లిక్కర్ తాగితే యువతీయువకుల బ్రెయిన్‌కు చాలా డేంజర్...

ఫొటో సోర్స్, GETTY IMAGES
నాకు 18 ఏళ్ళు వచ్చాయి. ఇక స్వేచ్ఛగా ఆల్కహాల్ కొనుక్కోవచ్చు. పబ్బులు, స్టూడెంట్ బార్లలో చక్కర్లు కొట్టొచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మద్యపానానికి ఉన్న 18 ఏళ్ళ వయోపరిమితిని నేను దాటేశాను.
నా కొత్త ఇంటికి సమీపంలోని డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వారానికి ఎన్ని యూనిట్ల అల్కహాల్ తాగుతున్నావని అడిగారు. ఎంత ఆల్కహాల్ తీసుకున్నామో యూనిట్లలో కొలవడం ఇక్కడ సాధారణం. 1.5 యూనిట్ పరిమాణం దాదాపు ఓ చిన్నగ్లాస్ వైన్‌కు సమానం.
వెంటనే గత రాత్రి నా స్కూల్ ఫ్రెండ్స్‌తో నేను తాగిన ఆరెంజ్ ఓడ్కాను గుర్తుచేసుకుంటూ ‘‘దాదాపు ఏడు యూనిట్లు’’ అని చెప్పాను. ఇది చాలా తక్కువ పరిమాణం అని నా ఉద్దేశం. ఎందుకంటే నేనెప్పుడూ నియమాలను పెద్దగా ఉల్లంఘించలేదు.
‘‘ఇకపై నువ్వు తాగే యూనిట్లు ఇంకా పెరుగుతాయి. అందుకే నువ్వు ఇక్కడకొచ్చావు’’ అన్నారు డాక్టర్ పొడి పొడిగా నవ్వుతూ. డాక్టర్ చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదు.
కొన్ని వారాల్లోనే స్టూడెంట్ బార్‌లో డ్రింక్స్ తయారుచేసేలోపే ఓ వైన్ బాటిల్ ఖాళీ చేసేశాను.
తెగ తాగేయడం జీవితాంతం నష్టాన్ని కలుగచేస్తుందని నాకు తెలుసు. కానీ నేనిప్పుడే యౌవనంలోకి అడుగుపెట్టాను కాబట్టి 30,40,50 ఏళ్ళ వయసువారితో పోల్చుకుంటే నాకేమీ పెద్ద నష్టం కలగదని భావించాను.
భ్రమలకు ఫుల్‌స్టాప్

ఫొటో సోర్స్, GETTY IMAGES
అల్కహాల్ వల్ల కలిగే ముప్పు పెద్దలకు మాత్రమే అని భావించాను. యువత మెదడుకు కూడా అల్కహాల్ వినియోగం ప్రమాదం కలగచేస్తుందనే విషయాన్ని నేను వినిఉంటే, కొంత జాగ్రత్త పడేవాణ్ణేమో.
18 ఏళ్ళ వయసులో మెదడు ఇంకా అపరిపక్వంగానే ఉంటుంది. మరో ఏడేళ్ళకు గానీ అది పక్వానికి చేరదు. ఇది మనం ఆల్కహాల్ కు స్పందించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ కీలక సమయంలో మద్యసేవనం మన మెదడు ప్రతిభాపాఠవాలపై దీర్ఘకాలిక పరిణామాలకు కారణమవుతుంది.
మద్యపాన సేవనం యువతపై చూపించే ప్రభావం గురించి నేను పరిశోధకులతో మాట్లాడినప్పుడు, ఇంకా అనేక కొత్త విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. యూకే, యూఎస్ కంటే ఖండాతర యూరోపియన్లకు ఆరోగ్యకరమైన మద్యపాన సంస్కృతి ఉందని, తమ పిల్లలను భోజనంతోపాటు ఆల్కహాల్ సేవనానికి అంగీకరిస్తున్నారని,దీనివల్ల ఆల్కహాల్ వినియోగంలో బాధ్యత నేర్పినట్టవుతుందనే నమ్మకాలను ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు తిప్పికొడుతున్నాయి.
మద్యపానంపై ఈ కొత్త పరిశోధనలు ప్రస్తుత మన మద్యపాన చట్టాలలో మార్పులకు ప్రేరేపిస్తాయ లేదా అనేది ఓ సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్నే అయినా, వీటిల్లోని వాస్తవాలు మన భావితరాలకు చైతన్యం కలిగించేవిగానూ, సరదాగా ఆల్కహాల్ తీసుకోనే విషయంలో వారికి అవగాహన కలిగించేలా ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులకు కూడా తమ ఇళ్ళలో ఆల్కహాల్ సేవనంపై ఎలా వ్యవహరించాలో తెలుపుతున్నాయి.
చిన్న పెగ్గు కూడా ప్రమాదకరమే...

ఫొటో సోర్స్, GETTY IMAGES
నిజం మాట్లాడుకుంటే ఆల్కహాల్ అనేది ఓ మత్తు. అది ప్రాణాంతక ప్రమాదాలకు, లివర్ వ్యాధులకు, అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది.
చిన్న మొత్తంలో ఆల్కహాల్ వినియోగం కూడా క్యాన్సర్‌కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ‘‘ఇంత మొత్తం ఆల్కహాల్ మాత్రమే ఆరోగ్యాన్ని ప్రభావితం చేయదు అని చెప్పే లెక్కలేవీ లేవు’’ అని పేర్కొంది.
ఆల్కహాల్ అందించే సంతోషంతో పోల్చుకున్నప్పుడు కొన్ని చర్యలను ముప్పులేనివిగానే పరిగణించాలి. అంటే ఆల్కహాల్ వినియోగాన్ని తగినంత మోతాదుకు పరిమితం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని హాయిగా కాపాడుకోవచ్చు.
అమెరికాలో మగవారు ప్రతిరోజూ రెండు పెగ్గులు, మహిళలు ఒక పెగ్గు ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యకరమని నిర్ణయించారు. మిగిలిన దేశాలలో ఇదేవిధమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
సాధారణంగా బీర్, వైన్ హాని చేయని పానీయాలుగా భావిస్తుంటారు. కానీ అమెరికా మార్గదర్శకాల ప్రకారం ఏ రకమైన మద్యం సేవిస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత పరిమాణంలో ఆల్కహాల్ వినియోగిస్తున్నామన్నదే కీలకం.
‘ 360 మిల్లీ లీటర్ల బీరులో ఓ 15 మిల్లీ లీటర్ల గ్లాస్ వైన్, లేదంటే 45 మిల్లీ లీటర్ల లిక్కర్‌కు సమానమైన ఆల్కహాల్ ఉంటుంది’’ అని నిబంధనలు వివరిస్తున్నాయి.
ఆల్కహాల్ కొనుగోలు చట్టాన్ని కూడా ఈ ముప్పు పరిమితులను దృష్టిలో పెట్టుకునే అమలు చేస్తుంటారు. ఈ చట్టం చిన్నారుల రక్షణకు ఉపయోగపడటంతో పెద్దవారు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిస్తుంది.
యూరప్‌లోని అనేక దేశాలలో మద్యపానానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా, అమెరికాలో 21 ఏళ్ళు.
కానీ మద్యపాన సేవనానికి చట్టబద్ధమైన వయసు దాటిన తరువాత కూడా యువతకు ఆల్కహాల్ సేవనం ఎందుకు ప్రమాదకరమనే అంశానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఈ కారణాలలో శరీరాకృతి, దాని సైజు కూడా ఒకటి.
టీనేజర్లు 21 ఏళ్ళ వయసు వచ్చేవరకూ పెద్దవారి ఎత్తును అందుకోలేరు.
‘‘ఓ గ్లాస్ ఆల్కహాల్ సేవనం వల్ల పెద్దవారి కంటే యువకుల రక్తంలో అధికపరిమాణంలో ఆల్కహాల్ చేరుతుంది’’ అని రుడ్ రూడ్బీన్ చెప్పారు. ఆయన నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ లో పోస్ట్ డాక్టరల్ పరిశోధకునిగా ఉన్నారు. అలాగే ఆల్కహాల్ వినియోగానికి కనీస వయసు పెంపు ప్రభావంపై రాసిన బియాండ్ లెజిస్లేషన్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
కౌమారదశలో ఉన్నవారి శరీరనిర్మాణం మత్తు అనుభవించే తీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే అది రక్త ప్రవాహంలోకి చేరి శరీరమంతటా వ్యాపిస్తుంది. తరువాత ఐదు నిమిషాల్లోనే అవలీలగా మెదడును చేరుకుంటుంది.
‘యువత సేవించే ఆల్కహాల్‌లో ఎక్కువభాగం వారి మస్తిష్కంలోనే తిష్టవేస్తుంది. అందుకే వారు ఆల్కహాల్ పాయింజనింగ్‌తో బాధపడటానికి ఇది మరో కారణం’’అని రూడ్‌బెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మెదడులో మార్పులు
గతంలో నాడీ అభివృద్ధి కౌమరదశలో ఆగిపోతుందని భావించేవారు. కానీ కౌమర మస్తిష్కం సంక్లిష్టమైన రీవైరింగ్ కు లోనవుతూనే ఉంటుందని, అది పాతికేళ్ళ వరకు కొనసాగుతుందని ఇటీవల వరుసగా జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి.
కౌమారదశలో ఆల్కహాల్ సేవనం వల్ల కలిగే మరో ముఖ్యమైన మార్పు ఏమంటే మన దైనందిన కార్యకలాపాలను సజావుగా చేసుకోవడానికి కారణమయ్యే ‘గ్రే మేటర్’ తరిగిపోయి నాడీకణసంధిని మెదడు అడ్డుకుంటుంది. ఈ నాడీ కణ సంధి వల్లే సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి పంపిణీ అవుతుంది. అదే సమయంలో తెల్లని పొరతో కప్పి ఉండే మైలిన్ పెరుగుతుంది.
‘‘అవి (నాడీ కణసంధులు) మన మెదడులో రహదారుల్లాంటివి. సమర్థమైన న్యూరాన్ల వ్యవస్థ సమాచారాన్ని త్వరగా విశ్లేషిస్తాయి’’ అని లిండ్సే స్కేగ్లియా చెప్పారు.
స్కేగ్లియా సౌత్ కరోలినా మెడికల్ యూనివర్సిటీలో న్యూరోసైకాలజిస్ట్‌గా ఉన్నారు.
మన భావోద్వేగాలు, జ్ఞాపకశక్తిని పెంచడం, లైంగిక కోరికలను ప్రేరేపించే లింబిక్ వ్యవస్థ ముందుగా పరిపూర్ణంగా ఎదుగుతుంది. ఈ భాగం కౌమరదశలోనే పెద్దవారితో సమానంగా పోలి ఉంటుంది’’ అని స్కేగ్లియా తెలిపారు.
మన నుదుటి భాగం వెనుక ఉండే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మెల్లిగా పరిపక్వం చెందుతుంది. ఇది మన భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడం, స్వీయనియంత్రణకు బాధ్యత వహిస్తుంది.
ఈ రెండు కీలకమైన భాగాల అభివృద్ధిలో కనిపించే అసమతుల్యత కౌమార,యౌవన దశలో ఉండేవారు ఆల్కహాల్ సేవనం వల్ల , పెద్దల కంటే ఎందుకు ఎక్కువ హానికి గురవుతారో వివరిస్తుంది.
‘‘టీనేజర్ల మెదడు బ్రేకుల్లేని యాక్సిలర్‌రేటర్ ల్లాంటిదని’’ అభివర్ణిస్తుంటారు.
ఆల్కాహాల్లో న్యూరాన్లు (ఉత్తేజాన్ని కలగచేసేవి) మునిగి తేలడం వల్ల మరింత ఉల్లాసంగా ఉండాలనే కోరికను రెట్టింపు చేస్తాయి.
పెద్దగా ఆలోచించలేని లేని టీనేజర్లను ఆల్కహాల్ సేవనం దుష్ప్రవర్తనకు గురిచేస్తుంది.
‘‘బలహీన మనస్కులైన పిల్లలు ఎక్కువ తాగి, దాని దుష్ప్రభావాలకు గురవుతారు’’అని చెప్పారు స్కేగ్లియా.
కౌమార దశలో తరచుగా ఎక్కువ పరిమాణంలో మద్యసేవనం , మస్కిష్క పరిపక్వతను ప్రభావితం చేస్తుంది. మెదడులో గ్రేమేటర్ ను క్షీణించేలా చేసి, వైట్ మేటర్ పెరుగుదలను ఆలస్యం చేస్తుంది.
‘‘ఈ పరిణామాలన్నీ అభిజ్ఞాపరీక్షలలో వెంటనే ప్రతిఫలించకపోవచ్చు. కానీ యువ మస్కిష్కాలలో సమస్యలను పరిష్కరించడానికి కారణమయ్యే ప్రాంతాలు కష్టంగా పనిచేస్తాయి. అయితే దీర్ఘకాల మద్యసేవనం మెదడు పనితీరును మరింత శుష్కించేలా చేస్తుంది. సాధారణ పనుల విషయంలో కూడా ఇది ప్రతిఫలిస్తుంది’’ అని చెప్పారు స్కేగ్లియా
యౌవన దశలోనే మద్యసేవనం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పోను పోను తాగుబోతులుగా మారే ప్రమాదమూ ఉంటుంది. తాగుడు అలవాటున్న కుటుంబాలలో ఇదో నగ్నసత్యం. చిన్నవయసులోనే మద్యసేవనం ప్రారంభించినవారు, తరువాత కాలంలో దాని వలలో చిక్కుకుపోతారు.
అసలింతకీ ఎప్పుడు తాగాలి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
మద్యసేవనం ఎప్పుడు ప్రారంభించాలనే టీనేజర్ల యావను, ఇంటి వద్ద ఆల్కహాల్ సేవనానికి ఏ సమయంలో అనుమతి ఇవ్వాలనే తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఈ ఫలితాలు ఎంతవరకు ప్రభావితం చేయగలవు?
‘‘ మా సందేశం వీలైనంత ఆలస్యం చేయడమే. ఎందుకంటే మీ మెదడు ఇంకా ఎదుగుతూనే ఉంది. దానిని పూర్తిగా ఎదగనీయండి. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలు తీసుకునే ముందు మీరు వీలైనంత ఆరోగ్యంగా ఉండండి’’ అని స్కేగ్లియా చెప్పారు.
ఫ్రాన్స్ లాంటి దేశాలలో మైనర్లు కూడా కుటుంబంతో భోజనం చేసేటప్పుడు ఓ గ్లాసు బీరు లేదా వైన్ తీసుకోవచ్చు.
యూరప్ బయటి దేశాలలో పిల్లలకు మెల్లిగా మద్యసేవనం నేర్పడం వల్ల తరువాత కాలంలో వారు తాగుబోతులుగా మారకుండా నియంత్రణలో ఉంటారని తల్లిదండ్రులు నమ్ముతుంటారు.
కానీ ఇది పూర్తిగా భ్రమ. ‘‘ తల్లిదండ్రులు పిల్లల మద్యసేవనం విషయంలో ఎంత మెత్తగా ఉంటే భవిష్యత్తులో పిల్లలు ఆల్కహాల్ సేవనంలో అంత ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారని, కానీ కఠినంగా వ్యవహరిస్తే, మద్యం వల్ల కలిగే ముప్పు తక్కువగా ఉంటుందని’’ ఓ సమగ్ర అధ్యయనం తెలిపింది.
మద్యం కొనుగోలు వయసును పెంచడం బాధ్యతాయుతమైన మద్య వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని అనేక ఆధారాలు చెబుతున్నాయి.
ఆస్ట్రియాలోని లింజ్‌లో గల జోహాన్నెస్ కెప్లర్ యూనివర్సిటీలో అలెగ్జాండర్ అహ్మర్ చేసిన అధ్యయనాన్ని మేం సమీక్షించాం.
ఆస్ట్రియాలో 16 ఏళ్ళ దాటిన ఎవరైనా చట్టబద్ధంగా బీరు లేదా వైన్ కొనుగోలు చేయవచ్చు.
16 ఏళ్ళకే మద్యపానం చేయవచ్చనే చట్టం కారణంగా మద్యసేవనంతో ముడిపడి ఉన్న ప్రమాదాల విషయంలో ఆస్ట్రియన్ల దృక్పథం మారిపోయినట్టుగా అహ్మర్ తెలుసుకున్నారు.
‘‘మద్య వినియోగం చట్టబద్ధమైనప్పుడు కౌమార దశలో ఉన్నవారు మద్యసేవనమనేది గతంలో కంటే తక్కువ ప్రమాదకారిగా భావించడం మొదలుపెట్టారు’’ అని ఆయన చెప్పారు.
16 ఏళ్ళ వయసులో ఇటువంటి భావన కలగడం ప్రమాదకరం. అదే 21 ఏళ్ళ వయసులో అయితే మీ మెదడు కొంత పరిణితి చెంది ఉంటుంది. మీరు మద్యం సేవించినా తట్టుకోగలిగే అవకాశం మీ మెదడుకు మెరుగ్గా ఉంటుంది.
ఆరోగ్యవంతమైన యురోపియన్ మద్యపాన సంస్కృతి అనే భావన కూడా సరైనది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం యురోపియన్ ప్రాంతాలలోని కేన్సర్లకు తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా మద్యాన్ని వినియోగించడం కూడా కారణమని తెలిపింది.
శాస్త్రీయ ఆధారాల రీత్యా , మెదడు పూర్తిగా పక్వం చెందే పాతికేళ్ళ వయసులో మద్యపాన వినియోగానికి అనుమతించాలా అనే ప్రశ్నకు ఇదంత తేలికైన విషయం కాదంటారు నిపుణులు. ప్రజారోగ్యం, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ రెండింటిని సమన్వయం చేయాలంటారు.
నిషేధాలు, కట్టుబాట్లు కంటే కౌమారదశలో ఉండేవారికి మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి వారిని చైతన్యపరచడమే ఉత్తమ మార్గమంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేశాక వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆలోచన ఏమిటి?
- ఎలక్ట్రిక్ కార్: టెస్లాకు పోటీగా రంగంలోకి దిగిన షియోమీ, కారు ధర ఎంత, సవాళ్లేంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














