రోజూ ఉదయం ఇడ్లీ, దోశ తినవచ్చా? పొద్దున తినే అల్పాహారంలో ఉత్తమమైనది ఏది?

ఇడ్లీ, దోశ, పూరి, వడ, బ్రేక్‌ఫాస్ట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనం రోజూ ఉదయం పూట కచ్చితంగా తీసుకోవాల్సింది- అల్పాహారం. ఉదయం మహరాజులా తినాలి అని పెద్దలు చెబుతుంటారు.

అయితే ఉరుకుల పరుగుల జీవితంలో మహరాజులా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం కష్టం.

అలాగని ఉదయం అల్పాహారం తినకుండా ఆఫీసు, స్కూలు, కాలేజ్‌, ఇతర పనులకు వెళితే ఆ పనుల మీద మనసు పెట్టడం సాధ్యమేనా?

కడుపు ఖాళీగా ఉంటే పని చెయ్యడం సాధ్యమేనా? కొంత మంది ఉదయం పూట నిద్రపోవడానికి బ్రేక్ ‌ఫాస్ట్ మానేస్తున్నారు.

పొద్దున తినాల్సిన టిఫిన్ తరచూ మానేస్తే, అల్సర్లు, బరువు పెరగడం, రోజంతా నీరసంగా ఉండటం లాంటి సమస్యలు పెరగవచ్చు.

పిల్లలు చక్కగా పెరగాలంటే వారికి ఉదయం పూట ఇచ్చే అల్పాహారం తప్పనిసరిగా ఇవ్వాలి.

ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలా? మానేస్తే ఏమవుతుంది? బ్రేక్‌ఫాస్ట్‌లో ఏముండాలి? బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీ, దోశ రోజూ తినవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

పారిశ్రామిక విప్లవం, ఇంగ్లండ్, బ్రేక్‌ఫాస్ట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రజల్లో పెరిగిన బ్రేక్‌ఫాస్ట్ అలవాటు

బ్రేక్‌ఫాస్ట్ ఎలా అలవాటు అయ్యింది?

బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రిటిషర్లు చెప్పే అర్థం బ్రేక్ ద ఫాస్ట్ అని.

“రాత్రి పూట భోజనానికి ఉదయం తీసుకునే అల్పాహారానికి మధ్య 8 నుంచి 10 గంటల గ్యాప్ ఉంటుంది. ఈ సమయంలో మనం ఏమీ తినం. దాదాపు ఉపవాసం లాంటి పరిస్థితి. ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి ఉదయం తీసుకునే అల్పాహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ అంటారు” అని పీడియాట్రీషియన్, న్యూట్రిషన్ కన్సల్టెంట్ అరుణ్ కుమార్ చెప్పారు.

“వ్యవసాయం చేయడం కనుక్కున్న తర్వాత మనుషుల్లో బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే అలవాటు ప్రారంభం అయింది. అప్పుడు కూడా పిల్లలు, వృద్దులు, కష్టపడి పని చేసే వాళ్లు మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు. ఎక్కువ మంది రోజులో మొదటి ఆహారాన్ని మధ్యాహ్నం పూట తీసుకునేవారు.”

“పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ సంప్రదాయం మారిపోయింది. ఎందుకంటే ఫ్యాక్టరీల్లో షిఫ్టుల్లో పని చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఉదయాన్నే ఎనిమిది గంటలకు పనిలోకి వెళ్లేవాళ్లు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండా మధ్యాహ్నం వరకు పని చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు.”

“ప్రతి దేశంలోనూ అలా బ్రేక్‌ఫాస్ట్ అనేది వారి ఆహారంలో భాగంగా మారిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఏర్పాయింది” అని అరుణ్ కుమార్ చెప్పారు.

“అనేక దేశాల్లో అల్పాహారంలో భాగంగా పిండి పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట ఆహారంలో పిండి పదార్థాలు కాస్త ఎక్కువగా ఉండేవి తింటున్నారు. ఉదయం పూట కూడా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవచ్చు. అయితే అది మీరు చేసే పనిని బట్టి తీసుకోవడం మంచిది" అని ఆయన సూచించారు.

డాక్టర్, న్యూట్రిషనిస్ట్, పీడియాట్రీషియన్

ఫొటో సోర్స్, DRARUNKUMAR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, డాక్టర్ అరుణ్ కుమార్

బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏ ఆహారం మంచిది?

ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటే అది మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతుందా అని డాక్టర్ అరుణ్‌ కుమార్‌ను బీబీసీ అడిగింది.

“అందరికీ ఒకే రకమైన ఆహారం సరి కాదు. ఊబకాయంతో బాధ పడేవాళ్లు, మధుమేహం ఉన్న వారు, ఇతర శారీరక సమస్యలు ఉన్న వారు ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

ఒకటి వారు చేసే పని మీద. రోజువారీ కూలీలైతే పిండి పదార్ధాలైన ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి లాంటివి తినవచ్చు. వాటితో పాటు గుడ్లు, గింజలు లాంటివి కూడా తీసుకోవచ్చు.

బ్రేక్‌ఫాస్ట్ అనేది శరీరానికి సంబంధించిన సమస్య కాదు. రోజులో శారీరకంగా ఎంతగా శ్రమిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పిండి పదార్ధాలను కూడా చాలా తక్కువ స్థాయిలో తీసుకోవచ్చు. ఎందుకంటే అవి తిన్న తర్వాత శారీరకంగా ఎలాంటి శ్రమ లేకుంటే 4-5 గంటల వరకూ ఆహారం లేకుండా ఉండేందుకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది" అని ఆయన వివరించారు.

ఒబేసిటీ, డయాబెటిస్, షుగర్ లెవల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరిమితికి మించి తింటే ఊబకాయం వచ్చే సమస్య

మధుమేహులు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలి?

ఒబేసిటీ, డయాబెటిస్ ఉన్నవారు ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పిండి పదార్ధాలు తక్కువగా ఉంటే మంచిదని డాక్టర్ అరుణ్ సూచించారు.

“పిండి పదార్థాలు తక్కువగా ఉండే గింజలు, రెండు కోడిగుడ్లు, శనగలు లాంటివి ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి బ్రేక్ ఫాస్ట్‌లో మంచిది.

ఎందుకంటే రాత్రి పూట ఆహారం తీసుకున్న తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది. వారు అల్పాహారంలో ఎక్కువ పిండి పదార్ధాలు ఉండే ఆహారం తీసుకుంటే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగడం, ఊబకాయం పెరగడం వంటి సమస్యలు వస్తాయి” అని డాక్టర్ అరుణ్ తెలిపారు.

బియ్యం, పెరుగు, పప్పు, పచ్చడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రేక్‌ఫాస్ట్ కింద చద్దన్నం తినడం కూడా మంచిదేనంటున్న వైద్యులు

బ్రేక్‌ఫాస్ట్‌లో చద్దన్నం తినవచ్చా?

చద్దన్నాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం మంచిదేనా అనే ప్రశ్నకు డాక్టర్ అరుణ్ సమాధానమిస్తూ- “బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చద్దన్నాన్ని తినడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే- ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనం ఎంత తింటున్నామనేది కూడా ముఖ్యం. శరీరానికి పెద్దగా కష్టం లేకుండా, కుర్చీలో కూర్చుని పని చేసేవారు ఇలాంటి ఆహారం తక్కువ తీసుకుంటే మంచిది.

ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పెరుగన్నం తింటే సరిపోతుంది. అయితే పొలం పనులు చేసేవారు, ఫ్యాక్టరీల్లో పని చేసేవారు సరిపడ తినవచ్చు. ఇడ్లీ, దోశ విషయంలోనూ ఇదే పద్ధతి పాటించవచ్చు. శారీరక శ్రమ లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు.

పెరుగన్నాన్ని రాత్రంతా ఉంచినప్పుడు అందులో ఉండే లాక్టోబేసిల్లస్ అనే బ్యాక్టీరియా దాన్ని పులిసేలా చేస్తుంది. దీంతో ఇందులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.

న్యూట్రిషనిస్టు, బ్రేక్‌ఫాస్ట్
ఫొటో క్యాప్షన్, భువనేశ్వరి, న్యూట్రిషనిస్ట్

బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏమవుతుంది?

బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే ఏమవుతుందనే ప్రశ్నకు న్యూట్రిషనిస్టు భువనేశ్వరి సమాధానమిస్తూ- “ఒక రోజుని ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడం తప్పనిసరి. ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో 60 శాతం వరకు పిండి పదార్థాలు ఉంటాయి. ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇడ్లీ-సాంబార్, ఆకుకూరలు, పప్పులు కూడా మంచిదే. అయితే ఎన్ని ఇడ్లీలు తింటామనేది ఒక వ్యక్తి బరువు, ఎత్తు, ఆ రోజులో వారు చేసే శ్రమను బట్టి ఉంటుంది’’ అని తెలిపారు.

కొంత మంది రాత్రి పూట ఆహారం ఎక్కువ తిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు.

ఇది చాలా తప్పని, ఇది శరీరం మీద దుష్ప్రభావాలను చూపుతుందని భువనేశ్వరి హెచ్చరించారు.

‘‘ఇది అల్సర్లకు దారి తీయవచ్చు. శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనం నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. పిల్లలకు కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి. రెగ్యులర్‌గా బ్రేక్ ఫాస్ట్ తినే పిల్లల్లో నేర్చుకునే శక్తి బాగా ఉంటుంది’’ అని అధ్యయనాలు చెబుతున్నాయి అని ఆమె వివరించారు.

బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల అనేక దుష్పరిణామాలు

బ్రేక్‌ఫాస్ట్‌కు మంచి సమయం ఏది?

బ్రేక్‌ఫాస్ట్ పేరుతో అన్ని రకాల ఆహారాన్ని తినడం మంచిది కాదని న్యూట్రిషనిస్టు భువనేశ్వరి హెచ్చరించారు.

నూనెలో వేపిన ఆహారం, పూరీలు, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

బ్రేక్‌ఫాస్ట్‌లో మాంసాహారాన్ని స్వల్పంగా మాత్రమే తీసుకోవాలని ఆమె చెప్పారు.

బియ్యంతో చేసిన పదార్థాల కంటే ఓట్స్ లాంటివి మంచివేనా అనే ప్రశ్నకు- “ఓట్స్ చాలా మంచిది. ఓట్స్‌తో పాటు గింజలు, పాలు, పండ్లు మంచివి. వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. అలాగే వీటికి ప్రత్యామ్నాయంగా అటుకులు, తృణధాన్యాలు కూడా మంచిదే’’ అని ఆమె బదులిచ్చారు.

బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడానికి మంచి సమయం ఏదని అడగ్గా, “నిద్ర లేచిన రెండు గంటల్లోగా తినడం మంచిది. 11 గంటల తర్వాత తింటే దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అని అనలేం’’ అని ఆమె తెలిపారు.

బ్రేక్‌ఫాస్ట్ తినకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తే ఎక్కువ ఆహారం తినేందుకు అలవాటు పడుతున్నట్లేనని భువనేశ్వరి హెచ్చరించారు.

ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుందని, అందుకే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరని, దానికి ప్రత్యామ్నాయం లేదని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, బ్రేక్‌ఫాస్ట్ ఏం తినాలి? ఎప్పుడు తినాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)