అమెరికా అధ్యక్షుడి విమానంలో మాయమవుతున్న వస్తువులు... వార్నింగ్ ఇచ్చిన వైట్‌హౌస్

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో కొన్ని వస్తువులు మాయమైపోతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ విషయంలో వైట్ హౌస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో పశ్చిమతీర ప్రాంతంలో పర్యటించారు. ఇందుకోసం ఆయన వైట్ హౌస్ అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణించారు.
తిరిగి వచ్చిన తరువాత చూస్తే విమానంలో చాలా వస్తువులు కనిపించలేదన్న సంగతిని భద్రతా సిబ్బంది గుర్తించారు.
బ్రాండెడ్ దిండు కవర్లు, గ్లాసులు, బంగారు పూత పూసిన పళ్లేలు తదితర వస్తువులు అధ్యక్షుడి విమానం నుంచి తస్కరణకు గురైనట్టు వారు తెలుసుకున్నారు. ఇది విలేకరుల పని అని గుర్తించారు.
దాంతో, అధ్యక్షుడి విమానం నుంచి ఇలాంటి వస్తువులను తీసుకువెళ్ళడం నిషిద్ధమని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ తెలిపింది.
ఈమేరకు అసోసియేషన్ రిపోర్టర్లకు ఒక వార్నింగ్ మెయిల్ పంపింది.
ఇలాంటి ప్రవర్తన విలేఖరులపై తప్పుడు అభిప్రాయాన్ని కలుగ చేస్తుందని, అధ్యక్షుడితో ప్రయాణించే రిపోర్టర్లు ఇలాంటి ప్రవర్తనను మార్చుకోవాలని అందులో కోరింది.
కొన్ని సందర్భాలలో ఈ విమానంలో ప్రయాణించిన జర్నలిస్టులకు అధ్యక్షుడి సీల్‌తో కూడిన చిన్న చిన్న చాక్లెట్ల బాక్సులను గుర్తుగా ఇస్తుంటారు.
కానీ ఎయిర్‌ఫోర్స్ వన్ లోగోతో ఉన్న కత్తులు, టవల్స్ లాంటి వస్తువులను తీసుకోవడమనేది చాలా ఏళ్ళుగా సర్వసాధారణమైన విషయమని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

‘ఇది సాధారణమే’
వాయిస్ ఆఫ్ అమెరికాకు చెందిన వైట్‌హౌస్ కరస్పాండెంట్ మిషా కోమడోవిస్కీ తన వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్‌లోగోతో కూడిన ఆకర్షణీయమైన కలెక్షన్ ఉన్నట్టు తెలిపారు.
‘‘ఈ వస్తువులను సేకరించే విషయంలో నేనేమీ తప్పు చేయలేదు. లేదంటే ఎవరినీ ఇబ్బందికి గురి చేయలేదు’’ అని ఎయిర్ ఫోర్స్ వన్ లోగోతో ఉన్న పేపర్‌కప్పును చూపిస్తూ మిషా చెప్పారు.
‘‘ఈ పేపర్ కప్పును పారేయడం మరిచిపోయాను’’ అని ఆయన చెప్పారు.
మిషా వద్ద అధ్యక్షుడి బైడెన్ సంతకంతో కూడిన ప్రెసిడెన్షియల్ చాక్లెట్స్ పాకెట్స్ కూడా ఉన్నాయి.
‘‘ఈ చాక్లెట్లు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే వాటిని ఆకర్షణీయమైన బాక్స్‌లో పాక్ చేశారు అంతే’’ అని చెప్పారు.
ఎయిర్‌ఫోర్స్ వన్ ను వైట్ హౌస్ ‘ఎగిరే శ్వేత సౌధంగా’ అభివర్ణిస్తుంటుంది.
ఈ విమానంలో నాలుగువేల చదరపు అడుగుల స్థలంలో మూడు ఫ్లోర్లు కలిగి ఉంటుంది.
ఇందులో ఎన్నో ఆకర్షణీయమైన సౌకర్యాలు ఉన్నాయి.
అధ్యక్షుడి కోసం ఓ విశాలమైన సూట్ ఉంటుంది.
ఆపరేషన్ టేబుల్ తో కూడిన వైద్య కేంద్రం . కాన్ఫరెన్స్ హాల్, భోజనశాల, ఒకేసారి వందమందికి వండి వార్చగల వంటశాల, వీఐపీలకు, ప్రెస్ కు చక్కని సౌకర్యాలు, భద్రత, కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక వసతులు ఉన్నాయి.
ఇందులోని అధునాతన భద్రతా సౌకర్యాల దృష్ట్యా దీనిని మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ గా పిలుస్తారు. దీనిని వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించారు.
ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలదు. దీనివల్ల విమానం ఎంతసేపైనా ఎగిరే అవకాశం ఉంటుంది. అత్యవసర వేళల్లో ఈ సామర్థ్యం చాలా ముఖ్యమైన అంశం.
ఇందులోని సమాచార సాధానాలు ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను మొబైల్ కమాండ్ కేంద్రంగా పనిచేసేలా చేస్తాయి. ఇందులో మొత్తం 85 టెలిఫోన్లు ఉన్నాయి. టూ వే రేడియో, కంప్యూటర్ కనెక్షన్ ఉన్నాయి.
ఎయిర్‌ఫోర్స్ వన్‌లో అధ్యక్షుడు ముందు భాగంలో కూర్చుంటారు.
వెనుక భాగంలో జర్నలిస్టులు ప్రయాణిస్తారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేశాక వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆలోచన ఏమిటి?
- ఎలక్ట్రిక్ కార్: టెస్లాకు పోటీగా రంగంలోకి దిగిన షియోమీ, కారు ధర ఎంత, సవాళ్లేంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















