జర్మనీకి 20 వేల ఏనుగులను పంపిస్తామని బోట్స్‌వానా ఎందుకు హెచ్చరించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్వలిన్ హోవార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక చర్చలో భాగంగా వివాదం చెలరేగడంతో “జర్మనీకి 20 వేల ఏనుగుల్ని పంపిస్తాను” అంటూ బోట్స్‌వానా అధ్యక్షుడు హెచ్చరించారు.
ఈ ఏడాది మొదట్లో జంతువుల్ని వేటాడుతున్న దేశాల నుంచి జంతువుల చర్మాలు, దంతాలు, తల లాంటి వాటిని దిగుమతి చేసుకోవడంపై కఠిన ఆంక్షలు విధించాలని జర్మనీ పర్యావరణ శాఖ ఒక సూచన చేసింది.
అయితే తమ దేశంలో ఏనుగుల వల్ల పేదరికం పెరుగుతోందని బోట్స్‌వానా అధ్యక్షుడు మాగ్‌వీట్సీ మసీసీ జర్మనీ మీడియాతో అన్నారు.
సంరక్షణ చర్యలు చేపట్టడంతో తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, వాటిని వేటాడటం ద్వారా వాటిని అదుపులో ఉంచుతున్నామని ఆయన చెప్పారు.
“జర్మన్లు మాకు నీతులు చెప్పడం కాదు. మీరు మాలాగే జంతువులతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. నేనేమీ జోక్ చేయడం లేదు” అని మసీసీ, జర్మన్ వార్తాపత్రిక బిల్డ్‌తో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగుల్లో మూడొంతులు బోట్స్‌వానాలోనే ఉన్నాయి. ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఈ దేశంలో ప్రస్తుతం లక్షా 30 వేల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఖ్య అక్కడ ఉండదగిన ఏనుగుల కంటే అనేక రెట్లు ఎక్కువ.
ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయని, పంటలను తినేస్తున్నాయని, స్థానికుల్ని గాయపరుస్తున్నాయని మసీసీ తెలిపారు.
బోట్స్‌వానాలో ఏనుగుల సంఖ్యను తగ్గించుకునేందుకు గతంలో 8 వేల ఏనుగులను తన పక్కనే ఉన్న అంగోలాకు పంపించింది. మొజాంబిక్‌కు కూడా వందల సంఖ్యలో పంపించింది.
“మేము జర్మనీకి కూడా అలాంటి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాం” అని మసీసీ అన్నారు. అందుకు జర్మనీ ‘నో’ చెప్పినా తాము అంగీకరించేది లేదన్నారు.

హంటింగ్ ట్రోఫీల దిగుమతులపై యూరోపియన్ దేశాల నిషేధం
ఒక జంతువుని వేటాడటం, ఆ తర్వాత దాని తల, చర్మం, దంతాలను తీసుకెళ్లి ఇంట్లో విజయానికి చిహ్నంగా ఉంచుకోవడం క్రూరమని, అలాంటి వాటిని నిషేధించాలని వన్య ప్రాణుల సంరక్షణ సంస్థలు వాదిస్తున్నాయి.
హ్యుమేన్ సొసైటీ ఇంటర్నేషనల్ 2021 నివేదిక ప్రకారం ఆఫ్రికా ఏనుగుల దంతాలు, చర్మాలను దిగుమతి చేసుకుంటున్న యూరోపియన్ యూనియన్ దేశాల్లో జర్మనీ ముందు వరసలో ఉంది.
ఏనుగుల్ని వేటాడటాన్ని బోట్స్‌వానా 2014లో నిషేధించింది. అయితే ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో 2019లో వేటపై ఉన్న నిషేధాన్ని తొలగించింది.
బోట్స్‌వానాలో ప్రస్తుతం వేటకు సంబంధించి వార్షిక కోటా విడుదల చేస్తున్నారు. దీని వల్ల స్థానికులకు మంచి ఆదాయం లభిస్తోందని, కోటా కారణంగా పరిమిత సంఖ్యలోనే వారు ఏనుగుల్ని వేటాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
వేట లైసెన్సుల జారీని ప్రభుత్వం కఠినంగా నియంత్రిస్తోంది.
అయితే ఏనుగుల వేటకు సంబంధించి బోట్స్‌వానా తమతో ఎలాంటి అంశాలనూ ప్రస్తావించలేదని జర్మనీ పర్యావరణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.
“జీవ వైవిధ్యంలో వేగంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని హంటింగ్ ట్రోఫీలను చట్టబద్దంగా దిగుమతి చేసుకునే విషయంలో మాకు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. వాటిని మేం నిర్వర్తించాల్సి ఉంటుంది” అని ఆమె చెప్పారు.
ఏనుగుల దంతాలు, చర్మాల దిగుమతి విషయంలో జర్మనీ విధించిన ఆంక్షల గురించి జర్మనీ పర్యావరణ శాఖ బోట్స్‌వానాతోపాటు ఆఫ్రికన్ దేశాలతో చర్చిస్తుందన్నారు.
హంటింగ్ ట్రోఫీలను దిగుమతి చేసుకోవడంపై ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బెల్జియం ఇప్పటికే నిషేధం విధించాయి.
మార్చ్‌లో బ్రిటన్ ఎంపీలు కూడా హంటింగ్ ట్రోఫీల దిగుమతులపై నిషేధం విధించాలని బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఇది చట్ట రూపం దాల్చేందుకు ‘స్క్రూటినీ’ జరగాల్సి ఉంది.
వన్య ప్రాణుల్ని వేటాడి, వాటి తల, చర్మం, గోళ్లు, కొమ్ములు, దంతాలు లాంటి వాటిని దిగుమతి చేసుకోవడాన్ని నిషేధిస్తామని కన్సర్వేటివ్‌లు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని బోట్స్‌వానా పాటు జింబాబ్వే, నమీబియా వ్యతిరేకిస్తున్నాయి. తమ దేశంలో ఇప్పటికే గుట్టలుగా పోగు పడిన ట్రోఫీలు అయిపోయే వరకు వాటి దిగుమతులను అంగీకరించాలని కోరుతున్నాయి. దీని వల్ల తమకు ఆదాయం సమకూరుతుందనేది ఆయా దేశాల వాదన.
ఈస్ట్ ఆఫ్రికన్ దేశాలతో పాటు జంతు సంరక్షకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలా చేస్తే జంతువుల వేటను ప్రోత్సహించినట్లు అవుతుందని అంటున్నారు.
ఇవి కూాడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














