ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు.. ఆ దేశంలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్
- నుంచి, జెరుసలెం
ఇజ్రాయెల్‌లో రాజకీయ విభేదాలు బట్టబయలయ్యాయి.
అక్టోబర్ 7న హమాస్ దాడుల తరువాత దిగ్భ్రాంతికి గురైన ప్రజలు దేశవ్యాప్తంగా ఏకతాటిపై నిలబడ్డారు. కానీ, ఆరునెలల తరువాత వేల మంది ఇజ్రాయెల్ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఇజ్రాయెల్‌లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జెరూసలెంలో ప్రధాన హైవే ప్రాంతమైన బిగిన్ బౌలే వార్డ్ ను దిగ్భంధించిన నిరసనకారులపై పోలీసులు జలఫిరంగుల ద్వారా మురికివాసన కొట్టే నీటిని ప్రయోగించారు.
గాజాలో బందీలుగా ఉన్న 134 మందిని తక్షణం విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని,నెతన్యాహు రాజీనామా చేయాలని, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.
ఒప్పందం లేకుండా యుద్ధం కొనసాగితే బందీలుగా ఉన్నవారిలో చాలామంది చనిపోయే అవకాశం ఉందని వారి బంధువులు, స్నేహితులతోపాటు నిరసనకారులు భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Oren Rosenfeld
‘నెతన్యాహుదే బాధ్యత’
ఆదివారం సాయంత్రం ఇజ్రాయెల్ పార్లమెంట్ చుట్టూ ఉన్న విశాలమైన మార్గాలను వేలాదిమంది చుట్టిముట్టినప్పుడు కటియా అమ్రోజా తన మెగాఫోన్‌ను ఓ నిమిషం పాటు ఆపివేశారు. ఆమె కుమారుడు గాజాలో ఉన్న ఇజ్రాయెలీ సైన్యంలో పనిచేస్తున్నారు.
‘‘ఈరోజు ఉదయం నుంచి నేనిక్కడే ఉన్నాను. నెతన్యాహు దేశం విడిచి వెళ్ళేందుకు ఆయనకు ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ చార్జీలు చెల్లిస్తాను. ఆయన ఇకపై ఎంతమాత్రం తిరిగి రాకూడదు’’ అని ఆమె చెప్పారు.
‘‘ఆయన, తనతోపాటు ప్రభుత్వంలోని అత్యంత పనికిమాలినవారిని, ఈ సమాజానికి ఎందుకు పనికిరానివారిని కూడా తీసుకువెళ్ళాలి’’అని ఆమె తెలిపారు.
అదే సమయంలో కటియా ను దాటుకుంటూ ఓ యూదు బోధకుడు అటుగా వెళుతున్నారు.
టెంపుల్ మౌంట్ వద్ద యూదుల ప్రార్థనల కోసం ప్రచారం చేసే ఆయన పేరు యొహవా గ్లిక్ నిరసనకారులు తమ అసలైన శత్రువు నెతన్యాహు కాదని, హమాస్ అనే విషయాన్ని మరిచిపోతున్నారని ఆయన చెప్పారు.
‘‘ఆయన (నెతన్యాహు) చాలా పేరున్న మనిషి. బహుశా వీరంతా ఎప్పటి నుంచో ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నా, ఇంకా ఆయన అధికారంలోనే ఉన్నారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు.ఆ విషయమే వీరిని రెచ్చగొడుతున్నట్టుంది.’’ అని చెప్పారు.
‘‘నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. వారేమనుకుంటున్నారో వచ్చి బిగ్గరగా చెప్పండి. వారి మనోభావాలేమిటో కూడా స్పష్టంగా చెప్పాలి. కానీ ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య ఉన్న సన్నని గీత విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Oren Rosenfield
అతివాద యూదు పార్టీల మద్దతుతో కొనసాగుతున్న నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య శత్రువులు ఉన్నారని, నిరసనకారులతోపాటు ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్న దేశాలలోని నెతన్యాహు విమర్శకులు కూడా నమ్ముతున్నారు.
ఈ అతివాద యూదు పార్టీలలో రిలీజియస్ జియోనిజమ్ పార్టీ ఒకటి. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలల్ స్మాట్రిక్ నేతృత్వంలో ఈ పార్టీ నడుస్తోంది. ఈ పార్టీ ఎంపీ ఒహద్ తల్ మాట్లాడుతూ హమాస్‌పై సైనిక ఒత్తిడి పెంచడం కాకుండా ఇతర మార్గాలలో బందీలను విడిపించడం సాధ్యమేనని నమ్మడం అమాయకత్వమని చెప్పారు.
‘‘ఏదైనా బటన్ నొక్కితే హమాస్ చెరలో ఉన్న బందీలందరూ వెనక్కి వచ్చే అవకాశం ఉంటే, ప్రతి ఇజ్రాయెలీ పౌరుడు ఆ బటన్ నొక్కుతారు. కానీ ఇది మీరు అనుకున్నంత సులభం కాదు’’ అని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్‌ను సురక్షితంగా ఉంచుతానని బెంజిమిన్ నెతన్యాహు తరచూ చెపుతుంటారు. అనేకమంది ఇజ్రాయెలీలు ఈ విషయంలో ఆయనను విశ్వసించారు.
పాలస్తినీయన్లను తాను ఒప్పించగలనని, యూదులను పాలస్తీనా ప్రాంతంలో స్థిరపరిచి, వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలనని, ఇందుకోసం ఎటువంటి మినహాయింపులు, త్యాగాలు అవసరం లేకుండానే శాంతి ఒప్పందాన్ని కుదర్చగలనని ఆయన చెప్పారు.
కానీ అక్టోబరు 7 న హమాస్ దాడుల తరువాత పరిస్థితి మొత్తం తారుమారైంది. అనేకమంది ఇజ్రాయెలీలు ఈ భద్రతా వైఫల్యానికి నెతన్యాహునే బాధ్యుడిని చేశారు. అయితే భద్రత విషయంలో తాము తప్పులు చేశామని అంగీకరిస్తూ నెతన్యాహు భద్రతా అధికారులు తరచూ ప్రకటనలు విడుదల చేసినా, నెతన్యాహు ఏనాడూ ఈ బాధ్యతను అంగీకరించలేదు.
జెరుసలెం రహదారులను దిగ్భంధించిన వేలాదిమంది పౌరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
పాలస్తీనాకు వ్యతిరేకం

ఫొటో సోర్స్, EPA-EFE-REX/Shutterstock
బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెలీ రాజకీయాలలో ఎటువంటి ప్రభావం చూపని కాలం గురించి తెలియాలంటే కచ్చితంగా ఇజ్రాయెలీలకు 40 ఏళ్ళ వయసు ఉండి ఉండాలి.
ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ అధికారి ప్రతినిధిగా ఎదిగాకా, ఓస్లో శాంతి ఒప్పంద ప్రక్రియను వ్యతిరేకించడంలో స్వల్ప విజయం సాధించిన తరువాత బెంజిమిన్ నెతన్యాహు ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
మధ్య ప్రాచ్యంలో ప్రస్తుతం శాంతి నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల మాదిరిగానే ఓస్లో ఒప్పదం కూడా జోర్డాన్ నది, మధ్యధార సముద్రం మధ్యన ఉన్న ప్రాంతంపై పట్టు కోసం అరబ్బులకు, యూదుల మధ్య శతాబ్దానికి పైబడి ఉన్న చిచ్చును చల్లార్చేందుకు, ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పాటుచేసుకునేందుకు ఉద్దేశించినది.
పాలస్తీనా ప్రత్యేక దేశం ఏర్పాటును నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో పూర్వ స్థితి కోసం, స్వతంత్ర పాలస్తీనాకు మద్దతు పలికేందుకు అమెరికా చెబుతున్న ‘గ్రాండ్ బార్గెయిన్’ విధానాన్ని నెతన్యాహు తోసిపుచ్చుతున్నారు.
యుద్ధానంతరం గాజాలో పాలనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రణాళికను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఇజ్రాయెలీ తీవ్ర మితవాద గ్రూపుల మద్దతు కోసమేనని ఆయన విమర్శకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Oren Rosenfeld
‘ఇజ్రాయెల్‌కు ప్రమాదకారి’
ఇజ్రాయెల్ పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నవారిలో డేవిడ్ అగ్మాన్ కూడా ఒకరు. ఆయన ఇజ్రాయెలీ సైన్యం నుంచి రిటైరైన బిగ్రేడియర్ జనరల్. నెతన్యాహు తొలిసారి ప్రధానిగా ఎన్నికైన సమయంలో ప్రధాని కార్యాలయంలో పనిచేశారు.
‘‘1948 నుంచి ఇదే అతి పెద్ద సంక్షోభం. నేను మీకు కొన్ని సంగతులు చెప్పాలి. 1996లో నెతన్యాహు కు నేనే మొదటి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ని. ఆయన గురించి నాకు బాగా తెలుసు. కానీ మూడు నెలల తరువాత నేను అక్కడి నుంచి వచ్చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్‌కు ప్రమాదకారి అని గ్రహించాను’’ అని చెప్పారు.
‘‘ఆయనకు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు. పిరికివాడు. ఆయనకు కేవలం మాట్లాడటం మాత్రమే తెలుసు. ఇదే కాదు ఆయన భార్యపై ఆధారపడతారు. ఆయన అబద్ధాలు చెప్పడం కూడా నేను చూశాను. మూడు నెలల తరువాత మీకు ఎవరి సహాయం అవసరం లేదు. మీ స్థానంలో మరొకరు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను’’ అని డేవిడ్ అగ్మాన్ వివరించారు.
నిరసనకారులు వీధులలో ఉండగానే, ముందస్తు ఎన్నికల అంశాన్ని నెతన్యాహు కొట్టిపారేశారు. పైగా రఫాలోని హమాస్ దళాలకుపై దాడులకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు.
ప్రత్యర్థులు కోరుకున్నట్టు ముందస్తు ఎన్నికలు వచ్చినా, నెతాన్యుహునే గెలుస్తారని ఆయన మద్దతు దారులు బలంగా నమ్ముతున్నారు.
హమాస్ ను అంతమొందించే విషయంలో ఇజ్రాయేలీలు ఒక్కటిగానే ఉన్నారు. కానీ యుద్ధం నడుపుతున్న తీరు, బందీలను విడుదల చేయించడంలో వైఫల్యాలు బెంజిమిన్ నెతన్యాహు రాజకీయ జీవితానికి చరమగీతం పాడే ప్రక్రియగా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 - జనసేన: పదేళ్ళ ఈ పార్టీ రూటు మార్చిందా... ఏపీలో జేడీఎస్‌లా మారిందా?
- నిజాం నవాబ్ కాదు, బిల్ గేట్సూ కాదు, చరిత్రలో అత్యంత ధనికుడు ఇతడే...
- ఎలక్ట్రిక్ కార్: టెస్లాకు పోటీగా రంగంలోకి దిగిన షియోమీ, కారు ధర ఎంత, సవాళ్లేంటి?
- ఈ దేశాల్లో డ్యామ్‌లను కూలగొడుతున్నారు... ఎందుకు?
- క్లిక్ హియర్ అంటే ఏంటి? ‘ఎక్స్’లో ఈ మాట ఎందుకు ట్రెండ్ అవుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















