280 మంది విద్యార్థులు, కొందరు టీచర్లను కిడ్నాప్ చేసిన 'బందిపోట్ల'తో ప్రమాదకరమైన మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సులేమాన్ ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ప్రియా సిప్పీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కిడ్నాపైన వారిని విడిపించేందుకు డబ్బు చెల్లించడం చట్టవిరుద్ధం కావచ్చని, అయితే ఉత్తర నైజీరియాలో కిడ్నాపర్ల చెర నుంచి బందీలను విడుదల చేయడానికి ఉన్న ఏకైక మార్గం అదేనని వారిని విడిపించే మధ్యవర్తి సులేమాన్ బీబీసీతో చెప్పారు.
మధ్యవర్తి వ్యక్తిగత గుర్తింపును గోప్యంగా ఉంచడానికి ఈ కథనంలో ఆయన పేరును సులేమాన్‌గా మార్చాం. ఆయన నైజీరియాలోని కడునా రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
మార్చి మొదటి వారంలో కదునాలో కురిగా ప్రాంతంలోని ఒక పాఠశాలలో 8-14 సంవత్సరాల వయసున్న 280 మంది చిన్నారులు, కొంతమంది టీచర్లను కిడ్నాపర్లు ఎత్తుకుపోయారు.
సులేమాన్ చాలా ఏళ్లుగా ఈ వివాదాస్పద, ప్రమాదకర పాత్రలో అనధికారికంగా పని చేస్తున్నారు, తన బంధువులను బందీలుగా పట్టుకున్నప్పటి నుంచి ఆయన ఈ పనిలో ఉన్నారు.
అపహరణకు గురైన తన ఇద్దరు బంధువుల కోసం దాదాపు రూ.10,42,000 డబ్బులు సేకరించేందుకు ప్రయత్నించే క్రమంలో ఆయన చర్చల్లో పాల్గొన్నారు.
"మనం చర్చలు జరపాలి. బందీలను తిరిగి తీసుకురావడానికి బలాన్ని ఉపయోగించలేరు. అది బందీల జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది" అని సులేమాన్ బీబీసీతో చెప్పారు.
నైజీరియాలో డబ్బు చెల్లించడం చట్టవిరుద్ధం కావడానికి ఒక సంవత్సరం ముందు అంటే 2021లో స్థానికంగా బందిపోట్లు అని పిలిచే కిడ్నాపర్లతో సులేమాన్ చర్చలు జరిపారు.
గత మూడేళ్లలో 200 మందికి పైగా బందీలను విడుదల చేయడానికి చర్చలు జరిపినట్లు సులేమాన్ చెప్పారు. గత దశాబ్దంగా ఇలాంటి కిడ్నాప్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, AFP
చర్చలకు సహనం, ధైర్యం అవసరం
సులేమాన్ ఒక గుర్తుతెలియని ప్రదేశం నుంచి మాట్లాడుతూ, "నేను బందిపోట్లకు సహాయం చేస్తున్నానని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం నుంచి డబ్బు పొందుతున్నానని బందిపోట్లు భావిస్తున్నారు, కాబట్టి నేను కూడా కిడ్నాప్ అవ్వొచ్చు" అని అన్నారు.
"నేను ఏం చేశానో నాకు తెలియదు. బందిపోట్లతో మాట్లాడా, వారిని వేడుకున్నా" అని సులేమాన్ గుర్తుచేసుకున్నారు.
ఆ రోజు ఆయన సహనానికి ఫలితం దక్కింది. ముఠా సభ్యులు ఆయన బంధువులను వదిలేశారు. వారికి డబ్బులివ్వడానికి ఊళ్లోని తన పొలాన్ని అమ్ముకున్నారు సులైమాన్.
కిడ్నాపర్ల చెర నుంచి బందీలు విడుదలైనట్లు వార్త అంతటా వ్యాపించింది. దీంతో తమ వారిని కూడా విడిపించి తీసుకురావాల్సిందిగా మిగతా కుటుంబాలు ఆయన వద్దకు వచ్చాయి.
ఆ క్షణం నుంచి సులేమాన్ ఫోన్ బిజీగా మారింది.
"నా గ్రామంలో దాదాపు ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు" అని అన్నారు సులేమాన్. వారందరికీ ఆయన ఉచితంగా సేవలందించానని చెప్పారు.
విమోచన చెల్లింపు (బందీల విడుదలకు డబ్బు)లను నిషేధించినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ సులేమాన్ వద్దకు వస్తారు, సహాయం కోసం ఎదురుచూస్తారు.
"బందిపోట్లతో చర్చలు జరపడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, అలా చేసినవారిని జైలుకూ పంపొచ్చు" అని సులేమాన్ అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
బందిపోట్ల జీవితంపై మధ్యవర్తి ఏమంటున్నారు?
పేదరికం, యువత నిరుద్యోగం తార స్థాయికి చేరడం నైజీరియాలో కిడ్నాప్‌కు మూల కారణాలని సులేమాన్ అభిప్రాయపడ్డారు.
పశువుల కాపరులు, రైతుల మధ్య భూమి, వనరుల కోసం పోటీ కూడా సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నదని అంటున్నారు.
కిడ్నాపర్లు ఫులాని జాతికి చెందిన మాజీ పశువుల కాపరులు, వీరు ప్రధానంగా హౌసా రైతులు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటారు.
చర్చలు ప్రధానంగా హౌసా భాషలో జరుగుతాయి, ఇది ముస్లింలు అధికంగా ఉండే ఉత్తర ప్రాంతాలలో విస్తృతంగా మాట్లాడే భాష.
కానీ, కిడ్నాపర్ల మాతృభాష ఫుల్‌ఫుల్డే, అది ఫులానీ ప్రజలు మాట్లాడే భాష.
"నేను బందిపోట్లతో మాట్లాడినప్పుడు, నాకు వారి గురించి అర్థమైంది" అని సులేమాన్ తెలిపారు.
"వాళ్లు అడవిలో కరెంటు లేకుండా కష్టతరమైన జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్లను ప్రభుత్వం మరచిపోయిందని వారనుకుంటున్నారు" అని చెప్పారు సులేమాన్.

ఫొటో సోర్స్, Getty Images
బందీల విడుదల ఎప్పుడు?
బందిపోట్లు తరచుగా మోటార్‌బైక్‌లపై సంచరిస్తారు. ఇన్‌ఫార్మర్ల సమాచారంతో దాడి ప్రాంతాలను, నిర్దిష్ట కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది వారికి డబ్బు సంపాదించే ఆపరేషన్.
రాజధాని అబుజాలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రకారం వాయువ్య నైజీరియాలో 100కు పైగా ముఠాలలో 30,000 మంది బందిపోట్లు పనిచేస్తున్నారు.
తన చర్చల ఫలితం కిడ్నాపర్ల నాయకుడిపై ఆధారపడి ఉంటుందని సులైమాన్ అంటున్నారు.
"కొంతమంది బందిపోట్లు డబ్బు చెల్లించిన తర్వాత కూడా, బందీలను ఉంచుకుని మరింత డబ్బు డిమాండ్ చేస్తారు'' అని తెలిపారు.
"కొందరు చెల్లించిన వెంటనే బందీలను విడుదల చేస్తారు" అని అన్నారు మధ్యవర్తి సులైమాన్.
ఇది చాలా శ్రమతో కూడుకున్నదని, బందీగా ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి 50 రోజులు పడుతుందని, 20, 30 ఫోన్ కాల్స్ ఉండొచ్చంటున్నారు.
"మీరు సున్నితంగా మాట్లాడాలి. వారు అసభ్యంగా ప్రవర్తిస్తారు, అవమానిస్తారు, కానీ మనం ప్రశాంతంగా ఉండాలి" అని సులైమాన్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
'ప్రభుత్వాలూ చెల్లిస్తాయి'
నైజీరియాలో బ్యాంకు నోట్ల కొరత ఉన్నప్పటికీ, నగదు రూపంలో చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తారు.
చెల్లింపులు సాధారణంగా తల్లిదండ్రులు లేదా అపహరణకు గురైన వారిలో ఒకరి బంధువు ద్వారా చేయించుకుంటారని సులైమాన్ వివరించారు.
"డబ్బులు అందాక బందిపోట్లు వారిని పిలిచి, పొదల్లో ఉన్న తన మనుషులను ఎలా చేరుకోవాలో సూచనలిస్తారు. అందిన డబ్బులో బందిపోటు ప్రతీ నోటు లెక్కించుకుంటాడు" అని ఆయన తెలిపారు.
కొన్నిసార్లు బందిపోట్లు మోటార్ సైకిళ్లను అలాగే మద్యం, సిగరెట్లనూ డిమాండ్ చేస్తారు.
యూనివర్సిటీలో పనిచేస్తున్న తనకు సన్నిహితమైన ఒక వ్యక్తి కూడా కిడ్నాప్ అయ్యారని సులేమాన్ చెప్పారు. తనతో పాటు విద్యార్థులూ కిడ్నాప్ అయ్యారని, వారిని విడిపించడానికి ఒక్కొక్కరికి ప్రభుత్వం సుమారు 1.9 లక్షలు చెల్లించిందని ఆయన అంటున్నారు. అప్పటికీ ఈ డబ్బు చెల్లింపులపై ప్రభుత్వం నిషేధం విధించలేదు. అయితే, సులేమాన్ చెప్పిన విషయానికి అధికారిక ధ్రువీకరణ లేదు.
"ప్రభుత్వం వారు చెల్లించినట్లుగా రికార్డులో ఎన్నటికీ ఒప్పుకోదు. ఎందుకంటే, వారికి అది వైఫల్యాన్ని అంగీకరించినట్లవుతుంది. కానీ, అంతర్గత వ్యక్తులుగా ఏం జరిగిందో మాకు తెలుసు. మా వద్ద అంత డబ్బు లేదు" అని సులేమాన్ చెప్పారు.
ఆ చర్చలలో పాల్గొన్నానని సులేమాన్ చెబుతున్నారు, కిడ్నాపర్లు మొదట ప్రతి బందీకి సుమారు రూ.26 లక్షలు డిమాండ్ చేశారని, చివరికి బేరం కుదుర్చుకున్నారని చెప్పారు.
ఈ రోజుల్లో అంతటి నగదును సేకరించే స్థోమత కొంతమందికే ఉంది. అందుకే బాధితులు తరచుగా డబ్బు కోసం క్రౌడ్ ఫండింగ్ వైపు మొగ్గు చూపుతారు.
'ప్రభుత్వం ఏం చేయాలంటే?'
చెల్లింపుపై ఎటువంటి ఆశ లేనప్పుడు బందీలను చంపడం లేదా విడుదల చేయడం చేస్తుంటారని బందిపోట్లకు పేరుంది.
పాఠశాలల నుంచి ఇటీవల జరిగిన సామూహిక అపహరణలు, విద్యార్థులను చంపేస్తాననే బెదిరింపులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే బందిపోట్ల ఎత్తుగడగా సులేమాన్ అభిప్రాయపడ్డారు.
"ప్రభుత్వం చెల్లిస్తుందని వారు భావిస్తున్నారు" అని అన్నారు. అయితే అధికారులు సందర్భానుసారం ఇలాంటి డబ్బులు చెల్లించినట్లు రిపోర్టులూ ఉన్నాయి.
ఇటీవల కిడ్నాపైన కురిగా పిల్లల కోసం ఒక పైసా కూడా చెల్లించబోమని బాధతోనే చెప్పారు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు.
అయితే, వారి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ భద్రతా దళాలకు ఆదేశాలు జారీచేశారు.
2022 జులై, 2023 జూన్‌ల మధ్య సాయుధ ముఠాలు 50 కోట్లకు పైగా డబ్బులు డిమాండ్ చేశాయని ఎస్‌బీఎం ఇంటెలిజెన్స్,సెక్యూరిటీ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ చెబుతోంది.
ప్రభుత్వ నిర్ణయానికి మధ్యవర్తి సులేమాన్ కూడా మద్దతిస్తున్నారు. చెల్లింపులు చేస్తున్న కొద్దీ కిడ్నాప్ వ్యాపారానికి ఆజ్యం పోసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కిడ్నాప్‌లను నిలువరించడానికి సైనిక చర్య సమాధానం కాదని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వం కిడ్నాపర్లను కలిసి, వారితో మాట్లాడాలని సులేమాన్ కోరుతున్నారు.
అలా చేసేవరకు మరోసారి ఫోన్ రింగ్ అయితే, అది మరొక కిడ్నాప్ కేసుగా భయపడుతున్నట్లు సులైమాన్ చెప్పారు. ఆయన, తన కమ్యూనిటీకి సాయంగా ఉండాలని, ఫోన్ మాట్లాడాలనే అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














