తైవాన్: 7.4 తీవ్రతతో భూకంపం.. విరిగిపడ్డ కొండచరియలు, కూలిన భవనాలు..

వీడియో క్యాప్షన్, తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసిన క్షణాలు..
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ -హేస్
    • హోదా, సింగపూర్, తైపీ నుంచి

తైవాన్ తూర్పు తీర ప్రాంతం చిగురుటాకులా కంపించింది. ఈ ప్రాంతంలో బుధవారం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తైవాన్‌లోని హువాలిన్ నగరానికి దక్షిణాన 18 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

గత 25 ఏళ్లలో తైవాన్‌లో వచ్చిన భారీ భూకంపం ఇదేనని అధికారులు చెప్పారు.

భూకంపం కారణంగా ఏడుగురు చనిపోయారని, 700 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రక్షణ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

మారుమూల పర్వతప్రాంతమైన హువాలిన్ నగరంలో కొండచరియలు విరిగిపడి భారీ నష్టం సంభవించింది.

ఈ ప్రాంతం తిరిగి కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది.

తైపీలో భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, న్యూతైపీ నగరంలో ఓ అపార్ట్‌మెంట్ లోపలి దృశ్యం

భూ ప్రకంపనలు రాజధాని తైపీ వరకూ వ్యాపించాయి.

ఇక్కడి భవనాలు ఊగిపోతున్న వీడియోలు భూకంప తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఫిలిప్పీన్స్ భూకంప హెచ్చరికల కేంద్రం కూడా సునామీ హెచ్చరికలను జారీ చేసింది.

ఫుజియాన్ ప్రావిన్సులోని కొన్ని భాగాల్లోనూ భూప్రకంపనలు వచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: తైవాన్‌ను భూకంపం కుదిపేసిన క్షణాలు

భూంకంపం కారణంగా ఈ దీవితోపాటు, పొరుగు దేశాలలో సునామీ వస్తుందనే ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా, తరవాత ఉపసంహరించుకున్నారు.

భారీ భూకంపం కారణంగా హువాలిన్ నగరంలో అనేక భవనాలు కుప్పకూలాయి.

1999 సెప్టెంబర్ నెలలో తైవాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,400 మంది ప్రజలు చనిపోయారు. 5 వేల భవనాలు ధ్వంసం అయ్యాయి.

తైపీలో భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూకంపం వల్ల ఓ అపార్ట్‌మెంట్‌లో చిందరవందరగా పడిపోయిన సామాన్లు

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7:58 గంటలకు 15.5 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 4 తీవ్రతతో 9 సార్లకు పైగా భూమి కంపించింది.

‘‘భూ ఉపరితలానికి తక్కువ లోతులోనే భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తైవాన్‌తో పాటు సముద్రంలోని దీవులంతటా కనిపించాయి. గడిచిన పాతికేళ్లలో ఇదే తీవ్రమైన భూకంపం’’ అని తైపీ సెస్మాలజీ కేంద్ర డైరక్టర్ వూ చిన్ ఫూ తెలిపారు.

తైవాన్ భూకంపం

ఫొటో సోర్స్, Ocean Tsai

హువాలిన్ నగర శివార్లలోని టరోకో జాతీయ పార్కు పరిసరాలలో ముగ్గురు మరణించారని జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. 50 మందికిపైగా గాయపడ్డారని, కొంతమంది భవనాలలోనూ, నగరం చుట్టు ఉన్న సొరంగాలలోనూ చిక్కుకుపోయారని ఆ సంస్థ పేర్కొంది.

తైపీలో భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి

తైవాన్ చిప్ తయారీ దిగ్గజం టీఎస్‌ఎంసీ, హిసించు, దక్షిణ తైవాన్‌లోని తమ ఫ్యాక్టరీలలో కొన్నింటిని సిబ్బంది భద్రతా దృష్ట్యా ఖాళీ చేసినట్టు పేర్కొంది.

యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్‌ దీనిపై కామెంట్ చేయాల్సిందిగా బీబీసీ చేసిన విన్నపంపై స్పందించలేదు.

అంతకుముందు భూంకపం కారణంగా సునామీ వస్తుందనే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. తైపేతోపాటు పొరుగుదేశాలలోనూ ఈ హెచ్చరికలు చేశారు.

ధ్వంసమైన నివాసభవనాలు, ప్రజలు ఇళ్ళను, పాఠశాలలను ఖాళీచేస్తున్న దృశ్యాలను స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి.

స్థానిక మీడియా సంస్థ టీవీబీఎస్ ప్రసారం చేసిన దృశ్యాలలో భూకంపం కారణంగా ధ్వంసమైన వాహనాలు, వస్తువులన్నీ కిందకు పడిపోయి దుకాణాలన్నీ గందరగోళంగా మారడం కనిపిస్తోంది.

తైపీలో భూకంపం

ఫొటో సోర్స్, Reuters

తైపే అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగినట్టు అంతర్జాల నియంత్రణ బృందం నెట్‌బ్లాక్స్ తెలిపింది.

తైవాన్‌కు తూర్పున విశాలమైన పర్వత ప్రాంతంలో హువాలిన్ నగరం ఉంటుంది.

ఈ ప్రాంతంలోని నగరాలలో జనసమ్మర్థం తక్కువగా ఉంటుంది.

ఈ ప్రాంతాన్ని తైవాన్‌తో అనుసంధానించే భారీ రహదారులు, రైల్వే లైన్లను ఇప్పుడు మూసివేశారు.

రక్షణ దళాలు వాయుమార్గం ద్వారానే ఇక్కడకు ప్రవేశించాల్సి ఉంటుంది.

తైపీ పొరుగుదేశమైన జపాన్ నైరుతీ తీర ప్రాంతంలో మూడుమీటర్ల మేర అలలు ఎగసిపడి, సునామీ వస్తుందని అధికారులు తొలుత ప్రకటించారు.

కానీ తరువాత జపాన్ వాతావరణశాఖ ఈ హెచ్చరికను ఉపసంహరించుకున్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భూకంపం తరువాత వచ్చే ప్రకంపనలు అంతే తీవ్రత కలిగి ఉంటాయని, దాదాపు వారం పాటు ఇది కొనసాగచ్చని పేర్కొంది.

తైపీలో భూకంపం

ఫొటో సోర్స్, TVBS

ఫొటో క్యాప్షన్, హువాలిన్ నగరంలో పాక్షికంగా కూలిన భవనం

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)