కోతులను చిత్రహింసలు పెట్టి వీడియోలు తీసిన ‘టార్చర్ కింగ్’పై అభియోగాల నమోదు

ఫొటో సోర్స్, Joel Gunter/BBC
- రచయిత, జోయెల్ గుంటర్, రెబెకా హెన్స్‌చ్కే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చిన గ్లోబల్ మంకీ టార్చర్ నెట్‌వర్క్ రింగ్‌లీడర్‌పై అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.
50 ఏళ్ల మైఖేల్ మెకార్ట్నీ అలియాస్ ‘టార్చర్ కింగ్’ జంతువులను చిత్రహింసలు పెట్టే వీడియోలను చిత్రీకరించి, పంపిణీ చేసేందుకు కుట్ర పన్నారని వర్జీనియాలో ఆయనపై కేసు నమోదైంది.
జంతువులను వేధించారనే అభియోగాలు రుజువైతే ఆయనకు గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
కోతులను చిత్రహింసలు పెట్టే శాడిజం గ్రూప్‌లపై ఏడాది పాటు ‘బీబీసీ ఐ’ టీమ్ విచారణ జరిపింది. ఈ విచారణలో బీబీసీ బయటపెట్టిన ముగ్గురు కీలక వ్యక్తుల్లో మెకార్ట్నీ ఒకరు.
ఈ విచారణ తర్వాత బ్రిటన్‌లో ఇద్దరి మహిళలపైనా అభియోగాలు నమోదయ్యాయి.
అంతకుముందు మోటార్‌సైకిల్ గ్యాంగ్‌లో సభ్యుడైన మెకార్ట్నీ జైలు జీవితం గడిపారు.
ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా మంకీ టార్చర్(కోతుల చిత్రహింసలు కోరుకునే) ఔత్సాహికుల కోసం పలు చాట్ గ్రూప్‌లను నిర్వహించారు.
ఈ గ్రూప్‌లలో చిత్రహింసలు పెట్టే వీడియోల కోసం వికృతమైన ఆలోచనలను పంచుకునేవారు. మంటపై కోతులను నిల్చోబెట్టడం, వాటిని వివిధ పరికరాలతో గాయాలు పాలు చేయడం వంటివి ఈ వీడియోల్లో పెట్టేవారు.

ఫొటో సోర్స్, ED OU/BBC
ఈ టార్చర్ గ్రూపుల్లో అమెరికా నుంచి ఇండోనేషియా వరకు అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్లు ఉన్నారు.
ఇదొక వ్యాపార వలయం. ఇండోనేషియాలో ముఠాలు పొడవు తోక ఉండే మాకాక్ కోతిపిల్లలను పట్టుకుని హింసిస్తాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల నుంచి డబ్బులిచ్చి మరీ ఈ హింస వీడియోలు తెప్పించుకుంటున్నారు.
అభియోగాల డాక్యుమెంట్ ప్రకారం అమెరికాలోని వర్జీనియాలో నివసించే మెకార్ట్నీ చాట్ గ్రూపుల నుంచి నిధులను సేకరించేవారని, ‘‘జంతువులను ముఖ్యంగా చిన్న, పెద్ద కోతులను లైంగికంగా వేధించడం, చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడం’’ వంటి వీడియోలను పంపిణీ చేసేవారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఇన్వెస్టిగేటర్లకు మెకార్ట్నీ సహకరించారు. ఆయనపై మోపిన నేరారోపణ అభియోగాలను ఒప్పుకున్నారు.
ఆ వీడియోలు నేను ఇప్పటివరకు చూడని “చాలా వింతైన వీడియోలు” అని మెకార్ట్నీ చెప్పారు. క్రమంగా కోతులను హింసించే గ్రూపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా మారారు.
మైఖేల్ మెకార్ట్నీతోపాటు ఈ టార్చర్ నెట్‌వర్క్‌లో కీలకమైన వ్యక్తులుగా చెబుతున్న మరికొంత మందిపైనా అభియోగాలు నమోదు చేయనున్నారు.
బీబీసీ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చాక, ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మందిని ఈ కేసులో విచారిస్తున్నారు.
అమెరికాలో మెకార్ట్నీ సహా ఈ నెట్‌వర్క్‌లో భాగమైన ముగ్గురిపై అమెరికా చట్టాల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.
ఇండోనేషియాలో కోతులను హింసించిన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
బ్రిటన్‌లో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేయగా, వారిలో ఇద్దరు మహిళలపై అభియోగాలు నమోదు చేశారు.
గత నెలలో కిడ్డెర్‌మిన్‌స్టర్‌కు చెందిన 37 ఏళ్ల హోలీ లెగ్రెస్లీ, ఆప్టన్-అపాన్ సెవెర్న్‌కు చెందిన 55 ఏళ్ల అడ్రియానా ఓర్మేలపై గత నెలలో అభియోగాలు నమోదు చేశారు.
వీరిద్దరూ ఆ ఆన్‌లైన్ టార్చర్ గ్రూపుల్లో హై- ప్రొఫైల్ సభ్యులు.
‘ది ఇమ్మోలేటర్’ అనే స్క్రీన్ పేరుతో మెకార్ట్నీ నిర్వహించే గ్రూపులో మోడరేటర్‌గా ఉన్న లెగ్రెస్లీకు కొన్ని తీవ్రమైన వీడియోలను రూపొందించడంలోనూ పాత్ర ఉంది.
అమెరికాలో మెకార్ట్నీతోపాటు మరో ఇద్దరిపై కూడా అభియోగాలు నమోదు చేశారు.
వారిలో, అమెరికా మాజీ వైమానిక దళ అధికారి 48 ఏళ్ల డేవిడ్ క్రిస్టోఫర్ నోబెల్ గతంలో కోర్టు మార్షల్‌ను ఎదుర్కొన్నారు. మిలటరీ సర్వీసు నుంచి ఆయన్ను తొలగించారు.
35 ఏళ్ల నికోల్ డెవిల్బిస్ కూడా అరెస్టయ్యారు. ఇద్దరికీ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














