విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ఆడటం లేదా? కారణాలేంటి?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె.బోధిరాజ్​
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విరాట్ కోహ్లీకి పిచ్, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తన ఆటను మలుచుకుంటాడనే పేరుంది. అయితే, వచ్చే టీ20 ప్రపంచకప్‌లో అతను భారత్ తరఫున ఆడతాడా లేదా అనే సందేహం నెలకొంది. ఇంతకీ విరాట్ కోహ్లీ నిజంగా ఆడటం లేదు? ఈ వార్తలు ఎలా వచ్చాయి?

“వాతావరణానికి అనుగుణంగా కోహ్లీ బ్యాటింగ్ సామర్థ్యం, కాంపిటీటివ్ గేమ్ పట్ల అతనికున్న అవగాహన అపారం. ప్రతి నాలుగైదు ఓవర్లకు ఆటలో గేర్ ఏ విధంగా మార్చాలో కోహ్లీకి తెలుసు. ఛేజింగ్‌లో కావాల్సిన రన్ రేట్ చూసుకుంటూ, దానికనుగుణంగా బ్యాటింగ్ చేస్తాడు''. ఇవి కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పిన మాటలు.

అయితే జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో కోహ్లి భారత్ తరఫున ఆడతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

‘2024 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఎంపికయ్యే అవకాశం లేదు’ అని కొన్ని రోజుల క్రితం పలు ఆంగ్ల పత్రికలు, వెబ్‌సైట్‌లు కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీలు ఇద్దరూ 14 నెలలుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడలేదు.

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ మాత్రమే ఎంపికయ్యాడు. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి కూడా కోహ్లీ వైదొలిగాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడతాడా?

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆడే భారత జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల ప్రకటించారు.

అయితే విరాట్ ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడో లేదో ఆయన స్పష్టం చేయలేదు.

తాజాగా ''టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడటం కష్టమని, వెస్టిండీస్‌, అమెరికాలో స్లో వికెట్‌ పిచ్‌లు ఉండటమే దీనికి కారణమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి' అని ఆంగ్ల వెబ్‌సైట్‌లు, వార్తాపత్రికలు కథనాలు ప్రచురించడం చర్చనీయాంశమైంది.

''ఇక్కడ బంతి బ్యాట్స్‌మన్ వైపు నెమ్మదిగా వస్తుంది, కాబట్టి క్రీజులో ఓపికగా బ్యాటింగ్ చేయాలి. ఇలాంటి పిచ్‌లు విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ శైలికి అనుగుణంగా ఉండవు. ఈ పిచ్ పవర్ హిట్టర్లకు మాత్రమే. అందుకే కోహ్లీని భారత జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది’’ అని వారు చెప్పారని కథనాలు పేర్కొన్నాయి.

''సెలక్టర్లు విరాట్ కోహ్లీని ప్రపంచకప్‌కు పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా కఠినమైన నిర్ణయం, కానీ, వేరే మార్గం లేదు. భవిష్యత్తులో జట్టును నడిపించడానికి, యువ ఆటగాళ్లను గాడిలో పెట్టడానికి వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను కనబరిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అందువల్ల కోహ్లీని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు కథనాలు తెలిపాయి.

ఈ విషయాన్ని విరాట్ కోహ్లీకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యతలు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పగించారని కూడా తెలిపాయి.

టీ20 ప్రపంచకప్ ఎప్పుడు?

టీ20 ప్రపంచకప్ టోర్నీ 2024 జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.

ఈ 55 మ్యాచ్‌ల టోర్నీకి వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. వెస్టిండీస్‌తో పాటు అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

గత టీ20 ప్రపంచకప్‌లో 16 జట్లు తలపడగా, ఈసారి 20 జట్లు పోటీ పడనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​ సహా ర్యాకింగ్‌ పరంగా మొదటి 8 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా అర్హత సాధించాయి. తొలిసారిగా కెనడా, ఉగాండా, అమెరికా జట్లు ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి.

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, TWITTER/ SURYA KUMAR YADAV

ఫొటో క్యాప్షన్, సూర్యకుమార్ యాదవ్

కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారు?

విరాట్ కోహ్లీ అందుబాటులో లేకుంటే అతని స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది? అనే ప్రశ్నకు.. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, తిలక్ వర్మ, రింకూ సింగ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ ఇలా జాబితా పెద్దదే.

2022 టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడినపుడు, జట్టును ఆదుకున్నది విరాట్ కోహ్లీనే.

కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్‌ను పక్కనపెట్టాలనుకోవడం అన్యాయమని అతని అభిమానులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

అయితే టీ20 మ్యాచ్‌లలో విరాట్ గణాంకాలు, బ్యాటింగ్ శైలి అతనికి ప్రతికూలంగా మారాయనే వాదనలు కూడా ఉన్నాయి.

టీ20 క్రికెట్లో విరాట్ బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ బలహీనతలేంటి?

విరాట్ కోహ్లీ 117 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 4,037 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 51.75, స్ట్రైక్ రేట్ 138.

361 ఫోర్లు, 117 సిక్సర్లు కొట్టాడు. అంటే ఇన్నింగ్స్‌కు 3.30 బౌండరీలు, 1.07 సిక్సర్లు మాత్రమే బాదాడు. బౌండరీల ద్వారా సగటున 19 నుంచి 20 పరుగులు మాత్రమే చేస్తున్నాడు.

టీ20 మ్యాచ్‌లలో కూడా వికెట్ల మధ్య పరుగెత్తడానికి, పరుగులు చేయడానికి కోహ్లీ ఇష్టపడతాడని, బౌండరీలు కొడుతూ పవర్ హిట్టర్‌గా మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపడని విమర్శకుల ఆరోపణ.

టీ20 మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు సగటున 27.1 బంతులను ఎదుర్కొని 37.5 పరుగులు చేశాడు.

టీ20 గేమ్‌కు ఏం కావాలి?

టీ20 మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లకు 120 బంతులుంటాయి. సగటున ఒక్కో బ్యాటర్​ (వికెట్) కోసం 12 బంతులు. వన్డేల్లో 30 బంతులకు ఒక వికెట్ లెక్కన, టెస్టు మ్యాచ్‌ల్లో 62 బంతులకు ఒక వికెట్‌గా పరిగణించవచ్చు..

ఈ ఆటతీరును నాలుగు గ్రూపులుగా విభజించవచ్చు. ఫెయిల్యూర్, క్యామియో, సక్సెస్, అండర్ పార్

  • ఫెయిల్యూర్: టీ20 ఇన్నింగ్స్‌లో ఒక బ్యాటర్​ 12 బంతుల్లోనే అవుట్ అవడం, ఎదుర్కొన్న బంతులకు ఊహించిన దాని కంటే తక్కువ పరుగులు చేయడం.
  • క్యామియో: ఒక బ్యాట్స్‌మన్ మొత్తం 12 బంతులు ఆడకుండానే ఔట్ అయినప్పటికీ, ఎదుర్కొన్న బంతులకు ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు చేయడం.
  • సక్సెస్: ఒక బ్యాట్స్‌మన్ 12 బంతులు ఆడి, ఊహించిన దాని కంటే ఎక్కువ స్కోర్ చేయడం.
  • అండర్ పార్: ఒక బ్యాటర్ కనీసం 12 బంతులు ఆడటం, ఊహించిన పరుగుల కంటే తక్కువ స్కోర్ చేయడం.
కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ 'అండర్ పార్' బ్యాటర్​?

భారత టీ20 జట్టులో ప్రస్తుత యువ ఆటగాళ్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎక్కువగా 'అండర్ పార్' మ్యాచ్‌లే ఆడాడు.

అంటే కోహ్లీ ఎదుర్కొన్న బంతుల్లో ఊహించిన దానికంటే తక్కువ పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ రన్ రేట్, రోహిత్ శర్మతో పోలిస్తే 5.7 శాతం తక్కువ, కేఎల్ రాహుల్‌తో పోలిస్తే 5.2 శాతం, సూర్యకుమార్‌తో పోలిస్తే 27 శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

విరాట్ కోహ్లీ తన మొదటి 100 బంతుల్లో 128 పరుగులు చేస్తే, కేఎల్ రాహుల్ 134, రోహిత్ శర్మ 139 పరుగులు చేశారు. అయితే తొలి 20 బంతుల్లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ సగటులో వెనుకబడి ఉన్నా.. మ్యాచ్‌లో రన్ రేట్‌ను వేగవంతం చేయడంలో కోహ్లీ కంటే రోహిత్ మెరుగ్గా ఉన్నాడని గణాంకాలు చెబుతున్నాయి.

విరాట్ కోహ్లి టీ20లలో యాంకర్ పాత్ర పోషిస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలుస్తుండటంతో మిగతా బ్యాటర్లకు ముఖ్యంగా యువ ఆటగాళ్లకు నిరూపించుకొనే అవకాశాలు తక్కువే వస్తున్నాయి.

పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్, ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ శైలి కూడా కోహ్లీ మాదిరే ఉంటుంది.

కోహ్లీ కరీబియన్ పిచ్‌లపై 7 ఇన్నింగ్స్‌లు ఆడి 229 పరుగులు, యూఎస్ఏలో 3 మ్యాచ్‌లలో 63 పరుగులు చేశాడు. ఈ మైదానాల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌ 120.66, సగటు 29 పరుగులు. ఇక్కడ కోహ్లీ 30 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అతని మొత్తం పరుగులలో 49 శాతం బౌండరీలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా 100కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, కరీబియన్, అమెరికన్ పిచ్‌లపై కోహ్లీకి అంతగా అనుభవం లేదు, అక్కడ విరాట్ పవర్ హిట్టర్ కాదు, అండర్ పార్ బ్యాటర్.

విరాట్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ ఆలోచనలే..

విరాట్ కోహ్లీని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడానికి 3 కారణాలు ఉండవచ్చని బీబీసీతో సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ముత్తుకుమార్ అన్నారు.

“యువ ఆటగాళ్లు IPL ద్వారా అరంగేట్రం చేస్తున్నారు, భారత జట్టుకు ఎంపికవుతున్నారు. వారికి మార్గం కల్పించడానికి కోహ్లీని తొలగించొచ్చు. విరాట్​ ఏ టోర్నీలో ఆడాలనేది సెలక్టర్లు కాకుడా అతనే నిర్ణయించుకుంటున్నాడు. తన ఇష్టప్రకారం టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాడు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాడు. దీంతో కోహ్లీ తీరు ప్రస్తుత సెలక్టర్లకు ఇబ్బందిగా మారింది' అని తెలిపారు.

“14 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని వికెట్ కీపర్‌ని టీ20 ప్రపంచ కప్ కోసం సెలెక్ట్ చేస్తే, ఇతర ఆటగాళ్ల స్థైర్యాన్ని ప్రభావితం చేస్తుంది. జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఐక్యతను దెబ్బతీస్తుంది. పైగా, చాలామంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు, వెంటనే సర్దుబాటు చేయడం కష్టం. టీమ్‌లో కంటిన్యూటీ ఉన్నప్పుడే సహచరులతో అవగాహన, ఐక్యత, స్ఫూర్తి మొదలైనవి డెవలప్ అవుతాయి'' అని ముత్తుకుమార్ అన్నారు.

కోహ్లీని తొలగిస్తే తప్పిదమే

“ ఒకవేళ కోహ్లీని తొలగించాల్సి వస్తే అతని స్థానంలో బలమైన బ్యాటింగ్ నైపుణ్యమున్న వికెట్ కీపర్‌ను భర్తీ చేయాలి. కాకపోతే ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలో కోహ్లీ లేకపోతే ప్రత్యర్థి జట్టులో ఉత్సాహం నింపినట్లే. కాబట్టి, కోహ్లీ జట్టులో ఉంటే బాగుంటుంది. ముఖ్యమైన మ్యాచ్‌లకు కోహ్లీని ఉపయోగించుకోవచ్చు. ప్రాముఖ్యత లేని మ్యాచ్‌లలో అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు” అని ముత్తుకుమార్ అంటున్నారు.

టీ20 ఆట ప్రకారం కోహ్లీ బ్యాటింగ్ ఉండటం లేదన్న ఆరోపణలపై ముత్తుకుమార్ స్పందిస్తూ.. 'టెస్ట్ మ్యాచ్‌లలో పుజారా నెమ్మదిగా ఆడుతున్నాడంటూ ఒకప్పుడు కోహ్లీ ఆరోపించాడు. ఇప్పుడు కోహ్లీ టీ20 మ్యాచ్‌లలో స్లో ఆడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇది నిజమే అయినప్పటికీ.. యాంకర్ పాత్రను కోహ్లీ తీసుకున్నప్పుడే ఇలా జరుగుతుంటుంది' అని అన్నారు

"190 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ చివరి వరకు ఉండి 170 పరుగులే చేశాడంటే ఆ ఆరోపణ ఆమోదయోగ్యం. ప్రారంభంలో రిలాక్స్‌గా, నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికీ, కోహ్లీ స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకుంటాడు. ఆలస్యంగా క్యామియో పాత్ర పోషిస్తాడు. గత ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు కనిపించింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి’’ అని ముత్తుకుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)