ఐపీఎల్: హార్దిక్ పాండ్యాపై అభిమానుల హేళనలు ప్రశంసలుగా మారుతాయా? ఈ పరిస్థితిని ఆయనే కొనితెచ్చుకున్నారా?

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌరభ్ సోమని
    • హోదా, క్రీడా రచయిత

భారత స్టార్ క్రికెటర్ ఒకరు గత రెండు వారాలుగా తీవ్ర అవహేళనలను ఎదుర్కొంటున్నారు. కిక్కిరిసిపోయిన స్టేడియంలో క్రికెట్ అభిమానుల అసంతృప్తికి, ఆగ్రహాలకు గురవుతున్న ఆ క్రికెటర్ హార్దిక్ పాండ్యా.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్డిక్ పాండ్యా.

అహ్మదాబాద్, హైదరాబాద్‌ గ్రౌండ్లతో పాటు హోం గ్రౌండ్ ముంబయిలోనూ తమ మ్యాచ్‌ల సందర్భంగా పాండ్యా, అభిమానుల నుంచి హేళనలను ఎదుర్కొన్నారు.

గత సీజన్‌ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సీజన్‌లో హార్దిక్‌ను ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, నిరుటి సీజన్ వరకు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టును నడిపించారు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌కు ముంబయి కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.

2021 వరకు హార్దిక్ పాండ్యా కూడా ముంబయి ఇండియన్స్ జట్టులోనే ఉన్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఏడు సీజన్లు ముంబయికి ఆడారు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయారు.

రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ముంబయి తీసుకున్న నిర్ణయం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

ముంబయి జట్టుకు దిగ్గజాలు కెప్టెన్లుగా వ్యవహరించారు. సచిన్ తెందూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ వంటి ప్లేయర్ల తర్వాత ముంబయిని ఇప్పుడు పాండ్యా నడిపిస్తున్నారు.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ముంబయి ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి
గుజరాత్ జట్టు అభిమాని

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును చీర్ చేస్తోన్న అభిమాని

అయితే, ముంబయి అభిమానులు కెప్టెన్సీ మార్పును తేలికగా తీసుకోలేకపోయారు. వారంతా రోహిత్ శర్మ స్వయంగా కెప్టెన్సీని వదులుకోలేదని, ఆయనను బలవంతంగా తప్పించారని నమ్ముతున్నారు. కెప్టెన్‌గా రోహిత్ లేకపోతే తమకు ఎలా ఉంటుందో పాండ్యాకు తెలిసేలా చేస్తున్నామని అభిమానులు అనుకుంటున్నారు.

గుజరాత్‌ టైటాన్స్ జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా 2022లో టైటిల్‌ను కూడా అందించారు. గత వారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబయి కెప్టెన్‌గా హార్దిక్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్ అభిమానుల నుంచి హేళనలను ఎదుర్కొన్నారు.

ఇదంతా ఒకెత్తు అయితే, సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్‌కు అభిమానుల నుంచి ఈ అనుభవం తప్పలేదు. టాస్ సమయంలో మైదానంలోని అభిమానులు హార్దిక్‌కు వ్యతిరేకంగా గోల చేయడంతో అక్కడే ఉన్న కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ దయచేసి అభిమానులంతా మర్యాదగా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు.

అయితే, అభిమానులకు ఇదేం పట్టలేదు. వారి గోల తగ్గలేదు. మ్యాచ్‌లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్దిక్ చేజార్చినప్పుడు కూడా అభిమానులు మళ్లీ హేళన చేయడం మొదలుపెట్టారు. బ్యాటింగ్ సమయంలో పాండ్యా కొన్ని చక్కని బౌండరీలు కొట్టినప్పుడు మాత్రం హేళన స్థానంలో అభిమానులు చప్పట్లు కొట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోయి వరుసగా ముంబయి మూడో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో మళ్లీ హార్దిక్‌పై విమర్శలు మొదలయ్యాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్పిన్ మ్యాస్ట్రో రవిచంద్రన్ అశ్విన్, హర్దిక్ పట్ల అభిమానుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనంతటికీ ‘‘ఫ్యాన్ వార్స్’’ కారణమంటూ ఆరోపించారు.

‘‘క్రికెటర్లు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే అంశాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశం. ఫ్యాన్ వార్స్ ఇలా తప్పుదారి పట్టకూడదు’’ అని తన యూ ట్యూబ్ చానెల్‌లో అశ్విన్ అన్నారు.

భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు పరస్పరం ఒకరి నాయకత్వంలో మరొకరు ఆడిన విషయాన్ని అశ్విన్ ఉదహరించారు. అప్పుడు ఇలాంటి ప్యాన్ వార్స్ జరుగలేదని అన్నారు.

‘‘సచిన్ కెప్టెన్సీలో సౌరవ్ గంగూలీ ఆడారు. అలాగే గంగూలీ సారథ్యంలో సచిన్ ఆడారు. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఈ ముగ్గురు కలిసి అనిల్ కుంబ్లే నాయకత్వంలో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ ఈ నలుగురు, ధోని కెప్టెన్సీలో జట్టులో ఆడారు. ధోని కెప్టెన్‌గా ఎదిగే సమయానికే వీరంతా క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లు. ధోని కూడా విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆడారు కదా’’ అంటూ అశ్విన్ గుర్తు చేశారు.

క్రికెట్ ఆడే ఇతర దేశాల్లో ఇలాంటి ‘‘ఫ్యాన్ వార్స్’’ జరుగుతాయా? అని అశ్విన్ ప్రశ్నించారు.

‘‘ఉదాహరణకు, మీరెప్పుడైనా జోరూట్, జాక్ క్రాలీ అభిమానులు గొడవపడటం చూశారా? లేదా జో రూట్, జాస్ బట్లర్ అభిమానులు మాటామాటా అనుకున్నారా? ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ అభిమానులు, ప్యాట్ కమిన్స్ అభిమానులతో గొడవపడతారా? ఇది చాలా హాస్యాస్పదం’’ అని అశ్విన్ ఉదహరించారు.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది

రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా పాండ్యాకు మద్దతుగా నిలిచారు.

‘‘దీన్ని మీరు నియంత్రించలేరు. కాబట్టి ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టండి. చెప్పడం కంటే చేయడం చాలా కష్టం’’ అని హార్దిక్‌ను ఉద్దేశించి మీడియాతో బౌల్ట్ అన్నారు.

క్రికెటర్లు, అభిమానుల ప్రేమను స్వీకరించినప్పుడు వారు చేసే విమర్శలను, గోలను కూడా స్వీకరించాలంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిమానులు అంటున్నారు.

పాండ్యా పట్ల అభిమానుల ప్రవర్తన చాలా అసాధారణంగా ఉందని క్రీడా రచయిత శారదా ఉగ్ర అన్నారు.

‘‘అభిమానుల ఆగ్రహానికి గురైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, ఈ రీతిలో ఒక ఆటగాడిని హేళన చేయడం విచిత్రంగా ఉంటుంది. మొదట ఆడిన మైదానంలో, రెండో వేదికలోనూ, చివరికి సొంత మైదానంలోనూ పాండ్యాతో అభిమానులు ఇలా ప్రవర్తించడం చాలా అసాధారణంగా ఉంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. 1989 నుంచి ఆమె క్రికెట్ గురించి రాస్తున్నారు.

‘‘నాకు తెలిసి ఇదంతా సోషల్ మీడియా ద్వారా జరిగిందని అనుకుంటున్నా. ఇది ఒక ట్రెండ్‌లా మారిపోయి ముంబయి ఇండియన్స్ జట్టు ఆడే ప్రతీ మైదానానికి విస్తరించింది’’ అని ఆమె చెప్పారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనితో పాటు రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్

కెప్టెన్సీ మార్పు గురించి ప్రశ్నించినప్పుడు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ముంబయి, హార్దిక్ పాండ్యా ఈ పరిస్థితిని తెచ్చుకున్నారని చాలామంది నమ్ముతున్నారు.

గుజరాత్ జట్టు నుంచి ముంబయి టీమ్‌లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులో ఉన్న కెప్టెన్సీ నిబంధన గురించి పాండ్యాను ప్రశ్నించినప్పుడు ఆయన నిశ్శబ్ధంగా ఉన్నారు. దీంతో వ్యాఖ్యాత చేసేదేమీ లేక వెంటనే మరో ప్రశ్న అడిగారు. ప్రీ సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇది జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

అలాగే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను తీసుకోవడం వెనుక కారణం ఏంటని ముంబయి హెడ్‌కోచ్ మార్క్ బౌచర్‌ను రిపోర్టర్లు ప్రశ్నించినప్పడు ఆయన కూడా మాట్లాడకుండా ఉండిపోయారు.

పాండ్యాను అభిమానులు ఆదరిస్తారా, లేదా అనేది సమయమే నిర్ణయిస్తుంది.

కానీ, ఒకవేళ పాండ్యా అద్భుతంగా ఆడుతూ, జట్టును విజయతీరాలకు చేరిస్తే ఈ హేళనలన్నీ ప్రశంసలుగా మారుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)