బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: నౌకలోని భారతీయులను ఒడ్డుకు ఎందుకు రానివ్వడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్డ్ డిబ్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలో బాల్టిమోర్‌లోని 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ' వంతెన కూలి వారం గడుస్తోంది. అయితే, ఆ వంతెనను ఢీకొన్న నౌకలో ఉన్న సిబ్బంది ఇంకా బయటికి రాలేదు.
డాలీ అనే 948 అడుగుల పొడవైన ఈ కార్గో షిప్‌లో ఉన్నవాళ్లలో ఎక్కువ మంది భారతీయులే. వంతెనను ఢీకొట్టిన సమయంలో వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి కూడా.
అంతేకాదు ఈ ప్రమాదంలో వంతెనపైనున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు డాలీ నౌక వంతెనను ఢీకొనడానికి కారణాలను గుర్తించేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
అయితే, నౌకలో ఉన్న సిబ్బంది ఇప్పటికీ అందులోనే ఎందుకు ఉన్నారు? వారిని కనీసం ఒడ్డుకు ఎందుకు రానివ్వలేదు? అసలు నిబంధనలేంటి?

ఫొటో సోర్స్, REUTERS
20 మంది భారతీయులే
21 రోజుల ప్రయాణంలో భాగంగా డాలీ అనే ఈ కంటైనర్ షిప్ శ్రీలంకకు బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నౌకలో 21 మంది సిబ్బంది ఉన్నారు.
వారిలో 20 మంది భారత పౌరులేనని భారత ప్రభుత్వంతోపాటు సదరు నౌక కంపెనీ ధృవీకరించింది.
ప్రపంచ సముద్ర రవాణా పరిశ్రమలో 3 లక్షల 15 వేల మంది పనిచేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పరిశ్రమలోని మొత్తం కార్మికులలో ఇది 20 శాతానికి సమానం, ఈ రంగంలో కార్మికుల సంఖ్య పరంగా ఫిలిప్పీన్స్ మొదటి స్థానంలో ఉంది.
నౌకలో ఉన్న సిబ్బంది ఆరోగ్యం బాగానే ఉందని భారత అధికారి ఒకరు చెప్పారు. వీరిలో ప్రమాదం కారణంగా వైద్యం అందాల్సిన వ్యక్తి ఒకరున్నారు.
అంతేకాదు సిబ్బంది ఎక్కడుంటారు, వారి కుటుంబాలు ఏమనుకుంటున్నాయనే దానిపై తక్కువ సమాచారం అందుబాటులో ఉంది.

ఫొటో సోర్స్, REUTERS
సిబ్బంది ఎలా ఉన్నారు?
డాలీ నౌక సిబ్బందితో జాషువా మెస్సిక్ అనే వ్యక్తికి పరిచయముంది. ఆయన బాల్టిమోర్ ఇంటర్నేషనల్ సీఫేరర్స్ సెంటర్ డైరెక్టర్.
ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, సముద్ర రవాణా విభాగంలో పనిచేసే వారి హక్కుల కోసం పనిచేస్తుంది.
నౌకలో ఉన్న వారికి సహాయం చేయడానికి కొన్ని వస్తువులను పంపినట్లు బీబీసీకి జాషువా మెస్సిక్ తెలిపారు. వాటిలో వైఫై హాట్‌స్పాట్ సదుపాయం కూడా ఉందన్నారు.
ఆ తర్వాత వాట్సాప్ ద్వారా వారితో మాట్లాడానని, సిబ్బంది 'భయంతో' ఉన్నారని, విచారణ సమయంలో పూర్తిగా మౌనంగా ఉన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.
జాషువా వారి పరిస్థితిపై మాట్లాడుతూ ‘‘సిబ్బందిని సంప్రదించిన ఎవరితోనూ వాళ్లు మాట్లాడలేదు. శనివారం వరకు వారికి వైఫై సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రపంచం ఏమనుకుంటోందో కూడా వాళ్లకు తెలియదు. ఈ ప్రమాదానికి వారే బాధ్యులనే ఆరోపణలు చేస్తున్నారా, వారిని విలన్‌గా చేస్తున్నారా అనేది వారికి కచ్చితంగా తెలియదు. ప్రమాదం తర్వాత వారి మనసులో ఏం అనుకున్నారో, ఎలాంటి భయాలు పెట్టుకున్నారో కూడా తెలియదు'' అని అన్నారు.
''వాళ్లు చాలా సున్నితంగా కనిపిస్తున్నారు. వారు ఏదైనా చెబితే, అది కంపెనీకి లింక్ చేస్తారు. ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని చెప్పారేమో'' అని అన్నారు.
'అపోస్టిల్‌షిప్ ఆఫ్ ది సీ' అనే ప్రోగ్రామ్‌ను ఆండ్రూ మిడిల్‌టన్ నడుపుతున్నారు. ఇది బాల్టిమోర్‌కు రావడానికి, అక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు నౌకలకు సహాయం చేస్తుంది.
ప్రమాదం జరిగిన తర్వాత సిబ్బందితో తరుచుగా మాట్లాడుతున్నట్లు ఆండ్రూ చెప్పారు. ‘‘గాయపడిన వ్యక్తి బాగానే ఉన్నారని వాళ్లు చెప్పారు’’ అని ఆండ్రూ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
నౌక నుంచి సిబ్బందిని ఎందుకు బయటికి పంపలేదు?
ప్రస్తుతం నౌకలోని సిబ్బంది దిగేందుకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఓడను అక్కడి నుంచి తీసే వరకు వారిని వెళ్లేందుకు అనుమతిస్తారన్న ఆశ లేదు, ఇది చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ అన్నారు.
బాల్టిమోర్ నౌకాశ్రయాన్ని తెరిచి, నౌకలు ప్రయాణించేలా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని కోస్ట్ గార్డ్ అడ్మిరల్ షానన్ గిల్రేత్ అంటున్నారు. డాలీ షిప్‌ను అక్కడి నుంచి తొలగించే పని తరువాత విషయమని ఆయన తెలిపారు.
సాధారణ పరిస్థితుల్లో కూడా అమెరికా ఓడరేవుల వద్ద నౌకల నుంచి విదేశీయులు ఒడ్డుకు రావాలంటే చాలా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నౌక సిబ్బందికి వీసాలు, పాసులు ఉండాలి.
అయితే, నౌకల సిబ్బందితో కలిసి పనిచేసే అక్కడి సంస్థలు ఈ వెసులుబాటు ఎక్కువగా కల్పించవు.
ఈ డాలీ నౌకలో ఉన్న సిబ్బందికి ఒడ్డుకు వచ్చేందుకు అవసరమైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
దర్యాప్తు ఎన్ని రోజులు కొనసాగుతుందో స్పష్టంగా తెలియదని, ప్రక్రియ పూర్తయ్యే వరకు సిబ్బంది ఓడలోనే ఉండాలని యూనిఫైడ్ కమాండ్ సోమవారం బీబీసీతో చెప్పింది. బాల్టిమోర్ ప్రమాదం దర్యాప్తును యూనిఫైడ్ కమాండ్ పర్యవేక్షిస్తోంది.
చిరాగ్ బహ్రీ అనుభవమున్న భారత నావికుడు, ఆయన ప్రస్తుతం యూకేకు చెందిన ఇంటర్నేషనల్ సీఫేరర్స్ వెల్ఫేర్ అండ్ అసిస్టెన్స్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
డాలీ నౌకలో ఉన్న సిబ్బంది ఇంటికి తిరిగి రావడానికి నెలల సమయం పట్టవచ్చని చిరాగ్ అభిప్రాయపడ్డారు.
‘‘కొన్ని వారాల తర్వాత కింది స్థాయి సిబ్బందిని ఇంటికి పంపించే అవకాశం ఉంది. అయితే ఉన్నత స్థాయి సిబ్బంది విచారణ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉంచొచ్చు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
‘సిబ్బందికి మానసిక ఇబ్బందులు రావొచ్చు’
డాలీ సిబ్బందికి ఇప్పటికే సరిపడా ఆహారం, నీరు, ఇతర అవసరమైన వస్తువులు ఉన్నాయి. నౌక శ్రీలంక చేరడానికి 21 రోజులు పడుతుంది, అందుకే వాళ్లు అన్ని సమకూర్చుకొని బయలుదేరారు.
నౌకల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల నుంచి ఇతర సామగ్రి అందుతుంది. వీటిలో వండిన ఆహారం, ఇతర వస్తువులూ ఉంటాయని జాషువా మెస్సిక్ తెలిపారు.
నౌక సిబ్బంది మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చని జాషువా అభిప్రాయపడ్డారు.
''చాలాకాలం పాటు పనిలేకుండా కూర్చుంటారు, విసుగు కలుగుతుంది'' అని జాషువా అంటున్నారు.
చాలా మంది యువకులు వీడియో గేమ్‌లు ఆడటం లేదా సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చిస్తారని తెలిపారు.
ఈ ప్రమాదంలో సరిగ్గా ఏ తప్పు జరిగింది? దానికి ఎవరు బాధ్యత వహించాలి? అనే దానిపై సిబ్బంది, మీడియా కథనాలు చూస్తుంటారని, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి వారికి సహాయం అవసరమని చిరాగ్ బహ్రీ అంటున్నారు.
''ఎవరిని చూసినా ఈ ప్రమాదం మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. దీన్ని ఆపాలి'' అని సూచించారు.
''షిప్ ఆపరేటర్లు ఇప్పటికే షాక్ లో ఉన్నారు, ఒత్తిడికి లోనయ్యారు. వాళ్లు విదేశీ గడ్డపై, అది కూడా నౌకలో చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట సమయంలో వారిని నిందించబోమని భరోసా ఇస్తూ, వారితో నిలబడాలి'' అని చిరాగ్ బహ్రీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేశాక వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం ఆలోచన ఏమిటి?
- ఎలక్ట్రిక్ కార్: టెస్లాకు పోటీగా రంగంలోకి దిగిన షియోమీ, కారు ధర ఎంత, సవాళ్లేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















