ఆ దేశ రాజధానిలో మనుషులపై దాడి చేస్తున్న హైనాలు

హైనా

ఫొటో సోర్స్, CITIZEN DIGITAL

    • రచయిత, బసిల్లి రుకాంగ
    • హోదా, బీబీసీ న్యూస్, నైరోబీ

కెన్యాకు చెందిన నకురు నగరంలోని ఒక చిన్న దుకాణంలో దాక్కున్న జంతువును చూసి ఆ దుకాణ యజమాని హడలిపోయారు.

వ్యాపారి ఫ్రెడరిక్ ఒముంగు రెండు రోజుల కిందట ఉదయాన్నే తన దుకాణానికి వెళ్లినప్పుడు ఆయనకు ఈ జంతువు కనబడింది.

మొదట ఆ జంతువు ఏంటో తనకు అర్థం కాలేదని, చాలా భయపడ్డానని ఆయన చెప్పారు.

‘‘అది కచ్చితంగా కుక్క అయితే కాదు. చిరుతపులి లేదా ఇంకేదైనా అని అనుకున్నా’’ అని బీబీసీతో ఆయన అన్నారు.

అప్పుడే పొరుగువారు వచ్చి అది హైనా అని గుర్తించారు. ఒక్కోసారి హైనాలు మనుషులపై దాడి చేస్తాయి.

‘‘ నేను భయపడి దూరంగా వెళ్లిపోయా. హైనాలు ప్రమాదకర జంతువులని, మనుషుల్ని చంపగలవు అని నేను విన్నాను’’ అని ఒముంగు చెప్పారు.

కౌంటర్ కింద దాక్కున్న ఆ జంతువును చూడటానికి అరగంటలోనే పదుల సంఖ్యలో స్థానికులు అక్కడ చేరారు.

జనాభా ఎక్కువగా ఉండే ఏరియాలోని ఆయన దుకాణంలోకి ఆ జంతువు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియలేదు.

ఖాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖాట్ ఆకులు

ఒముంగు తన దుకాణంలో స్థానికంగా మిరా అని పిలిచే ఖాట్ ఆకులతో పాటు సాఫ్ట్ డ్రింకులు, స్వీట్లు, పల్లీలను విక్రయిస్తారు.

అంతకుముందు రోజు రాత్రి 8 గంటలకు వ్యాపారాన్ని ముగించుకొని మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో దుకాణానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

ఈ ఏరియా, లేక్ నకుర నేషనల్ పార్క్‌కు సమీపంలోనే ఉంటుంది. అక్కడ నుంచే రాత్రిపూట హైనా తప్పించుకొని వచ్చినట్లుగా వారు అనుమానిస్తున్నారు.

కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్)‌ వార్డెన్లు తర్వాత ఆ జంతువును పట్టుకుని తరలించారు.

ఇటీవల కాలంలో కెన్యాలో మనుషులుండే ప్రాంతాలలోకి జంతువులు రావడం ఎక్కువైంది.

దేశవ్యాప్తంగా పలు చోట్ల మనుషులపై హైనాలు దాడి చేస్తున్న ఘటనలు రికార్డయ్యాయి.

పార్క్‌ల నుంచి పబ్లిక్ ఏరియాల్లోకి జంతువులు రాకుండా తగు చర్యలు తీసుకోవడం లేదంటూ నకురులోని కొందరు నివాసితులు, కేడబ్ల్యూఎస్‌పై ఆరోపణలు చేశారు.

పార్క్‌లో పాడైన కంచెను పునరుద్ధరిస్తున్నామని, జంతువులు పార్క్ నుంచి జనావాసాల్లోకి రావడం దురదృష్టకర ఘటన అని బీబీసీతో కేడబ్ల్యూఎస్ సీనియర్ వార్డెన్ మార్క్ చెరియట్ అన్నారు.

హైనా

ఫొటో సోర్స్, Getty Images

పార్క్‌కు తన దుకాణం కంటే సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని చిన్నారుల భద్రత గురించి ఒముంగు ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ఈ స్కూల్ పిల్లల్లో కొంతమంది ఉదయం 5 గంటలకే వస్తారు. దేవుడి దయవల్ల హైనా ఎవరికీ హాని కలిగించలేదు’’ అని ఆయన అన్నారు.

హైనాలు ఇలా జనావాసాల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదని స్థానిక మీడియాతో నకురులో నివసించే జసింటా జెరీ చెప్పారు.

మూడు వారాల క్రితం ప్రజలపై మూడు హైనాలు దాడి చేశాయి.

హైనా ఎదురుపడినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పే మార్గదర్శకాలను కేడబ్ల్యూఎస్ గతంలో జారీ చేసింది.

హైనా ఎదురైతే కదలకుండా అక్కడే నిలబడి, దాంతో మాట్లాడుతూ భయాన్ని పైకి కనపడనివ్వకుండా ప్రశాంతంగా ఉండాలంటూ ఇచ్చిన సలహా ట్రోలింగ్‌కు గురైంది.

దీంతో హైనాతో ఏ భాషలో మాట్లాడాలంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల హైనా దాడుల్లో మరణాలు , గాయాలుపాలైన ఘటనలున్నాయి.

రాజధాని నైరోబీకి సమీపంలో హైనా దాడి బాధితుడి శరీర భాగాలను గత నెలలో కేడబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు.

జనవరిలో రాజధాని నైరోబి శివార్లలో 10 ఏళ్ల బాలుడు హైనా దాడిలో మరణించాడు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)