ్వాస తీసుకుంటూ చెప్పలేక చెప్పాడు. ‘‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఒక వైపు నుంచి మరో వైపుకు కూడా నేను నాశరీరాన్ని కదల్చలేకపోతున్నాను. అంకులే నన్ను పక్కకు తిప్పుతున్నాడు’’ అని తెలిపాడు.

రఫీక్, అతని చెల్లి 15 ఏళ్ల రఫీఫ్ ఇజ్రాయెల్ తమ ఇంటిపై జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబంలో 11 మంది చనిపోయారని వారి అంకుల్ మహమూద్ చెప్పారు. చనిపోయిన వారిలో వారి తల్లి, నలుగురు తోబుట్టువులు, వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఉన్నారు. దుగ్మౌస్ కూడా ఒక కాలును పోగొట్టుకున్నాడు.

ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడకుండా ముందు నుంచే రఫీక్ తీవ్ర పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నాడని డాక్టర్లు చెప్పారు.

‘‘తినడానికి పండు కూడా దొరకడం లేదు. యాపిల్ లేదు. జామ కాయ లేదు. కనీసం ఎలాంటి ఆహారం లేదు. మార్కెట్లలో ప్రతిదీ ఖరీదైనదిగా ఉంది’’ అని తెలిపారు.

రంజాన్ అంటే అప్పట్లో స్వచ్ఛమైన ఆనందం మాత్రమేనని రఫీఫ్ తెలిపింది. ‘‘ అదొక స్వర్గంలా ఉండేది.’’ అని చెప్పింది.

‘‘కానీ, ఈ పరిస్థితులు మళ్లీ రావొద్దు. మా జీవితాల్లో ఉన్నతమైన వ్యక్తులందర్ని పోగొట్టుకున్నాం’’ అని రఫీఫ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

రఫీఫ్ దుగ్మౌస్

ఫొటో సోర్స్, Mohammed Shahin/BBC

ఫొటో క్యాప్షన్, వైమానిక దాడుల్లో తన 11 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న రఫీఫ్ దుగ్మౌస్

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను డాక్టర్లు అల్-షైఫా ఆస్పత్రి నుంచి కమల్ అద్వాన్ హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.

ఎందుకంటే, ఆ ఆస్పత్రిలో పిల్లలకు చికిత్స చేసే మెరుగైన సౌకర్యాలున్నాయి. కానీ, ఇప్పటికే చాలా మంది చిన్నారులు చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

గత నాలుగు నెలలుగా డీహైడ్రేషన్ లేదా పౌష్టికాహార లోపంతో ఆస్పత్రిలో 21 మంది చిన్నారులు చనిపోయినట్లు కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని పీడియాట్రిక్స్ విభాగానికి హెడ్‌గా ఉన్న డాక్టర్ హస్సమ్ అబు సఫియా తెలిపారు.

ప్రస్తుతం 10 మంది చిన్నారులు తీవ్ర కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పిల్లల్ని కాపాడటంలో తాను నిస్సహాయంగా మారానని డాక్టర్ సఫియా తెలిపారు.

“నా ఉద్యోగుల విషయంలో కూడా నాకు ఇదే బాధ ఉంది. వారు సరైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. తినకుండా పస్తులుంటున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఆకలితో మాడాల్సి వస్తుంది’’ అని అన్నారు.

ఇజ్రాయెల్ కావాలనే గాజా ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తోందని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన అధినేత జోసెఫ్ బోరెల్ తెలిపారు.

‘‘ఇది ఆమోదించదగ్గ విషయం కాదు. ఆకలిని ఇజ్రాయెల్ యుద్ధానికి ఆయుధంగా వాడుకుంటుంది. ఇజ్రాయెల్ క్షామాన్ని మరింత రెచ్చగొడుతుంది’’అని ఆరోపించారు.

ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గత వారం ఖండించారు.

చిన్నారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పాలస్తీనా బాలుడు

కానీ, గాజా ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ‘‘ అక్కడి పరిస్థితులు ఈ నిజాన్ని చెబుతున్నాయి’’ అని మిడిల్ ఈస్ట్‌లోని ప్రపంచ ఆహార కార్యక్రమానికి చెందిన సీనియర్ అధికార ప్రతినిధి అబీర్ ఈటెఫా చెప్పారు.

‘‘ఐపీసీ ఫేస్ 5 అంటే తీవ్రమైన ఆకలి విపత్తును 11 లక్షల మంది ప్రజలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న మూడొంతుల కంటే ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. అంటే, వారు చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

చారిటీ సంస్థ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌ నుంచి గాజా ప్రజలకు శుక్రవారం 200 టన్నుల ఆహార సాయం అందింది.

ధ్వంసమైన భవంతుల శిథిలాలను వాడుతూ వరల్డ్ సెంట్రల్ కిచెన్ గాజా తీర ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రేవుకట్టపై పెద్ద పడవలో ఆహారాన్ని సిద్ధం చేసే ఏర్పాట్లు చేసింది.

నార్త్, సెంట్రల్ గాజాలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని ఇది కాస్త తగ్గిస్తుందని భావిస్తున్నారు. రంజాన్‌ను గుర్తుకు చేస్తూ ఇది కాస్త వారికి ఊరటనిచ్చింది.

‘‘గాజాపై అధికారాన్ని చేజిక్కించుకునేందుకు, గాజా ప్రజల అవసరాలను లేదా మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ దేశం అడ్డుకుంటుంది’’ అని యూఎన్ శరణార్థుల సంస్థ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియట్ టూమా చెప్పారు.

గాజా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వరల్డ్ సెంట్రల్ కిచెన్‌లాగా సెంట్రల్ గాజాలో కూలిపోయిన తమ ఇంటి శిథిలాలపై ఖలేద్ నాజి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆకలితో ఉన్న వారి కోసం ఆహారం సిద్ధం చేస్తున్నారు.

‘‘మాకు ఈ సాయం కావాలి. వారు మానవతా సాయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, మాకేమీ అందడం లేదు’’ అని ఖలీదా నాజి చెప్పారు.

‘‘మేం భగవంతుడి కోసం ఉపవాసం చేస్తుంటాం. కానీ, ఈ ఏడాది మేం దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం’’ అని నాజి చెప్పారు.

ఖలేద్ నాజి

ఫొటో సోర్స్, Majdi Fathi/BBC

‘‘సూర్యోదయం లేదు. ఉపవాసం వదిలేసే క్షణాలు లేవు. ఎప్పుడూ పాటించే పద్ధతులను ఆచరించడం లేదు. మా పిల్లలకి మంచి బట్టలు వేసి, ప్రార్థనలకు తీసుకెళ్లడం లేదు. మా విశ్వాసాల గురించి వారికేం నేర్పించడం లేదు. చిన్న రొట్టె ముక్కయినా పిల్లలకు పెట్టాలనుకుంటున్నాం. ఏ బాంబు వచ్చి మీద పడుతుందేమోనని భయపడుతున్నాం’’ అని తెలిపారు.

సూర్యాస్తమయం కాగానే, కాంక్రీటు స్లాబ్‌పై ఒక దుప్పటి వేసి, ఆయన తన కుటుంబంతో కలిసి భవన శిథిలాలపైనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. సాయంత్రం కాస్తంతా తాజా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అంతకుముందు కొన్ని రోజులు అయితే పూర్తిగా పస్తులుండే వారు.

‘‘గాజా స్ట్రిప్‌లో ప్రస్తుతం మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చనిపోయిన వారి పట్ల నాకు అసూయ కలిగేలా చేస్తున్నాయి ఈ పరిస్థితులు’’ అని నాజి చెప్పారు.

‘‘ఈ ఏడాది రంజాన్ కాదు. పేరు మార్చాలి. మేం మరణాల నెలలో ఉన్నాం’’ అని నాజి ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, గాజా ప్రజలకు సాయం అందకుండా చేయడం యుద్ధ నేరం అవుతుందన్న యూఎన్ సీనియర్ అధికారి

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)