కెనడా: వాంకోవర్‌లో ఒక్క రోజే 2 వేల భూప్రకంపనలు.. ఎందుకు ఇలా?

వాంకోవర్

ఫొటో సోర్స్, Getty Images

కెనడాలోని వాంకోవర్ ద్వీపంలో ఒకే రోజు దాదాపు 2000 భూకంపాలు వచ్చాయి. మార్చి నెల ఆరంభంలో ఇది జరిగింది.

వాంకోవర్ ద్వీపం తీరానికి 240 కి.మీ దూరంలో ఎండీవర్ అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక్క రోజులోనే అనేక భూకంపాలు సంభవించాయి.

భూమికి 5 కి.మీ లోతులో ఈ భూకంపాలు వచ్చాయి.

ఈ భూకంపాలు తీర ప్రాంతాల్లో పెను విధ్వంసం సృష్టించగలవు. కానీ, దీనికి విరుద్ధంగా ఎండీవర్‌లో వచ్చిన భూకంపాల తీవ్రత చాలా స్వల్పం. భూకంప తీవ్రత 1.0 కంటే తక్కువగా నమోదైంది.

ఎండీవర్ సెగ్మెంట్‌లో పనిలో భాగంగా ఓషన్స్ నెట్‌వర్క్ డేటాను జో క్రాస్ అధ్యయనం చేస్తున్నారు.

వాషింగ్టన్ యూనివర్సిటీలో మెరైన్ జియోఫిజిక్స్‌లో జో క్రాస్ పీహెచ్‌డీ చేస్తున్నారు.

‘‘మద్యధరా అగాథాలు (రిడ్జ్) నిజానికి అధిక తీవ్రత గల భూకంపాలను సృష్టించలేవు’’ అని జో క్రాస్ చెప్పారు.

ఈ ప్రకంపనలు ఆందోళనకరమైనవి కావని తీరం చుట్టూ జరిపిన కొన్ని తవ్వకాల్లో వెల్లడైంది. కానీ, సముద్రపు లోతులో జరుగుతున్న భౌగోళిక ప్రక్రియ ఆందోళనకరమైనది. ఈ ప్రక్రియలో కొత్త సముద్ర గర్భం పుట్టుకొస్తోంది.

ఈ భూకంపాలు, ప్రజలకు ప్రమాదకరం కాదు. ఇవన్నీ చాలా సూక్ష్మమైనవి. ఎండీవర్ అనే చిన్న ప్రాంతానికే ఇవి పరిమితం.

వాంకోవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇన్ని భూకంపాలకు కారణం ఏంటి?

వాంకోవర్‌లోని ఎండీవర్ ప్రాంతం సముద్రపు మధ్య అగాథంలో (మిడ్ ఓషన్ రిడ్జ్) ఉంటుంది.

ఇక్కడి భూమి ఉపరితలం ఏడు పెద్ద పలకలుగా, 8 చిన్న పలకలుగా ఉంటుంది. అతిపెద్ద పలకలు అంటార్కిటిక్, యూరేషియన్, ఉత్తర అమెరికాకు చెందినవి.

ఈ పలకలు, భూమి పర్వత శ్రేణుల కింద 125 కి.మీ. మందంతో ఉంటాయి. రెండు భూగర్భ పలకలు ఒకదానికొకటి దూరంగా జరిగినప్పుడు మిడ్ ఓషన్ రిడ్జ్ ఏర్పడుతుంది.

ఈ పలకలు దూరంగా జరుగుతున్నప్పడు, భారీ అగ్నిపర్వత విస్పోటాలు సంభవిస్తాయి.

ఈ అగ్నిపర్వతాలు చల్లబడి, పర్వతాలుగా మారినప్పుడు అక్కడ అగాథాలు (మిడ్ ఓషన్ రిడ్జ్) ఏర్పడతాయి. ఈ రకంగా సముద్రం లోపల ఒక కొత్త పొర ఏర్పడింది.

ఎండీవర్ అనే ప్రాంతం పసిఫిక్ సముద్రంలో, జువాన్ డి ఫకా పలకాలపై ఉంది.

ఎండీవర్‌లో వచ్చిన ఈ ప్రకంపనలు, సముద్ర గర్భం(సీ ఫ్లోర్) విస్తరిస్తున్నట్లుగా సూచిస్తున్నాయి.

ఈ పలకాలు ఒక క్లిష్టమైన స్థానానికి చేరుకోవడానికి ముందు గరిష్ఠంగా 3.3 అడుగుల వరకు సాగుతాయి. భూమి ఇలా విస్తరించడం వల్ల అక్కడ ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల సముద్రం అడుగున ఒక కొత్త పొర ఏర్పడటంతో పాటు ఈ ఒత్తిడి వల్ల భూకంపాలు వస్తాయి.

ఇటీవల సంభవించిన భూకంపాలు, ఎండీవర్ సముద్రపు అడుగుభాగం గరిష్ఠ స్థాయిలో విస్తరించిందనడానికి ఒక సూచిక.

అగ్నిపర్వతం నుంచి వెలువడిన శిలాద్రవం ఇప్పుడు ఎండిపోయి సముద్ర గర్భంలో కొత్త పొరను ఏర్పరుస్తుందని క్రాస్ అంచనా వేశారు.

వాంకోవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఈ భూకంపాలు ఎంత ప్రమాదకరం?

ఎండీవర్ నేల అనేది సముద్రపు అడుగుభాగం ఏర్పడే ప్రాంతం.

‘‘మిడ్ ఓషన్ రిడ్జ్ వాస్తవానికి 5 తీవ్రత కంటే పెద్ద భూకంపాలను ఉత్పత్తి చేయలేదు’’ అని లైవ్‌ సైన్స్‌తో క్రాస్ చెప్పారు.

భూకంపం అనేది శాస్త్రీయంగా ఆసక్తికర ప్రక్రియ అని క్రాస్ అన్నారు. ఎందుకంటే అవి సముద్ర గర్భం ఎలా విడిపోతుంది? కొత్త క్రస్ట్ ఎలా ఏర్పడుతుంది? అనే వివరాలను వెల్లడిస్తాయి. ఎండీవర్ ఉన్న ప్రదేశంలో పసిఫిక్ ప్లేట్, జువాన్ డి ఫుకా ప్లేట్లు దూరంగా కదులుతున్నాయి.

ఈ ఎండీవర్ ప్రదేశాన్ని ‘ద కెనడా ఓషన్స్ నెట్‌వర్క్స్ సంస్థ’ నిరంతరం పర్యవేక్షిస్తుంది. 2018 నుంచి ఈ ప్రాంతం మరింత భూకంప క్రియాశీలంగా మారిందని క్రాస్ చెప్పారు.

మార్చి 6న ఈ ప్రాంతంలోని సముద్ర గర్భంలో ప్రతీ గంటకు కనీసం 200 స్వల్ప భూకంపాలు సంభవించాయి.

అదే రోజు మొత్తం 1,850 భూకంపాలు నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు.

వాంకోవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఈ భూకంపాలను ఎలా పర్యవేక్షిస్తున్నారు?

మార్చి 6 నుంచి భూప్రకంపనలు కొద్దిగా తగ్గాయని క్రాస్ చెప్పారు.

ఇక్కడి భూకంపాల గురించి క్రాస్ నిశితంగా పరిశీలిస్తున్నారు.

సముద్రపు అడుగుభాగం గరిష్ఠ స్థాయికి విస్తరించడం వల్ల తీవ్ర ఒత్తిడి ఏర్పడి, ఈ భూకంపాలు సంభవించి ఉంటాయని క్రాస్ అంచనా వేశారు. ఇలాంటి భూకంపాలు క్రమం తప్పకుండా 20 ఏళ్ల వ్యవధిలో సంభవిస్తాయన్నారు.

2005లో చివరిగా ఎండీవర్‌లో ఇలాగే చాలా భూకంపాలు సంభవించాయని తెలిపారు.

2011 నుంచి ఎండీవర్ ప్రదేశాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి అంతకుముందు సంభవించిన భూకంపాల డేటా పరిశోధకుల వద్ద లేదు.

కొత్త క్రస్ట్‌ను ఏర్పరిచే శిలాద్రవం మూలానికి సంబంధించి వారిలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి.

‘‘భూమి క్రస్ట్ ఎలా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? శిలాద్రవం ఎలా ఏర్పడుతుంది’’ అని క్రాస్ అన్నారు.

ప్రస్తుతానికైతో క్రాస్‌ బృందం రాబోయే రోజుల్లో అక్కడ ఏమి జరుగనుందో అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: