ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?

ది ఫ్యామిలీ స్టార్

ఫొటో సోర్స్, Vijaydevarakonda/Instagram

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

'గీత గోవిందం’తో వంద కోట్ల హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అదే సినిమా దర్శకుడిగా పరశురాంను బిగ్ లీగ్‌లో చేర్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ 'ఫ్యామిలీ స్టార్' కోసం మళ్ళీ కలిశారు.

కుటుంబ కథా చిత్రాల్ని అందించడంలో పేరు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మాణంలో సినిమా తయారవ్వడం, విజయ్, పరశురాం హిట్ కాంబినేషన్ కావడం, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

మరి ఈ చిత్రం అంచనాల్ని `ఫ్యామిలీ స్టార్‌` అందుకుందా? ఫ్యామిలీ స్టార్ పంచిన వినోదం ప్రేక్షకుల్ని అలరించిందా?

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, Vijaydevarakonda/Instagram

కథేంటి?

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ)ది మధ్యత‌ర‌గ‌తి ఉమ్మడి కుటుంబం. తను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ మ్యానేజర్. తన జీతంతోనే ఇంట్లో దాదాపు పదిమందిని పోషిస్తుంటాడు. అయితే ఏనాడూ దాన్ని భారంలా కాకుండా బాధ్యతగానే చూస్తుంటాడు. ఇందు (మృణాల్ ఠాకూర్) గోవర్ధన్ ఇంటిపై పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు ఇందు ఎవరు? ఇందు వచ్చిన తర్వాత గోవర్ధన్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనేది కథ.

ఆత్మాభిమానంతో బ‌తికే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి స్టోరీ ఇది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఇలాంటి సమయంలో విజయ్ లాంటి యువ హీరోతో ఓ మధ్యతరగతి ఉమ్మడి కుటుంబ కథ చెప్పాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

గోవర్ధన్ క్యారెక్టర్‌ను ప‌రిచ‌యం చేస్తూ కథని మొదలుపెట్టాడు. మిడిల్ క్లాస్ మ్యాన్‌గా రాసుకున్న సన్నివేశాలు మొదట్లో, లైటర్ వెయిన్‌లో సరదాగా సాగిపోతాయి.

ఇందు పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంలో చోటు చేసుకున్న సన్నివేశాలు మరీ గొప్పగా లేకపోయినా పర్లేదనిపిస్తాయి.

కథ విషయానికి వచ్చేసరికి ఇందులో సంఘర్షణ ఏంటో ఎంతకీ పైకి తేలదు. తాగుడికి బానిసైన గోవర్ధన్ అన్నయ్య ట్రాక్‌ చాలా బలహీనంగా రాశారు. ఈ మాత్రానికే అంత హడావిడి చేయడం అవసరమా? అనిపిస్తుంది. అవసరం లేని యాక్షన్ సీక్వెన్స్‌లు కథ నడకకి అడ్డు తగులుతాయి.

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, DilRaju/YT

సెకండాఫ్‌లో మూగమనసులు..

ఫ్యామిలీ కథల్లో ఎమోషనల్ డ్రామా ప్రధాన ఆకర్షణగా వుండాలి. ఫ్యామిలీ స్టార్‌లో వాటి మోతాదు పూర్తిగా తగ్గింది.

హీరో, హీరోయిన్ మధ్య ‘అపార్ధం’ సంఘర్షణగా చేసుకొని 'గీత గోవిందం'లోని డ్రామాని చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దిన పరశురాం, ఇందులోనూ అదే కోణంలో కథని నడపాలని చూశారు. కానీ, అది బెడిసి కొట్టింది.

ప్రథమార్థంలో ఫ్యామిలీ అంశాలతో ఏదో కాలక్షేపం అవుతుందేమో కానీ ద్వితీయార్థంలో వచ్చే అమెరికా ఎపిసోడ్ తేలిపోయింది. ఆ సన్నివేశాల్ని చాలా సాగదీతగా ఎక్కడా ఉత్సాహం కలిగించకుండా చిత్రీకరించిన తీరు నిరాశపరుస్తుంది.

కథ ఒక దిశ, ద‌శ‌ లేకుండా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. సెకండ్ హాఫ్‌ మొత్తంలో హీరోయిన్‌ని మూగపాత్ర అన్నట్టుగా, కనీసం రెండు డైలాగులు కూడా లేకుండా ఏదో ఆర్ట్ సినిమాలో హీరోయిన్‌లా తీర్చిదిద్దన వైనం మెప్పించదు.

ఇండియా వచ్చిన తర్వాత కథ మళ్లీ వేగం పుంజుకుంటుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. క్లైమాక్స్‌ని తీర్చిదిద్దన విధానం కూడా ఓవర్ సినిమాటిక్‌గా, అసహజంగా వుంది.

మృణాల్ ఠాకూర్

ఫొటో సోర్స్, DilRaju/YT

విజయ్ ఫ్యామిలీ స్టార్ అయ్యాడా?

కథ, కథనం బలహీనంగా ఉన్నప్పటికీ సినిమాని ఆద్యంతం చూసేలా చేసింది మాత్రం విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజన్స్.

సినిమాని దాదాపుగా త‌న భుజాల‌పై మోశాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌లా తెరపై చూడముచ్చటగా కనిపించాడు.

తను డైలాగ్ చెప్పే తీరు, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి. ఫైట్లు కూడా వున్నాయి. అందులో విజయ్ ఈజ్ బావుంది కానీ, అవసరం లేని ఫైట్లు కావడంతో అవి అంత ప్రభావతంగా ఉండవు. మృణాల్ అందంగా కనిపించింది. తొలిసగంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

అయితే దర్శకుడు ఆ పాత్రకు చివరి వ‌ర‌కూ ఒక వాయిస్ అంటూ లేకుండా చేశాడు. డ్రామా పండకపోవడానికి ఇదీ ఒక కారణం. కుటుంబం సభ్యులుగా కనిపించిన పాత్రలు కథలో కీలకం కాలేకపోయాయి. రోహిణి హట్టంగ‌డి పాత్రని చివరి వరకూ తీసుకొచ్చారు కానీ, క్లైమాక్స్ వీక్‌గా వుండటం వలన ఆ పాత్రతో కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది.

వెన్నెల కిశోర్ కామెడీ వర్క్ అవుట్ కాలేదు. జగపతి బాబుది రొటీన్ పాత్రే. మిగతా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కూడా కావు.

ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, DilRaju/YT

టెక్నికల్‌గా ఎలా వుంది?

గోపీసుందర్ సంగీతంలో మెరుపులు లేవు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కళ్యాణి పాట రోలింగ్ టైటిల్స్‌కి పరిమితం అయ్యింది.

నేపథ్య సంగీతం తేలిపోయింది. కొన్ని చోట్ల మోతాదుకు మించిన సౌండ్ వినిపిస్తుంది. కెమెరా పనితనం మాత్రం డీసెంట్‌గా ఉంది. విజువల్స్‌ని రిచ్‌గా చిత్రీకరించారు. అమెరికా నేపథ్యంలో వచ్చే సీన్స్ లావిష్‌గా వుంటాయి. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. ముఖ్యంగా అమెరికా వీధుల్లో ఓ రాత్రి జరిగిన అనవసరమైన గొడవ సీన్‌ను పూర్తిగా కత్తిరించేయాల్సింది. చాలా పేలవమైన ఎపిసోడ్ అది.

పరశురాం రాసుకున్న కొన్ని వన్ లైనర్స్ పేలాయి, గుర్తుపెట్టుకునే డైలాగ్‌లైతే లేవు. ప‌ర‌శురామ్ ఓ చిన్న లైన్ ప‌ట్టుకొని, కాంబినేష‌న్లని సెట్ చేసుకొని, `గీత గోవిందం` లాంటి సెట‌ప్‌తో మెప్పిద్దామ‌నుకొన్నాడు. అయితే ఆ ఆ మ్యాజిక్ ఇక్కడ అస్సలు వ‌ర్కవుట్ కాలేదు.

నిజానికి బలమైన డ్రామా, ఎమోషన్ పండించే పాయింట్ కాదిది.

అయితే, కొన్నిసార్లు ఒక బలహీనమైన కథాంశాన్ని బలంగా తీర్చిద్దిన సందర్భాలు వుంటాయి. కానీ ఇందులో ఆ ప్రయత్నం జరగలేదు.

వీడియో క్యాప్షన్, ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉందంటే...

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)