దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో అత్యధికుల దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ విమర్శలు కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధి చేస్తామని చెప్తోంది.
ఇంతకూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిందా? మొత్తం భారతదేశాన్ని పక్కనపెడితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానమేంటి? విద్య, వైద్యం, ఆర్థికం వంటి కీలక రంగాల్లో ఏపీ ఎక్కడుంది?

ఫొటో సోర్స్, AP SPECIAL STATUS CAMPAIGN
జీఎస్‌డీపీ: దక్షిణాదిలో నాలుగో స్థానం
2022-23 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలు అయిదింటి జీఎస్‌డీపీ వాటా దేశ జీడీపీలో 30 శాతంగా ఉంది. దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలలో చూసుకుంటే జీఎస్డీపీ విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం నాలుగు.
తమిళనాడు జీఎస్‌డీపీ అన్నిటికంటే అధికంగా రూ. 24.8 లక్షల కోట్లు ఉండగా రూ. 22.4 లక్షల కోట్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత రూ. 13.3 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ రూ. 13.2 లక్షల కోట్లు.
కేరళ జీఎస్‌డీపీ రూ. 10 లక్షల కోట్లు.

ఫొటో సోర్స్, Getty Images
తలసరి ఆదాయం: దక్షిణాదిలో అట్టడుగున ఏపీ
తలసరి ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ. 2,75,443 తలసరి ఆదాయంతో దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో అగ్రస్థానంలో ఉంది.
ఆ తరువాత స్థానాల్లో కర్ణాటక- రూ. 2,65,623, తమిళనాడు- రూ. 2,41,131, కేరళ- రూ.2,30,601 ఉన్నాయి.
రూ. 2,07,771 తలసరి ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ ఈ అయిదు రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉంది.
అయితే, తలసరి ఆదాయ జాతీయ సగటు రూ. 1,50,007తో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు అయిదూ మెరుగ్గా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పులు-జీఎస్‌డీపీ నిష్పత్తి ఎలా ఉంది?
ఏ ఆర్థిక వ్యవస్థనైనా అంచనా వేయడంలో కీలకమైన ‘అప్పులు-జీఎస్‌డీపీ నిష్పత్తి’(Debt to GSDP ratio) విషయంలో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ మెరుగ్గా ఉంది. ఆ తరువాత స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ‘అప్పులు-జీఎస్‌డీపీ నిష్పత్తి’ 32.8 శాతంగా ఉంది. 37.2 శాతంతో అట్టడుగున ఉన్న కేరళ కంటే ఏపీ ఒక స్థానం ముందు ఉంది.
తమిళనాడు ‘అప్పులు-జీఎస్‌డీపీ నిష్పత్తి’ 27.7 శాతంగా, కర్ణాటకది 27.5 శాతంగా, తెలంగాణది 25.3 శాతంగా ఉన్నాయి.
సామాజిక ప్రగతి సూచీలో ఎన్నో స్థానం?
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్’ సమర్పించిన ‘సామాజిక ప్రగతి సూచీ’ నివేదిక ప్రకారం 2023 నాటికి దేశంలోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో ఉంది.
ఈ సూచీలో దక్షిణాదిలోని తమిళనాడు ఆరో స్థానంలో, కేరళ తొమ్మిదో స్థానంలో, కర్ణాటక 17వ స్థానంలో, తెలంగాణ 26వ స్థానంలో ఉన్నాయి.
ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం.
పోషకాహారం, కనీస వైద్య సదుపాయాలు, నీరు, శుభ్రత, వ్యక్తిగత భద్రత, ఆశ్రయం లాంటి కనీస మానవ అవసరాలు, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ సదుపాయాలు, ఎన్విరాన్‌మెంటల్ క్వాలిటీ వంటివి.. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు పొందడం, ఆధునిక విద్యకు ఉన్న అవకాశాలు లాంటి అనేక అంశాలు ఆయా రాష్ట్రాల్లో ఎంత వరకు అందుబాటులో ఉన్నాయనే ప్రాతిపదికన ఈ సూచీ రూపొందించారు.
మహిళల్లో రక్తహీనత, మాతాశిశు మరణాలు, అంటువ్యాధులు, ఆరోగ్య కేంద్రాల సంఖ్య, పోషకాహార లోపం, విద్యుత్ కోతలు, విద్యుత్ సదుపాయం లేని ఇళ్లు, మహిళలపై నేరాలు, గృహ హింస, చిన్నపిల్లలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, స్కూల్స్ కనెక్టివిటీ, డ్రాపవుట్స్, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి, పిల్లల విద్యాస్థాయి, ఆన్‌లైన్ సేవల అందుబాటు, కంప్యూటర్ ఉన్న ఇళ్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వ్యాక్సినేషన్, గాలి నాణ్యత, నీటి నాణ్యత, న్యాయ సేవలు, బాల కార్మికులు, అవినీతి, కుటుంబ నియంత్రణ, ఎస్సీ, ఎస్టీలపై హింస లాంటి సుమారు 100 కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రూపొందించిన సూచీ ఇది.
ఈ సూచీలో పుదుచ్చేరి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముందుండగా ఝార్ఖండ్ అట్టడుగున ఉంది.

ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి?
అభివృద్ధి కొలమానాలలో ఒకటిగా నీతి ఆయోగ్ పరిగణించే ‘హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’లో కొన్ని విషయాలలో ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంది.
2022 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీలలో) 1142 మంది వైద్యుల అవసరం ఉండగా 2,206 పోస్ట్‌లు శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 158 ఖాళీలు ఉండగా 2048 మంది విధుల్లో ఉన్నారని, కొరత లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజిన్స్ విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ చెప్తోంది.
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ అవసరాని కంటే ఎక్కువ మంది వైద్యులే పీహెచ్‌సీలలో పనిచేస్తున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి.
కర్ణాటకలో మాత్రం పీహెచ్‌సీలలో 2,138 మంది వైద్యులు అవసరం ఉండగా, 2022 నాటికి 2078 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 60 మంది వైద్యుల కొరత ఉంది.
శస్త్రచికిత్స నిపుణులు, గైనకాలజిస్టులు, పిల్లల వ్యాధుల నిపుణులు, ఇతర స్పెషలిస్టుల విషయానికొస్తే 2022 నాటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 556 మంది నిపుణుల అవసరం ఉండగా మంజూరైన పోస్ట్‌ల సంఖ్య 408. అందులో 144 ఖాళీలుండడంతో 264 మందే విధుల్లో ఉన్నారు. 292 మంది నిపుణుల కొరత ఉంది.
తమిళనాడులో 1,291, కేరళలో 796, కర్ణాటకలో 465, తెలంగాణలో 14 మంది స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో నలుగురు స్పెషలిస్ట్ వైద్యులు ఉండాలన్న ప్రమాణాల మేరకు ఈ లెక్కలు కట్టారు.
ఇక 2021 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,444 ప్రభుత్వ ఆసుపత్రులలో 36,719 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
కర్ణాటక విషయానికొస్తే ఈ సంఖ్య భారీగా ఉంది. అక్కడ మొత్తం 25,797 ప్రభుత్వ ఆసుపత్రులలో 1,45,255 పడకలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
కేరళలో 1,284 ప్రభుత్వ ఆసుపత్రులలో 38,097 పడకలు, తమిళనాడులో 2,445 ప్రభుత్వ ఆసుపత్రులలో 52,751 బెడ్స్, తెలంగాణలో 1,026 ప్రభుత్వ ఆసుపత్రులలో 24,254 బెడ్స్ ఉన్నట్లు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ గణాంకాలు వివరిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చెంత?
ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రూ.7,941 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో తమిళనాడులో ఈ వ్యయం రూ. 13,012 కోట్లు, కర్ణాటకలో రూ. 9,474 కోట్లు, కేరళలో రూ. 7,595 కోట్లు, తెలంగాణలో రూ. 7,304 కోట్లుగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
విద్యా రంగం: దక్షిణాదిలో నాలుగో స్థానంలో ఏపీ
కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2021-22కి ఇచ్చిన గ్రేడ్లు, ర్యాంకులలో దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.
అభ్యసన ఫలాలు, మౌలిక వసతులు, విద్యా సదుపాయాలు, శిక్షణ వంటి అంశాల ప్రాతిపదిక రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును కొలుస్తూ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో దక్షిణ భారతదేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.
దక్షిణ భారతంలోని అయిదు రాష్ట్రాలలో ఒక్క తెలంగాణ మాత్రమే ఏపీ కంటే వెనుకంజలో ఉంది.
కేరళ 609.7 పాయింట్లతో ముందుండగా తమిళనాడు, కర్ణాటక ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.
కేరళ 609.7, తమిళనాడు 590.4, కర్ణాటక 549.7, ఆంధ్రప్రదేశ్ 543.8, తెలంగాణ 479.9 పాయింట్లతో ఉన్నాయి.
ఈ సూచీలో దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికంటే పైన చండీగఢ్ 659 పాయింట్లతో ఉండగా ఆ తరువాత స్థానాలలో పంజాబ్ (647.4), దిల్లీ (636.2) ఉన్నాయి.
మాతాశిశు మరణాల రేట్లు
తల్లుల మరణాలు
2018-20 లెక్కల ప్రకారం దేశంలో తల్లుల మరణాల జాతీయ సగటు 97. అంటే ప్రతి లక్ష మంది తల్లులలో(కాన్పు సమయంలో, ప్రసవం తరువాత నాలుగు నెలలలో) సగటున 97 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సగటు 45గా ఉండగా కేరళలో 19గా ఉంది. కర్ణాటకలో 69గా, తమిళనాడులో 54గా, తెలంగాణలో 43గా ఉంది.
తల్లుల మరణాలలో దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.
శిశు మరణాలు
దేశంలో శిశుమరణాల రేటు 2020లో 28గా ఉంది. అంటే ప్రతి వెయ్యి మంది శిశువులలో 28 మంది ఏడాదిలోపే మరణిస్తున్నట్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 24. జాతీయ సగటు కంటే పరిస్థితి నయంగా ఉంది. అయితే, దక్షిణ భారత రాష్ట్రాలలో మిగతా నాలుగూ ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. కర్ణాటకలో శిశుమరణాల రేటు 19గా, కేరళలో 6గా, తెలంగాణలో 21గా, తమిళనాడులో 15గా ఉంది.

నిరుద్యోగిత రేటు ఎలా ఉంది?
2022-23 లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు 54.
ఇది ఆంధ్రప్రదేశ్‌లో 65గా ఉంది. ఇది కర్ణాటకలో 42గా, తమిళనాడులో 51గా, కేరళలో 76గా, తెలంగాణలో 78గా ఉంది.
అదే గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు 24 కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సగటు 33గా ఉంది.
కర్ణాటకలో 15గా, తెలంగాణలో 28గా, తమిళనాడులో 38గా, కేరళలో 65గా ఉంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















