#IPL2024: తొలి మ్యాచ్‌లో ధోనీ Vs. విరాట్ కోహ్లీ

ధోనీ, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె.బోధిరాజ్
    • హోదా, బీబీసీ కోసం

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రాయల్ చాలెంజెర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) మధ్య మొదటి మ్యాచ్‌తో 2024 ఐపీఎల్ టీ20 పండుగ ప్రారంభం కానుంది.

తొలిమ్యాచ్‌లో ఓ వైపు ధోనీ, మరోవైపు విరాట్ కోహ్లీ తలపడనున్నారు. అంతేకాకుండా, సొంత మైదానమైన చెన్నై చెపాక్‌ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుండడం సీఎస్‌కే జట్టుకు మరింత బలంగా మారనుంది.

చెన్నై అభిమానులు సీఎస్‌కే జట్టుతో పాటు కోహ్లీ, ఆర్సీబీలకు కూడా ఘన స్వాగతం పలుకుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అద్భుతమైన చెన్నై అభిమానులు

చెన్నై క్రికెట్ అభిమానులు ఏ జట్టు ఉత్తమంగా రాణించినా మద్దతు ఇస్తారు, ప్రోత్సహిస్తారు, అలాగే ఆస్వాదిస్తారు. ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ - అఫ్ఘానిస్తాన్ మ్యాచ్‌కి ఊహించని రీతిలో క్రికెట్ అభిమానులు చెపాక్ స్టేడియానికి తరలివచ్చారు.

కాబట్టి, అది ధోనీ సీఎస్‌కే అయినా, కోహ్లీ ఆర్సీబీ అయినా చెన్నై అభిమానులు ఉత్తమ క్రికెట్‌ను ఆస్వాదించడం ఖాయం.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 16 సీజన్లలో 241 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయింది

కోహ్లీ 16 ఏళ్ల కల నెరవేరుతుందా?

మహిళల ఐపీఎల్ టీ20 టోర్నీ రెండో సీజన్‌లోనే స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు ఐపీఎల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆర్సీబీ పురుషుల జట్టు అదే చాంపియన్‌షిప్ గెలుచుకునేందుకు 16 సీజన్లుగా కష్టపడుతోంది.

ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలుచుకోవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న ఆర్సీబీ, రేపు తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ వేలంలో పాత ఆటగాళ్లను చాలా మందిని పక్కనబెట్టి ఫాస్ట్ బౌలింగ్‌కు ప్రాధాన్యమిచ్చింది. బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ, బౌలింగ్‌లోనూ పటిష్టంగా ఉండేలా జట్టును కూర్చుకుంది.

స్మృతి మంధాన జట్టు రెండో సీజన్‌లోనే విజయం సాధించడంతో విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఏర్పడింది. విరాట్ కోహ్లీ ట్రోఫీ కల 16 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. ఈసారైనా కోహ్లీ 16 ఏళ్ల కల నెరవేరుతుందా?

ధోనీ వయసు, పేలవమైన ఫాస్ట్ బౌలింగ్

అదే సమయంలో, సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వయసురీత్యా ఈ సీజనే తనకి చివరిది కావొచ్చు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది ఊహించడం కష్టమే కాబట్టి, ఈ సీజన్‌లో ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సీఎస్‌కే గట్టిగానే ప్రయత్నిస్తుంది.

అయితే, ఐపీఎల్ వేలంలో బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టిన సీఎస్‌కే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఆర్సీబీ బలమైన ఫాస్ట్ బౌలింగ్‌ను సీఎస్‌కే ఎలా ఎదుర్కొంటుంది? అలాగే ప్రత్యర్థిని కట్టడి చేసే స్థాయిలో బౌలింగ్ లేకుండా సీఎస్‌కే ఏం చేస్తుంది? అనే ప్రశ్నలు వేధిస్తున్నాయి.

ఐపీఎల్ టీ20 సిరీస్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే ఇప్పటి వరకూ 31సార్లు తలపడ్డాయి. వాటిలో ఆర్సీబీ 10 మ్యాచ్‌లలో నెగ్గగా, సీఎస్‌కే 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. లెక్కలను బట్టి చూస్తే, సీఎస్‌కేదే ఆధిపత్యం. అయితే, ఐపీఎల్ వేలం అనంతరం ఆటగాళ్ల మార్పుల కారణంగా జట్ల బలాలు, బలహీనతలు మారిపోయాయి.

ఐపీఎల్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఫొటో క్యాప్షన్, చెపాక్‌లో 2008లో చివరిసారిగా 14 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలిచింది

చెపాక్‌లో గెలుపు కోసం 16 ఏళ్లుగా ఎదురుచూపులు

చివరిసారిగా 2019లో సీఎస్‌కే, ఆర్సీబీ జట్లు చెపాక్ స్టేడియంలో తలపడ్డాయి. ఐదేళ్ల తర్వాత మరోమారు ఇరుజట్లు తలపడనుండడం రెండు జట్ల అభిమానులకు కనువిందు చేయనుంది. చెపాక్ స్టేడియంలో రెండు జట్లు ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడాయి. అందులో 8 మ్యాచ్‌లలో సీఎస్‌కే విజయం సాధించింది.

2008 మే 20న చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 14 పరుగుల తేడాతో సీఎస్‌కే జట్టుని చివరిసారి ఓడించింది. ఆ తర్వాత దాదాపు 16 ఏళ్లుగా చెపాక్‌ స్టేడియంలో సీఎస్‌కే జట్టుని ఆర్సీబీ ఓడించలేకపోయింది.

ఆ మ్యాచ్ తర్వాత 2010, 2011 (3 మ్యాచ్‌లు), 2012, 2013, 2016, 2019లో చెపాక్‌లో సీఎస్‌కేతో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ ఆర్సీబీ ఓడిపోయింది. దీంతో తొలి గేమ్‌లో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.

16 ఏళ్ల తర్వాత చెపాక్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతుంటే, తొలి మ్యాచ్‌లో విజయంతో శుభారంభం పొందాలని సీఎస్‌కే భావిస్తోంది.

కోహ్లీ మైలురాయికి ఒకేఒక్క పరుగు

సీఎస్‌కేపై ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అత్యధికంగా 999 పరుగులు చేశాడు. శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు సాధిస్తే, సీఎస్‌కేపై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు. ధోనీ 751 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థిని సవాల్ చేసే స్థాయిలో ఉంది

సీఎస్‌కే జట్టు బలహీనత అదే..

సుదీర్ఘ అనుభవమున్న 42 ఏళ్ల కెప్టెన్ ధోనీ వ్యూహాలే సీఎస్‌కే జట్టు బలం. మిస్టర్ కూల్ ఏ సమయంలో ఏ బౌలర్‌ను వాడతాడో, ఏ బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా రంగంలోకి దించుతాడో, అసలు అతని వ్యూహమేంటనేది తెలుసుకోవడం ప్రత్యర్థులకు సవాల్‌గా మారుతుంది.

సీఎస్‌కే బ్యాటింగ్ ప్రత్యర్థి జట్టును చాలెంజ్ చేసేంత బలంగానే ఉంది. కానీ ఇబ్బందేంటంటే, గాయం కారణంగా ఓపెనర్ డెవాన్ కాన్వే దూరమవుతున్నట్లు ప్రకటించాడు. అప్పుడు, రితురాజ్ గైక్వాడ్‌తో కలిసి కొత్తగా జట్టులోకి వచ్చిన రచిన్ రవీంద్ర ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

సీఎస్‌కే జట్టుకు మూలస్తంభాలుగా నిలిచిన సురేశ్ రైనా, అంబటి రాయుడు నిష్క్రమణతో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. వేలంలో 14 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్న న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశముంది.

ఇప్పటికే మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నప్పటికీ వేలంలో రచిన్ రవీంద్రను జట్టు కొనుగోలు చేయడం కొంత ఆశ్యర్యం కలిగించవచ్చు. కానీ, రచిన్ రవీంద్ర లాంటి యువ ఆటగాళ్లను ధోనీ చాలా తెలివిగా వాడుకోబోతున్నాడని రానున్న మ్యాచ్‌లలో నిరూపితం కావొచ్చు.

వారితో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లోటు భర్తీ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీని సీఎస్‌కే జట్టు రూ.8.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. రిజ్వీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అంబటి రాయుడు స్థానంలో రిజ్వీ లేదా రహానేను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు శివమ్ దూబే, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్‌మెన్‌లు కూడా అవసరమైన మేరకు అందుబాటులో ఉన్నారు.

సమీర్ రిజ్వీ

ఫొటో సోర్స్, SAMEER RIZVI / INSTAGRAM

ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన యువ ఆటగాడు సమీర్ రిజ్వీ

సీఎస్‌కే ఈసారి వేలంలో శార్దూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసి మరోసారి జట్టులోకి తీసుకుంది. ధోనీకి అత్యంత సన్నిహితులు శార్దూల్, దీపక్ చాహర్ మిస్టర్ కూల్‌కి ట్రంప్ కార్డులుగా పనికొస్తారు. మరీముఖ్యంగా, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో పేస్ మార్చడంలో రెహమాన్ దిట్ట. కాబట్టి, రెహమాన్‌ని ధోనీ బాగానే ఉపయోగించుకోవచ్చు.

ఇక ధోనీ విషయానికి వస్తే, గత రెండు సీజన్లలో బ్యాటింగ్‌లో పెద్దగా మెరుగవ్వలేదు. ఆ రెండు సీజన్లలో అభిమానులు ధోనీ నుంచి భారీ ఇన్నింగ్స్ చూడలేకపోయారు. ధోనీ బ్యాటింగ్ ఫామ్ సీఎస్‌కేకు ఆందోళన కలిగిస్తోంది. అయితే, ధోనీ మైదానంలోకి దిగితే కానీ సీఎస్‌కే పటిష్టంగానూ, ప్రత్యర్థి జట్టు బలహీనంగానూ కనిపించదు.

అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువ అనుభవం ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్. గతంలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ బౌలింగ్‌లో పెద్దగా రాణించలేదు. వీరిద్దరినీ డెత్ ఓవర్లలో ధోనీ చక్కగా ఉపయోగించుకోగలడని, అయితే వారిని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలిగేంత సమర్థవంతమైన బౌలర్లుగా చెప్పలేమని క్రికెట్ విమర్శకులు అంటున్నారు.

ఎందుకంటే, టీ20 మ్యాచ్‌లలో దీపక్ చాహర్ బౌలింగ్ యావరేజ్ 13.21, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ యావరేజ్ 11.24గా ఉంది.

స్పిన్ విషయంలో శాంట్నర్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్రల సహకారం జట్టు భారీ విజయానికి దోహదం చేస్తుంది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి రన్ రేట్‌ను నియంత్రించడంలో ఈ ముగ్గురూ ఉపయోగపడతారు. కాకపోతే పవర్ ప్లే, డెత్ ఓవర్లలో సీఎస్‌కేకు నాణ్యమైన పేసర్లు లేరు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యమిచ్చింది

ఆర్సీబీ బలమదే..

దాదాపు 16 సీజన్ల నుంచి ట్రోఫీ గెలవలేకపోవడం ఆర్సీబీ జట్టును మానసికంగా కుంగదీసే అంశం. ప్రతిసారీ ఆటగాళ్లను మారుస్తున్నప్పటికీ ఆ జట్టు కప్పు గెలవలేకపోయింది.

ఐపీఎల్ సిరీస్‌లో ఈసారి బౌలింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ లాకీ ఫెర్గూసన్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్‌ వంటి ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేసింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, మహిపాల్ లామ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ వంటి బ్యాటర్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

ఫాస్ట్ బౌలింగ్‌లో రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్, యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్, రజన్ కుమార్ అనే ఏడుగురు బౌలర్లు ఉన్నారు. వారిలో నలుగురికి మాత్రమే చెప్పుకోదగ్గ అనుభవముంది.

ఆర్సీబీ మంచి ఫాస్ట్ బౌలర్లను ఎంచుకుని ఫీల్డింగ్‌కి దిగితే కచ్చితంగా సీఎస్‌కేపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అల్జారీ జోసెఫ్, సిరాజ్, ఫెర్గూసన్, విజయ్ కుమార్‌తో మంచి స్పెల్ సిద్ధం చేయాల్సి ఉంటుంది.

మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించేందుకు మ్యాక్స్‌వెల్, కరణ్ శర్మ కాకుండా మూడో బౌలర్‌ను ఎంచుకోవడం అవసరం.

విరాట్ కోెహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, పాటీదార్, లామ్రోర్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది

అయితే, శ్రీలంక స్పిన్నర్ హసరంగ లేకపోవడం స్పిన్‌కి లోటు. అయినప్పటికీ కరణ్ శర్మ, మ్యాక్స్‌వెల్, ఎడమ చేతివాటం స్పిన్నర్ మయాంక్ థాకరే, స్వప్నిల్ సింగ్ ఉన్నారు. కానీ స్పిన్ విషయంలో బలంగా ఉన్నారని చెప్పలేం. ఎందుకంటే, మ్యాక్స్‌వెల్, కరణ్ శర్మ మినహా మిగిలిన వారికి అంతర్జాతీయ అనుభవం లేదు. ఐపీఎల్‌లోనూ పెద్దగా అనుభవం లేదు.

ఆల్‌రౌండర్లలో భారత ఆటగాడు లామ్రోర్, ఆకాశ్ దీప్, ప్రభు దేశాయ్ మినహా మ్యాక్స్‌వెల్ టామ్ కరణ్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్ సహా అందరూ విదేశీ ఆటగాళ్లే.

ఒక్కో మ్యాచ్‌కు నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే తుది జట్టులోకి తీసుకోవచ్చు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్‌‌ను తీసుకుంటే మరొకరిని ఎవరిని తీసుకుంటారనే సందిగ్దత నెలకొంది.

మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి మ్యాక్స్‌వెల్, కరణ్ శర్మ కాకుండా అదనపు బౌలర్ అవసరం అవుతారు, కాబట్టి కామెరాన్ గ్రీన్ కచ్చితంగా అవసరం. వారు కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ లేదా ఫెర్గూసన్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. అలాగే, మూడో బౌలర్‌గా యశ్ దయాల్ లేదా విజయ్ కుమార్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్‌లు ఇద్దరినీ 11 మంది టీంలోకి తీసుకుంటే కామెరాన్ గ్రీన్‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రీన్ జట్టులో ఉంటే అల్జారీ లేదా ఫెర్గూసన్ మైదానం బయట కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి, పిచ్‌ను బట్టి కెప్టెన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్సీబీ జట్టులో ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్లు ఉండడం అతిపెద్ద బలం. పిచ్‌కు తగినట్లుగా విదేశీ ఆటగాళ్లను ఎంచుకుంటే విజయం సులువు అవుతుంది.

డెత్‌ ఓవర్లలో నలుగురు బౌలర్లు అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్, సిరాజ్ ఉన్నారు. వారితో పాటు టామ్ కరణ్, రీస్ టోప్లీ, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్ వంటి ఆల్‌రౌండర్లతో జట్టు పటిష్టంగా మారితే ఈ ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్రయాణం మెరుగ్గా ఉంటుంది.

దినేశ్ కార్తీక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత రెండు సీజన్లుగా దినేశ్ కార్తీక్ భారీ స్కోర్లు చేసింది లేదు

డీకే ఫామ్‌లోకి వస్తాడా?

ఈ సీజన్ తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రకటించాడు. గత ఏడాది కాలంగా గ్రౌండ్‌లో కాకుండా కామెంట్రీపై దృష్టిపెట్టిన దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.

గత రెండు సీజన్లలో డీకే పెద్దగా స్కోరు చేసింది లేదు. కెప్టెన్ డుప్లెసిస్ కూడా గొప్ప ఫామ్‌లో లేడు. ఈ జనవరి నుంచి విరాట్ కోహ్లీ ఆడింది లేదు.

ఇలాంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఫామ్‌లో లేకపోతే ఆర్సీబీ ట్రోఫీ కలలు మరోసారి చెదిరిపోతాయి. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రాకపోతే ఈసారి కూడా ఆర్సీబీ చాంపియన్‌షిప్ కల కలగానే మిగిలిపోతుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)