సముద్ర గర్భాన్ని చూసొచ్చిన తొలి వ్యక్తి.. సబ్‌మెర్సిబుల్ కిటికీ పగిలినా ఎలా బయటపడ్డారంటే..

ఫొటో సోర్స్, NOAA
- రచయిత, రెబెక్కా మోరెల్లే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సముద్రంలో అత్యంత సాహోపేతంగా అద్భుతమైన డైవ్ చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి కథ ఇది.
ఆయన పేరు కెప్టెన్ డాన్ వాల్ష్. 60 ఏళ్ళ కిందట సముద్రంలో అంత్యంత లోతైన (11 కిలోమీటర్లు – 7 మైళ్ళ లోతు) ఉన్న మరియానా ట్రెంచ్ వద్దకు ఆయన వెళ్ళారు.
1960లలో ప్రపంచమంతా అంతరిక్షం వైపు చూస్తోంది. వ్యోమగాములు అవుదామనుకునేవారందరూ ఆకాశంలోకి ఎగిరిపోవడంపై కలలు కంటుండేవారు.
కానీ 28 ఏళ్ళ కెప్టెన్ డాన్ వాల్ష్ మాత్రం తన దృష్టిని నేలపైనే కేంద్రీకరించారు. ఆయన అంతవరకు మనుషులెవరూ చేరుకోలేనంత లోతైన ప్రాంతానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అమెరికా నావికాదళం బాతీస్కేఫ్ ట్రైస్టే అనే సబ్‌మెర్సిబుల్‌ను కొనుగోలు చేసింది. ఈ సబ్‌మెర్సిబుల్‌లో పనిచేసేందుకు సబ్‌మెరైన్ లెఫ్టినెంట్ అయిన డాన్ స్వచ్చందంగా ముందుకు వచ్చారు.
అప్పటిదాకా సముద్రంలో 100 మీటర్ల కిందకు వెళ్ళిన అనుభవం మాత్రమే డాన్‌కు ఉంది. కానీ అమెరికాతో చేసుకున్న ఒప్పంద పత్రాలలో బాతీస్కేప్ ట్రైస్టే ను అంతకు వందరెట్ల ఎక్కువగా తోతులకు తీసుకువెళ్ళాలని ఉండటంతో ఆయన నిర్ఘాంత పోయారు.
సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతానికి చేరుకోవాలనేది ప్రణాళిక.
గ్వామ్ తీరాన పశ్చిమ పసిఫిక్ సముద్రం అడుగున ఉండే మరియానా ట్రెంచ్ ఓ ఇరుకైన లోయ.
‘‘నేను ఈ ఒప్పందంలోకి స్వచ్ఛందంగా రావడానికి ముందు నాకీ విషయం ఎందుకు చెప్పలేదు అని తాను ప్రతిస్పందించినట్టు’’ డాన్ 2011లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘దీని తరువాత ఈ మెషిన్ గురించి నాకు ఆ సమయానికి ఎంత తెలియాలో అంతా తెలుసు కదా’’ అని ఆలోచించాను.
1960 జనవరి 23న డాన్, బాతీ స్కేప్ ను రూపొందంచిన స్విస్ సముద్ర శాస్త్రవేత్త జాక్వెస్ పికార్డ్ కలిసి సముద్రపు అలల కింద తమ ప్రయాణం మొదలుపెట్టారు.
మందపాటి ఉక్కుతో తయారు చేసిన చాంబర్‌లో వారు ఇరుక్కుని కూర్చున్నారు.
తాము కూర్చున్న స్థలం ఇంట్లో వాడే పెద్ద ఫ్రిజ్ అంత ఉంటుందని, వాతావరణం కూడా చల్లగా ఉందని డాన్ చెప్పారు.
మెల్లిగా వీరిద్దరూ సబ్‌మెర్సిబుల్‌లో సముద్రపు అడుగున చీకటిలోకి ప్రయాణించడం మొదలుపెట్టారు.
వీరిని తీసుకుపోతున్న సబ్ మెర్సిబుల్ లోపలకు దిగుతున్న కొద్దీ సముద్రపు ఒత్తిడికి భీకరశబ్దాలు చేయడం మొదలుపెట్టింది.

ఫొటో సోర్స్, NAVAL HISTORICAL FOUNDATION
ప్రమాదఘంటిక మోగింది
సముద్ర మట్టం ఒత్తిడిని వెయ్యింతలు తట్టుకునేలా బాతీస్కేప్ ను రూపొందించారు.
కానీ అప్పటిదాకా ఈ జలంతార్గమి అంతటి ఒత్తిడిని తట్టుకుంటుందా లేదా అనేది ప్రాక్టికల్‌గా పరీక్షించలేదు.
సముద్ర గర్భానికి ప్రయాణం మృదువుగా మొదలైనా, 9 వేల మీటర్ల వద్ద బాతీస్కేప్ ప్రమాదఘంటికను మోగిస్తూ కంపించిపోయింది.
‘‘అది చాలా అసాధారణమైనది. మేం ఇంతకుముందెప్పుడూ అలాంటి విషయాన్ని చూడలేదు’’ అని తరువాత డాన్ చెప్పారు.
అదేదో భారీ పేలుడు శబ్దం జరిగితే వచ్చే కంపనంలా అనిపించింది.
డాన్, జాక్వెస్ తమ పరికరాల రీడింగ్స్ ను జాగ్రత్తగా పరిశీలించారు. అవి అన్నీ బాగానే ఉండటంతో మరింత ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
ఐదుగంటల ప్రయాణం తరువాత ఎంత లోతుకు వెళ్ళామో చూపే డెప్త్ గేజ్ 10వేల మీటర్లను దాటినా వారికి సముద్రపు అడుగుభాగం కనిపించకపోవడంతో ఇంకా ఎంతలోతకు వెళ్ళాలనే విషయంపై వారు తర్జనభర్జన పడ్డారు.
చివరకు బాతీస్కేప్ లైట్లు వీరిపై పరావర్తన చెందడం మొదలుపెట్టాయి.
డాన్, జాక్వెస్‌లు అనుకున్నది సాధించారు.
దాదాపు 11 కిలోమీటర్ల (ఏడు మైళ్ళు) లోతున మరియానా ట్రెంచ్ అడుగుభాగానా వీరిద్దరు ఉన్నారు.
‘‘ మేమక్కడకు చేరుకున్నాకా అనేక నిక్షేపాలను చూశాం. అవ్వన్నీ పాక్షిక ద్రవరూపంలో ఉన్నాయి’’ అని డాన్ చెప్పారు.
‘‘అది ఓ గిన్నెలో పాలను చూసినట్టుగా అనిపించింది. అంటే మొత్తం తెల్లగానే ఉంది. దీంతో సముద్రంలోని అత్యంతలోతైన ప్రాంతాన్ని మేం ఫోటో తీయలేకపోయాం’’.
ఇంత అద్భుతాన్ని సాధించినా మాకక్కడ ఎటువంటి భావోద్వేగాలు లేకుండా పోయాయి.
‘‘ అది కేవలం ఓ నిశ్శబ్ద క్షణం’’ అని డాన్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, SUE FLOOD
సబ్‌మెర్సిబుల్ కిటికీ పగిలింది
డాన్, జాక్వెస్ సముద్రపు అడుగున 20 నిమిషాలకు పైగా గడిపారు. సబ్‌మెర్సిబుల్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు ఇంతకుముందు తాము విన్న శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. లోపలి ప్రవేశద్వారం వద్ద కిటికీ బద్దలవడం వల్లే ఆ శబ్దం వచ్చినట్టు గ్రహించారు. అదృష్టవశాత్తు ఇది ఒత్తిడికి సంబంధించిన ప్రదేశం కాకపోవడంతో మేం బతికిపోయాం. లేదంటే అప్పుడే అది పేలిపోయి ఉండేది.
వీరు సురక్షితంగా తిరిగి రావడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఇందుకుగాను వీరు అనేక ప్రశంసలు, పతకాలతోపాటు యూఎస్ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్ ను కూడా అందుకున్నారు.
ఈ డైవ్ పాక్షికంగా తానేంటో చెపుతుందంటారు డాన్. నా మిగిలిన జీవితమంతా నేను దీనివలనే భోజనం చేయగలుగుతున్నాను అని కూడా ఆయన సరదాగా అంటుంటారు.
కానీ చాలా లోతైన ప్రాంతాలను ఇష్టపడే నాలాంటివారు ఈ భూమ్మీద అత్యంత రహస్యమైన ప్రాంతానికి వెళ్ళి రావడం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఈ అద్భుతమైన కథను సరదాగానూ, సంతోషంతోనూ చెప్పడానికి డాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
అలా అని డాన్ గతంలోనే లేరు. ఆయన దాన్నుంచి చాలా దూరం జరిగారు.
ఆయన చేసిన డైవ్, సముద్రపులోతుల గురించి అన్వేషించేవారికి, తెలుసుకోవాలనుకునేవారికి ఓ పాఠం.
నేవీలో పనిచేశాకా ఆయన ఓషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయ్యారు. మెరైన్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. వీటికి సంబంధించిన భద్రత విషయాలలోనూ గట్టిగా నిలబడుతుంటారు.
సముద్రపు అడుగున ఉన్న టైటాన్ శిథిలాలను చూడటానికి బయల్దేరిన సబ్‌మెర్సిబుల్ విషాదాన్ని కూడా ఆయన ముందే హెచ్చరించారు. ఈ సబ్ మెర్సిబుల్‌లోని ఆరురుగురు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి కొన్నాళ్ళ ముందే ఈ కంపెనీ సీఈకు ఆయన ఓ లేఖ రాశారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా సబ్‌మెర్సిబుల్‌ను పంపిస్తే అతిపెద్ద విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని అని ఆయన ఆ లేఖలో హెచ్చరించారు.
డాన్‌ను ఆకర్షించిన జేమ్స్ కామెరున్

తరువాత కాలంలో మరోసారి మరియానా ట్రెంచ్ ఈయన దృష్టిని ఆకర్షించింది.
1960లో డాన్ తన డైవ్ పూర్తిచేశాకా, కొన్నేళ్ళ తరువాత ఎవరోఒకరు అక్కడికి చేరుకుని తిరిగి వస్తారని భావించారు. కానీ ఆ పనిచేయడానికి అర్థశతాబ్దానికిపైగానే పట్టింది.
2012లో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్, సముద్ర అన్వేషకుడు జేమ్స్ కామెరూన్ ఈ డైవ్‌ను పునారవృతం చేసిన మొదటి వ్యక్తి అయ్యారు. ఈయన ఒక్కరే ఆ పని పూర్తిచేసి, తీరానికి తిరిగొచ్చాకా కామెరూన్‌ను అభినందించడానిక డాన్ అక్కడ వేచి ఉన్నారు.
2019లో మరోసారి అమెరికన్ నావికాధికారి, అన్వేషకుడు విక్టర్ వెస్కోవో పసిఫిక్‌లోకి వెళ్ళి
వచ్చారు. ప్రపంచంలోని సముద్ర కందకాలన్నింటి దగ్గరకు విక్టర్ తన సబ్‌ను తీసుకువెళ్ళగలిగారు. ఆయన తనతోపాటు ప్రయాణికులను కూడా తీసుకువెళ్ళగలడు. ఆయనతో పాటు ఉన్నది డాన్ కుమారుడు కెల్లీ వాల్ష్.
కెల్లీవాల్ష్ సముద్రపు డైవ్ తనకో ఉత్తమమైన ఫాదర్స్ డే బహుమతిలాంటిదని చెప్పారు. తన కుమారుడు తనకంటే ‘ మీటర్ల లోతుకు వెళ్ళాడని డాన్ సంబరపడ్డారు.
సముద్రపు, అంతరిక్ష అవరోహణలను తరచూ పోలుస్తుంటారు.
అయితే డాన్ ఎప్పడూ వ్యోమగాములంతటి ప్రచారం పొందలేదు.
అధునాతన సాంకేతికత కారణంగా ఇన్నాళ్ళకు మనం సముద్రపు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం.
ఒకనాడు సముద్రపు కందకాలు నిర్జీవంగా ఉండేవని నమ్మేవారు. దాని లోతు కారణంగా ఎవరూ వాటిపై ఆసక్తి చూపేవారు కాదు.
భూ వ్యవస్థలో అవెంతటి కీలకమో తరువాత అర్థమైంది.
ఎన్నో జీవులు ఇక్కడ జీవిస్తుంటాయి.
ఇవ్వన్నీ వాతావరణ మార్పులలోనూ కార్బన్ సైకిల్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అయితే చాలాకాలం కిందటే డాన్, జాక్వెస్ పికార్ అద్భుతమైన సాహసం లేకుండా దీన్నంతా మనం అర్థం చేసుకుని ఉండేవారం కాదు.
వారు చేసిన డైవ్ అధునాతన పరిశోధనలకు దారిచూపుతూనే ఉంది.
అగాధానికి ఆవలవైపున ఉన్న వాటిపై ఇది వెలుగులు ప్రసరిస్తోంది.
(సముద్ర అన్వేషకుడు కెప్టెన్ డాన్ వాల్ష్ (92) 2023 నవంబర్ 12న మరణించారు)
ఇవికూడా చదవండి :
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














