'భారత్ మాతా కీ జై' అనే నినాదాన్ని తొలిసారి వినిపించింది ఒక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమితాభ్ భట్టాసాలీ
- హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా, కోల్‌కతా
దేశంలోని హిందుత్వ రాజకీయ నేతలు, కార్యకర్తలు తరచూ 'భారత్ మాతా కీ జై' అని నినదిస్తూ ఉంటారు. అయితే, 1857లో జరిగిన తొలి స్వాతంత్య్ర పోరాటంలో ఓ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడు మొదటిసారి ఈ నినాదం ఇచ్చినట్లు చరిత్రకారుల బృందం చెబుతోంది.
భారత్ మాతా కీ జై అని ఎందుకు అనరని ముస్లింలను కొందరు ప్రశ్నిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి.
కొంతమంది ఆకతాయిల గుంపు ముస్లింలతో దురుసుగా ప్రవర్తించే సమయంలో, కొందరు హిందుత్వవాదులు బలవంతంగా భారత్ మాతా కీ జై అనాలని వేధింపులకు గురిచేసిన ఘటనలు గత కొన్నేళ్లుగా కనిపిస్తున్నాయి.
ఈ నినాదం మొదట ఒక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడు ఇచ్చారని చరిత్రకారుల బృందం విశ్వసిస్తోంది. అయితే, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రసంగంతో ఈ విషయం సామాన్య ప్రజలకు తెలిసింది.
విజయన్ ప్రసంగాన్ని వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది. అందులో విజయన్ ఇలా అన్నారు, ''సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తులు వచ్చి అక్కడ కూర్చున్న వాళ్లని భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయమంటారు. అసలు ఆ నినాదమిచ్చింది ఎవరో వాళ్లకి తెలుసా? సంఘ్ పరివార్‌కు ఈ విషయం తెలుసో లేదో, ఆయన పేరు అజీముల్లా ఖాన్ అని తెలుసో లేదో నాకు తెలియదు.''
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో అజీముల్లా ఖాన్‌ది కీలకపాత్ర. దానినే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు.
చరిత్రకారులు, రచయిత సయ్యద్ ఉబేదుర్ రెహమాన్ బీబీసీ బంగ్లాతో ఇలా చెప్పారు, ''మాద్రే వతన్ హిందుస్థాన్ జిందాబాద్ నినాదం ఇచ్చింది అజీముల్లా ఖాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.''
అజీముల్లా ఖాన్ నినాదానికి హిందీ అనువాదమే ''భారత్ మాతా కీ జై'' అని చరిత్రకారులు చెబుతున్నారు.
అయితే, ''మాద్రే వతన్ హిందుస్థాన్ జిందాబాద్‌కు అనువాదం లాంగ్ లివ్ మదర్లాండ్ ఇండియా'' అని ఇస్లాం మతవ్యవహారాల నిపుణులు మహమ్మద్ కమరుజ్జమామ్ అన్నారు.
రాయబారి అబ్ది హసన్ సఫ్రానీ 'జై హింద్' నినాదం ఇచ్చినట్లే, ప్రసిద్ధ దేశభక్తి గీతం 'సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా'ను మహమ్మద్ ఇక్బాల్ రాసినట్లే, ఇది కూడా అని కేరళ ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ అజీముల్లా ఖాన్?
సయ్యద్ ఉబేదుర్ రెహమాన్ సంకలనం చేసిన భారతీయ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలో అజీముల్లా ఖాన్ గురించి ప్రత్యేక అధ్యాయం ఉంది.
అందులో ఇలా రాసి ఉంది, ''1857 నాటి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన అగ్రనాయకుల్లో అజీముల్లా ఖాన్ ఒకరు. ఆయన ఇంగ్లిష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో నిష్ణాతులు. ఇతర స్వాతంత్ర్య సమరయోధులకు విదేశీ భాషల్లో అంత పరిజ్ఞానం లేదు. ఆయన బ్రిటిష్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు, చర్చలు జరిపేవారు. బ్రిటిష్ సైన్యాన్ని జయించడం అసాధ్యమని చాలామంది భారతీయులు నమ్ముతున్న రోజుల్లో ఆయన టర్కీ, క్రిమియా, యూరప్‌లను సందర్శించి అక్కడ బ్రిటిష్ సైన్యం ఓడిపోవడాన్ని చూశారు.''
రెండవ పీష్వా బాజీరావు దత్తపుత్రుడు నానా సాహెబ్ వద్ద అజీముల్లా ఖాన్ దివాన్ అని రెహమాన్ రాశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు. మరాఠా సామ్రాజ్యానికి రాజు పీష్వా.
హిందూ జాతీయవాద పితామహుడిగా చెప్పే వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకం 'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857' లో అజీముల్లా ఖాన్ గురించి ఇలా రాశారు. ''1857 తిరుగుబాటులో గుర్తుకొచ్చే ముఖ్యమైన వ్యక్తుల్లో అజీముల్లా ఖాన్ ఒకరు. స్వాతంత్ర్య పోరాటం గురించి మొదట ఆలోచించిన వారిలో అజీముల్లాకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి''
రెండవ పీష్వా బాజీరావు దత్తపుత్రుడు కావడంతో, ఆయన మరణానంతరం నానా సాహెబ్‌కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెన్షన్ నిలిపేసింది.
ఆ వారసత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు నానా సాహెబ్ అజీముల్లా ఖాన్‌ను ఇంగ్లండ్ పంపించినట్లు సావర్కర్‌తో పాటు పలువురు చరిత్రకారులు కూడా రాశారు. అజీముల్లా దాదాపు రెండేళ్లపాటు ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆయన 1855లో భారత్‌కు తిరిగొచ్చారు.
ఇంగ్లిష్, ఫ్రెంచ్ సహా అనేక విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ అజీముల్లా ఖాన్ బాల్యం మాత్రం అత్యంత పేదరికంలో గడిచింది. 1837-38 నాటి కరువు సమయంలో అజీముల్లా, ఆయన తల్లిని కాపాడి, కాన్పూర్‌లోని క్రిస్టియన్ మిషనరీలో ఆశ్రయం కల్పించినట్లు చరిత్రకారులు రాశారు.
ఒకానొక సమయంలో వెయిటర్‌గా, బ్రిటిష్ అధికారుల ఇళ్లలో వంటవాడిగా పనిచేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఆయన ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు.
ఇంగ్లండ్, యూరప్ పర్యటన తర్వాత అజీముల్లా ఖాన్ టర్కీ, క్రిమియాకు వెళ్లారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తిరుగుబాటు చేయాలని నానా సాహెబ్‌కు సలహా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
వార్తాపత్రిక ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణ
యూరప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అజీముల్లా ఖాన్ 'పయామే ఆజాది' పేరుతో వార్తాపత్రికను ప్రారంభించారు. ఇది ఉర్దూ, మరాఠీ, హిందీలో ప్రచురితమయ్యేది. యూరప్ నుంచి ప్రింటింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారు. దానితోనే తన వార్తాపత్రికను ముద్రించేవారు.
అజీముల్లా ఖాన్ తన వార్తాపత్రిక ద్వారా తిరుగుబాటు, స్వాతంత్ర్యం ఆలోచనలను ప్రచారం చేయడం ప్రారంభించారని ఉర్దూ జర్నలిజం చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంపై పరిశోధన జరిపిన ఫైసల్ ఫారూఖీ చెప్పారు.
''వార్తాపత్రిక ద్వారా ముస్లింలు, హిందువులు, సిక్కులు సహా అన్నివర్గాల ప్రజల్లోనూ స్వాతంత్ర్య కాంక్షను పదేపదే ప్రేరేపించారు. గంగా - జమున సంస్కృతి ఆయన రచనల్లో ఎప్పుడూ కనిపిస్తుంది. తొలి స్వాతంత్ర్య పోరాటం లేదా సిపాయి తిరుగుబాటు సమయంలో కవాతు పాట కూడా రాశారు'' అని ఆయన అన్నారు.
ఫారూఖీ పాటను చదువుతున్నారు. ఆయన చదివిన చివరి రెండులైన్లను బట్టి అజీముల్లా ఖాన్ అన్నిమతాల వారిని స్వాతంత్య్ర పోరాటానికి ఎలా ప్రేరేపించారో అర్థం చేసుకోవచ్చు. ''హిందూ, ముస్లిం, సిక్కు హమారా భాయీ భాయీ ప్యారా, యే హై ఆజాదీ కా జెండా, ఇసే సలాం హమారా.. అంటే హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ ప్రియమైన అన్నదమ్ములే, మేమంతా ఈ జాతీయ జెండాకు వందనం చేస్తున్నాం.''
అదే సమయంలో తన వార్తాపత్రికలో మాద్రే వతన్ నినాదాన్ని రాసినట్లు చరిత్రకారులు, రచయిత సయ్యద్ ఉబేదుర్ రెహమాన్ చెప్పారు.
''ఈ నినాదం ఆయనే రాశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ నినాదాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు ఆయన వార్తాపత్రిక పిలుపునిచ్చేది. అందులో అజీముల్లా ఖాన్ ఇలాంటి నినాదాలు రాసేవారు'' అన్నారాయన.
అయితే, 'మాద్రే వతన్ హిందుస్థాన్' నినాదాన్ని అజీముల్లా ఖాన్ ఇచ్చారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని మరికొందరు అంటున్నారు.
1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రణాళికలు రచించిన వారిలో అజీముల్లా ఖాన్ కూడా ఒకరని రెహమాన్ చెప్పారు.
తిరుగుబాటు అణచివేత తర్వాత అజీముల్లా ఖాన్ ఎక్కువ కాలం జీవించలేదు. 1859లో నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలో ఆయన మరణించారు. బ్రిటిష్ సైన్యం నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. బహుశా నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ ఉండడం వల్ల ఆయన సరైన వైద్యచికిత్స పొందలేకపోయి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాతృభూమితో పాటు అనేక నినాదాలు...
ముస్లిం నేతలు 'మాద్రే వతన్'తో పాటు అనేక తిరుగుబాటు నినాదాలు కూడా ఇచ్చారని చరిత్రకారులు, రచయిత సయ్యద్ ఉబేదుర్ రెహమాన్ చెప్పారు.
''కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా హస్రత్ మోహానీ 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదం ఇచ్చారు. అలాగే యూసుఫ్ మెహర్ అలీ 'క్విట్ ఇండియా' నినాదమిచ్చారు. గో బ్యాక్ నినాదమిచ్చింది సైమన్. కానీ, వారి పేర్లు ఎవరూ చెప్పరు'' అన్నారాయన.
రెహమాన్ చెప్పినదాని ప్రకారం, అది 1857 స్వాతంత్ర్య సంగ్రామమైనా, 1910 నుంచి 1947 వరకూ జరిగిన స్వాతంత్య్రోద్యమమైనా, ఆ రోజుల్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ కలిసి పోరాడారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంతమంది ముస్లింలు బాధ్యతలు నిర్వర్తించారో తెలుసా? అబుల్ కలాం ఆజాద్ పేరు అందరికీ తెలిసిందే. కానీ, మొత్తం ఎనిమిది మంది ముస్లింలు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారని ఎంతమందికి తెలుసని రెహమాన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
'భారత్ మాత' నినాదం ఎక్కడి నుంచి వచ్చింది?
1866వ సంవత్సరానికి ముందు హిందూత్వ సంస్థలు రాజకీయ, దేశభక్తి నినాదంగా ప్రచారం చేస్తున్న 'భారత్ మాతా కీ జై' ప్రస్తావన లేదు.
హిందూత్వ రాజకీయాలపై పరిశోధన చేస్తున్న స్నిగ్ధేందు భట్టాచార్య మాట్లాడుతూ, ''బెంగాల్‌లో, 1866లో, 19వ పురాణంలో భారత్ మాత ప్రస్తావన ఉంది, బహుశా కృష్ణ ద్వైపాయన వ్యాస్ పేరుతో భూదేవ్ ముఖోపాధ్యాయ రాసి ఉండొచ్చు. ఆ మరుసటి ఏడాది హిందీ ఫెయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా ద్విజేంద్రనాథ్ ఠాకూర్ తాను రాసిన 'మలిన్ ముఖచంద్ర, మా భారత్ తోమారి' పాట పాడారు. విపిన్ చంద్రపాల్ తన వ్యాసంలోనూ దీనిని ప్రస్తావించారు. 1873లో కిరణ్ బంధోపాధ్యాయ రాసిన భారత్ మాత నాటకంలోనూ ఈ పాట ఉంది'' అన్నారు.
''బెంగాల్‌లో భారత్ మాతా కీ జై నినాదం అప్పట్లో ప్రాచుర్యం పొందిందో లేదో తెలియదు. అప్పటికే బంకించంద్ర రాసిన వందేమాతరం బాగా ప్రాచుర్యం పొందడమే అందుకు కారణం'' అన్నారు స్నిగ్ధేందు.
1860కి ముందు బెంగాల్ లేదా భారత్‌లో 'భారత్ మాత' ప్రస్తావన లేదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు, అజీముల్లా ఖాన్ మాద్రే వతన్ హిందుస్థాన్ జిందాబాద్ నినాదమిచ్చారు కాబట్టి, మాతృభూమి అనే పదానికి ఆయన్ను పితామహుడిగా పిలుస్తారని అన్నారు.
అవనీంద్రనాథ్ ఠాకూర్ 1905లో భారతమాతకు మొదటిసారి రూపమిచ్చారు.
''నిజానికి, భారత్ మాతా కీ జై, మాద్రే వతన్ ఒకటే అయినప్పటికీ, హిందూత్వవాదుల దృష్టిలో అవి రెండూ వేర్వేరు. భారత జాతీయవాదం, హిందూ జాతీయవాదం, బెంగాలీ జాతీయవాదం మూడు ఇదే బెంగాల్‌లో, 19వ శతాబ్దం రెండో అర్థభాగంలో పుట్టాయి. అది 1850లలో జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి భారత జాతీయవాదం, హిందూ జాతీయవాదం, ప్రాంతీయ జాతీయవాదం ఆవిర్భవించి, ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.'' అని స్నిగ్ధేందు వివరించారు.
అవనీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించిన భారత్ మాత చిత్రానికి తొలుత బంగామాత పేరు పెట్టారని, బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం కూడా బంగామాతను ఆరాధిస్తూ రాసినదేనని ఆయన అన్నారు. ఆ తర్వాత అన్ని జాతీయవాదాలనూ భారత జాతీయవాదంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు.
స్నిగ్ధేందు వివరిస్తూ "భారత జాతీయవాదులు భారతదేశం, హిందుస్థాన్ రెండింటినీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, ఇది అన్ని కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం. కానీ, హిందూ జాతీయవాదులు హిందుస్థాన్ అనే పదాన్ని సరిగ్గా వాడరు. వారి సంభాషణలో ఉర్దూ ప్రభావం ఉంటుంది కానీ పర్షియన్‌కు చోటులేదు. అందుకే వారికి మాద్రే వతన్ హిందుస్థాన్, మదర్ ఇండియా ఒకటి కావు. అయితే, ముస్లింలు భారత్‌ను మాతృభూమిగా చెప్పేందుకు ఇష్టపడరని హిందూత్వవాదులు చేసే ఆరోపణలను మాద్రే వతన్ హిందుస్థాన్ పదాలు కొట్టిపారేస్తున్నాయి.''
దేశాన్ని మాతృభూమిగా ప్రేమించడం గురించి హదీస్‌లో ప్రస్తావన ఉందని ఇస్లాం మతవ్యవహారాల నిపుణులు మహమ్మద్ కమరుజ్జమామ్ చెప్పారు.
కమరుజ్జమామ్‌కు రాజకీయంగానూ గుర్తింపు ఉంది. ఆయన ఆల్ బెంగాల్ మైనారిటీ యూత్ ఫెడరేషన్ అధినేతగా ఉన్నారు. ఆయన మాజీ అలియా మదర్సా (ప్రస్తుతం అలియా విశ్వవిద్యాలయం)లో చదువుకున్నారు.
''హదీస్‌లో హుబ్బుల్ వతన్ ప్రస్తావన ఉంది. మొత్తం పద్యం 'హుబ్బుల్ వతాని మినల్ ఇమాన్'. వతన్ అంటే మాతృభూమి, హుబ్బుల్ అంటే ప్రేమ. మాతృభూమిపై ప్రేమ, ఇది మతంలో ఒక భాగం'' అని ఆయన వివరించారు.
అయితే, భారత్ మాతా కీ జై నినాదాన్ని ప్రస్తుతం రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
హిందుత్వవాదులు ఈ నినాదాన్ని రాజకీయంగా వాడుతున్నందున ముస్లింలకు ఈ నినాదంపై అభ్యంతరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైటెన్షన్ విద్యుత్ టవర్ల దగ్గర సెల్‌ఫోన్ మాట్లాడటం ప్రమాదమా, అక్కడ ఇళ్లు కూడా కట్టుకోకూడదా?
- రాంలీలా మైదానంలో ‘ఇండియా’ మెగా ర్యాలీ: ప్రధాని మోదీ రాముడి జీవితం నుంచి నేర్చుకోవాలి- ప్రియాంక గాంధీ
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














