రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?

రష్యాలో సెక్స్ పార్టీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల కాలంలో పబ్లిక్, ప్రైవేటు సెక్స్ థీమ్డ్ పార్టీలపై కనీసం ఆరుసార్లు దాడులు జరిగాయి
    • రచయిత, అమాలియా జటారి, అనస్తాసియా గొలుబెవా
    • హోదా, బీబీసీ రష్యన్ న్యూస్

రష్యాలో ఎల్‌జీబీటీక్యూ ( లెస్బియన్, గే, బైసెక్సువల్,ట్రాన్స్‌జెండర్,క్వీర్) ఉద్యమాన్ని ‘తీవ్రవాద భావజాలం’గా నిర్ణయిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రష్యా అధికారులు సెక్స్ పార్టీలపై దాడులు మొదలుపెట్టారు.

ఇటీవల కాలంలో రష్యాలోని పలు ప్రాంతాలలో రష్యన్ పోలీసులు పబ్లిక్, ప్రైవేట్ సెక్స్ థీమ్ పార్టీలపై దాడులు చేశారు. ఇలాంటి ఉదంతాలు కనీసం ఆరు చోటు చేసుకున్నాయి.

వీటిల్లో కొన్ని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధం లేనివి కూడా ఉన్నాయి.

మాస్కోకు తూర్పున 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెక్టెరిన్‌బర్గ్‌ నగరంలో రష్యన్ పోలీసులు కిందటి ఫిబ్రవరిలో ‘బ్లూ వెల్వెట్’ పేరుతో జరిపిన పార్టీపై దాడి చేశారు.

ఈ పార్టీలో పాల్గొంటున్నవారు తమనెవరూ గుర్తు పట్టకుండా మాస్క్‌లు ధరించారు.

ఈ దాడిలో కనీసం 50 మంది పోలీసులు పాల్గొన్నారని, వారిలో కొంతమంది ప్రత్యేక భద్రతా దళాధికారుల్లానూ కనిపించారని పార్టీ నిర్వాహకులు బీబీసీకి చెప్పారు.

పార్టీలో పాల్గొన్నవారందరిని మాస్కులు తొలగించమని పోలీసులు ఆదేశించారని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా అడిగారని పార్టీ నిర్వాహకులు స్టానీస్లావ్ స్లోవికోవ్‌స్కీ తెలిపారు.

‘‘పార్టీలో ఎవరైనా స్త్రీ,పురుష స్వలింగ సంపర్కులు ఉన్నారా, అలాగే ఎల్‌జీబీటీ ప్రచారం చేసేవారు ఉన్నారా అని అడిగిన పోలీసులు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా అని కూడా పనిలో పనిగా అడిగారు’’ అని ఆయన చెప్పారు.

రష్యాలో సెక్స్ పార్టీలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రష్యాలో ఎల్‌జీబీటీక్యూను సమర్థించడం నేరం.

ఎల్‌జీబీటీక్యూ ఉద్యమం తీవ్రవాదమే

రష్యాలో స్వలింగ సంపర్కాన్ని, ఎల్‌జీబీటీక్యూను నిషేధించడానికి దశాబ్దానికి పైగా రష్యన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అనేక శాసనాలు ఎల్‌జీబీటీక్యూ ఉద్యమాన్ని తీవ్రవాద భావజాలంగా గుర్తించాయి.

రష్యన్ పార్లమెంట్ దిగువ సభ 2013లో ఎల్‌జీబీటీ ప్రచారాన్ని నిషేధిస్తూ ఓ బిల్లును ఆమోదించింది.

ఇది ఎల్‌జీబీటీక్యూ హక్కులు, సంబంధిత అంశాలను బహిరంగంగా చర్చించడాన్ని పరిమితం చేసింది.

కిందటేదాడి మరింత కఠినమైన ఎల్‌జీబీటీక్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

1997 నుంచి చట్టబద్ధంగా పరిగణిస్తున్న లింగమార్పిడిని జులైలో రష్యన్ పార్లమెంట్ నిషేధించింది.

లింగ నిర్థరణ ఆపరేషన్లు, హార్మోన్ల చికిత్స, అధికారిక పత్రాలలో జెండర్ మార్పులను నిషేధించింది.

మరోపక్క కిందటి నవంబర్‌లో ఎల్‌జీబీటీక్యూ ఉద్యమాన్ని ‘‘తీవ్రవాద భావజాలం’’ గా రష్యన్ సుప్రీం కోర్టు నిర్థరించింది.

ఈ ఉద్యమాన్ని ఐఎస్, యోహవా విట్నెసెస్ తీవ్రవాద గ్రూపుల జాబితాలో చేర్చారు.

రష్యాలో ఎల్‌జీబీటీక్యూ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం నేరం.

పదేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు.

రష్యాలో సెక్స్ పార్టీలు
ఫొటో క్యాప్షన్, బ్లూ వెల్వెట్ సెక్స్ థీమ్డ్ పార్టీపై ఫిబ్రవరిలో పోలీసులు దాడి చేశారు

బీడీఎస్ఎం ముసుగులో...

రష్యన్ అధికారులు ‘ ‘బ్లూ వెల్వెట్’ పార్టీపై బీడీఎస్ఎం (కొన్ని రకాల శృంగార పద్ధతులు) పేరుతో దాడి చేశారు. ఆ పార్టీ చేసుకోవడం నేరమేమీ కాదన్నారు స్టానీస్లావ్ స్లోవికోవ్‌స్కీ

ఈ పార్టీలో కొన్ని శృంగార ప్రదర్శనలు, వీటిల్లో కొన్ని బీడీఎస్ఎం విధానాలు కూడా ఉన్నాయి. అంటే వివిధ రకాల లైంగిక పద్ధతులు, అతిథులను వీటిల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తాం. అయితే సంభోగంలో పాల్గొనాలని వారిపై ఎటువంటి ఒత్తిడి చేయలేదు అని స్లోవికోవ్‌స్కీ చెప్పారు.

యెకాటెరిన్‌బర్గ్ సిటీ పోలీసులు దీనిపై ప్రకటన విడుదల చేస్తూ ఈ పార్టీ జరగకుండా ముందుజాగ్రత్తగా తమ దళాలు దాడులు చేశాయని చెప్పారు.

‘బీడీఎస్ఎం పార్టీ ముసుగులో ఎల్‌జీబీటీ కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించడాన్ని తోసిపుచ్చలేం’’ అని యెకాటెరిన్‌బర్గ్ పబ్లిక్ చాంబర్ సభ్యుడు దిమిత్రీ చౌక్రీవ్ చెప్పారు.

గడిచిన కొన్ని సంవత్సరాలలో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీపై అధికారులు దాడులు పెరిగినా ‘‘వీరు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

‘‘వారు ఇంకా తమను తాము ఆనందపరుచుకోవాలని, తమ ఆలోచలను ఆచరణలో పెట్టాలనే కోరికలో ఉన్నారు. అందుకే ఇంకా నిషేధానికి గురికాని బీడీఎస్‌ఎం పార్టీల ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టున్నారు. ’’ అని ఆయన బీబీసీ రష్యన్‌కు చెప్పారు.

రష్యాలోని పెద్ద పెద్ద నగరాలలో చాలా కాలంగా సెక్స్ పార్టీలు జరుగుతున్నాయి.

ఈ పార్టీలు ఉద్యోగం చేసుకునే మధ్యతరగతి ప్రజలు, సృజనాత్మక రంగం, ఐటీ వారిని ఆకర్షిస్తున్నాయి.

గతంలో ఈ పార్టీలను రష్యాలోని ఉదారవాదానికి, సహనశీలతకు ప్రతిబింబంగా గుర్తించేవారు.

కానీ పెరుగుతున్న సంప్రదాయవాద చట్టాలు ఈ పార్టీలను అండర్‌గ్రౌండ్స్‌లో జరుపుకునేలా చేస్తున్నాయి.

రష్యాలో సెక్స్ పార్టీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్స్ పార్టీలకు హాజరైన కొందరి సమాచారాన్ని టెలివిజన్ ఛానళ్ళు బహిర్గతం చేశాయి

దాదాపు నగ్నంగా...

రష్యాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ ప్రయోక్త అనస్తాసియా ఇవ్లీవా పుట్టినరోజు వేడుక తరువాత రష్యన్ అధికారులు సెక్స్ పార్టీలపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు.

ఈ పుట్టిన రోజు పార్టీలో అతిథులు దాదాపు నగ్నంగా కనిపించేలా దుస్తులు ధరించాలనే డ్రెస్ కోడ్ విధించారు.

ఈ పార్టీకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.

వీటిల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు దీర్ఘకాలంపాటు మెంటార్,సహచరుడిగా ఉన్న అనతోలి సోబక్ కుమార్తె రష్యన్ మీడియా ప్రముఖురాలు క్సెనియా సోబక్ సహా పలువురు అగ్రశ్రేణి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఈ పార్టీలో చాలామంది ఉల్లిపొర లాంటి టాప్స్, లోదుస్తులు ధరించారు.

మరి కొంతమంది తమ అవయవాలు మరింత బయటకు కనిపించే బట్టలు వేసుకున్నారు.

రాపర్ వాసియో అయితే తన మర్మావయంపై కేవలం ఒక మేజోడు మాత్రమే వేసుకుని కనిపించారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు అనేకమందిలో ఆగ్రహం కలిగించాయి.

రాపర్ వాసియో కు గూండాయిజం అభియోగాలపై 15 రోజుల జైలు శిక్ష విధించారు.

జననేంద్రియాలపై సాక్స్‌తో దర్శనమిచ్చినందుకు 2 లక్షల రూబుల్స్ జరిమానా విధించారు.

పార్టీని నిర్వహించినందుకు ఇవ్‌లీవాకు లక్ష రూబుల్స్ జరిమానా వేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఈ ఫోటోలు చూపడంతో , పార్టీ నిర్వాహకురాలికి, ఆమె అతిథులకు కష్టాలు పెరిగిపోయాయి.

ఈ పార్టీలో పాల్గొన్న తమకు క్రిమినల్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే బెదిరింపులు వచ్చాయని కొందరు సెలబ్రిటీలు చెప్పారు.

సంప్రదాయ విలువలను రెచ్చగొట్టడం ద్వారా పుతిన్ ఐదోసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.

రష్యాలో సెక్స్ పార్టీలు
ఫొటో క్యాప్షన్, మాస్కోలో ప్రసిద్ధి చెందిన పోపోఫ్ కిచెక్ పార్టీ తన ఈవెంట్స్ అన్నింటినీ రద్దు చేసుకుంది.

బెదిరింపులు

సెక్స్ పార్టీలపై పోలీసులు ఒకే తరహా దాడులు చేశారు. అతిథులందరినీ కింద కూర్చోమని చెప్పి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు.

వీటిల్లో చాలా దాడులు అధికార మీడియాలో ప్రసారమయ్యాయి. కొన్ని టెలివిజన్ ఛానళ్ళయితే పార్టీలకు హాజరైన వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రసారం చేశాయి.

పార్టీల్లో పాల్గొన్న మగవారిని యుక్రెయిన్‌లో యుద్ధానికి పంపుతామని బెదిరించాని పార్టీలకు వెళ్ళే ఓ వ్యక్తి బీబీసీకి చెప్పారు.

దాడులు పెరుగుతుండటం, ప్రజలలో అవమానాల కారణంగా పార్టీ నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు.

మాస్కోలో స్థానిక ఎల్‌జీబీటీక్యూ వర్గాలలో ప్రసిద్ధి చెందిన ‘‘పోపోఫ్ కిచెన్’ సెక్స్ థీమ్డ్ కింకీ పార్టీ తాము రష్యాలో ఇకపై ఎటువంటి పార్టీలు నిర్వహించమని ప్రకటించాయి.

‘ఇకపై సెక్స్ సంబంధిత అంశాలను ప్రస్తావించే ఎటువంటి పార్టీలకు అనుమతి లేదనే ఓ హెచ్చరిక వచ్చింది’’ అని కింకీ పార్టీ నిర్వాహకులు తమ ప్రకటనలో తెలిపారు.

‘‘అత్యంత ప్రసిద్ధి చెందిన పార్టీలను కూడా మూసేయగలరానికి చెప్పడానికి మేమొక చక్కని ఉదాహరణ. పార్టీలకు వచ్చే అతిథుల భద్రతకు హామీ లేనప్పుడు ఈ పార్టీలు నిర్వహించడం అసాధ్యమైన విషయమవుతుంది’’ పోపోఫ్ కిచెన్ కు చెందిన నికిటా ఎగోరోవ్ చెప్పారు.

‘‘ఈ దాడులు, బెదిరింపులతోపాటు, వ్యక్తిగత సమాచారాన్ని ఒక్కసారి కనుక నోట్ చేసుకుంటే ఇక మీ పార్టీ సురక్షితమని మీరు ప్రజలను ఎప్పటికీ నమ్మించలేరు’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)