మనిషికి పంది కిడ్నీ: ఈ సర్జరీ చేయించుకున్న రిక్ ఇప్పుడు ఎలా ఉన్నారు?

మనిషికి పంది కిడ్నీ అమర్చారు

ఫొటో సోర్స్, MASSACHUSSETS GENERAL HOSPITAL

ఫొటో క్యాప్షన్, మనిషికి పంది కిడ్నీ అమర్చారు
    • రచయిత, నదీన్ యూసుఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంది నుంచి జన్యుపరంగా మార్పిడి చేసిన కిడ్నీని అమర్చిన మొదటి వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అవయవ మార్పిడిలో సంచలనంగా భావిస్తున్న ఈ సర్జరీ జరిగిన రెండు వారాల తర్వాత మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి నుంచి 62 ఏళ్ల రిచర్డ్ రిక్‌ స్లేమ్యాన్ బుధవారం ఇంటికి చేరుకున్నారు.

జన్యుపరంగా మార్పిడి జరిగిన పందుల నుంచి తీసిన అవయవాల మార్పిడి గతంలో విఫలమైంది.

అయితే తాజాగా జరిగిన ఆపరేషన్ విజయవంతం కావడాన్ని అవయవాల మార్పిడిలో చరిత్రాత్మక పరిణామంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

సర్జరీ విజయవంతం అయిందని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా నగరం బోస్టన్‌లో అతి పెద్ద బోధనా ఆసుపత్రి హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు అనుబంధంగా ఈ ఆసుపత్రి పని చేస్తోంది.

భవిష్యత్తులో పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చా?

వీడియో క్యాప్షన్, పంది కిడ్నీ పెట్టించుకున్న రిక్ ఎలా ఉన్నారు?

మసాచుసెట్స్‌లో నివసించే రిక్ కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నారని, కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి.

మార్చ్ 16న నాలుగు గంటల పాటు జరిగిన సర్జరీతో జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని రిక్‌కు అమర్చారు డాక్టర్లు.

ఆయనకు అమర్చిన కిడ్నీ ప్రస్తుతం చక్కగా పని చేస్తోందని, ఆయనకు ఇకపై డయాలసిస్ అవసరం లేదని వైద్యులు చెప్పారు.

కిడ్నీ సమస్య నుంచి బయటపడి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడం “జీవితంలో మర్చిపోలేని క్షణాల్లో ఒకటి” అని రిక్ తెలిపారు.

“డయాలసిస్ అనే బాధ నుంచి విముక్తి పొంది తిరిగి నా కుటుంబం, స్నేహితులు, దగ్గరివాళ్లతో సమయం గడపుతాననే ఆలోచన చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది” అని ఆయన చెప్పారు.

2018లో రిక్‌కు ఒక చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీ తీసి మార్చారు. అయితే అది విఫలమైంది. దీంతో పంది కిడ్నీని అమర్చాలనే ఆలోచనను డాక్టర్లు ముందుకు తీసుకువచ్చారు.

“ఇది నా ఒక్కడి జీవితానికి మాత్రమే కాదు. కిడ్నీ అవసరమైన వేల మందికి కొత్త మార్గాన్ని చూపిస్తుంది” అని రిక్ అన్నారు.

పంది కిడ్నీ, మసాచుసెస్ట్ హాస్పిటల్

ఫొటో సోర్స్, Massachussets General Hospital

ఫొటో క్యాప్షన్, మనిషి శరీరానికి అనుగుణంగా పని చేసేలా పంది కిడ్నీలో జన్యు పరంగా మార్పులు

రిక్‌కు అమర్చిన కిడ్నీని కేంబ్రిడ్జ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇ-జెనిసిస్ అభివృద్ధి చేసింది.

“ఈ కిడ్నీలో ప్రమాదకరమైన పంది జన్యువులను తొలగించి మనిషి జీన్స్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా ఇది మనుషుల అవసరాలకు అనుగుణంగా పని చేసేలా తయారు చేశాం” అని ఆ సంస్థ తెలిపింది.

కిడ్నీ మార్పిడి కోసం మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి, ప్రపంచంలో తొలిసారి 1954లో జరిగిన కిడ్నీ మార్పిడి సర్జరీని అధ్యయనం చేసింది. పంది కిడ్నీకి జన్యు మార్పిడి చేసిన ఇ జెనిసిస్ సంస్థతో కలిసి ఐదేళ్లు పరిశోధన నిర్వహించింది.

ఈ ప్రక్రియను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ప్రాణాంతక వ్యాధులతో బాధ పడే వారికి ప్రయోగాత్మక చికిత్స చేసేందుకు అవసరమైన కారుణ్య పరమైన అనుమతులను ఆ సంస్థ మంజూరు చేసింది.

కిడ్నీ మార్పిడి చికిత్స కోసం పని చేసిన బృందం సర్జరీ విజయవంతం కావడాన్ని ప్రస్తుతించింది. అవయవ మార్పిడి ఆపరేషన్లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ అవయవాలు తక్కువగా ఉన్న సమయంలో ఇదొక పరిష్కారం చూపుతుందని వైద్యులు భావిస్తున్నారు.

“ఈ సాంకేతిక ప్రగతి వల్ల అవయవాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు ఇది ఉత్తమ పరిష్కారం. బాగా పని చేసే కిడ్నీలు రోగులకు అందుబాటులోకి వస్తాయి” అని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్ విన్‌ఫ్రెడ్ విలియమ్స్ చెప్పారు.

అమెరికా, అవయవాల కొరత
ఫొటో క్యాప్షన్, అమెరికాలో అవయవాల మార్పిడి చికిత్స కోసం రోగుల ఎదురు చూపు

అమెరికాలో లాభాపేక్ష లేకుండా పని చేస్తున్న ఓ సంస్థ డేటా ప్రకారం లక్ష మంది అమెరికన్లకు ప్రాణాలను కాపాడే అయవయ మార్పిడి చికిత్స అవసరం.

2023లో మరణించిన, బతికున్న వారిలో అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చినవారు 23,500 మంది మాత్రమే.

అమెరికాలో అవయవాల కోసం ఎదురు చూస్తూ రోజూ 17 మంది చనిపోతున్నారు. ఇందులో ఎక్కువ మందికి అవసరమైన అవయవం కిడ్నీలు.

ప్రస్తుతం రిక్‌కు పంది కిడ్నీని అమర్చారు. అయితే పంది నుంచి మనుషులకు అవయవాలు అమర్చడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ఇద్దరు రోగులకు పంది గుండె అమర్చారు. అయితే అవి విఫలం అయ్యాయి. పంది గుండె అమర్చిన ఇద్దరు రోగులు కొన్ని వారాల తర్వాత మరణించారు.

ఈ రెండు కేసుల్లో ఒక రోగిలో రోగనిరోధక వ్యవస్థ పంది గుండెకు అనుగుణంగా పని చెయ్యని సంకేతాలు కనిపించాయి. అవయవాల మార్పిడిలో ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుందంటున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)